Sunday, 31 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 148 వ భాగం



త్రిచూర్ ప్రశస్తి


త్రిచూర్ ఆలయానికి వెళ్ళి నియమ నిష్ఠతో స్వామిని అర్చించారు. ఆ క్షేత్రాన్ని వృషాచలమంటారు. అందలి నంది ఎత్తుగా ఉంటుంది. ఒక మూల గుండ్రంగా ఎత్తైన పర్వతం. ఆలయంలో టేకు చెట్లుండడం వల్ల టేక్కంగాడని అంటారు.


స్వామి పేరు వడక్కునాథుడు. స్వామి సన్నిధిని శ్రీ కోవిల్ అంటారు. ఆలయం గుండ్రంగా ఉంటుంది. ఆలయంలోనే శంకర నారాయణ, రామాలయాలున్నాయి. విష్ణ్వాలయాలు శివాలయంలో ఉండడం కేరళలో ప్రత్యేకత. ఇక్కడ నృత్య నాటకాలకు ప్రత్యేక మంటపాలున్నాయి. వాటిని కూతాంబళం అంటారు.


త్రిచూర్ లో ఏనుగుల ఉత్సవం (త్రిచూర్ పేరం) పేర్కొనదగింది. అలంకరించిన ఏనుగులు బారులు తీరి యుంటాయి. అయితే వీటిపై వృషాచల మూర్తిని ఊరేగించరు. చుట్టు ప్రక్కలనున్న అమ్మవారి ఉత్సవమూర్తులను వీటిపై ఉంచి తీసుకొని వస్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఉత్సవ ప్రాంతానికి చేరుకుంటాయి. శివరాత్రి ఉత్సవం బాగా ఘనంగా జరుగుతుంది. అయినా స్వామి ఉత్సవమూర్తిగా ఊరేగడు.


ఇందలి పూజారులు తమకు విధింపబడిన కాలంలో పూర్తిగా బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు. అది ముగిసిన తరువాత మరొకరికి ఆలయాన్ని అప్పజెప్పి బైటకు వస్తారు. అట్లా చాలా పవిత్రంగా ఉంటుంది.


ఇక్కడి లింగాన్ని ఆవునేతితో అభిషేకిస్తారు. లింగంపై వేల సంవత్సరాల నెయ్యి పేరుకుని పోయి ఉంటుంది. వేసవిలో కూడా దీపాలను వెలిగించినా ఆ నేయి కరగదు. మంచుతో కైలాసనాథుడుండగా, ఇక్కడ నేతితో మంచు ఆకారంలో కప్పబడి యుంటాడు.


Saturday, 30 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 147 వ భాగం



దుర్వాసుడు, ఆర్యాద్విశతిని రచించాడు. ఈ దేవతా పూజా కల్పాన్ని అందించాడు. మూక పంచశతిలో మొదటి వంద శ్లోకాలనూ ఆర్యాశతకమంటారు. కనుక కంచి అమ్మవారి పేరును, శంకరుల తల్లికి పెట్టగా ఆ పేరునకు, కంచికి సంబంధం ఉంది.


అవతార ప్రదేశం - విశిష్టత


వైదిక మతానుష్టానం ఉన్న కేరళ ప్రాంతం అనుకూలమైనదే. శాస్త్రంలేదు, వేదం లేదని మనం అనుకొంటూ ఉంటే ఈనాటికీ వాటిని రక్షిస్తున్నవారు నంబూద్రీ బ్రాహ్మణులే. సకాలంలో ఉపనయనం, గురుకులానికి పంపడం, బ్రహ్యచర్య దీక్షలు, దండధారణ, కృష్ణాజినం - అంతా నేటికీ ఉంది. ఈనాటికీ ఆంగ్ల విద్య నేర్చుకున్నా కొంతకాలం వేదాభ్యాసం చేస్తూ ఉంటారు. అది ఆ భూమి విశిష్టత. అందుకే వారక్కడ అవతరించారు.


పుణ్య దంపతులు


త్రిచూర్ కి 30 మైళ్ళ దూరంలో కాలడి గ్రామం ఉంది. ప్రక్కనే పూర్ణానది ప్రవహిస్తోంది. శివగురువు తండ్రిపేరు విద్యాధిరాజు. 'పేరు సార్థకం. 


అక్కడ గృహస్థులు సంపన్నులు. ఒక పెద్ద తోటలోనే వారి నివాసం. అది అనేక ఫలవృక్షాలతో ఉంటుంది. అందన్ని పంటలను పండిస్తారు.  

తిండికి లోటుండదు. శివ గురువు తల్లి 'కైపల్లి'కి చెందగా, ఆర్యాంబ మేళపూర్ నకు చెందింది.


Friday, 29 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 146 వ భాగం



కుంభకోణం దగ్గరగా నున్న శివపురంలోని బ్రాహ్మణులు, త్రిచూర్ వచ్చి యుంటారు. శంకరుల తాతగారైన విద్యాధి రాజు, తమిళనాడులోని శివ పురస్వామియైన గురుపదాన్ని తన కొడుకునకు పెట్టి యుంటాడు. ఇట్లా తమిళ సంబంధం కుదురుతుంది.


సృష్టికి కారణమైన అమృత కుంభం ఉన్నచోటు కనుకనే అది కుంభకోణమైంది. అట్టి క్షేత్రం నుండి శంకరుల పూర్వులు, కేరళకు వచ్చి యుంటారు.


అందువల్ల కంచి నుండి మా మఠం, రెండవ పట్టణానికి మారవలసి వచ్చినప్పుడు కుంభకోణానికి ఆ బహుమతి లభించింది అని నాకు తోచింది. కుంభకోణానికున్న ఖ్యాతి ఒక కారణమై ఉంటుందనిపిస్తుంది. రాముడు సూర్య వంశానికి చెందినట్లు ఆచార్యులవారి పూర్వీకులు కుంభకోణానికి చెందినవారు. 


కంచిలో శంకరులు, సిద్ధిని పొందగా కుంభకోణం వారికి ఒకవిధంగా కారణమైనట్లు ఊహిస్తున్నా.


తల్లియైన ఆర్యాంబ విశేషం చూద్దాం. శబరిమలై స్వామిని, శాస్తయని అంటారు. అతడే ఆర్యన్. తమిళనాడులో ఈ స్వామిని అయ్యనార్ అంటారు. ఈ అయ్యప్ప ద్రావిడ దేవతయనడం తెలివి తక్కువ.


అమ్మవారికి ఆర్య అని పేరు ఉంది. త్రిపుర సుందరియే ఆర్య. కామాక్షి, మహాత్రిపుర సుందరి కదా. ఆమెయే లలిత.


Thursday, 28 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 145 వ భాగం



నంబూద్రీలు త్రిసూరిని 'శివపురం అంటారు. మలయాళంలో శివపేరూర్. గౌరవవాచకమైన శ్రీని అనగా తిరు చేరిస్తే తిరు శివపేరూర్ అవుతుంది. అది కాలక్రమంలో తిరుచూర్ అయింది.


తమిళనాడులో కూడా శివపురం ఉంది. అప్పర్, జ్ఞాన సంబంధర్ అనే శివ భక్తులు అక్కడున్న దేవతామూర్తులను కీర్తించారు. అది కుంభకోణానికి మూడు మైళ్ల దూరంలో ఉంటుంది.


'ఒక మహాక్షేత్రం ఉందంటే దాని ప్రభావం ఐదు క్రోసుల వరకూ ఉంటుంది. క్రోశమనగా 2', మైళ్ళు. అనగా పది, పన్నెండు మైళ్లవరకూ ఉంటుంది. దానిని పంచ క్రోశమంటారు. ఈ శివపురం ప్రాంతలోనే సమీపంగా కుంభకోణం ఉంది. ఇక్కడ శివపురం ఉన్నట్లే మలయాళ దేశంలో కాలడిలో శివపురం ఉంది (త్రిచూర్), తమిళ ప్రాంతంనుండి అక్కడికి వెళ్ళినవారు వారి ఊళ్ళపేర్లను పెట్టుకుని సంతోషిస్తారని చెప్పాను కదా. అట్లాగే తమిళంలోని శివపురం వారు కేరళ వెళ్ళి శివపురం అని పెట్టగా అది త్రిచూర్ అయింది.


ఈ త్రిచూర్ లోనే శంకరుల తల్లిదండ్రులు స్వామిని సేవించుట, ఈశ్వరానుగ్రహం వల్ల జన్మనిచ్చుట జరిగింది.


మరొక సంబంధం ఉంది. శంకరుల తండ్రి పేరు శివ గురువు, శంకరులు శంకరావతారం గనుక తండ్రిపేరు శివగురువనడం బాగానే ఉంది. తండ్రి గురువే, ఉపదేశమిచ్చువాడూ గురువే. ఇట్లా సరిపోయింది. తల్లి, ఆర్యాంబ. శివ గురువని సాధారణంగా పేరు పెట్టుకోరు. కాని తమిళనాడులో, కుంభకోణం దగ్గర, శివపురంలో ఇట్లా పేర్లు పెట్టుకునేవారున్నారు.


తమిళనాడులోని శివపురంలో స్వామిపేరు, శివగురునాథ స్వామి. స్వామిమలైలో కుమారస్వామియే తండ్రికి ఉపదేశమిచ్చాడు. కనుక కొడుకే శివగురువయ్యాడు. కాని కేరళలో శివగురువు, శంకరావతారానికి తండ్రి అయ్యాడు. '


Wednesday, 27 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 144 వ భాగం



శాంతి నెలకొల్పబడిన తరువాత మరల మూర్తులు, స్వస్థలాలకు వెళ్ళాయి. కాని కామాక్షి విగ్రహం, తంజావూర్లో స్థిరంగా ఉండిపోయింది. కారణం తర్వాత చెబుతాను.


ఉడయార్ పాళెంలో, శివ, విష్ణు ఆలయాలున్నాయి. ఈనాటికీ శివాలయంలో సభాపతి మంటపం, త్యాగరాజు మంటపమని, కామాక్షి మంటవమని ఉన్నాయి. విష్ణ్వాలయంలో రంగరాజు, వరద రాజుమూర్తులుండేవి.


ఆ సమయంలో తంజావూర్ని ప్రతాప సింహుడు పరిపాలిస్తూ ఉండేవాడు. మన స్వాముల వారిని మఠాన్ని అక్కడే ఉండేటట్లుగా ప్రార్ధించాడు. మన స్వామి స్వర్ణ కామాక్షిని కూడా తీసుకొని వెళ్ళారు.


తంజావూర్లో ఉండడం కంటె కావేరీ తీరంలోని కుంభకోణంలో మఠం వీలుగా ఉంటుందనే అభిప్రాయాన్ని స్వామివారు వెల్లడించగా రాజు అంగీకరించాడు. మంత్రియైన దబీర్ పంత్ తో ఏర్పాట్లు చేయవలసిందిగా రాజన్నాడు. అట్లా కంచి మఠానికి కుంభకోణం ప్రధాన కేంద్రమైంది. ప్రజలకు, రాజునకు తృప్తి కలిగించడం కోసం తంజావూర్లోనే స్వర్ణ కామాక్షి విగ్రహం ఉంటుందని స్వామివారన్నారు. రాజు, అమ్మవారికి గుడి కట్టించాడు. శ్యామశాస్త్రి వ్రాసిన తెలుగు పాటలలో ఆమెను బంగారు కామాక్షి అని అన్నారు. దానితో ఆమె బంగారు కామాక్షిగా ప్రసిద్ధిని పొందింది.


కుంభకోణాన్ని ఎందుకెన్నుకున్నారని సందేహించాను. తంజావూర్ దగ్గరే కావేరి, 'పంచనదం'గా నాల్గు శాఖలతో ప్రవహిస్తోంది. అక్కడే తిరువైయార్ ఉంది. భూలోక కైలాసంగా ఆ క్షేత్రం ప్రసిద్ధిని పొందింది. కావేరీ తులాస్నానానికి ప్రసిద్ధమైన మాయావరం క్షేత్రం కూడా ఉంది. అయితే కుంభకోణానికి శంకరులు అవతారానికి సంబంధం ఉంది.


Tuesday, 26 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 143 వ భాగం



కంచి మఠం - కుంభకోణం


ఒక ప్రాంతంవారు మరొక ప్రాంతం వెళ్ళినా పూర్వ ప్రాంతంపై మక్కువతో ఉండడం, వారి ఊళ్ళ పేర్లను క్రొత్తవాటికి చేర్చడం సహజం. ఆంగ్లేయులు, అమెరికాకు వెళ్ళినా ఆంగ్ల ప్రాంతపు నామానికి కొత్తగా 'న్యూ' చేర్చడం జరిగింది. అమెరికాలో కొంత ప్రాంతాన్ని న్యూ ఇంగ్లాండ్ అంటారు. యార్క్, జెర్సీ వంటివి న్యూయార్క్, న్యూజెర్సీగా అమెరికాలో మారాయి. అట్లాగే ఆస్ట్రేలియాకు వెళ్ళిన ఆంగ్లేయులు వారి వేల్స్ ని న్యూ సౌత్ వేల్స్ గా మార్చారు. అట్లాగే తమిళ దేశం నుండి వచ్చినవారి నల్ల కణ్ణనూర్, మలయాళంలో కన్ననోర్; పళూర్, పళు పురుగా మారింది. శంకరుల జన్మస్థలం, శివపురం, త్రిచూర్ గా ఎట్లా మారిందో తరువాత వివరిస్తాను.

కాంచీపురంలోని మా మఠం, 18వ శతాబ్దంలో కుంభకోణానికి మారింది. ఆర్కాట్ నవాబ్, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచివారు, హైదరాలీ యుద్ధాలతో కాంచీపురం అల్లకల్లోలంగా ఉండేది. 62వ పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతీ స్వామివారు మఠాన్ని అక్కడికు మార్చారు.


రామేశ్వరం తీర్థయాత్రకు వెడుతూ ఉడయార్ పాలయంలో స్థిరపడ్డారు. అక్కడి జమీందారులు స్వామిని అక్కడే ఉండిపొమ్మని అన్నారు. అది సురక్షిత ప్రాంతం. కంచి కామాక్షి మఠం, మా మఠం యొక్క ఆధీనంలో ఉండేది. అందున్న స్వర్ణ కామాక్షి విగ్రహాన్ని రక్షించడం కోసం అక్కడే ఉండిపోవలసి వచ్చింది.


అంతేకాదు, చిదంబరంలోని నటరాజ విగ్రహం, కంచిలోని వరద రాజస్వామి యొక్క ఉత్సవమూర్తి; శ్రీరంగంలోని రంగరాజ ఉత్సవమూర్తిని తరలించవలసి వచ్చిన కాలమది. పరిపాలించేవారు రాజులైనా, విదేశీయుల భయం వల్ల ఇట్లా జరిగింది. భగవంతుడు తన శక్తి కోల్పోవడం వల్లకాదు. ప్రజలు మతంమీద నిరాదరణ, అనాసక్తే ఈ పరిస్థితులకు దారితీసింది. మన నిర్లక్ష్యమే కారణమని మనకొక గుణపాఠం భగవానుడు నేర్పాడని అనిపిస్తుంది.


స్వర్ణ కామాక్షి కాదు. నటరాజు, త్యాగరాజు, రంగరాజు, వరద రాజులకు కూడా ఆ ఉడయార్ పాలెం నిలయమైంది. అక్కడి రాజులు భక్తి ప్రపత్తులతో వాటిని రక్షించారు.


Monday, 25 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 142 వ భాగం



శంకరులు ప్రభవించి ధర్మోద్ధరణను చేసినా రాను రాను క్షీణించిన కాలమూ ఉంది. పరశురాముడు, కొన్ని ఆచారాలను ప్రవేశపెట్టాడని చెప్పాను. బ్రాహ్మణులలో పెద్దవాడు, బ్రాహ్మణ స్త్రీని, మిగిలిన సంతానం ఇతర వర్ణ స్త్రీలను వివాహ మాడుట అందులో నొకటి.


పర్వత ప్రాంతానికి అవతలవైపు ఉండడం వల్ల, ఆనాడు రాకపోకలు తక్కువగా ఉండడం వల్ల, ఇది ఒక ప్రత్యేక సంస్కృతితో చాలాకాలముంది. అయితే ఆదీ, మొత్తం భారతీయ సంస్కృతికి భిన్నం కాదు. ఒక నదిలో అనేక స్నానఘట్టాలున్నట్లుగానే భిన్న భిన్న సంప్రదాయాలుండడం సహజం. మిగిలిన ప్రాంతాలలో సనాతన పద్ధతులు క్షీణించినా ఇక్కడ మాత్రం రక్షింపబడింది. అందువల్ల శంకరులిక్కడ అవతరించారు.


దీనికి భిన్నంగా కొన్ని మార్పులు కాలక్రమేణా చోటు చేసుకున్నాయి. ఇది సముద్ర ప్రాంతంలో ఉండడం వల్ల పాశ్చాత్య దేశాలనుండి ఇతర మతాలవారిక్కడ ప్రవేశించారు. వర్తక కేంద్రం కావడం వల్ల మిగిలిన మతస్థులు ప్రవేశానికి తావేర్పడింది. ఇట్లా యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయులూ ఇందు ప్రవేశించి తరువాత మతవ్యాప్తిని చేసారు.


ఇట్లా ఇతర మతాలవారు వచ్చినా ఇక్కడి హిందువులు శంకర సంప్రదాయాన్నే పాటిస్తూ వస్తున్నారు. పద్మనాభస్వామి, గురువయ్యార్ వంటి వైష్ణవ క్షేత్రాలలో అర్చకులు వైష్ణవులు కారు. శంకర సంప్రదాయానికి చెందినవారనే మాటను గుర్తించండి.


ఒకమూల సనాతన సంప్రదాయమున్నా రాజకీయంగా కమ్యూనిష్టుల ప్రభావమూ ఇక్కడ ఉంది.


Saturday, 23 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 141 వ భాగం



వీరిలో చోళ దేశం నుండి వచ్చినవారెందరో ఉన్నారు. తెలుగులో ఇల్లును, కన్నడంలో మన అంటారు. తమిళంలోనూ ఇల్లం, మనై మాటలు యున్నాయి. అందుకే నంబూద్రీలు మేము ఫలానా ఇల్లం లేదా ఫలానా మనాకు చెందిన వాళ్ళం అంటారు. ఆచార్యులు 'కయిపల్లిమనా'కు చెందినవారు.


వీరు ఆదివాసి జనులతో కలిసి యుండడం సగం తమిళం, సగం సంస్కృతం, దేశీయ పదాలతో మలయాళ భాష ఉంటుంది.


వేయి లేక 1500 సంవత్సరాలనుండి ఈ భాష ప్రచారంలో ఉంది. ఒక రాష్ట్రంలో వ్యవసాయం, వర్తకం, రకరకాల వృత్తులుండాలి. తమిళులలో బ్రాహ్మణేతరులు ప్రవేశించడం వల్ల వర్తక వాణిజ్యాలు వృద్ధి పొందాయి. తమిళ దేశపు చేరరాజుల ప్రభావం ఉండడం వల్లనే ఇక్కడ వైదిక సంస్కృతి వ్యాపించింది.


సుఖ జీవులైన తమిళ బ్రాహ్మణులు కొంతమంది తమ రాష్ట్రానికి వెళ్ళినా కన్నడ, తెలుగు బ్రాహ్మణులిక్కడ ఉండి పోయారు. పరశురాముడనేక క్షేత్రాలనేర్పాటు చేసాడు. తమిళ బ్రాహ్మణులు కేరళ రాష్ట్ర సరిహద్దులలో అనగా పాల్కాడ్, తిరువనంతపురంలలో స్థిరపడ్డారు.


అశోకుని శాసనాలలో కేరళ ప్రస్తావింపబడిందని చరిత్రకారులంటారు. తిరుమురైని కీర్తించిన చేరమాన్ పెరుమాళ్ నాయనార్ ప్రబంధాన్ని కీర్తించిన కులశేఖర పెరుమాళ్ రాజులు కేరళలో ఎందరో ఉండేవారు.


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 140 వ భాగం



ముందుగా అనేక ప్రాంతాలనుంచి మత్స్యకారులు వచ్చారు. దీనిని వైదిక భూమిగా చేద్దామని వైదిక అనుష్టానం బాగా తెలిసిన బ్రాహ్మణులను రప్పించాలనుకున్నాడు.


కేరళలో తమిళం


చోళ రాజ్యం నుండి వచ్చినవారిని బోళియర్లని అంటారు. వీరు ద్రవిడ ప్రాంతం నుండి వచ్చారు. ఆర్య ద్రావిడ భేదాలు కల్పితమని చాలాసార్లు చెప్పాను. వారు వేరు వీరు వేరనే భావనను పెకలించండి. ద్రవిడ దేశం నుండి ఉత్తర దేశానికి వెళ్ళినవారిని ద్రావిడ్ అనేవారు. అట్లాగే ఉత్తర దేశం నుండి వచ్చినవారూ ఇక్కడున్నారు. వారిని 'వాడమర్' అంటారు. (ఎవ్వరూ కైబర్ పాస్ నుండి వచ్చినవారు కాదు).


చోళియర్లు కేరళ ప్రాంత వాతావరణం పరిస్థితులకు తట్టుకోలేకపోయారు. నిరంతరం వర్షంతో చిత్తడితో ఉన్న నేల వారికి నచ్చలేదు. పరశు రామునికి తెలియకుండా రహస్యంగా తిరిగి వెళ్ళిపోదామనుకున్నారు. వీరి భావనను ఆయన గమనించి వీరి ఆచారాలలో కొన్ని మార్పులను చేసాడు. మార్పులను చేసినా వారు వెళ్ళిపోతే అక్కడ ఉండలేక తిరిగి వస్తారని ఊహించాడు. వారికి నెత్తిపై ఊర్ధ్వశిఖ ఉంటుంది. మనమాదిరిగా వెనుక నుండదు. ఇప్పటికీ నంబూద్రీ బ్రాహ్మణులీ ఆచారాన్ని పాటిస్తున్నారు. చాలామంది చోళ దేశం తిరిగి వెళ్ళిపోయారు. అందులో ఇట్లా ఊర్ధ్వశిఖ గలవారు తమిళనాడులో ఇప్పటికీ ఉన్నారు.


చాలామంది చోళియర్లు వెళ్ళిపోవడం గమనించి కన్నడ, ఆంధ్రప్రాంతాల నుండి బ్రాహ్మణులను రప్పించాడు. ముందు వీరికి ఉన్న 108 ఆచారాలలో అనేక మార్పులు చేసి వీరిని స్వస్థలాలకు వెళ్ళకుండా చేసాడు.


ఇట్లా ఉండిపోయిన వారిని నంబూద్రీ బ్రాహ్మణులని అంటారు. ఇదంతా కేరళోత్పత్తియనే గ్రంథాన్ని చూసి చెబుతున్నా.


Friday, 22 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 139 వ భాగం



పరశురాముడు, దుష్ట క్షత్రియులపై 21 సార్లు దండెత్తాడని తెలుసు. ఇతనికి విరక్తి కలిగింది. ఈ రాజ్యాన్ని నేనేం చేసుకోను? నేను చేసిన కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకొని తపస్సు చేసుకొంటానని భూమినంతటినీ కశ్యప మహర్షికి ధారాదత్తం చేసాడు. మనం మనువు యొక్క సంతానం. మనువు యొక్క తండ్రి వివస్వంతుడు. వివస్వంతుని తండ్రి కశ్యపుడు. ఇతడే మనుష్యజాతికి మూల పురుషుడు. అతడు ప్రజాపతి కనుక, దేవాదులకూ తండ్రియే. ఎందరో ప్రజాపతులున్నా మనుష్య జాతి వృద్ధికి ఇతడు కారణం కనుక ఇతణ్ణి కశ్యప ప్రజాపతియని గౌరవంతో పిలుస్తాం.


ఇంటిని దానం చేసి మరల ఇంటిలో ఉండటం కుదురుతుందా? అందుచేత పరశురాముడు ఈ భూమిలో ఉండకుండా క్రొత్త ప్రదేశాన్ని ఎన్నుకొని తపస్సు చేద్దాం అనుకున్నాడు. అందుకే దానమిచ్చిన భూమిలో ఉండకూడదనే పరశురాముని భావనను కశ్యపుడు గమనించి జ్ఞాన దృష్టితో దానమిచ్చిన భూమి బయట తపోభూమిని చూడమని చెప్పాడు.


పరశురాముడు పశ్చిమ కనుమలకు వచ్చి కొండ శిఖరం ఎక్కాడు. ఆనాడు సముద్రం కొండకు సమీపించి యుండేది. అంటే కొండ కివతల మలయాళదేశం లేదు. కేవలం సముద్రమే ఉండేది. దానమిచ్చిన ప్రాంతంలో నేను ఉండకూడదు కనుక ఈ కొండ దగ్గర నువ్వు తొలగి నాకు కొంత చోటు నిప్పించుమని పరశురాముడు సముద్రుణ్ణి అడిగాడు.


రామునకు సముద్రుడు సాయం చేసినట్లే ఇతనికీ చేసాడు. నీ చేతిలో పరశువు ఉంది కదా, దానిని విసిరివేయగా అది ఎక్కడ పడుతుందో అంతమేర, నేను వెనుక తగ్గుతానని సముద్రుడన్నాడు. అట్లా ఏర్పడినదే మలయాళ దేశం. ఇక్కడ చాలా మంది పరశురాముని పేరుతో ఉంటారు.


Thursday, 21 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 138 వ భాగం





ప్రభుత్వం అండగా ఉంటే కుమారిల భట్టు జయించాడని భావించినా శంకరులు మాత్రం ఎట్టి సాయం లేకుండానే తమ బుద్ధి బలంతో ప్రతిపక్షులనెదుర్కొనారు. బౌద్ధమతం, జైనమతం, రాజుల ప్రోద్భలంతో వృద్ధి పొందాయి. అప్పర్, జ్ఞాన సంబంధర్, పల్లవ, పాండ్యరాజులును మరల వైదికమార్గంవైపు మళ్లించారు. రాజెప్పుడైతే మారాడో ప్రజలూ వైదిక మతం వైపు మళ్ళారు. అటువంటిది శంకరుల జీవితంలో కనబడదు. వారి కాలంలో పెద్ద పెద్ద రాజులు లేరని, చక్రవర్తి లేకపోవడం వల్ల వర్ణాశ్రమ ధర్మం క్షీణించిందని వారి 'సూత్రభాష్యం' వల్ల అవగతమౌతుంది.


రాజుల ప్రోద్బలంతో కుమారిలుడు, మండన మిశ్రుడు బౌద్ధమతాన్ని ఖండించడంతో బాటు అద్వైతాన్ని, ఎదుర్కొనగా శంకరులు వీరిని ఎదుర్కొని ఖండించారు. కుమారిలునితో వివాదానికి అవకాశం ఏర్పడలేదు. కాని వారి శిష్యుడైన మండన మిశ్రునితో 21 రోజులు వాదించి ఓడించారు. మండనుడు గృహస్థు కనుక, సరస్వతి, ఇతని భార్య సరసవాణిగా వచ్చింది.


మరొక కారణం ఉంది. శంకరుల సర్వజ్ఞత్వాన్ని పరీక్షించాలంటే సాక్షాత్తూ సరస్వతియే దిగి రావాలి. అందుకే ఆమె అట్లా అవతరించింది.


దేవతలు మొరపెట్టడం, శివగురు, ఆర్యాంబల మొరలాలించి శంకరుడే శంకరులుగా అవతరించాడు. ఇది ఎట్లా, ఎప్పుడో చూద్దాం.


కేరళ చరిత్ర


కేరం అంటే కొబ్బరి చెట్టు. అవి ఎక్కువగా నున్న దేశం కేరళ దేశం. ఒక మూల పర్వతాలు, మరొక మూల సముద్రం మధ్యనున్న దేశమది.


Wednesday, 20 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 137 వ భాగం



ఇక మండన మిశ్రులు మీమాంసపై గ్రంథం వ్రాసారో లేదో! మీమాంసానుక్రమణిక గ్రంథం వ్రాసినవారు, వీరు కాదని వేరని అంటున్నారు. వారు సన్న్యాసం పుచ్చుకొన్న తరువాత వ్రాసిన గ్రంథాలు లభ్యమౌతున్నాయి.


కర్మవాదుల అవతార కారణం


ముందు వీరెందులకు అవతరించనట్లని సందేహం. బ్రహ్మ - కుమార స్వాములు సురేశ్వరులుగా, కుమారిలభట్టుగా అవతరించారు. పరమేశ్వరునితో దేవతలు కర్మానుస్థానం లోపించిందని అన్నారని విన్నాం. మనమిచ్చే ఆహుతులే దేవతలకాహారం. జ్ఞాన మార్గంలో ఉన్నవాడెట్లాగూ కర్మ చేయడు. కనుక దేవతలు జ్ఞానులంటే ఇష్టపడరు. కర్మిష్ఠులనే కోరుతారు.


కర్మ పూర్తిగా పోయినపుడు తానవతరించి ఏం ప్రయోజనమని, ముందు కొంతకాలం యజ్ఞాలు మొదలైన కర్మకాండ సాగనీ అని శంకరుడు భావించి యుంటాడు.


బౌద్ధులు, జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు వెడితే ఏది వైదిక జ్ఞానమో, ఏది కాదో అనే సందేహం ప్రజలలో కలుగుతుందని ముందుగా వారిని పంపించారు.

ఇంద్రసరస్వతుల అవతారాలు - ప్రభుత్వ సాహాయ్యం లేకుండా శంకరుల కృషి


కొన్ని పుస్తకాలలో ఇంద్రుడు, సుధన్వుడనే రాజుగా వచ్చి కుమారిలభట్టునకు సాయం చేసినట్లుంది. ఇంద్రుడట్లా రావడం, దేవతలకూ ఉపయోగకరమే.


Tuesday, 19 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 136 వ భాగం



దేవుడు లేడనే విషయంలో బౌద్ధులతో ఢీకొని తీవ్రంగా వాదించినవాడు ఉదయనుడు, కర్మలు అక్కర్లేదనే విషయాన్ని ఖండించినవాడు కుమారిలుడు.


ఇక శంకరులు చేసిందేమిటి? శంకరుడు, శంకరులుగా అవతరించడానికి ముందే శంకర తనయుడైన కుమారస్వామి, కుమారిలునిగా అవతరించాడు.


మరొక చిత్రం పై వారిద్దరూ శంకరుల పనిని తేలిక చేసారు. ఉదయమునికి ముందున్న న్యాయ సిద్ధాంతాన్ని శంకరులు ఖండించారు. పెక్కు ఆత్మలని న్యాయం అంటుంది. ఉన్నది ఒక్కటే ఆత్మయని అద్వైతం అంటుంది. కనుక దీనినీ ఖండించవలసి వచ్చింది. దీనిని పెద్దగా ఖండించకపోయినా కుమారిలుని మతాన్ని గట్టిగా ఖండించారు. తరువాత సాంఖ్యులను. వారు చెప్పిన పురుష - ప్రకృతి సిద్ధాంతం, మన బ్రహ్మ మాయ వంటిదిగా - కనబడినా వేదాంతానికి భిన్నంగా కనబడడం వల్ల ఖండించారు. అయితే ఇందున్న తత్త్వ విభజనను స్వీకరించారు. అయితే వేదాంతానికి ఎట్లా భిన్నమో చెప్పవలసి వచ్చింది. ఆపైన సాంఖ్యం కేవలం బుద్ధితో సంబంధించినది.


బౌద్ధికం, సామాన్యులలో వ్యాప్తి పొందలేదు. ఇక కర్మానుష్టానం నిత్య జీవితంలో ఉంటుంది కనుక ఎంతవరకూ దీనిని గ్రహించాలనే విషయంలో మీమాంసకులతో పేచీ పడి ఇదే పరమార్ధం కాదని ఖండించవలసి వచ్చింది. ఒక దశలో దీని ఊసు, ఎత్తకూడదని ఆత్మానుభూతియే పరమ గమ్యమని చెప్పవలసి వచ్చింది. శ్రోతస్మార్త కర్మలు అవసరం ఉన్నా అదే పరమార్ధం కాదని చెప్పవలసి వచ్చింది. "


ఒక గాయం తగిలింది, దానికి కట్టు కట్టాం. గాయం మానింది. మానినా ఇంకా కట్టు కట్టుకొని యుండండని అనడం సబబుగా ఉండా? అట్లాగే జ్ఞానావస్థలో కర్మకాండలలో మునగవద్దని శంకరులన్నారు.


Monday, 18 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 135 వ భాగం



ఇట్లా భగవంతుడున్నాడని, ప్రజలలో భక్తిని పాదుకొలిపి, వైదిక కర్మలను ప్రోత్సహించి, క్రూరాచారాలను ఖండించి వైదిక మతాన్ని దృఢతరం చేసారు.


ఆనాడు తాంత్రికాచారాలుండేవి. 64 తంత్రాలు ఉండేవని, 'చతుష్షష్ట్యా తంత్రైః' అని సౌందర్యలహరిలో (31 శ్లో) అన్నారు. ఒక్కొక్క తంత్రానికి ఒక్కొక్క దేవత. దీనిని ఆగమమని అంటారు కూడా. వైదిక ధర్మానికి దూరంగా ఉంటే వీటిని నమ్మనవసరం లేదని శంకరులన్నారు. వేద సమ్మతాలనే స్వీకరించండన్నారు. ఇందు కౌల మార్గమని, మిశ్రమార్గమని, సమయ మార్గమని ఉన్నాయి. ఇందు కౌలం స్వతంత్రమైనది. మిశ్రమార్గంలో అక్కడక్కడా వైదికాచారాలుంటాయి. సమయ మార్గం మాత్రం వైదిక పద్ధతిలో ఉంటుంది. దీనిని శంకరులు సమర్ధించారు.


శంకరులు తరువాత ఉదయనాచార్యులు వచ్చి, భగవంతుడున్నాడని బౌద్ధులను గట్టిగా ఎదుర్కొన్నారు. వారి న్యాయ కుసుమాంజలి ప్రసిద్ధం. శంకరుల పనిని పూర్తిగా నెరవేర్చినవారు వీరే.


శంకరుల వర్గీకరణం


కర్మానుష్ఠానాన్ని స్థాపించడంలో కుమారిలునిది ప్రధాన పాత్ర. బౌద్ధాన్ని వారీ విషయంలో ఎదుర్కొన్నారు. శంకరుల దృష్టిలో కర్మ, ప్రాథమిక మైనది. ఇది చిత్త శుద్ధికి తోడ్పడేది. తరువాత జ్ఞాన విచారం చేయాలని దానివల్లనే మోక్షమని ప్రతిపాదించారు. ఇది ప్రాథమికం కాదని, జీవితాంతం కర్మానుష్ఠానమని కుమారిలుని సిద్ధాంతం. జ్ఞాన విచారణ అక్కర్లేదని దీనివల్లనే మోక్షమని గట్టిగా నమ్మారు. కనుక బౌద్ధుల నెదుర్కొనడంలో, కర్మానుష్ఠానం విషయంలో శంకరుల పాత్ర కంటే వీరి పాత్ర ఎక్కువ. జైమిని సూత్రాలకు శబరస్వామి భాష్యం వ్రాయగా దానికి వీరు వ్రాసిన వార్తికంలో అనేక ఉపపత్తులను చూపించి బౌద్ధులను ఢీకొన్నారు.


Sunday, 17 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 134 వ భాగం



కొన్ని మతాలు భగవానుడు లేడనగా కొందరు భగవానుడు నిమిత్త కారణమని, అణువులచే నిర్మించాడని, అనగా అద్వైతం రెండూ ఆయనే అంటుంది.


జగత్తునకు, ఈశ్వరుడు కర్త కాదని సాంఖ్యులంటారు. ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడని అంటారు. అట్టి జ్ఞానం నుండి ఈ భౌతిక జగత్తు రాదంటారు. శంకరులే మన్నారు? భౌతిక జగత్తు చైతన్యం నుండి రాదని, భౌతిక జగత్తు శాశ్వత సత్యం కాదని, మాయవల్ల కన్పిస్తున్నట్లుందని ఇది మాయయేయని, మన కల్పనల వల్ల ఉన్నట్లుందని అంటారు. ఆ కల్పన, మన బుద్ధి నుండి వచ్చింది. ఈశ్వరునిలోని కల్పన కూడా అంతే! అతని బుద్ధినుండే అతని చైతన్యం నుండే వచ్చిందనడంలో వైరుధ్యం ఏముంది? కనుక ఈ కల్పనా ప్రపంచానికి ఈశ్వరుణ్ణి కర్తయని అంటున్నాం. పదార్థం కూడా శక్తియేయని నేటి సైన్సు అంటోంది కదా!


కలలో కొన్నిటిని చూస్తున్నాం. చూస్తున్నంతసేపూ అవి ఉన్నాయి. మెలకువ వస్తే లేవు. కలలో అవి ఎట్లా తాత్కాలికంగా ఉన్నాయో జగత్తు కూడా కొంతకాలముంటుంది. నిత్య సత్యం కాదని అంటారు. ఈ కల్పనా ప్రపంచానికి ఈశ్వరుడే కర్త అవుతున్నాడు.


మనం కర్త అనే పదాన్ని వాడగా క్రైస్తవులు కర్తర్ అంటారు. 


అది మాయయైనా కల్పనయైనా, ఈ కల్పించే వాడొకడుండాలి. కనుక కర్త, ఈశ్వరుడని, శంకరులు సాంఖ్య సిద్ధాంతాన్ని ఖండించారు. ఫలదాత ఈశ్వరుడని, జడమైన కర్మ ఫలాన్నియ్యదని, సమష్టి బుద్ధితోనున్న ఈశ్వరుడే ఎవరెవరికి ఏయే కర్మలకు తగిన ఫలాన్ని నిర్దేశించగలడని నిర్ధారించి మీమాంసకుల మతాన్ని ఖండించారు.


Saturday, 16 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 133 వ భాగం



భగవంతుడున్నాడనుట


అందరూ భక్తికి మ్రొగ్గు చూపుతారు. ప్రతిదీ కారణకార్యాలతో ముడిపడి యుంటుంది కనుక దీనికంతటికీ ఒక కారణమైన ఈశ్వరుడున్నాడని చాలామంది నమ్ముతారు. అట్టిది లేదంటే విని ఆశ్చర్య పడతారు. లేడనే వారి తర్కం, ప్రజలను ఆకర్షించలేదు. వారు ప్రజలను ఆకర్షించినా భగవద్భక్తిని ప్రజలనుండి దూరం చేయలేకపోయారు. అందువల్ల ప్రజల మనస్తత్వానికి అనుగుణంగా ఏదో ఒక రూపంలో బౌద్దులు పెట్టవలసి వచ్చింది. దేవుడు లేడనేవానికే వారు విగ్రహాలు పెట్టి పూజించారని లోగడ వివరించాను. ఇట్టి స్థితిలో శంకరులకు, వారితో పెద్దగా చర్చించవలసిన అవసరం లేకపోయింది. భక్తి తత్వాన్ని వైదిక మార్గంలో ఉన్నదాన్నే ఇంకా బలపరచడం కోసం, అనేక స్తోత్రాలను శంకరులు వ్రాసేరు. యంత్ర ప్రతిష్టాపనలు చేసారు. ప్రజలలో కాపాలికాచారాలను, వామ మార్గాలను ఖండించి వైదిక పద్ధతికి దోహదం చేసారు. బుద్ధి బలంతో భక్తిని పాదుకొల్పలేం. హృదయ బలంతోనే వ్యాప్తి చేయగలమని శంకరులు భావించారు.


భగవానుడు ఈ సమస్త ప్రపంచానికీ ఉపాదాన కారణంగా, నిమిత్త కారణంగా ఉన్నాడని శంకరులు ప్రతిపాదించారు. అంటే ఏమిటి? ఒక వస్తువును తయారు చేయాలంటే ఒక ముడిపదార్థం లేదా మూల పదార్థం ఉండాలి. ఒక నగను తయారు చేస్తే దానికి బంగారమో, వెండియో ఉండాలి. ఇంటికి కావాలి. నగకు బంగారం, ఉపాదాన కారణం. నగ కంసాలియుంటేనే తయారవుతుంది. కనుక ఇతడు నిమిత్త కారణమౌతాడు.


అద్వైతం ప్రకారం ఉపాదానమూ, నిమిత్తమూ ఈశ్వరుడే. కనబడే జగత్తు, మిథ్యయని, ఉన్నట్లు కన్పిస్తోందని ఇది శాశ్వతం కాదని, శాశ్వతమైనట్లుగా ఉందని అనినప్పటికీ నిత్య వ్యవహారం సాగిపోతుంది. ఇట్లా తాత్కాలికంగా సత్యమనిపించే దానిని వ్యవహార సత్యమన్నారు. దీనికి మూల వస్తువూ ఉండాలి. తయారు చేసేవాడూ ఉండాలి. ఈ రెండూ ఒకటంటుంది అద్వైతం. అతడొక మూల వస్తువుతో చేసాడంటున్నాం. అది ఎక్కడినుండి వచ్చింది? అతనికంటే మరొకటి లేదు కదా! అతని నుండే వచ్చిందని, అతడే వివిధ వస్తువులుగా కన్పడేటట్లు చేసేవాడని, ఉపాదన నిమిత్తాలతడే అంటుంది. కలలో అనేకమైన వాటిని చూస్తున్నాం. ఇవి ఎక్కడినుంచి వచ్చాయి? మన మనస్సు నుండే ఈ స్వప్న ప్రపంచం రాలేదా?


Friday, 15 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 132 వ భాగం



ఎదుర్కొనుట సత్యమే. అప్పుడే సాయం చేసారంటున్నా. ఇతర శిష్యులకంటే ఇట్టివారి వల్లనే మహోపకారం జరిగింది. చిత్రంగా ఉంది కదూ! పైవారిద్దరూ బౌద్ధమతాన్ని ఖండించడంలో చాలా తోడ్పడ్డారు. మీమాంస అనే ఆయుధంతో ఎదుర్కొనడం వల్ల శంకరుల పని చాలా సులువైంది.


బౌద్ధమెట్లా భిన్నం


బౌద్ధం, వైదిక పద్ధతిని ద్వేషించినా వీరి సిద్ధాంతాన్ని కొంతవరకూ అద్వైతం స్వీకరించింది. బౌద్ధులు, మాయను అంగీకరిస్తారు. మనస్సును పూర్తిగా మట్టు పెట్టడాన్ని నిర్వాణాన్ని పొందడాన్నే లక్ష్యంగా పెట్టుకుంటారు. మనస్సు నశించినా బ్రహ్మము ప్రకాశిస్తుందనే మాటను పేర్కొనకుండా శూన్యమనే అంటారు. అక్కడే వారికీ మనకూ తేడా. ఇంకా కొన్ని భేదాలున్నా జ్ఞాన సిద్ధాంతంలో వేదాంతానికి పూర్తిగా భిన్నం మాత్రం కాదు.


వారు భగవానుని అంగీకరించరు మనం భక్తిని స్వీకరిస్తాము కనుక మన ధర్మానికి అది విరుద్ధం. ఇక కర్మల విషయంలో వారు పూర్తిగా యజ్ఞలను, మిగిలిన వాటిని వ్యతిరేకిస్తారు కనుక మనకూ వారికీ పడదు. చాలా వాటిల్లో వైదిక ధర్మం కంటే భిన్నం.


Thursday, 14 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 131 వ భాగం



బౌద్ధమత ఖండనలో మీ మాంసకుల సాహాయ్యం


సురేశ్వరులకు, తోటి శిష్యులకు తేడా ఉంది. మిగిలిన ముగ్గురు బ్రహ్మచర్యం నుండే సన్న్యాసం స్వీకరించారు. ఇతడు శంకరుల కంటె వయస్సులో పెద్దవాడు. ఇతడు గృహస్థుడుగా ఉన్నప్పుడు మీమాంసకుడు. అద్వైత ఖండన చేసేవాడు. శంకరుని వాదనా పటిమచే అద్వైతాన్ని స్వీకరించి సన్న్యాసి అయినాడు. గృహస్థుగా నున్నపుడు అతని పేరు మండన మిశ్రుడు. బ్రహ్మయొక్క అంశతో జన్మించినవాడు.


యజ్ఞం కర్మానుష్ఠానానికి చెందింది. యజ్ఞంలో నాల్గు రకాలైన ఋత్విక్కులుంటారు. యజ్ఞాన్ని పర్యవేక్షించే వానిని బ్రహ్మ అని అంటారు. మీమాంసకుడైన ఇతడు, బ్రహ్మాంశతో పుట్టడం బాగానే ఉంది.


మరొక మీమాంసకుడు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం కుమారస్వామి అంశతో పుట్టాడు కనుక కుమారిలభట్టుగా వచ్చాడు. అతని సిద్ధాంతానికి భాట్ట మతమనే పేరు. యజ్ఞంలో అగ్నికి ప్రథమస్థానం. అగ్నియే సుబ్రహ్మణ్యుడు. అందుకే కర్మ మీమాంసకు అనుకూలంగా ఉంది. ముందు ఇతడు అద్వైత వేదాంతాన్ని ఎదుర్కొన్నవాడే. చివరకు శంకరుల జ్ఞాన మార్గాన్ని అంగీకరించాడు. అయితే శంకరుల శిష్యుడు కాలేదు. వారి కథ తరువాత చెబుతా.


శంకరులు జ్ఞాన మార్గాన్ని వీరు కర్మ మార్గాన్ని ఎన్నుకొనడమేమిటి? పరస్పరం వాగ్వాదాలేమిటి? వారు దేవతలైనపుడు దేవుడైన శంకరులకు తోడ్పడవద్దా అని శంకిస్తాం.


Wednesday, 13 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 130 వ భాగం



"దుష్టాచార వినాశాయ, ధర్మ సంస్థాపనాయచ 

భాష్యం కుర్వన్ బ్రహ్మసూత్ర తాత్పర్యార్థ వినిర్ణయం 

మోహన ప్రకృతి ద్వైతధ్వాంతం అధ్యాత్మ భానుభిః 

చతుర్భిః సహితం శిష్యైః చతుర్భిః హరివత్ భుజైః 

యతీంద్ర శంకరో నామ్నా భవిష్యతి మహీతలే"


యమ, యతి పదాలకు ధాతువొక్కటే. అణచుటయనే అర్థం. యముడు జీవులను శిక్షిస్తాడు. యతి, ఇంద్రియాలను, మనస్సును అణచేస్తాడు. యముని కర్మ, క్రూరంగా కన్పిస్తుంది. జ్ఞానంతో యతి అణుస్తాడు. కనుక యతి కూడా యముడే. దీనికి 'సం' అనే ఉపసర్గ చేర్చబడి సంయమి అయింది. అందుకే సన్న్యాసులను సంయములని అంటారు.


ఈ అవతరించుటలో దేవతలకూ తగు ప్రాధాన్యం ఉంది.


త్రిపురాసుర సంహారంలో దేవతలందరూ శంకరునకు సాయం చేస్తామని వివిధాయుధాలతో వచ్చారు. అన్నిటినీ ఇతడుపయోగించుకున్నాడా? ఒక నవ్వు నవ్వాడు. అదే అగ్నియై త్రిపురాసురులను భస్మీపటలం చేసింది. అట్టి లీలలను ప్రదర్శించిన భగవానుడు మరొక లీలను ప్రదర్శించపబోతున్నాడు. ఒక శంకర విజయంలో దేవతలకూ తగిన పాత్ర ఇచ్చినట్లుంది.


రామాది అవతారాలలో దేవతలు తమ వంతు పాత్రను పోషించారు.


శంకరుడు ఈ అవతారంలో నలుగురు శిష్యులు కావాలనుకున్నాడు. అందుచేత పద్మపాదుడు విష్ణ్వంశతో, హస్తామలకుడు వాయ్వంశతో; తోటకుడు అగ్న్యంశతో, సురేశ్వరుడు బ్రహ్మాంశతో అవతరించారు. బ్రహ్మతో సరస్వతి కూడా వచ్చింది. ఈ అవతారంలో ఆమె పేరు సరసవాణి. ఇంద్రుడు, సుధన్వుడనే రాజయ్యాడు. సుధన్వుడు కుమారిలునితో, సరసవాణి, సురేశ్వరునితో సంబంధం కల్గియుంది. వీరిని గురించి కూడా 

చెప్పుకోవాలి.


Tuesday, 12 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 129 వ భాగం



శ్రుత్యాచారం (వేదాచారం) పోయి మిథ్యాచారం ప్రబలిందని అన్నాడు:


"శ్రుత్యాచారం పరిత్యజ్య మిథ్యాచారం సమాశ్రితః" ఒక మూల బౌద్ధులు వేదాలను, కర్మానుష్ఠానాన్ని వర్ణాశ్రమ విభజనను ఖండిస్తున్నారని, యజ్ఞభూమిలో యోగులంటే చెవులు మూసుకుంటున్నారని, మరొక మూల వైదిక పద్ధతులను విసర్జించి శైవ వైష్ణవులు, లింగ ముద్ర చక్ర ముద్రలు వేయించుకుంటున్నారని, ఇక కాపాలికులు తలలు కోసుకుంటున్నారని నీవవతరించి వేద మార్గాన్ని స్థాపించ వలసిందిగా వారు వేడుకున్నారు.


'వర్త్మ స్థాపయతుశ్రోతం, జగత్ యేన సుఖం ప్రజేత్'


అని ప్రార్థించినట్లు మాధవ శంకర విజయంలో ఉంది. (ఇది విద్యారణ్యులు వ్రాసినది కాదని చారిత్రకులంటారు). అవతరిస్తానని ఆయన మాట ఇచ్చాడు.


బ్రహ్మమొక్కటే అనే దానిని మరిచారని, జీవులు, బ్రహ్మము కంటె భిన్నులనే అజ్ఞానంలో ఉన్నారని, మాయ వల్ల ద్వైత జ్ఞానంలో ఉన్నారని, ఒకయతీంద్రునిగా అవతరిస్తానని పరమేశ్వరుడన్నాడని ఉంది. నేను నల్గురు శిష్యులతో మహావిష్ణువు యొక్క నాల్గు చేతులు మాదిరిగా అవతరిస్తానని అన్నాడు. దుష్టాచారాలను పోగొట్టడానికి, ధర్మస్థాపన చేయడం కోసం సూత్ర భాష్యాన్ని వ్రాసి వేదాంత తాత్పర్యం, అద్వైతమేయని ప్రతిపాదిస్తానని అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతానని అన్నట్లుంది.


Monday, 11 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 128 వ భాగం



గురురత్నమాలలోని గోవింద స్తుతిలో ఒకప్పుడు హరితల్పమైనవాడు, భూభారం వహించినవాడు లక్ష్మణునిగా, బలరామునిగా పతంజలిగా అవతరించిన వాడు చంద్రశర్మయై గోవిందముని యైన వానికి జయమగు గాక అనే స్తుతిలో పూర్వాపరాలన్నీ తడుమబడ్డాయి.

"హరితల్ప హరాంఘ్ర నూపురక్ష్మాధర

సౌమిత్రి, బల, అత్రిపుత్ర లక్ష్మా..."


ఆచార్య పరంపర యొక్క విశిష్టత


శంకరుల గురించి తెలుసుకోవాలంటే వారి పూర్వాచార్యులను గురించి తెలుసుకోవాలని ఇదంతా చెప్పాను.


ఒక ఆచార్యుని తరువాత మరొక ఆచార్యుడు అంది పుచ్చుకుంటాడు. ఆత్మజ్యోతి నిరంతరము వెలుగుతూ ఉండవలసిందే. జ్ఞానమనే విద్యుత్తు నిరంతరం ఉంటేనే ఆచార్య పరంపర కొనసాగితేనే ప్రపంచము వెలుగులో ఉన్నట్లుంటుంది. ఒక విద్యుత్ పరికరాన్ని 'ఛార్జి' చేసారని అంటాం. ఆఫీసరు ఒకడు బదిలీ అయి అతని బాధ్యతలను మరొకనికి అప్పజెప్పినపుడు ఛార్జ్ ఇచ్చారని అంటారు. జ్ఞానమనే విద్యుత్తో గురువు, శిష్యుణ్ణి ఛార్జి చేస్తాడు. పీఠాన్ని ప్రతివ్యక్తీ అధిరోహించడానికి వీలు లేదు. తగిన అర్హతలుండాలి. గురుపరంపర నిరంతరమూ సాగుతూ ఉండాలి.


ప్రార్థన - వరము


దక్షిణామూర్తి మఱ్ఱి చెట్టు క్రింద నుండగా కర్మానుష్టానం క్షీణించిందని, దేవతలు మొరపెట్టారు. నారదుడు, ముందుగా బ్రహ్మను సమీపించాడని తరువాత కైలాసానికి దేవతలతో కలిసి వెళ్ళాడని ఒక శంకర విజయంలో ఉంది. అదే ఆనంద గిరీయం. 


Sunday, 10 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 127 వ భాగం



పతంజలి చరితంలో ఆదిశేషుని నుండి మొదలై గౌడపాద, గోవిందుల కథ వరకూ ఉంటుంది. శంకరుల కథ సూక్ష్మంగా చెప్పబడింది. ఎనిమిదవ సర్గలో, రామభద్ర దీక్షితులు, పూర్వాచార్యుల గురించి విపులంగా వ్రాసేరు. ఇక అనేక శంకర విజయాలలో శంకరుల చరిత్ర విపులంగా ఉంది. కనుక సంక్షేపించాడు. వీరి పుస్తకంలో మొసలి శంకరుల కాలును పట్టుకోవడంతో మొదలౌతుంది. కంచిలో శంకరులు చివరి కాలంలో ఉన్నట్లు వ్రాసేడు.


"గోవింద దేశికం ఉపాస్య చిరాయ భక్త్యా 

తస్మిన్ స్థితే నిజమహిమ్ని విదేహ ముక్త్యా 

అద్వైత భాష్యం ఉపకల్ప్య దినోవిజిత్య 

కాంచీపురే స్థితిం అవాపస శంకరార్యః


ఈ శ్లోకంలో శంకరులు గురువుకై వెదకడం, ఉపదేశాన్ని పొందడం, కాశీకి వెళ్ళడం, భాష్య రచన, దేశం నలుమూలలా తిరగడం చివరకు కంచిలో ఉన్నట్లు సూక్ష్మంగా చెప్పబడింది.


నర్మదా తీరంలో గురువుదగ్గర శంకరులు చాలాకాలం ఉండలేదు. గోవిందులు తాము వచ్చిన పనియై పోయిందని విదేహ ముక్తి పొందారు. తరువాత శంకరులు గురువయ్యారు. మరొక కథ కూడా ఉంది. జగదాచార్యులుగా దిగ్విజయం చేసారని, కైలాసానికి వెళ్ళారని, పరమ శివుని నుండి పంచలింగాలను పొందారని, గోవిందులను దర్శించుకొని దక్షిణామూర్తి అష్టకం వ్రాసేరని ఉంది. పతంజలి చరితం ప్రకారం గోవిందులు ముక్తిని పొందిన తరువాతే శంకరులు ఆచార్యత్వాన్ని వహించినట్లుంది. భాష్యాలను వ్రాసి కంచిలో ఉన్నట్లుంది. 


Saturday, 9 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 126 వ భాగం



శంకరులు చాలా వినయంతో గురుస్తోత్రం చేసారు. గుర్వష్టకం వ్రాసేరు. వివేక చూడామణి గ్రంథంలో తన గురువుని నుతించారు:


"సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ్ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం"


(సద్గురుం బదులు మద్గురుం అనే పాఠం కూడా ఉంది.)


వారు పరమానంద స్వరూపులని, వారిని సమీపించడం కష్టమైనా దయతో శిష్యులనుగ్రహిస్తారని అన్నారు. ఎట్లా? వేదాంత సిద్ధాంతాన్ని, సాధన మార్గాలను చెప్పి వాటిద్వారా తన దగ్గరకు చేరునట్లు చేస్తారని చెప్పబడింది. అందుకనే ఈ శ్లోకం, సర్వ సిద్ధాంత గోచరం అని మొదలు.


ఈ శ్లోకాన్ని బట్టి ఇది ఒక మానవ మాత్రుని కాదని పరమాత్మనే సంబోధించినట్లు లేదూ?


అట్టి భావన ఉంటే మానవ గురువు యొక్క అవసరమే ఉండదు. శాస్త్రాల ప్రకారం పరమాత్మయే గురు రూపంలో వస్తాడని ఉంది. అయితే మనకొక సందేహం కల్గుతుంది. ఈయనకు పరమాత్మానుభవం ఉందా? అట్టి అనుభూతి కలిగినవాడే వీరు పేర్కొన్న గురువు వంటివారు కావాలి. బదరికాశ్రమంలో గోవిందులకు వ్యాస దర్శనమైంది. ఒక అవతార పురుషునకు నీవు గురువు కావాలని వ్యాసుడు వీరితో అన్నాడు. ఈశ్వరుని మాట వ్యాసుని ద్వారా వెలువడింది.


సంప్రదాయం ప్రకారం ఒక గురువు, ఒక శిష్యుడు ఉండాలి కనుక అవతార పురుషునికి కూడా ఒక గురువుండాలి. "నీవు కొంత దూరం అతణ్ణి వెదకడానికి వెళ్ళు, అతడు సద్గురువును వెదుకుతూ వస్తాడు. భారతదేశం మధ్యలో నర్మదాతీరం ఉంది. అక్కడ ఇద్దరి సమాగమమని" వ్యాసుని తీర్పు. అపుడు వ్యాసుడే కాదు, శుకుడు, గౌడపాదులు, గోవిందులు అందరూ కలిసే యున్నారు. అది ఒక రకమైన Round Table Conference.


Friday, 8 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 125 వ భాగం



మధ్వాచార్యుల పూర్వాశ్రమ నామం వాసుదేవులు. తరువాత వారు ఆనంద తీర్థులయ్యారు. వీరినే పూర్ణ ప్రజ్ఞులని అంటారు. వాసుదేవ పదానికి వారి సన్న్యాసి నామానికి పోలిక లేదు. కృష్ణ చైతన్యుని పూర్వనామం గౌరాంగుడు. కృష్ణుడు నలుపు. గౌరాంగుడంటే తెల్లనివాడు. కనుక రెంటికీ పోలిక లేదు. శంకరులకే రెండు ఆశ్రమాలలోని నామాలూ ఒకటయ్యాయి.


గోవిందులు గొప్పదనం


గోవిందులు ఏమి వ్రాసారో తెలియదు. యోగతారావళి, అద్వైతానుభూతి వ్రాసేరని అంటారు. శంకరులే వ్రాసేరనీ ఉంది. శంకరులు వ్రాసేరన్నా గురువులనుండి స్ఫూర్తిని పొందినట్లు భావించవచ్చు. యోగతారావళిలో అష్టాంగ యోగాన్ని అనుసరిస్తే సమాధి స్థితిని పొందవచ్చని అద్వైతానుభూతి కల్గుతుందని చెప్పబడింది. పతంజలి యోగ సూత్రాలు వ్రాసేడని తెలుసు కదా! ఆ పతంజలియే గోవిందులని చదివాం. అద్వైతాను భూతిలో క్రియతో కూడిన యోగం కాక, కేవలానుభూతి గురించే యుంటుంది.


గౌడపాదులనుండి మహాభాష్యాన్ని నేర్చుకున్నట్లు విన్నాం. అయితే ఇతడేమీ వ్యాకరణ గ్రంథం వ్రాయలేదు. శాస్త్ర ప్రచారం చేసాడు. ఎందరినో శిష్యులను తయారు చేసాడు. సంగీత శాస్త్రజ్ఞులలో కొందరికి ప్రత్యేక శాస్త్రజ్ఞానం అంటూ లేకపోయినా, సంగీత పరిశోధకుల కంటె ఎందరినో శిష్యులను తీర్చి దిద్దినవారున్నారని విన్నాం అంటే బుద్ధి కంటే అనుభవానికీ ప్రాధాన్యం. ఇతరులను తీర్చిదిద్దడం మాటలా?


బుద్ధిమంతులు కావచ్చు, కాని అందరూ అధ్యాపకులు కాలేరు. అట్టి ఆచార్యత్వం గోవిందులలో ఉంది.


అయితే మామూలు శిష్యునిగా తీర్చిదిద్దినట్లు శంకరులను తీర్చి దిద్దాలా? పరమేశ్వరుడు శంకరులుగా అవతరించినపుడు శిష్య గురు సంప్రదాయాన్ని తెలియపరచాలని గురువుల గొప్పదనం, శిష్యులను తీర్చిదిద్దే పద్ధతి లోకంలో తెలియజెప్పాలని శిష్యుడిగా చేరారు.


Thursday, 7 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 124 వ భాగం



ఈ దశనామి సంప్రదాయంలో రామానుజులు లేరు. 'యాదవ ప్రకాశీ అనే అద్వైతి దగ్గరకు దీక్షకోసం వెళ్ళినట్లు ఆయనకు గురువు మాటలు నచ్చలేదని అంటారు. ఆశ్రమ స్వీకారానికి ముందట్లా వెళ్ళారట. (అయితే అద్వైత గ్రంథాలలో అట్టి వ్యక్తి ఉన్నట్లు లేదు.)


శంకరులు వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రచారం చేయగా రామానుజులు కొంత సడలించారు. అయితే వారి భాష్యాన్ని చూస్తే దీనిని గట్టిగా సమర్ధించినట్లుంది. సడలించినట్లున్న కథలు ప్రచారంలో ఉన్నాయి. మధ్వాచార్యులూ వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థించారు.


శంకరులకు విరుద్ధంగా కొన్నిటిని రామానుజులెందుకు ఏర్పాటు చేసారు? ఏదైనా క్రొత్త పార్టీ పెట్టినపుడు సిద్ధాంతాలలో భేదాలుండవా? జెండాలు మారవా? ప్రత్యేకత తప్పక ఉంటుంది. అట్లాగే మధ్వాచార్యుల వారు కూడా. ఇక పోలికలేమిటి? రామానుజుల పూర్వాశ్రమ నామం లక్ష్మణులు. అంటే రాముని సోదరుడు. అందుచేత రామానుజుడన్నా లక్ష్మణుడన్నా ఒక్కటే. శంకరులు, ఆశ్రమ స్వీకారం చేసిన తరువాత పేరెట్లా మార్పు చెందలేదో, రామానుజుల పేరూ అట్లాగే ఉంది.


లక్ష్మణుడు, ఆదిశేషుడు. రామానుజులను ఆదిశేషుని అవతారంగానే భావిస్తారు.


శంకరులను శివావతారం అంటున్నాం. వైష్ణవులు వారి ఆచార్యులను విష్ణ్వతారమని అనరు. మాధ్వులు, మధ్వాచార్యులను వాయుదేవుడి అవతారం అంటారు.


మరికొన్ని పోలికలున్నాయి. గోవింద భగవత్పాదులు పతంజలి అవతారం. ఆ పతంజలి ఆదిశేషుని అవతారమే. వైష్ణవులు రామానుజులను ఆదిశేషావతారంగా భావిస్తారు. ఇంకో చిత్రమేమంటే శంకర జయంతి, రామానుజ జయంతి ఒకే రోజునే సాధారణంగా వస్తాయి. మనం తిథిని పాటిస్తాం. వారు నక్షత్రాన్ని పాటిస్తారు. అవి సాధారణంగా కలుస్తాయి.


Wednesday, 6 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 123 వ భాగం



కనుక శంకర నామంలోనే శంకరుల శక్తి ఇమిడి యుంది. శరీరం లేకపోవచ్చు. జయ జయ శంకర, హర హర శంకర అంటే చాలు. ఇట్టి తన పేరే ఇతరులకు స్ఫూర్తిని, రక్షణను కల్గిస్తుందని తరువాత వారీ పేరుతోనే ఉండవచ్చని భావించారేమో! అర్హత, లేకపోయినా ఆ పదం అర్హతను సంపాదించి పెడుతుందని సమాధానం చెప్పుకున్నాను. అనుయాయులచే ధర్మ ప్రబోధం చేయించాలని వారి సంకల్పం.


వారి నామాన్ని ధరిస్తే వారి శక్తిని ధరించగలమా? వారి నామమే అట్టి శక్తినిస్తుందని సమాధానం. నీరసంగా ఉన్నవాడు, బలమైన మందును తీసుకొంటే నీరసాన్ని పోగొట్టడానికే అని సమాధానం.


రామానుజులతో పోలిక


శంకరులకు, రామానుజులకు కొన్ని పోలికలున్నాయి. అద్వైతానికి పూర్తిగా విరుద్ధం ద్వైతం. విశిష్టాద్వైతం అట్టిది కాదు. అయితే విధి విధానాలు భిన్నం. మధ్వ సంప్రదాయంలో బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్న్యాస స్వీకారం. శిఖాయజ్ఞోపవీతాలుండవు. రామానుజ సంప్రదాయంలోని సన్న్యాసులకు ఇవి యుంటాయి. గృహస్థాశ్రమం నుండి సన్న్యాసం తీసుకుంటారు. మన సంప్రదాయంలో ఏకదండి సన్న్యాసులుంటే వారు త్రిదండి సన్న్యాసులు.


శంకరులు, మధ్వాచార్యులు మఠాలను స్థాపించారు. రామానుజులు స్థాపించలేదు. వీరిలో 72 సింహాసనాధిపతులున్నారు. అందులో సన్న్యాసి మఠం అనే వ్యవస్థ ఉండదు. వైష్ణవ సంప్రదాయం, గృహస్థ పరంపర వల్ల వృద్ధి పొందింది.


శంకర సంప్రదాయంలోని సన్యాసులు 'దశనామి' అనే వర్గం లోనివారు ఈ వర్గంలోనిదే, మధ్వాచార్యులు గ్రహించిన తీర్థ సంప్రదాయం. వారి సన్న్యాస నామం ఆనందతీర్థ. కృష్ణ చైతన్యులు ఈశ్వరపురి అనేవారినుంచి దీక్ష స్వీకరించారు. భారతి, పురి అనేవి కూడా దశనామి వర్గంలోనివే. రామకృష్ణ పరమహంసగారు, 'పురి' సన్న్యాసి నుండి ఆశ్రమాన్ని స్వీకరించారు. వారే తోతాపురి.


Tuesday, 5 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 122 వ భాగం



సన్న్యాసి నామము - శంకర నామం గొప్పదనం


సన్న్యాసం పుచ్చుకుంటే అసలు పేరు పోయి, మరొక నామం వస్తుంది. ఆది గురువు నుండి శుకుని వరకూ పేర్లల్లో మార్పు లేదు. గౌడపాదులకి ఏ నామమిచ్చారో తెలియదు. గౌడ దేశం నుండి చదువుకై రావడం, తరువాత పూజ్యవాచక మైన 'పాద' పదంతో ఉండడం కన్పిస్తుంది. 


గోవిందునకు పూర్వనామం చంద్రశర్మ, సన్న్యాసినామం, గోవింద. శంకరుల అసలు పేరే శంకరుడు. అదే ఆశ్రమం పుచ్చుకున్న తర్వాత కూడా ఉంది. వీరు కైలాస శంకరుల అవతారమని నిశ్చయించి గురువు ఆ పదాన్ని మార్పు చేయకుండా ఉంచాడు. శంకర అనే పదం, నామ కరణం చేసినపుడు తిథి, వార, నక్షత్రాదుల కనుగుణంగా పెట్టారు. ఈ ఆచార్య సంప్రదాయంలో వీరు స్థాపించిన మఠాలలో శంకరాచార్య పదమే ఈనాటికీ వినిపిస్తుంది. అట్టిది మిగతా సంప్రదాయాలలో లేదు. రామానుజ పీఠంలో ఉన్న పీఠాధిపతిని రామానుజులని అనరు.


ఇట్లా ఎందుకు విధించినట్లు? మాకొక సన్న్యాసి నామం ఉంది. దానికి శంకరాచార్య అనే పదాన్ని ఎందుకు జోడించినట్లు? వారికీ తరువాత వచ్చినవారికీ భేదం లేదని చెప్పడానికా? బాగా లేదు. వారెక్కడ? మేమెక్కడ? హస్తిమశకాంతరం ఉంది.


వారి పేరులోనే శక్తి యిమిడి ఉంది. 59వ పీఠాధిపతియైన బోధేంద్రస్వామి, నామ మాహాత్మ్యాన్ని ఉగ్గడించలేదా? శివ విష్ణు నామాలలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడని చెప్పారు.


"అపర్యాప్తం రూపం జగదవన ఏతత్పునరితి

ప్రభుర్జాగర్తి శ్రీహరి గిరిశ నామాత్మక తయా"


Monday, 4 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 121 వ భాగం



సాక్షాత్కారం పొందిన తరువాత సన్న్యాసాశ్రమ నియమాలను పాటించినా అతనికేమీ చిత్తక్షోభ ఉండదు. వీరెట్లా ఉండాలో అంతా ఈశ్వర సంకల్పాన్ని బట్టి యుంటుంది. నియామతీతులుగా కొందర్ని తీర్చిదిద్దుతాడు.


గౌడపాదులనుండి, అద్వైత సంప్రదాయంలో నియమాలతో కూడిన ఆశ్రమమే ఉంది. కనుక శంకరులు, సన్న్యాసి నుండే దీక్షను స్వీకరించారు. గాని, అత్యాశ్రమి నుండి కాదని సారాంశం. పైవారిద్దరూ ఒక్కటే అని ఏ సందర్భంలో శంకరులన్నారు?


ఛాందోగ్యపనిషత్తులో ఇంద్రుణ్ణి ప్రజాపతి పరీక్ష చేసి ఆత్మ తత్త్వాన్ని అందించాడు. అన్ని కోరికలనూ విదిలి ఆత్మజ్ఞానానికే అంకితమైనవారు, అత్యాశ్రములని వారే పరమహంస పరివ్రాజకులని అన్నారు. ఇట్టివారే ఉపదేశించుటకు అర్హులని అన్నారు. శంకరుల కాలంలో అట్టి ఉపదేశం ఇచ్చే వారున్నారు. ధర్మం పూర్తిగా కనుమరుగు కాలేదు. బౌద్ధులకు భిన్నంగా సంప్రదాయానికి బద్ధులై ఆత్మవిచారణ చేసేవారుండేవారు.


అందు అత్యాశ్రములు, తురీయాశ్రములూ ఉండేవారు. శంకరులు తురీయాశ్రమం గురువు ద్వారా తీసుకోవాలనుకున్నప్పుడు అత్యాశ్రమి దగ్గరకు వెళ్ళకుండా శాస్త్ర నియమాలను పాటిస్తూ ఆత్మజ్ఞానులైన వారినే గురువులుగా ఎన్నుకొన్నారని సారాంశం. ఉపనయనానికి ముందే అత్యాశ్రమియైన శుకుని వంటివారి నుండి కాకుండా తురీయాశ్రమంలో ఉంటూ శాస్త్ర నియమాలు పాటిస్తున్న గోవింద భగవత్పాదుల దగ్గరకు వెళ్ళారు. గౌడపాదులకు ప్రత్యేకంగా సన్న్యాసనామం లేదు. గోవిందపాదులకుంది.


Sunday, 3 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 120 వ భాగం



శంకరులు స్థాపించిన మఠాలలోని ఆచార్యులు మఠ కార్యక్రమాలను నిర్వహించాలి కనుక, పరమహంస పరివ్రాజకుల విషయంలో కొంత సడలించారు. ఇది కేవల ధర్మ సంస్థాపన కోసమే.


శాస్త్రాలలో అత్యాశ్రమి, సన్న్యాసస్థితి కంటె అతీతుడైనవాడైన పరమహంసగానే పరిగణింపబడ్డారు. అందు పరమహంస సన్న్యాసులే బట్టలను, దండాన్ని, కమండలువులను విడిచి పెట్టినట్లు ఉంది. శుక, దత్తులట్టివారు. శంకరులు ఛాందోగ్యోపనిషత్తు భాష్యంలో అత్యాశ్రమియనగా పరమహంస పరివ్రాజకులనే వ్రాసేరు. ఇద్దర్నీ కలిపి వాడడం చాలాకాలం సాగింది.


శాస్త్రాలు రెండు రకాలైన సన్న్యాసాన్ని పేర్కొన్నాయి. వివిదిషా సన్న్యాసమని, విద్వత్ సన్న్యాసమని. తురీయాశ్రమాన్ని యతి ధర్మ నియమాలను పాటిస్తూ ఉన్నవాడు అన్నిటినీ విడిచి అత్యాశ్రమి అవుతాడు. వివిదిషయనగా తెలిసికొనుట. సమాధి, ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మానందం ఏమిటో తెలుసుకొనేవాడు. అతడు గృహస్థ జీవితాన్ని గడుపుతూ వాటిని తెలుసుకోవడం కుదరదు. కనుక శాస్త్ర నియామాలను పాటిస్తూ దండ, కమండులువులను ధరించి సన్న్యాసం పుచ్చుకొన్నవాడు వివిదిషా సన్న్యాసి.


ఆశ్రమం పుచ్చుకొని, ఆత్మశాస్త్రాన్ని అభ్యసిస్తూ అప్పుడప్పుడు ఆత్మానుభూతి కల్గుతుంది. తరువాత విద్వత్ స్థితి వస్తుంది. తరువాత దండాదులను విడిచి పెడతాడు. అపుడు విద్వత్ సన్న్యాసి.


సన్న్యాసం నుండి సన్న్యాసం పుచ్చుకోవడమంటే విరక్తి పుట్టకుండా సన్న్యాసం ఎందుకులే అనే ఇంటికి తిరిగి రావడం.


అత్యాశ్రమి ఇట్లా తిరిగి రాడు. యతి ధర్మాలనే విడిచిపెడతాడు. సన్న్యాసాన్ని దాటి యుంటాడు. నిరంతరం సమాధి స్థితియే అతని లక్ష్యం. అంటే అందరూ అట్లా కావాలని లేదు. జనకుడు గృహస్థాశ్రమంలో ఉండే జీవన్ముక్తుడు కాలేదా? బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉండి సమర్థ రామదాసు జీవన్ముక్తుడు కాలేదా? ఇక సన్న్యాసంలోనే ఉండి అట్టి స్థితిని పొందిన వారున్నారు.


Saturday, 2 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 119 వ భాగం



గురు పరంపరంలో శుకుని వరకూ ఎవ్వరూ సన్యాసాశ్రమం తీసి కోలేదని. అయినా బ్రహ్మ జ్ఞానులని, ఆచార్య పురుషులని చెప్పాను.


గృహస్థాశ్రమంలో ఉంటూ కలిలో జ్ఞానోపదేశం చేయడం సబబు కాదు, అట్లాగే అతి వర్ణాశ్రమంలో కూడా. ఈ యుగంలో కొందరు అతివర్ణాశ్రములమని, మాకే నియమాలూ పట్టవని, ఆ పేరుతో అనాచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాలు బాధ కలిగిస్తున్నాయి. అట్టి వారిని చూస్తే నిందింపవలసి వస్తుంది. కలిలో అతి వర్ణాశ్రములు, గురుపరంపరలో కనబడరు. గౌడపాదులవారినుండి సన్న్యాసం నియమాల ప్రకారము తీసుకోవడం మొదలయింది.


అట్లా అని గౌడపాదుల ముందు సన్న్యాసాశ్రమం లేదనుకొనండి. వేదంలో వీటి ప్రస్తావన లేదా? వేదంలో సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తులనే విభాగాలే నాల్గు ఆశ్రమాలను సూచిస్తున్నాయని శంకర సిద్ధాంతాన్ని సరిగా అర్ధం చేసుకున్న జర్మన్ విద్వాంసుడైన పాల్ డ్యూయసన్ అన్నాడు. బృహదారణ్యకంలో భార్యను విడిచి యాజ్ఞవల్క్యుడు సన్న్యాసం పుచ్చుకోలేదా? 108 ఉపనిషత్తులలో 10 లేక 15 ఉపనిషత్తులు సన్న్యాసం గురించే ఉంటాయి. అవధూతోపనిషత్తు, సన్న్యాసోపనిషత్తు అని కూడా ఉన్నాయి. మనుస్మృతిలో తురీయాశ్రమం గురించి యుంది. ఈ ఆశ్రమం నుండే 'తురీయ' స్థితిని చేరుకోగలడని స్మృతులన్నాయి. విశ్వేశ్వర స్మృతిలో సన్న్యాసి ధర్మాలు ఉగ్గడింపబడ్డాయి. దీనిని విశ్వేశ్వర సంహిత అని కూడా అంటారు.


శంకరుల పరంపరలో గౌడపాదులు, గోవిందులు, నియమాల ప్రకారం సన్న్యాసం పుచ్చుకున్నవారే.


సన్న్యాసులలో కుటీచక, బహూదక, హంస, పరమహంసలని నాల్గు రకాలవారున్నారు. చివరి తరగతికి చెందినవారు, అద్వైత సంప్రదాయానికి చెందినవారు. వారు తిరుగుతూ ఉంటారు కనుక పరివ్రాజకులు.


Friday, 1 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 118 వ భాగం



నాల్గు ఆశ్రమాలలోను చివరిది సన్న్యాసము, దానికీ నియమ నిబంధనలుంటాయి. శుకుడు దానికి అతీతుడు. అట్టివారిని ''అత్యాశ్రమి' అంటారు. అంటే వర్ణాలు లేవు, ఆశ్రమాలు లేవన్నమాట.


గురు పరంపరలో దక్షిణామూర్తి తరువాత దత్తాత్రేయుడు. తరువాత విష్ణువు, బ్రహ్మలు, త్రిమూర్తులలో ఉన్న శివుణ్ణి పేర్కొనలేదు. అతడు దక్షిణామూర్తియే కదా! మధ్యమ మణిలా శంకరులు ఈ గురుపరంపరలో ప్రకాశిస్తున్నారు.


శుకుని మాదిరిగానే దత్తాత్రేయుడు కూడా అతివర్ణాశ్రమి. త్రిమూర్తులు కలిగిన రూపంతో ఉన్నా అవధూత సన్యాసిలా నిరంతరం తిరుగుతూ ఉంటాడు. సన్న్యాసి అంటే సన్న్యాసాశ్రమం స్వీకరించాడని భావించకండి. సన్న్యాసి మాదిరిగా అన్నిటినీ విడిచి పెట్టాడనే అర్థంలో వాడాను. అతనిదీ ముండిత శిరస్సు కాదు. కాషాయ వస్త్రాలు లేవు. జటలతో, దిగంబరంగా ఉంటాడు.


అతి వర్ణాశ్రమి, ఫలానా రూపంలో ఉండాలని లేదు. రాజులా ఉండవచ్చు. ఒకచోట ఏమీ చేయకుండా ఉండవచ్చు. కాని దత్తుడు, శుకుడు అట్టివారు కాక అన్నిటినీ విడిచిన సన్న్యాసులుగా ఉంటారు.


సనక, సనందన, సనాతన, సనత్కుమారులని నల్గురు సోదరులు, జ్ఞానాచార్యులు, విష్ణువు యొక్క 24 అవతారాలలో వీరు కూడా ఉన్నారు. ఈ నలుగురు కలిసినది విష్ణువు కుమారావతారం. ఈ నలుగురులో సనత్కుమారుడున్నాడు కనుక అట్లా అన్నారు. బ్రహ్మకు, ముందు పుట్టిన మానస పుత్రులు వీరే. అందువల్ల వీరు బ్రహ్మకుమారులు. అంతేకాకుండా జీవితాంతమూ వీరు కుమారులుగానే ఉంటారు. దక్షిణామూర్తి, శుకుడు నిత్య యౌవనంలో ఉంటారు. పై సనకాదులకు యౌవనావస్థ లేదు. వారు నిత్య మునివృత్తి మార్గంలో ఉంటారు. జ్ఞానాన్ని పంచిపెట్టారు. మేము, మా మఠాలలో వ్యాసపూజ తరువాత వీరిని కొలుస్తాం. సనత్సుజాతునితో కలిపి వీరైదుగురు.