Monday, 30 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (99)

 

అనేక దేవతల అవసరం


అనేక రుచులను ఇష్టపడతాం. నాటకంలో భిన్న రసాలుంటాయి. అది సంగీతమైతే భిన్నరాగాలుండాలి. కొందరు మండ్రస్థాయిని, కొందరు ద్రుత పద్ధతిని కోరుతారు. అట్లాగే ఉపాసనలో కూడా. సమాధి స్థితి చిట్టచివర దశలోనే. అందరూ ప్రాథమిక దశలో నున్నవారే. అట్టి మహోన్నత సమాధి స్థితి రావాలంటే పరమేశ్వరుని అనుగ్రహం తప్పనిసరి. అతడు నానా రూపాలను ధరిస్తాడు. రకరకాల కోరికలను తీరుస్తాడు. పూజలో కూడా భిన్నంగా ఉంటుంది. ఒక దేవతకు మారేడు, మరొక దేవతకు తులసి, మరొక దేవతకు మోదకం ఇష్టం. భిన్న రుచులతో కూడినది లోకమనే నానుడి యుంది కదా. లోకో భిన్న రుచి:


ఈశ్వరుని లీలలను లెక్కపెట్టలేం. కొందరికి ఇష్టదైవముండి అతణ్ణి కొలుస్తారు. పెక్కుమందిని కొలవనే కొలవరు. తాము కొలిచిన దేవతయే పరమాత్మయని భావిస్తారు. అందుకే సుబ్రహ్మణ్య భక్తులు, దేవీ భక్తులు, శివ భక్తులనే వ్యవహారం ఉంది. పరమాత్మ వీరి భక్తి తీవ్రతను గమనించి అన్ని ఫలాలనిస్తాడు.


ఇట్లా ఇష్ట దేవతయున్నా వినాయకుడే మాత్రం విస్మరించరు. శుక్లాం బరధరం అనకుండా పూజ నారంభించరు.

Sunday, 29 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (98)

ఇట్టి ప్రణాళికలో విఘ్నాలను తొలగించడం అనే పనిని వినాయకునకు ఈశ్వరుడు నిర్దేశించాడు. కనుక వినాయకుడు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. వినాయక రూపంలో విద్యను, భాగ్యాన్ని, విజయాన్ని తిన్నగా ప్రసాదించడు. అట్టి పనులను వివిధ దేవతలకు పరమాత్మ, కేటాయిస్తాడు అయితే తతః హేతున్యాయం ఇక్కడ నప్పుతుందా?


ప్రభుత్వం ఏర్పడినప్పుడు వివిధ శాఖలను వివిధ మంత్రులకు కేటాయిస్తారు కదా! ఏ మంత్రియైనా వివిధ శాఖలను నిర్వహించగలడు. అతనికి అంతకుముందు ఆ విషయం తెలియకపోయినా. అయితే ఒక మంత్రికి కేటాయించిన శాఖలో మరొక మంత్రి తలదూర్చకూడదు. అట్లాగే జగత్ ప్రభుత్వం కూడా దేవతలచే అట్లా నిర్వహింపబడుతుంది. వారి వారి పరిధిలో ఆయా దేవతలు భక్తుల కోరికలను తీరుస్తారు.


ఇది సాధారణ నియమమన్నాను. అంటే ఏదో విశేష నియమం ఉండాలి కదా.


ఒక ప్రత్యేకమైన దేవత - అది వినాయకుడు కావచ్చు, మరొక దేవత కావచ్చు. పరమాత్మ మాదిరిగా ఒక ప్రత్యేక ఫలాన్నే ఈయడమే కాకుండా దేనినైనా ఈయగలడు. ఒక భక్తుడు తన ఇష్ట దైవాన్ని నీవే నాకు ఏకైక దైవం, ఇక ఏ దేవతను కొలవనని భీష్మించుకొని కూర్చుంటే ఆ దేవత, పరమాత్మ మాదిరిగా అన్నిటినీ ఇస్తుంది. తాను పరమాత్మనని ఎఱుక లేని దేవత కూడా, ఇట్టి సర్వార్వణ భావాన్ని అసలు పరమాత్మ గ్రహించి ఈ చిన్న దేవత ద్వారా భక్తుడు కోరిన అన్నిటినీ ప్రసాదింపజేస్తాడు. అది మానవ రూపంలోనూ ఉండవచ్చు. అట్లా సర్వార్పణ భావం, ఒకే దేవతపై గాఢభక్తి కలిగి యుండడం, ఎక్కడో గాని ఉండదు.


Saturday, 28 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (97)

అన్ని ఫలాలూ అతడీయకపోయినా


వినాయకుడు శక్తిమంతుడైనా అతడన్నీ ఈయకుండా, ఉన్న ఆటంకాలను మాత్రమే తొలగిస్తాడని కాసేపు ఊహిద్దాం. మిగతా దేవతలే ఫలాలిచ్చేటట్లుగా చేస్తాడని భావిద్దాం. అతని గురించి ఎట్లా పరదైవమని అంటున్నామో మిగతా దేవతలను వర్ణించేటపుడూ ఎవరికి వారే పరమ దైవాలని పురాణ కథలంటున్నాయి కదా. అదీ సత్యమే. ఒక్క పరమాత్మయే భిన్న దేవతలుగా కన్పిస్తున్నాడు. మనపట్ల కూడా అంతే. మాయ, మనలను కప్పివేయడం వల్ల మనము అఖండాత్మ స్వరూపులమని గుర్తించలేకపోతున్నాం. అయితే దేవతా రూపాలలోనున్న వారు తాము పరమాత్మయనే గుర్తిస్తున్నారు.


ఈ పరమాత్మననే భావన అందరి దేవతలకూ ఉందా? అందుకొందరే భావిస్తున్నారని కొంత వరకే కొందరని ఒక అభిప్రాయముంది. ఇట్టి సందేహం మనం శివుణ్ణి, అమ్మవారిని, విష్ణువుని పూజించినప్పుడు కలగదు. వీరు ముగ్గుర్నీ రత్న త్రయంగా, పూర్ణ బ్రహ్మ శక్తి కలవారుగా అప్పయ్య దీక్షితులు పేర్కొన్నారు. వీరిని పూజించేటపుడు కూడా గణపతిని పూజిస్తాం.


సాధారణ నియమ మేమంటే ఏ దేవత యైనా అది తాను పరమాత్మనని తెలుసుకున్నా, పూర్తి ఫలాన్ని భక్తునకీయకుండా, భక్తుడు కోరినది మాత్రం ప్రసాదిస్తుంది. ఒక పరమాత్మ - భిన్న రూపాల లక్ష్యం ఇది కదా! ఈ సనాతన ధర్మంలో అనేక దేవతలుండాలని రకరకాలుగా అలంకరించి, వివిధ నైవేద్యాలు ఆయా దేవతలకు అర్పించవచ్చని భగవత్రణాళికగా ఉంది.


Friday, 27 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (96)


ఈ శ్లోకంలోని ఉపాసకుడు సామాన్యుడు కాడు. అతడు 'తతః హేతోరితివిత్' అనగా న్యాయం తెలిసినవాడు. తర్కశాస్త్రం బాగా తెలిసిన వాడగుటచే బాగా ఆలోచించి పూర్వాపరాలను వీక్షించి నిర్ణయానికి వస్తాడు. అతడు వినాయకుని పట్ల ఎట్లా ప్రవర్తిస్తాడు?


అందరు దేవతలు ముందు విఘ్నేశ్వరుని పూజిస్తున్నారు. అప్పుడే వారికి ఆటంకాల బాధ ఉండడం లేదు. ఏ దేవతయైనా ఇతణ్ణి పూజించకపోతే ఇతడు వారికి ఆటంకాలను కల్గిస్తాడు. అందువల్ల ఇతని అనుగ్రహం కోసం కొలుస్తున్నారు. అందువల్ల అందరి దేవతలకంటే ఇతడధికుడు, ఫలప్రదాత. గణేశుని నామాలను పరికిస్తే ఇది తేలతెల్లమౌతుంది. 'లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి మొదలైన నామాలు. అనగా లక్ష్మి, సరస్వతి దుర్గ లిచ్చేవన్నీ ఇస్తాడన్న మాట. అంతేకాదు సర్వసిద్ది ప్రద గణపతి అనగా అన్నిటినీ ఈయగలదు. అందువల్లనే చాలా చోట్ల సిద్ధి వినాయక ఆలయాలు వెలిసాయి. అందువల్ల సమస్త దేవతల కంటే ఇతడధికుడని, తెలివైన భక్తుడు, తర్కజ్ఞానం గల భక్తుడు, ఇతజ్ణి ఏకం పరందేవంగా భావిస్తాడు.


ఒక్క విఘ్నేశ్వరుడు అన్నిటినీ ఇచ్చినపుడు మిగతా దేవతలను పూజింప నేల? తతఃహే తో రేవ తతః హేతుత్వే మధ్యే కింతేన? అనగా తతః హేతున్యాయం తెలిసినవాడు అతడు పరమ దైవమని భావించి అతని పూజకే కట్టుబడి యుంటాడు.


తతః హేతోరితి నీతివిదు: భజతే దేవం యం ఏకం పరం


ఇంకా ఏమంటాడు? మామూలు పూజ ఇతనికి చేసి, విస్తారమైన పూజ మిగతా దేవతలకు చేసినా ఇతనికి జరిగిన పూజతోనే సరిబెట్టుకుంటాడు. 


Thursday, 26 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (95)



శ్లోకంలో రెండవ పంక్తిలో ఎవరిని తప్పక పూజించాలో అని ఉంది. మూడవ పంక్తిలో తతః హేతున్యాయం ప్రకారం మహోత్తమ దేవతగా ఎవనిని భావిస్తారో అని ఉంది. ఇందు కూడా ఆ ఒకని గురించి చెప్పలేదు. యం ఏకం పరం అని ఉంది. తేలిందేమిటి? సమస్త దేవతలకు మూలం పరబ్రహ్మం కదా! ఆ మాటను సూచిస్తూ ఏకంపరం ఉంది. ఆ ఒక్కడు, అద్వైతమైన పరబ్రహ్మమే అని చెప్పినట్లైంది. ఆ శ్లోక రచయిత పరవస్తువునే స్తుతిస్తున్నాడు తతః హేతున్యాయం ప్రకారం అతణ్ణే స్తుతిస్తున్నాడు.


శ్లోకం, అతని పేరు చెప్పకపోయినా అతడెవరో మనకు తెలుసు. మన వినాయకుడే. కనుక ఈ న్యాయం చెప్పి బాగా నప్పునట్లు చేసాడు రచయిత.


ఈ న్యాయం తెలిసినవారికి, తెలియనివారికి ఏం జరిగింది?


ఎవరైనా తమ ఇష్టదైవాన్ని ఒక ప్రధాన ప్రయోజనంతో కొలుస్తారు. ఏదైనా ఆటంకం వస్తుందేమోనని శంకిస్తారు. అయితే అట్లా శంకించడం ఆ దేవత పట్ల పూర్తి భక్తి విశ్వాసాలను ప్రకటించడం లేదని మనం నిర్ణయించవచ్చా! ఏదైనా ఆటంకం వస్తే తాను కొలచిన దేవత ఊరకే చూస్తూ కూర్చుంటాడా? అయితే బాధ పడడానికి కారణం ఉంది. పురాణాలు చూస్తే దేవతలు మంచి పనులను చేయాలని సంకల్పించినా ఆటంకాలెదురవడం, తరువాత గణపతి అట్లా చేయడం జరిగినట్లు చదువుకున్నాం. వాళ్ళే భయపడినపుడు మానవ మాత్రులం మనమెంత? పూజకోసం డబ్బు కూడబెట్టడంలో సామగ్రిని సేకరించడంలో, లేదా మనస్సు యొక్క ఏకాగ్రతలో ఆటంకాలు వస్తాయి. కనుక ఇట్టివి తొలగాలంటే దేవతలే పూజించిన గణపతిని మొదటగా ఆరాధిస్తే మంచిదే.

Wednesday, 25 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (94)



పాద పద్మం


పంకం నుండి పుట్టింది పంకేరుహం. పద్మం. మురికిగా నున్న బురదనుండి పుట్టి స్వచ్ఛంగా ఉంటోంది. ఇది ఏమని గుర్తు చేస్తోంది? ఏ స్థితిలో మనిషి పుట్టినా ఉత్తమునిగా తీర్చి దిద్దబడాలని, బడవచ్చని చెబుతోంది. పద్మం నీటిలో పుట్టడం వల్ల నీరజం, అంభోరుహం, సరసిజం అని పేర్లు వచ్చాయి బురదనుండి పుట్టడం వల్ల పంకేరుహమైంది. అట్లాగే సంశయాలతో కూడిన మనస్సు నుండే భగవానుని పాదపద్మం వికసించాలి.


అంతరాయహతయే = విఘ్నాలు పోవడానికి. ఇట్లా గణపతిని పూజించడం మంచికే కాదు, కార్యం తు అవశ్యం విదుః తప్పనిసరి కూడా అని తేలింది.


అందువల్ల ఇక్కడ ఫలానా వాడని చెప్పలేదు. ఆ ఎవరో చెప్పకపోవడం కవులు చేసే చమత్కారం. యత్ పాద పంకేరుహద్వంద్వారాధనం ఎవని పాద పంకేరుహాన్ని పూజిస్తే అన్నారు.


ఇతర దేవతలను పూజించాలన్నా ఆ ఒక్కణ్ణి అని చెప్పడం వల్ల అతని గొప్పదనం తెలియవస్తుంది. ఆ ఒక్కణ్ణి పూజించడం వారి లక్ష్యం కాదు అయినా ఆ ఒక్కణ్ణి పూజించి తీరాలి. ఇది అతని గొప్పదనాన్ని సూచించదా?


ఇతర దేవతలను పూజిస్తే వారికి విఘ్నాలను తొలగించే శక్తి లేదు. విఘ్నేశ్వరునకే అట్టి శక్తి.


Tuesday, 24 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (93)

మరొక ఉదాహరణతో ఈ న్యాయాన్ని వివరిస్తాను. మనకు బియ్యం బస్తాలు కావాలి. అది మన లక్ష్యం అనగా తతః. భూయజమాని దగ్గరే తీసుకొనవచ్చు. కనుక భూస్వామి ఇక్కడే హేతువు. కానీ అది స్థానికమైన కిరాణా వ్యాపారి సిఫార్సు చేస్తేనే ఇస్తాడు. ఈ కిరాణా వ్యాపారి ఎవరి సిఫార్సు అక్కఱలేకుండానే మనకిస్తాడు. కనుక ఇతడు మనకు ప్రత్యక్ష హేతువు. అటువంటప్పుడు ఇతని దగ్గరకే వెళ్ళి తీసుకోవచ్చు కదా. మధ్యలో భూ యజమాని ఎందుకు? ఇక్కడున్న దీపంలో చాలా వత్తులున్నాయి. తూర్పువైపు వెలుగు రావాలని అనుకున్నామనుకోండి. ఆ వైపున ఉన్న వత్తిని వెలిగిస్తే సరిపోతుంది. ముందు పడమరవైపు వెలిగించు, దానితో తూర్పువైపున ఉన్న దానిని ముట్టించని ఎవరైనా అంటారా? (అందరూ నవ్వారు) అట్లా తతః హేతుత్వేమధ్యే కింతేన ఈ న్యాయంతో ఆ శ్లోకంలోని గణపతిని ఎందుకు పూజించాలో చెబుతాను.


చదువుకై సరస్వతిని; డబ్బుకై లక్ష్మిని మొదలైనవి పూజించాలని చెప్పాను. వివిధ ఫలాలు కావాలంటే వివిధ దేవతలను పూజిస్తున్నాం. అయితే ఏ దేవతను పూజించినా ముందు గణపతినే పూజిస్తారెందుకు? ఇతర దేవతలను పూజించడంలో విఘ్నాలు రాకుండా ఉండడానికి అదే శ్లోకం ప్రథమ భాగంలో ఉన్నది.


అప్యన్యామరమారిరాధ యిషతా..


శ్లోకం మొదట్లో 'అపి' అని ఉంది. అంటే ఏదో చెప్పబోతున్నాడు. కుతూహలం ఏర్పడుతోంది కదా.


మిగతా దేవతలను పూజించేవారేమి చేస్తారు? వారిని పూజించేటపుడు కూడా ఆటంకాలు రాకుండా ఉండడానికి ఒకని పాద పద్మాన్ని అనగా గణపతిని పూజించాలి కదా, అదే సంస్కృతంలో యత్ పాదపంకే రుహ ద్వంద్వారాధనం, అంతరాయ పతయే కార్యం త్వవశ్యం విదుః అని ఉంది. పాదద్వంద్వం అంటే రెండు పాదాలను.


Monday, 23 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (92)

ప్రతి పుస్తకానికి ముందు మంగళ శ్లోకం ఉంటుంది కదా. సాధారణంగా గణపతి గురించే ఉంటుంది. ఈ స్తుతిలోనూ న్యాయ శాస్త్రాన్ని రుచి చూపించారు శాస్త్రిగారు.


అప్యన్యామరమారి రాధ యిషతాం యత్నాద పంకేరుహ

ద్వంద్వారాధనమంతరాయ హతయే కార్యం త్వవశ్యం విదు:


తద్దేతోవిధినీతివిత్తు భజతే దేవం యమేకం పరం

సర్వార్థ ప్రతిపాదనైక చతురోద్యైమాతురోజవ్యాత్ సనః 


అనగా గణపతి కంటే మిగిలిన దేవతలను పూజించేవారు కూడా ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతినే ముందు పూజించాలి. తాము పూజించే ఇతర దేవతల అనుగ్రహం కావాలన్నా ముందితనినే పూజించాలి. ఈ 'తతః హేతు' న్యాయాన్ని బట్టి ఇతడే ప్రథమ దేవత అవుతాడు. అట్టి విఘ్నేశ్వరుడు మా ప్రయత్నాలను ఫలించేటట్లుగా అనుగ్రహించుగాక.


తతఃహీతు న్యాయం


హేతువంటే కారణం. విద్యుత్తున్న తీగను ముట్టుకుంటే ప్రమాదం కదా. ఆ తీగ హేతువైంది. హేతువునకు విరుద్ధం అహేతువు. ఏ కారణం లేకుండా దేనినీ ఆపేక్షించకుండా భగవానుని పట్ల చూపు భక్తి అహైతుకీభక్తి అని అంటారు. అట్టి జ్ఞానియైన భక్తుడు, నిర్గుణ స్వరూపం రుచి చూసినవాడే.

Sunday, 22 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (91)

అనంతాచార్యులనే వారు అద్వైతాన్ని ఖండిస్తూ న్యాయభాస్కరం వ్రాయగా న్యాయేందు శేఖరం వ్రాసి శాస్త్రిగారు ఖండించారు. సూర్యుని మాదిరిగా వెలుగుతుందనే అర్ధంలో వారు న్యాయ భాస్కరం వ్రాయగా అతడస్తమిస్తే చంద్రుడే ప్రకాశిస్తాడు, చల్లని వెన్నెలను ప్రసారిస్తాడు. విద్వాంసుల హృదయం చల్లబడుతుంది కనుక న్యాయేందు శేఖరం మన శాస్త్రిగారు వ్రాసేరు. దానిని ఈశ్వర ప్రసాదంగా భావించారు. మనస్సులో చంద్రుడు, ఈశ్వరుడు ఉండాలి కనుక పుస్తకానికి ఆ నామముంచారు. ఈ పుస్తకంపై ప్రతి సంవత్సరమూ అద్వైత సభ జరుపుతారు. మా మఠానికి చెందిన పరమ గురువులీ ఏర్పాటు చేసారు. వారే ఆరవ చంద్రశేఖరేంద్ర సరస్వతి. వీరు 1894లో ఈ సభను స్థాపించారు. ఈ పుస్తకం పై పరిశోధన చేసేవారికి ప్రతి ఏటా బహుమతినిస్తారు. ఇది ఈ పుస్తకం యొక్క గొప్పదనం.


ఇక్కడ తర్క శాస్త్రానికి, గణపతికి ఉన్న సంబంధాన్ని వివరిస్తాను. తర్క శాస్త్రం కార్యకారణ విచారణ చేస్తుంది. ఈ నియమాలను న్యాయమని అంటారు. ఇందు కొన్ని పోలికలుంటాయి. లోకోక్తులూ ఉంటాయి ఉదాహరణకు కాకి, తాటి చెట్టు మీద వ్రాలితే తాటిపండు పడిందని దానినే కాకతాళీయ న్యాయమని అంటారని తెలుసు కదా!


చెవిదుద్దు, మంగలసూత్రము స్త్రీల సౌభాగ్య చిహ్నాలు. పూర్వకాలంలో నిరాడంబరంగా ఉండేవారు కనుక ఆ చెవి దుద్దు, మెడలో కట్టిన తాళి తాటాకులతో ఉండేవి. తాటాకును నేడు ధరించికపోయినా, వజ్రాన్ని ధరించినా ఆ పదాన్ని గుర్తు చేస్తూ వజ్ర తాటంకాలని నేటికీ వ్యవహారంలో ఉంది. శ్యామలా నవరత్నమాలలో అమ్మవారు తాళీపలాశ తాటంకం అని పేర్కొనబడింది. తాటాకుతో చుట్టబడి కర్ణాభరణంగా ఉందని అర్థం. మంగళ సూత్రంలోని బిళ్ళ కూడా తాటాకుతోనే ఉండేది. అందువల్ల మంగళసూత్రాన్ని తాళియని వ్యవహరిస్తారు. గణపతి గురించి చెబుతూ మిగతా విషయాలను ప్రస్తావించాను. ఇక పుస్తకంలోని గణపతిని పేర్కొంటాను.

Saturday, 21 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (90)



మన్నారు గుడికి చెందిన రాజు శాస్త్రిగారనే మహావిద్వాంసుడుండేవాడు. గొప్ప శివభక్తుడు. అనుష్ఠానపరుడు. ఆయన గురుకులం నడిపి ఎందరినో విద్వాంసులుగా తీర్చి దిద్దాడు. ఆయన అసలైన కులపతి. ఆయన గురించి ఎవరైనా చెప్పవలసి వచ్చినపుడు వారి పేరుతో చెప్పేవారు కాదు. మన్నారు గుడి పెరియవ అనేవారు. ఆ మాటకు మన్నారు గుడి పెద్దవారని అర్ధం. నా మాదిరిగా మఠాధిపతి కాదు. నన్నట్లా గౌరవంతో పిలుస్తున్నారు. అయన సన్న్యాసి కాదు, గృహస్థే. 


సుమారు వంద సంవత్సరాలు బ్రతికారు. 20 వ శతాబ్దం మొదటివరకూ ఉన్నారు. అంత విద్వాంసుడైనా గొప్ప వినయవంతుడు. 1887 లో తెల్లదొరల ప్రభుత్వం వారికి మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చింది. "ఇది పెద్ద విద్వాంసులకిచ్చేది. నాకు అర్హత లేదని" వినయంతో అన్నారు. ఆ బిరుదును ఢిల్లీ వెళ్ళి తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ గారే బిరుదును, బహుమతిని తీసుకొని వచ్చి యిచ్చారు. ఇతర విద్వాంసులు వీరితో వాగ్వాదం చేసినా సున్నితంగా సమాధానం చెప్పేవారు. తిరువిసైనల్లూర్ లో రామ సుబ్బశాస్త్రీ గారనే మహా మహోపాధ్యాలుండేవారు. ఆయన స్మార్తుడైనా అద్వైతాన్ని, సన్న్యాసాన్ని, శివభక్తిని గూర్చి నిందావాక్యాలు వ్రాయగా వ్యక్తిగతంగా వారిని దూషించకుండా ప్రతి మాటను శాస్త్రోక్తంగా దుర్జనకోటినిరాసం అనే గ్రంథంలో రాజుశాస్త్రిగారు ఖండించారు.     


వారు వ్రాసిన అనేక రచనలలో న్యాయేందు శేఖరగ్రంథము గొప్పది. అది తర్కవేదాంతాల సంగమం. దానినే న్యాయశాస్త్రమంటారు.

Friday, 20 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (89)

దేవతల విఘ్నాలను పోగొట్టినవాడు


ఏ పురాణం ఆరంభించినపుడైనా అసలు వాగ్దేవిని, విద్యాదేవిని స్మరించడం సబబు. కాని అంతకంటే ముందు గణపతిని నుతిస్తాం. వాగ్దేవిని పూజించడానికి కూడా ఏదైనా ఆటంకం వస్తే ఏం జరుగుతుంది? అందువల్ల ముందుగా గణపతిని పూజించవలసిందే.  


మరొక ముఖ్య కారణముంది. మనం పూజించేటపుడే కాదు. దేవతలు మనలను ఆశీర్వదించాలన్నా ఏదైనా వారికి ఆటంకం రావచ్చు. ఇట్లా .జరుగుతుందా? పార్వతీ పరమేశ్వరులు, మహావిష్ణువు, అతని అవతారాలు సుబ్రహ్మణ్య స్వామి మిగిలిన దేవతలు వారనుకొన్నవి జరుగకపోతే వారే గణపతిని పూజించినట్లు పురాణాలలో కావలసిన కథలున్నాయి. శ్లోకంలో బ్రహ్మాది దేవతలని ఉంది కదా! అంటే అంతటివారే ఇతణ్ణి అర్చించవలసి వచ్చింది. పూజిస్తేనే కాని వారి పనులు జరగలేదు. పుస్తకం వ్రాసినపుడు సరస్వతిని ప్రార్ధించినా డబ్బుకోసం లక్ష్మిని పూజించినా, రోగవిముక్తి కోసం సూర్యుణ్ణి ఆరాధించినా మునుముందుగా ఆయా దేవతలు కరుణించడానికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే ముందుగా మనం గణపతిని పూజించవలసిందే. అప్పుడే దేవతలు మనపై అనుగ్రహం చూపించగలరు.


అది రుద్రాభిషేకం కావచ్చు, చండీహోమం కావచ్చు, ఏదైనా ముందుగా శుక్లాంబరధరం శ్లోకం చదువకుండా ఆరంభించం.

Thursday, 19 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (88)

సరస్వతి భర్త, బ్రహ్మ కనుక, ఆమెను వాగ్దేవియని అంటాం, కనుక ఇతడు వాగీశుడయ్యాడు. శ్లోకంలోని వాగీశుడు బ్రహ్మయే, బ్రహ్మ దేవతలలో వాగీశుడైనట్లు, వాగీశుడైన గణపతి - బుద్ధికి, పాండిత్యానికి పెట్టింది పేరైనాడు. 


బ్రహ్మ, సృష్టికర్త కదా! సృష్టి అనినప్పుడు కాలం గుర్తుకు వస్తుంది. కాలానికి సంవత్సరమొక కొలమానం క్రొత్త సంవత్సరం నాడు పంచాంగాన్ని వినేటపుడు ముందుగా బ్రహ్మను గుర్తుంచుకోవడం, సబబే. తరువాత బ్రహ్మాది దేవతలు కొలిచే గణపతిని స్మరించడం సబబు.


బ్రహ్మ, వాగీశుడైనా బుద్ధితో, పాండిత్యంతో సంబంధమున్నవానిని పూజించాలి. ఇంకా విఘ్నాలు లేకుండా ఉండాలన్నా గణపతిని పూజించాలి • అందుకే ముందుగా శ్రీ మహాగణాధివతయే నమః అని వ్రాసి మొదలుపెడతాం.


సరస్వతి భర్తయైన బ్రహ్మ, వాగీశుడైనా గణపతిని కొలిచాడు కనుక ముందుగా గణపతిని పూజించాలి. రామాయణాన్ని పారాయణం చేసేటప్పుడైనా వాగీశాద్యాః అనే శ్లోకాన్ని ముందుగానే చదువుతాం. తరువాత సరస్వతీ స్తుతి యుంటుంది.

Wednesday, 18 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (87)



వాగీశుడెవడు ?


ఈ పదం, తిరునావుక్కరుసు స్వామికి ఉంది. ఇతడు జైనుడై, జైన మత ప్రవర్తకులలో గొప్పవాడై ధర్మసేనునిగా కీర్తింపబడ్డాడు. అతడు తిరిగి శైవమతంలోకి వచ్చినపుడు పరమేశ్వరుడే అశీరవాణితో "నా వుక్కరసు" అనే బిరుదు నిచ్చాడట. అది సంస్కృతంలో వాగీసుడని అర్ధం. దీని తరువాత తిరుజ్ఞాన సంబంధర్ ఇతణ్ణి అప్పర్ అని సంబోధించాడు. ఈ పేరూ ప్రచారంలో ఉంది. శ్లోకంలోని వాగీసపదం అప్పర్ స్వామిని చెప్పడం లేదు. వాగీశ మరియు దేవతలని ఉంది కదా! అయితే దేవతలలో వాగీశుడెవడు? బ్రహ్మకు, బృహస్పతికి ఈ పేరుంది.


దేవ గురువు బృహస్పతి చాలా బుద్ధిమంతుడు. అందుకే లోకంలో నువ్వేమైనా బృహస్పతివా అనే మాట వచ్చింది. అతడన్ని శాస్త్రాలలో నిష్ణాతుడు. కనుక అతడు వాగీశుడు. అతడు గీష్పతి కూడా. రెంటికీ ఒకే అర్ధం. ఇతనికి గణపతికి దగ్గర సంబంధం ఉంది. వేదాలలో నున్న బ్రహ్మణస్పతియే పురాణాలలోని విఘ్నేశ్వరుడని పరితోధకులంటారు. గణానాంత్వా అనే మంత్రాన్ని వినాయక ప్రతిష్ఠలో వాడతాం. ఇక్కడ అతడు బ్రహ్మణస్పతియే.


ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని గ్రహించవచ్చు. దేవతలు, వినాయకుణ్ణి వారి గురువు, బృహస్పతి ద్వారా తెలుసుకొని అర్చించారనవచ్చు. అనగా దేవగురువు. గణపతిని అర్చించి శిష్యులకిట్లా చేయాలని ఉపదేశించినట్లైంది.

Tuesday, 17 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (86)



అట్టి ఉగ్రత్వం తిరిగి ఆమెలో ప్రవేశించకూడదని విగ్రహంలోని ఉగ్రకళలను గ్రహించి తాటంకాలలో ఉంచారు. అంటే కర్ణాభరణాలుగా, అవి యంత్ర రూపంలో ఉంటాయి. వాటిని ఆమెకు అలంకరంగా ఉంచారట.


తాటంకం, సౌభాగ్యానికి గుర్తు, శంకరులు, సౌందర్యలహరిలో ఒక ప్రశ్న వేసారు. అమృతం త్రాగినా దేవతలు ప్రళయకాలంలో నామరూపాలు లేకుండా ఉన్నారేమిటి? ఒక్క పరమేశ్వరుడే నిలబడడానికి కారణం ఏమిటి? ఆపైన విషపానం చేసిన వాడుండడేమిటి? అని ప్రశ్న వేసుకొని, ఇదంతా నీ తాటంకాల మహిమయమ్మా, 'తవజనని తాటంక మహిమా' అన్నారు.


ఇట్లా ఉగ్ర కళలను తాటంకాలలో బంధించి, పాతివ్రత్యానికి చిహ్నమైన తాటంకాలనమర్చి ఎదురుగా కొడుకైన గణపతిని ప్రతిష్ఠించారు.


గణపతికి జంబుకేశ్వరంతో, సంబంధం ఉంది. జంబు అంటే నేరేడు. నేరేడు ఫలాలంటే స్వామికి ఇష్టం. ఒక స్తోత్రంలో 'కపిత్థ జంబూఫల సార భక్షితం' అని ఉంది. నేరేడు పండును సుబ్రహ్మణ్య స్వామి, అవ్వైయార్ అనే కవయిత్రికి ఇచ్చాడని, ఆమె గణపతి భక్తురాలని కథ.


శంకరుని అవతారమైన శంకరులు, శివపార్వతులకు ప్రీతిపాత్రుడైన వినాయకుణ్ణి ప్రతిష్ఠ చేయడంలో ప్రత్యేకత ఉండాలి.


పరాశక్తి యొక్క కోపాన్ని తగ్గించగల శక్తి గణపతికే ఉంది. అతనికి శక్తి ఉందంటే ఏదో మంత్రాన్ని ఉపయోగిస్తాడనో, ఏదో చేసి పరాశక్తిని మారుస్తాడని కాదు. పరాశక్తి యొక్క చూపు పడితే చాలు. ఆమె కంటికి ఇతడు ప్రీతి పాత్రుడు ప్రేమ మూర్తి. అతని మనస్సూ గొప్పదే. వాగీశది దేవతలు ఇతనిని అర్చించి విజయాన్ని పొందారు కదా!

Monday, 16 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (85)

 

ఏనుగు కాని ఏనుగు ముఖం కలవాడు


అతడెంత ఉదార హృదయుడో చెప్పడానికి ఒక్క సంఘటన చెబుతాను. ఎవని దగ్గర కోపం రాదో, ఎవర్ని చూస్తే కోపం పటాపంచలౌతుందో, శాంత మనస్యులౌతారో అట్టివానికి ప్రేమ పూర్వకమైన హృదయం ఉండాలి కదా! దానికి ఉదాహరణ మన గణపతియే. చీమనుండి బ్రహ్మవరకూ ఎవరు ప్రేమిస్తారు? ఆమెయే అమ్మవారు. ఆమె విశ్వజనని. అట్టి తల్లి, అఖిలాండేశ్వరి ఒక సందర్భంలో ఉగ్రరూపం ధరించింది. తమిళనాడులోని జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అట్లా ఉండేది. కలియుగ ప్రజలను చూసి ఉగ్రురాలైందట. ఆమె అమిత శక్తి కలదైనా, లలిత మాదిరిగా అందరినీ ప్రేమించినా ఉగ్రమైన కాళిగా కూడా ఉండగలదు.


ఇట్టి కాళీ రూపం తగ్గించడానికి శంకరులు ఇక్కడకు వెళ్ళారట. వారు పరమేశ్వరుని అవతారం కదా! కనుక ఆయన సమీపించగలరు. ఈ సందర్భంలో గణపతి యొక్క మహత్త్వాన్ని లోకానికి చాటించాలనుకొన్నారు. అందువల్ల అమ్మవారి ముందరగా గణపతిని ప్రతిష్ట చేసారు. అంతే! ఎప్పుడైతే గణపతి వెలిశాడో అమ్మవారి కోపతాపాలు చల్లారాయి. పిల్లవానిపై తల్లికి మమకారం ఉంటుంది కదా.

Sunday, 15 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (84)

 


పువ్వు - మనస్సు


సుమనస్ అనగా మంచి మనస్సని అర్ధం. అసలు మంచి మనస్సే దేవశక్తి. చెడ్డమనస్సు అసుర శక్తి, పువ్వును కూడా సుమనస్ అంటారు. ఒక మొక్క లేక లతలా పువ్వులా ఉంటుంది మంచి మనస్సు. మంచి మనస్సు యొక్క లక్షణమేమిటి? అందులో ప్రేమ ఊరుతూనే ఉంటుంది. మొక్కకైనా, లతకైనా దాని యొక్క సారమైన మాధుర్యం పువ్వులో కన్పిస్తుంది. పండు కంటే తియ్యగా ఉండేది మకరందమే. కొన్ని మొక్కలలో, కొన్ని చెట్లలో పండ్లు చేదుగా ఉండవచ్చు. కాని వాటి పువ్వులలో తేనె, తియ్యగానే ఉంటుంది. చేదుగా ఎన్నటికీ ఉండదు. పువ్వు కంటికి, ఒంటికి, ముక్కుకు, నాల్కకు సంతోషాన్ని కల్గిస్తుంది. అందమైన ఆకారం వల్ల కంటికి, మెత్తగా ఉండడం వల్ల చర్యానికి సుగంధం వల్ల ముక్కుకు; దానిలోని తేనె నోటికి రుచికరంగా ఉంటుంది ఇక చెవి ఒక్కటే మిగిలింది. పువ్వు తుమ్మెదలను తనవైపునకు ఆకర్షించుకొనేటట్లు చేస్తోంది. ఆ తుమ్మెదల ఝంకారం వీనుల విందుగా ఉంటుంది.


ఈ సునమస్సుకి - మంచి మనస్సు, అందం, దేవతలు అనే అర్థాలిచ్చే చాలా శ్లోకాలున్నాయి. మహిషాసురమర్దనీ స్తోత్రంలో ఈ సుమనస్ పదం చాలాసార్లు వస్తుంది. దీనికున్న అన్ని అర్థాలలోనూ వాడబడింది. ఇందులో అమ్మవారిని నుతిస్తూ, కాంతి కలిగిన పువ్వులతో అమ్మవారు, మంచి మనస్సు కల దేవతలచే అర్చించబడిందనే అర్థంలో సుమనస్' మంచి హృదయమని దేవతలని, అందమని, పువ్వులని అనేకార్థాలలో వాడబడింది. ఆ శ్లోకం యొక్క నడకయే అందంగా ఉంటుంది. (ఈ శ్లోకం అనంతరామదీక్షితుల కాలంలో ప్రాచుర్యం పొందింది)


గణపతి, సుమనస్సులచే అర్చింపబడ్డాడని అనినపుడు మంచి మనస్సు కలవారిచే అర్చింపబడ్డాడని అర్ధం. అందుకే వాగీశాద్యాః సుమనసః అని వాడబడింది. దేవతలనిక్కడ ఏ పదంతోనూ కాకుండా సుమనస్ అనే వాడబడింది


మంచి మనస్సు కలవారు ఎవర్నో ఒకర్ని పూజిస్తారు. పూజింప బదేవాడూ మంచి మనస్సు కలిగి యుండాలి కదా.


Saturday, 14 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (83)



దేవతలారాధించిన దేవత


గజవక్తుని పూజ వల్ల విజయం


సంవత్సరాదినాడు పంచాంగ శ్రవణంలో ఈ శ్లోకాన్ని చదువుతారు: 


వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే

యం నత్వా కృతకృత్యాస్యుః: తం నమామి గజాననం


ఇందు గజానన పదం వినబడుతోంది. కనుక శ్లోకార్థం తెలియకపోయినా వినాయకుణ్ణి స్తుతిస్తున్నామని అర్ధమవుతుంది. ఏమని చెప్పింది? దేవతలు తుదకు బ్రహ్మ కూడా ఏదైనా పనిని ఆరంభించి పూర్తి కావాలని అనుకొనేవారు ఈ గజాననుణ్ణి కొలుస్తారని.


బలహీనులైన మానవులే కాదు, బలవంతులైన దేవతలూ కొలుస్తారట. వారు నిర్దిష్టమైన తిథులలోనే కాదు, ఏదైనా పని ఆరంభించునపుడు నిరంతరమూ కొలుస్తారట. చేసిన పనులు ఫలిస్తాయని శ్లోకం చెబుతోంది. వీరి నమస్కారాన్ని మాత్రమే స్వీకరించడు, వారెందుకు నమస్కరించారో దానిని నెరవేరుస్తాడు. అనగా వారిని కృతకృత్యులను చేస్తాడన్నమట. అనగా వారి లక్ష్యాన్ని నెరవేరుస్తాడు.


వాగీశాద్యాః సుమనసః = వాగీశుడు మొదలగువారు. సుమనస్ అనగా దేవతలు.

Friday, 13 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (82)



జయంతుల ప్రత్యేకత


సౌర మాన పంచాంగాన్ని అనుసరించే తమిళులు అడృష్టవంతులంటున్నా కారణమేమంటే వీరికి గోకులాష్టమి (కృష్ణ జయంతి), వినాయక చవితి రెండూ త్రావణ మాసంలో వస్తాయి. ఇతరులకు గోకులాష్టమి త్రావణమాసంలో, వినాయక చవితి భాద్రపదమాసంలో వస్తుంది.


ఈ శ్రావణ మాసంలో దోసకాయలు విస్తారంగా పండుతాయి. ఇది సాత్త్వికాహారం కూడా. వండకుండానే పచ్చివాటిని తినవచ్చు. కృష్ణుడు, వినాయకుడు, బాలలీలలను చూపించే కాలమది. వారి జయంతులలో పచ్చి దోసకాయలు వస్తాయి. అధ్యాత్మికంగా మనం ఎదగడానికీ, అని తగిన కాలం దోసపండ్లను దేవతలకు నివేదించవచ్చు. మనం తినవచ్చు. మనము చల్లగా ఉండాలని వారు దీవిస్తారు.


సారాంశం


ఈ కథలవల్ల గణపతి, చిన్న పిల్లవాడే కాదు అనేక సందర్భాలలో పెద్దల కంటే పెద్దగా ఉంటాడు. ఎవరికంటె? తన తల్లిదండ్రులు, మేనమామ కంటె కూడా.


పరమేశ్వరునకు, లలితాంబకు రామునకు వచ్చిన ఆటంకాలను పోగొట్టినవాడు, సుబ్రహ్మణ్య వివాహానికి తోడ్పడినవాడు, మన అందరి సమస్యలను తీర్చువాడైన గణపతిని, అందరికంటే పెద్దగా ఉన్నానని నటించేవానిని భజిద్దాం.


Thursday, 12 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (81)



మణి లేకపోవడం వల్ల కఱువు రావడం, మరల భాగ్యం రావడం, అంతా నాటకంలో భాగమే. అసలు ద్వారకలో కృష్ణుడుండగా మణితో నిమిత్తం లేకుండా భాగ్యం ఉండదా? కఱువు, నాటకంలో ఒక భాగం. తరువాత భాగ్యం రావడమూ అంతే. మణిని ఆధారంగా తీసుకొని ఈ నాటకం ఆడించాడు, ఆ జగన్నాటక సూత్రధారి.


అతడు చెప్పినట్లే అక్రూరుని దగ్గరే మణియుంది. ప్రజలు సత్యం తెలుసుకొన్నారు. లెంపలేసుకున్నారు. కృష్ణుణ్ణి నుతించారు. 


బలరాముడూ విదేహ రాజ్యం నుండి తిరిగి వచ్చాడు. ఈ మొత్తం కథను వినిపించారు. కృష్ణుణ్ణి అనవసరంగా శంకించానని బాధపడ్డాడు బలరాముడు.


“మీదేమీ తప్పులేదు. నేను చవితి చంద్రుణ్ణి చూడడమే కొంప ముంచింది. ఇదీ బాగానే ఉంది. దీనివల్ల వినాయకుని గొప్పదనం వెల్లడైంది కదా అని కృష్ణుడన్నాడు. (అపార సంపద ఒక వ్యక్తి చేతిలో ఉంటే ఎన్ని అనర్ధాలు వస్తాయో గమనించారా? ప్రజలందరికీ చెందవలసిన విలువైన సంపద ప్రభుత్వాధీనంలో ఉందాలని ఈ కథ వెల్లడించడం లేదా? సంపద కలకాలం ఉండాలంటే శారీరిక, మానసిక శుచి తప్పక ఉండాలని బోధించడం లేదా? - అనువక్త)


Wednesday, 11 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (80)



ఇట్లా ప్రేమను, గౌరవాన్ని చూపిస్తూ వార్తలో లౌక్యాన్ని మేళవించాడు కృష్ణుడు. గమనించారా?


అసలేదో బుద్ధి చలించిందే గాని, అక్రూరుడు పరమ భాగవతుడే. ఈ మాటలను వినగా అతనిలో భక్తి పెల్లుబికింది. వచ్చి కాళ్ళపై బడ్డాడు.


నీ దగ్గరే ఉంచుకో అని భగవానుడన్నా మొత్తం సంపద అంతా లక్ష్మీపతికే చెందాలి కదా. తనకోసం దాచిపెట్టడం పాపమని, ఇది రాజద్రవ్యాన్ని అపహరించడమని పశ్చాత్తప్తుడయ్యాడు, అక్రూరుడు. మణిని తిరిగి ఇచ్చివేసాడు.


“దీనిని బహుమతిగా స్వీకరించవయ్యా, నేను ప్రేమతో ఇస్తున్నా, దానిని తిరస్కరించడం బాగుందా" అని అన్నాడు కృష్ణుడు, "నాపై నింద పోగొట్టుకోవడం కోసం ద్వారక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే నేను నిన్ను రమ్మన్నాను. నీ దగ్గరే ఉంచుకో” అని తిరిగి ఇచ్చివేసాడు.


కృష్ణుడు ద్వారకను నిర్మించాడు. ఉగ్రసేనుణ్ణి సింహాసనం పై కూర్చుండబెట్టాడు. ఇతడు యదువంశ నేత. కనుక అధికారంతో ఉన్నవారు ఇతరులపట్ల ఎట్లా ఉండాలో తెలియపర్చడం లేదా? తాము నిజాయితీతో ఉండడమే కాదు, నిజాయితీతో ఉన్నట్లుగా కూడా కనబడాలి, లోకులను సంఘాన్ని అవినీతి నుండి కాపాడాలి. వారి పవిత్రమైన నడవడిని చూపించాలి కూడా అందుకే ఆంగ్లంలో "Cesar's wife must be above suspision" అనే నానుడి ఏర్పడింది. అందువల్లనే తనపై మోపబడిన నిందను తుడిచివేసుకోవడాన్ని కృష్ణుడు, నానా తంటాలు పడవలసి వచ్చింది. అతడు నిజంగా బాధపడి కాదు. లోకానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. నాటకంలో వేషం వేసినవారికి బాధ లేకపోయినా, బాధపడుతున్నట్లు నటిస్తారు కదా!


Tuesday, 10 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (79)



నింద తొలగింది


ఇక కృష్ణునిపై వేసిన నింద ఎట్లా తొలగిందో చూద్దాం:


ద్వారకలో అనుకోకుండా కఱువు అలముకొంది. అదే సమయంలో కాశి పట్టణం భాగ్య భోగ్యాలతో కళకళలాడుతూ ఉందనే వార్త వినబడింది. అక్రూరుడక్కడున్నాడని ఆలయ సేవలు చేస్తున్నాడనే వార్తలూ వినబడ్డాయి. కనుక మణి, అక్రూరుని దగ్గర ఉండాలని ఊహించారు.


భగవానుడు సర్వజ్ఞుడు కదా! అతనికి వార్తాహరులు కావాలా? కాని మామూలు మనిషిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇట్లా ప్రజల మాటల కనుగుణంగా ఒక వార్తాహరుణ్ణి పంపాడు. ఏమని? 


ద్వారక, నీవు లేకపోతే వెలవెలబోతోంది. కఱువు తాండవించింది, నీపు వెంటనే వచ్చి నీ యదు వంశపు పెద్దరికాన్ని నిలబెట్టుకో, నీ దగ్గర మణియున్నా సరేసరి, సత్రాజిత్తు ఇప్పుడు లేడు, అతనికి ఔరసనునిగా మగసంతానమూ లేదు, సత్యభామ తండ్రిని పోగొట్టుకొని విలపిస్తోంది. మణిని గురించి పట్టించుకోవడం లేదు. ఎవరి చేతిలోనో ఆ మణి ఉండటం కంటే నీవంటి సచ్చరిత్రుని దగ్గర ఉండటమే మేలు". కృష్ణుడు ఈ మణిని తీసుకోవడానికి పూర్తిగా అర్హుడైనా తన గురించి చెప్పకుండా అతణ్ణే పొగిడాడు. సందేహం కలగకుండా ఇట్లా ప్రశంసించాడు: "నా అన్నగారు నన్నే శంకిస్తున్నాడు. అతడు శంకిస్తే ఇక జాంబవతి శంకించకుండా ఉంటుందా? నా దగ్గరే ఈ మణి యున్నట్లు జాంబవతి భావిస్తోంది. మొదట తపస్సువల్ల సత్రాజిత్తు సంపాదించాడు కనుక, దానిని దాచివేసి అతని కూతురుకే కట్టబెట్టతాడని భావించి యుండవచ్చు కూడా. ఇక సత్యభామ, ఈ మణి జాంబవంతుని దగ్గర ఉండడం వల్ల దీనిని జాంబవతికే నేను కట్టబెడతాననీ భావించి యుండవచ్చు. ఇట్లా అందరిలోనూ సందేహాలలుముకున్నాయి. ద్వారకలో ఉన్న రకరకాల ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. కనుక నీవు బాహాటంగా నీ దగ్గరే ఉందని తెలియపర్చాలి. అంతేకాదు, మన ప్రాంతం కలవు కాటకాలనుండి దూరంగా ఉండాలన్నా ఆ మణి నీ దగ్గర ఉండవలసిందే" అని కబురు పెట్టాడు కృష్ణుడు.


Monday, 9 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (78)



ఒక్క శ్లోకం చాలు


ఇక నీలాపనిందలు తొలగాలంటే మరొక సూక్ష్మోపాయం ఉంది. మొత్తం శ్యమంతకోపాఖ్యానాన్ని చదవడమూ కష్టమే. కనీసం కథ పై దృష్టి పెట్టండి అందొక్క శ్లోకమైనా చదవండి. ఈ శ్లోకాన్నే జాంబవరి పల్కింది, పిల్లవాణ్ణి జోకొట్టే సందర్భంలో. ఈ శ్లోకాన్ని బట్టి రహస్యాన్ని ఛేదించాడు కృష్ణుడు దీనిని లోగడ పేర్కొన్నాను. అయినా


సింహః ప్రసేనం అవధీత్ సింహో జాంబవతా హతః 

సుకుమారక! మారోదీ: తవ హ్యేష శ్యమంతకః


ఈ ఒక్క శ్లోకం చదివితే మొత్తం కథ అంతా మదిలో మెదులుతుంది. ఈ శ్లోకంలో రెండవ సగం, మనలనుద్దేశించినట్లుంది చూడండి. ఓయి పిల్లవాడ! ఏడవకుమని అంది. ఈ సుకుమారక అనే పదం మనకూ అన్వయిస్తుంది. తవ హ్యేష శ్యమంతకః, మణి నీకొరకే. ఇట్లా వినాయకమణి, కృష్ణమణి మనకే, మనకొరకే ఉన్నాయని భావించండి. వాళ్ళ అనుగ్రహం ఉంటే చీటికీ మాటికీ మనం ఏడవాలా?


ప్రత చూడామణి కల్పంలో ప్రతమెట్లా చేయాలో చెప్పబడింది. ఈ శ్లోకాన్ని తప్పక చదవాలని చెప్పింది.


Sunday, 8 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (77)



లీలా ఫలితం - లోకక్షేమం


గణపతితో కృష్ణుడొక విజ్ఞప్తిని చేసాడు. అతనికి లోకక్షేమం కావాలి కదా! "నీవు నా ఎదురుగా కనబడ్డావు, నా సమస్యను తీర్చావు. బాగానే ఉంది. అయితే ఇట్టి బాధలనుండి విముక్తి నాకొక్కడికే చెందకుండా అందరికీ ఉపయోగించే మార్గాన్ని చూపుమని” అన్నాడు.


ఇంతకుముందు గణపతి, చంద్రుణ్ణి ఎవరు చూసినా కష్టాలు పడతారని అన్నాడు కదా. కృష్ణుని మాటలను పురస్కరించుకుని అందరికీ మేలు చేయాలని ఇట్లా అన్నాడు. “ఆ చవితినాడు చూస్తే నిందలు వస్తాయని లోగడ అన్నాను. ఇక నీ శ్యమంతకమణి కథను ఎవరు చదివినా, విన్నా వెంటనే వారికి వచ్చిన నిందలు పోతాయని ఇప్పుడు వరం ఇస్తున్నా. ఈ చవితినాడు నేనావిర్భవించాను కదా! ఈనాడు ఆ కథ చదివితే చాలని అంటున్నా. నీలాపనిందలే కాదు ఎట్టి మానసిక ఆందోళనలూ ఉండవని అందరూ సుఖశాంతులతో ఉంటారని హామీ ఇస్తున్నానని" గణపతి అన్నాడు.


మానవావతారం ఎత్తినపుడు కష్టాలు, నష్టాలు తప్పవు. ఇట్లా లీలగా అనుభవించి కృష్ణుడు, లోకానికి ఉపకరించాడు.

Saturday, 7 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (76)



ఇట్లా చంద్రుడు - గణపతి కథను వినిపించాడు నారదుడు కృష్ణునికి. నీవు భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుణ్ణి చూసావు. వినాయకుని శాపం నీకు తగిలి యుంటుందని అన్నాడు. దానికి విరుగుడుగా చవితినాడు పూజ చేయవలసిందని అన్నాడు.


కృష్ణుడా మాటలను నమ్మి వ్రతం ఆచరించాడు. మేనల్లుడు కదాయని తేలికగా చూడలేదు. అతడు శుక్ల, కృష్ణ పక్ష చతుర్దులను రెంటినీ ఆచరించాడు. లేకపోతే ఇందెవరు గొప్పయని మనం శంకిస్తాం.


శుక్లాంబరధరుడైన గణపతి, కృష్ణుని ముందు సాక్షాత్కరించి నీవు మానవాకారం ధరించావు, అదర్శవంతంగా ఉండదానికి నీవూ నియమాలను పాటించవలసిందే. ఇకనుండి నింద తొలగిపోతుందిలే చంద్రుని మాదిరిగా తళతళా ప్రకాశిస్తావులే - అని మేనమామకే వరం ప్రసాదించాడు గణపయ్య.

Friday, 6 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (75)

 


కృష్ణుడు - చంద్రుడు


కృష్ణునికి సంబంధించిన గోకులాష్టమి పూజలోనూ చంద్రునకు అర్ఘ్యం ఉంటుంది కూడా. ఇట్లా కృష్ణుడు చంద్రుణ్ణి కూడా పూజించాలనే నియమాన్ని పెట్టియుంటాడు, విఘ్నేశ్వరుడు దయ చూపించినట్లుగా.


మరొక కథ ఇతనిలో సంబంధం ఉంది. రాముడు సూర్యవంశంలో పుట్టి రవికుల తిలకుడని, ఇనుకుల తిలకుడని పేరు గడించాడు. అంటే సూర్యునకు ప్రాధాన్యం ఇచ్చి చంద్రునకు అప్రాధాన్యం ఉన్నట్లే కదా. రాముని దగ్గరకు వెళ్ళి నన్నెట్లా విస్మరించావయ్యా అని విలపించాడు. బాధపడకయ్యా, నా పేరు చివర నీ పేరు నుంచుకొని ఇక రామచంద్రుడని పిలువబడుతానులే, అన్నాడట. అంతేకాదు, మరొక అవతారంలో చంద్రవంశంలోనే పుడతానని అన్నాడట. అందువల్ల కృష్ణుడు, చంద్రవంశంలో అవతరించాడు. చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేటట్లు చేసాడు. కనుక కృష్ణాష్టమి రోజున చంద్రునకు అర్ఘ్యం ఇయ్యాలి.

నింద పోగొట్టడానికి వరం


మరొకవిధంగానూ సత్కరించాడు గణపతి. సంకటహర చతుర్థినాడు తనతో చంద్రునికి పూజ చేయాలని చెప్పడమే గాక ఆ తిథికి ముందున్న తిథినాడు చంద్రుణ్ణి చూస్తే మంచిదని కూడా అన్నాడు. అమావాస్య తరువాత వచ్చే పా డ్యమినాడు చంద్రుణ్ణి చూస్తే చవితినాడు చూసిన దోషం తొలగిపోతుందనే నియమాన్ని ఏర్పాటు చేసాడు.


ఆ చవితి ముందున్న తదియనాడు చూడాలి. ఈ రోజే ఈశ్వరుడు అమ్మవారు, గణపతి కూడా చంద్రరేఖను నెత్తిపై ధరించారు. అమావాస్య తరువాత వచ్చిన పాడ్యమిలో చంద్రుడు మసక మసకగా కన్పిస్తాడు. విదియనాడు కన్పిస్తాడు. దానిని చంద్రదర్శనమని పంచాంగాలలోనూ ఉంటుంది. ఆ తదియనాడు చూడడాన్ని మరిచిపోయాం. లోకంలో చవితినాడు చూస్తే బాధలు పడవలసి వస్తుందనే నానుడి మాత్రం ఏర్పడింది. అమావాస్య నుండి మొదలు పెడితే నాల్గవ తిథి, తదియ వస్తోంది. (అట్లా లెక్కబెట్టి చూడడం లేదేమో!)


Thursday, 5 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (74)



మనం ఎవరినైనా స్తోత్రం చేస్తూ ఉంటే ఏమిటయ్యా, నెత్తిన బెట్టుకొని ఊరేగుతున్నావేమిటని అంటాం కదా. గణపతి, చంద్రునిపై దయ చూపించి నృత్యం చేసాడు. అతనికి నృత్త గణపతి అని కూడా పేరు.


చంద్రుణ్ణి గణపతిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఒకడు ఒకని నెత్తిపై కూర్చొనియుందగా ఒకనియందం మరొకనికి సంక్రమించినట్లుంటుంది.


సంకట హర చతుర్థి


స్వామి, చంద్రునికి మరొక గౌరవాన్ని కట్టించాడు. ప్రతి దేవతకు, తిథికి సంబంధం ఉంది. ప్రతి నెలలో రెండుసార్లు శుక్ల కృష్ణ పక్షాలలో తిథి వస్తుంది. అందొక తిథితో సంబంధం ఉంటుంది. కుమార స్వామికి శుక్ల పక్ష షష్ఠితోనే సంబంధం. శివునకు కృష్ణ చతుర్ధశిలోనే. దానినే మాస శివరాత్రి అని అంటారు. రామునకు శుక్ల నవమితో, కృష్ణునకు కృష్ణపక్ష అష్టమితో, (నల్లని కృష్ణునకు, తెల్లని శివునకు కృష్ణ పక్షంతోనే బంధం) అమ్మవారికి పూర్ణిమతో. అది శుక్ల పక్షంలోనే వస్తుంది. కాని మన గణపతికి శుక్ల, కృష్ణ పక్షాలతో సంబంధం ఉంది.


ఆయన అవతరించింది శుక్ల చతుర్థినాడు. అందుకే వినాయక చవితియని అంటాం. ఈ శుక్లచతుర్ధిని అన్ని మాసాలలోనూ ఆచరించవచ్చు. ఇంకా సంకటహర చతుర్థి కూడా ఉంది. అనగా కష్టాలను పోగొట్టే చతుర్థి. (హర అనే పదాన్ని విడిచి సంకట చతుర్ధియని కూడా వాడుతూ ఉంటారు). ఇది కృష్ణ పక్షంలోనే వస్తుంది. శుక్లపక్షంలో కాదు.


ఇది ఎట్లా వచ్చింది? ఈనాడే చంద్రుణ్ణి  క్షమించాడు. శుక్ల చతుర్థి నాడు చూడకూడదనే నియమం ఉంది కదా! బాధ పెట్టానని భావించి కృష్ణ పక్షంలోనూ ఇతణ్ణి పూజించాలని దయతో ఈ నియమాన్ని ఏర్పాటు చేసాడు. ఇట్లా ప్రకటించాడు కూడా. నన్ను కృష్ణ పక్షంలో పూజించిన వారికీ అన్ని కష్టాలను పోగొడతాను. ఈనాడే రోహిణితో కూడిన చంద్రుణ్ణి నా పూజతో బాటు పూజించాలి సుమా అన్నాడు. ఇట్లా రోహిణిపై పక్షపాతం చూపించిన చంద్రుని పట్ల జాలి చూపించాడు.


Wednesday, 4 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (73)

 


భాలచంద్రుడు


చంద్రునికి వేసిన శిక్షను తగ్గిస్తూ ఇంకా ఉదార హృదయంతో అతనికి గౌరవాన్ని ప్రసాదించాడు. నెలవంకను తన కిరీటంపై ధరించాడు కూడా.


శంకరుని మాదిరిగానే, అమ్మవారికి, గణపతికి ఇట్లా నెలవంకను ధరించడం ఉంది,


దీనివల్ల గణపతి, భాలచంద్రుడయ్యాడు. ఇతని 16 నామాలలో ఇది యొకటి. చాలామంది దీనిని బాలచంద్రుడని అనుకుంటారు. అనగా చిన్న చంద్రుడని అది 'బా కాదు. 'భా. భాలయనగా నుదురు. ఫాలయని కూడా అనవచ్చు. ఇట్లా ఉచ్చరిస్తే నుదుటి పై కొంత జుట్టున్న భాగం తోస్తుంది, శిల్పాలలో ఈశ్వరునికి జటాజూటంపై ఎడమవైపున ప్రక్కగా చంద్రరేఖ కన్పిస్తుంది. తిన్నగా కాదు. కనుక పరమేశ్వరుడు ఫాలచంద్రుడే. భాలచంద్రుడనే పదానికి అతికినట్లుంటాడు గణపతి.


చంద్రునకు, ఈశ్వరునకు తిన్నగా సంబంధం లేదు. చంద్రుణ్ణి క్షమించడం శివుని కథలో ప్రధానం కాదు. చంద్రుడు తన భార్యల పట్ల వివక్షత చూపించాడు కనుక శిక్షింపబడ్డాడు, క్షమాపణ కోరాదు, క్షమింపబడ్డాడు కూడా.


కాని గణపతిని ప్రత్యక్షంగా అవమానించాడు చంద్రుడు, కనుక ఇతడు చంద్రుణ్ణి క్షమించడం లోనే విశేషం దాగియుంది.

Tuesday, 3 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (72)



శివునకు అభిషేకం. విష్ణువునకు ఆలంకారము; వినాయకునకు నైవేద్యము ప్రీతి. ఇతడు పిల్లవాడు కదా! పిల్లలకు తిండిపై ధ్యాస ఉంటుంది. హాని చేస్తుందని తెలియకపోయినా ఏది పడితే దానిని నోట్లో పెట్టుకుంటారు. ఏవో తినుబండారాలిచ్చి వాటిని తీసివేస్తాం. కనుక కడుపునిండా అతనికి నైవేద్యం పెట్టాలి. అవ్వైయార్ అనే గణపతి భక్తురాలు, మొదట ప్రార్థనలో నైవేద్యాల గురించే చెప్పింది.


బ్రహ్మ సలహా ననుసరించి దేవతలందరూ పూజలు చేసారు. సముద్రంలో చంద్రుణ్ణి చూసి నీ తప్పు నీవు తెలుసుకోవాలయ్యా, మా పూజలకంటే ఇది చాలా ముఖ్యం, అపుడు వినాయకుడూ నీమీద జాలి పడతాడని అన్నారు.


కోపంతో ఊగిపోయేవారికి వినయం, దుఃఖం ఒక్కొక్కప్పుడు వివేకాన్ని కల్గిస్తాయి. గుణపాఠం నేర్పుతాయి.


చంద్రుడిన్నాళ్ళూ కుమిలిపోయాడు. దేవతలతో కలిసి ఇవడూ వినాయకుణ్ణి పూజించాడు. 


గణేశుడు సాక్షాత్కరించాడు. శూర్ప కర్ణాలతో అనగా చేటంత చెవులతో వారి విన్నపాన్ని విన్నాడు. వినయ భరితుడై తనను క్షమించుమని చంద్రుడు వేడగా ఉదార హృదయంతో అతణ్ణి క్షమించాడు వినాయకుడు.


శాపాన్ని కాస్త సడలించాడు. “నా నోటి నుండి వచ్చిన వాక్కు వ్యర్ధము కాదు, పూర్తిగా వెనుకకు తీసుకోవడమూ కుదరదు. జ్ఞానం, డబ్బు, అధికారం కలవారి గర్వం పోవాలంటే వారిని ఉపేక్షించడం, వారివైపు కన్నెత్తి చూడకుండా ఉండడమే ఉచితం. ఇతని కథ, అట్టివారికి గుణపాఠంగా ఉండాలి. కనుక ఒక్కరోజున, భాద్రపద శుక్ల చతుర్థినాడు మాత్రం ఎవ్వరూ ఇతణ్ణి చూడకూడదు. ఈ మాటను తిరస్కరించినవారు నీలాపనిందకు గురి వలసి వస్తుంది సుమా"!


కనుక సంవత్సరంలో ఒక్కరోజున మాత్రమే ఈ నియమం పెట్టాడు.


Monday, 2 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (71)

 

శాప విముక్తి


చంద్రుడు లేకపోతే రాత్రిళ్ళు ప్రజలకు గడవడం కష్టమైంది. ఓషధులుండాలన్నా చంద్రుడుండవలసిందే. అన్నిచోట్లా రోగాలు ప్రబలు తున్నాయి. ఓషధులు లేవు. ఇంతవరకూ చల్లని వెన్నెలనుభవించిన వారు నిరుత్సాహులై యున్నారు.


ప్రజల పట్ల జాలిపడి దేవతలు, ఋషులు బ్రహ్మను వేడుకున్నారు. 


ఏదైనా కష్టం వస్తే త్రిమూర్తులలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళడం ఆనవాయితీ. సాధారణంగా ఆయనే పరిష్కరిస్తూ ఉంటాడు. తనకు సాధ్యం కాకపోతే శివుని దగ్గరకో, విష్ణువు దగ్గరకో వెళ్ళండని చెబుతూ ఉంటాడు.


శాపం తొలగించండని అడిగారు. మహాగణపతి శపిస్తే నేనెట్లా తొలగించనయ్యా! పరమేశ్వరుడే త్రిప్పలేడు, నేనెంత? ఎవరు శపించారో వారి దగ్గరకు వెళ్ళండని బ్రహ్మ అన్నాడు. ప్రత్యేకమైన పూజ చేయండి, మోదకాలు సమర్పించండి, అతని గుండె కరిగి మీకు సరియైన మార్గాన్ని చూపిస్తాడని అన్నాడు.


సాధారణంగా వ్రతమంటే పగలు తిని రాత్రియందు తినకుండా ఉంటారు. ఈ పద్ధతి కొన్ని వ్రతాలలో తలకిందులుగా ఉంటుంది. పగలు ఉపవాసం ఉండి, పూజ చేసుకుని రాత్రియందు భుజించే వాటినీ వ్రతాలని అంటారు.


నక్తం అంటే రాత్రి, Nocturnal అనే పదం దీనినుండే వచ్చింది. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి ప్రీతి.

Sunday, 1 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (70)

దానినినట్లా ఉంచు. అందంకంటె శీలం ప్రధానం కదా! నీవు చేసిన 'నిర్వాకం' ఏమిటి? భార్యల పట్ల పక్షపాతం చూపించలేదా? దక్షుని శాపం వల్ల కృణించి పోతున్నావు కదా! 27 నక్షత్రాలలో రోహిణి పట్ల మక్కువ చూపించడం, దక్షుని శాపం తెలిసిందే కదా. నిన్ను ఉద్దరించినవాడు నా తండ్రియైన శివుడని గుర్తుందా? తదియనాటి చంద్రుణ్ణి శిరస్సున ధరించి క్రమక్రమంగా కృష్ణపక్షంలో కృశించి పోవడాన్ని నా తండ్రి అడ్డుకోలేదా? మాసంలో శుక్లపక్షంలో క్రమక్రమంగా పుంజుకొంటావనే భరోసా ఇద్చాడు కదా. నా తండ్రి అనుగ్రహమొక పక్షంలో మరొక పక్షంలో, నీ తప్పిదమూ గుర్తుకు రావడం లేదా? ఇక నీ గురుపత్నిని ఏం చేసావో అందరికీ తెలుసు. అది పైకి చెప్పలేని సంగతి, ఇవన్నీ తెలిసి ఏదో చల్లని కాంతిని ప్రసరిస్తున్నావని ఈ మిడిసిపాటేమిటి ?


ఇకనుండి నీ అందాన్ని చూడడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒకవేళ చూస్తే వారికి నీ కళంకం అంటుకొంటుందని శపించాడు.

శాప ఫలం

తాము అందంగా అందరి కంటే ఉన్నామని గర్వించిన వారికి శిక్ష ఏమిటి? వారి ముఖాన్ని చూడకుండా ఉంటే అదే చాలు కదా. నీ కన్నులకు గ్రుడ్డితనం వస్తుందనో, శిలగా పడియుండమనో శపించలేదు. నిన్ను చూసిన వారికే కళంకం, నింద కల్గుతాయని అన్నాడు. ఈ పద్ధతి బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. నాకీ నింద పడింది, నేను చంద్రుణ్ణి చూడడం వల్లనే కదా అని మాటిమాటికీ నిందిస్తూ ఉంటారు కదా!

మరొక కారణాన్ని ఊహించవచ్చు. ప్రజలలో గ్రుడ్డిగా తమకు నచ్చిన నాయకుణ్ణి పొగుడుతూ ఉంటారు. శీలాన్ని పట్టించుకోరు. ఇట్టి సాధారణ జనుల మనః ప్రవృత్తిని గమనించి అట్లా శపించి యుంటాడు.

మదమెక్కి గర్వంతో చూసేవాణ్ణి ముఖమెత్తి చూడకుండా ఉండడమే తగిన శిక్ష. అట్టివారిని పొగడడం, వీళ్ళ శీలాన్ని కళంకితం చేసుకోవడమే.

చంద్రుడు సిగ్గుతో తల దించుకున్నాడు. భయపడ్డాడు. తననెవ్వరూ చూడడం లేదు. ఎవరైనా చూసినా శాపం వల్ల వారికి నీలాపనిందలు వస్తున్నాయి. సిగ్గుపడి తాను పుట్టిన సముద్రంలో మునిగిపోయాడు.