Tuesday, 16 April 2013

భార్య తన భర్త పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో

ఓం శ్రీ రామాయ నమః

వనవాసానికి వెళ్ళాలనుకున్న రాముడు సీతమ్మను అయోధ్యలోనే ఉండి సమస్త రాజభోగాలు అనుభవించమంటాడు. ఎందుకంటే రాముడు వనవాసానికి వెళ్ళాలని కైకేయి వరం అడిగిందే కానీ, సీతమ్మ కూడా వెళ్ళాలని అడగలేదు. చాలా విధాలుగా చెప్పి చూస్తాడు. 

అప్పుడు సీతమ్మ ప్రేమ వలన కలిగిన కోపంతో "ఏం మాట్లాడుతున్నావు రామ, నువ్వేం చెప్తున్నావో నీకు అర్దం అవుతోందా? ఎవరైన నీ మాటలు వింటే నవ్విపోతారు. తల్లిదండ్రులు, కొడుకుకోడళ్ళ అదృష్టం వారు చేసుకున్న పుణ్యకర్మల మీద ఆధారపడి ఉంటుంది. కానీ భార్య అదృష్టం భర్త మీదే ఆధారపడి ఉంటుంది. అతను చేసుకున్న కర్మల ఫలాన్ని భార్య కూడా అనుభవిస్తుంది. అందువల్ల నువ్వు అడవులకు వెళ్తె నీతో పాటే నేనూ వనవాసానికి  వస్తా. స్త్రీ తల్లి, తండ్రి, కొడుకులు, మిత్రుల దగ్గర ఉంటే సంతోషంగా ఉండదు. స్త్రీ జీవించినా, మరణించినా భర్త దగ్గరే ఉండాలని కోరుకుంటుంది, అదే సంతోషంగా భావిస్తుంది.    

ఓ రామా! నువ్వు అడవులకు బయలుదేరితే నీ ముందు నేను నడుస్తా. కష్టమైన అటవిమార్గంలో నీ కాళ్ళకు అడ్డివచ్చే ముళ్ళపై నీకంటే ముందు నేనే పాదం మోపుతాను. నీకు అపాయం రాకుండా చూసుకుంటా. నీ మార్గాన్ని సుగమం చేస్తా.

ఓ వీరుడా! భర్త పాదాల వద్ద ఉండే రక్షణ కంటే పెద్దపెద్ద బహుళ అంతస్థుల భవనాల్లో ఉండడం, విమానాల్లో తిరగడం గొప్ప ఏమీ కాదు. నాకు చిన్నవయసులోనే మా అమ్మనాన్న అన్నీ నేర్పించారు. నేను నీకు అన్ని విషయాలు చెప్పనవసరంలేదు.  

సందేహమే లేదు, నేను నీతో అడవికి వస్తాను. నువ్వు నన్ను ఈ విషయంలో ఆపలేవు" అని అంటుంది.

భార్య భర్త పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో, సమస్త భోగాలకన్నా భర్తే మిన్న అని అన్నిటిని భర్త కోసం విడిచిపెట్టగలుగుతుందో సీతమ్మ మాటలలో మనకు అర్దమవుతుంది. అలాంటి సీతమ్మయే తరతరాల భారతనారికీ ఆదర్శమైంది, సీతా మహాసాధ్వీ - మన జాతీయ ఆదర్శం అంటారు స్వామి వివేకానంద. 

ఈ లోకంలో ఉన్న భార్యభర్తలందరూ ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలతో, గొడవలు లేకుండా జీవించాలని ఆ సీత సమేత శ్రీ రామచంద్ర మూర్తిని వేడుకుందాం.

- వాల్మీకి రామాయణం, అయోధ్యాకాండ, 27వ సర్గ నుంచి 

ఓం శ్రీ రామాయ నమః    

No comments:

Post a Comment