Tuesday, 28 January 2014

హిందూ ధర్మం - 6 (ధర్మం అంటే?)

ధర్మం అనేక అర్ధాలు కలిగిన పదం. ధర్మం అన్న పదం ఒక్క భారతీయసంస్కృతిలోనే ఉంది. హిందూ, జైన, బౌద్ధ, సిక్కు గ్రంధాల్లో ధర్మం అన్న పదం తరచూ కనిపిస్తుంది. ధర్మం అన్న పదానికి చాలా విశాలమైన అర్ధం ఉంది. ఎంత విశాలమైన అర్దం అంటే మూములు మనిషి మనసు ధర్మం యొక్క అర్ధాన్ని అంత సులభంగా అర్దం చేసుకోలేనంతగా. ధర్మానికి ఋగ్ వేదంలో 20 రకాల అర్ధాలను చెప్పారు. ధర్మం పదానికి సమానమైన పదం మరే భాషలోనూ లేదు.

ధర్మం 'ధృ' అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది, ధర్మానికి ఆచరించబడేది, పాటించబడేది, సమస్తానికి (సమస్త సృష్టికి) ఆధారభూతమైనది అనే అర్ధాలున్నాయి. అంటే ఏది లేకుంటే ఈ సృష్టి కుప్పకూలిపోతుందో, ఏది లేకపోతే విశ్వం గందరగోళంగా మారిపోతుందో, అది ధర్మం. ఇవే కాక, కర్తవ్యం, విధి, శాసనం, సరైన మార్గం, ఆచారం, న్యాయం వంటి అర్ధాలున్నా, ఇవన్నీ ఒక్కొక్కటిగా ధర్మాన్ని వివరించడంలో అసంపూర్ణాలే. సాధారణంగా చెప్పవలసి వస్తే, ధర్మం అనగా సరైన/ అసలుసిసలైన జీవన విధానం. చాలామంది సనాతనధర్మం ఒక జీవన విధానం అంటారు (Hinduism is a way of life), ధర్మానికి అంతకంటే చెత్త నిర్వచనం ఇంకోటి ఉండదు. ధర్మం ఒక జీవన విధానం అంటే రాక్షసునికి ఒక జీవన విధానం ఉంది, లంచగొండికి ఒక జీవన విధానం ఉంది. జీవన విధానం లేనిది ఎవరికి? అవన్నీ ధర్మాలవుతాయా? ఒక జీవనవిధానం కాదు, జీవించవలసిన విధానం. వేదోక్తమైన జీవన విధానం ధర్మం. దానికి విరుద్ధమైనది అధర్మం.మానవులు ఎలా బ్రతకడం వలన, సృష్టికి ధర్మాలకు అనుగుణంగా, సులభంగా, సుఖంగా జీవనం సాగించగలరో, దేన్ని పాటించడం వలన జననమరణ సంసార చక్రం నుంచి బయటపడగలరో, ఏది మనిషిని దైవత్వానికి, దివ్యత్వానికి తీసుకువెళుతుందో అదే ధర్మం.

ధర్మంలోనే అనేక ధర్మాలు ఉంటాయి, వాటిలో మళ్ళీ ధర్మాలు ఉంటాయి. అందుకే ధర్మం అనే మాటకు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు అర్ధాలు అన్వయం అవుతాయి. ధర్మం అంటే స్థిరమైనది, ఎప్పటికి నశించనది అని కుడా చెప్తారు. ఈ జగత్తు మొత్తం సవ్యంగా నడవడానికి ఆధరభూతమైన దానిని, ఈ సృష్టిని గందరగోళం లేకుండా, సవ్యంగా నడిపించే వ్యవస్థను ధర్మం అన్నారు.

ఈ సృష్టి భిన్నత్వాల సమూహం. రకరకాల వ్యక్తిత్వాలు, ఆలోచనలు, జీవన విధానాలు ఉన్నా, సూక్ష్మంలోకి వెళ్తే అన్నిటి యందు ఏకత్వం ఉంది. ఆ ఏకత్వమే చైతన్యం. ధర్మం కూడా అంతే. అన్ని జరుగుతున్నా, అన్ని కారణాలు వెనుక ఒక పెద్ద కారణం ఉంది, ఒక వ్యవస్థ ఉంది, అన్నిటిని నడిపిస్తున్నది అదే. అన్నీ దాన్ని అనుసరించే జరుగుతాయి. అదే ధర్మం.

To be continued ............

3 comments:

  1. మన సమాజంలో ధర్మం గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. అందుకే హైందవ సమాజంలోని కొంత మంది ఇతర మతాల అభూత కల్పనలు మాయమాటలు నమ్మి మోసపోతూ ఆకర్షితులవుతున్నారు. అన్నివైపులనుండి దాదాపు అన్నిమతాలవారు హిందూ ధర్మాన్ని విచ్చిన్నం చేయడానికి మన ఊహకి అందనంత భయంకరంగా దాడులు చేస్తున్నారు .ప్రతి ఒక్కరూ హైందవ సమాజాన్ని జాగృతం చేయవలసిన సమయం ఆసన్నమైనది.

    ReplyDelete
  2. జైశ్రీరామ్.సహజంగా ఎవరికైనా తన శక్తి సామర్థ్యాలు, గొప్పతనం తెలియనప్పుడు తనకంటే అన్ని విధాలా అల్పులైన వాళ్ళని కూడా తనకంటే చాలా గొప్పవాళ్ళుగా భావించడం జరుగుతుంది.అదే విధంగా హిందువులకు తమ హిందుత్వం గురించి అసలు ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది ఇతర మతాలవాళ్ళు చెప్పే మాయమాటల మోసాల వలలో పడిపోయి మతాలు మారిపోయి ఆ మరుక్షణం నుంచే హిందుత్వానికి భద్ధ శతృవులుగా తయారవుతున్నారు.దీనికి ప్రధాన కారణం మన విద్యావ్యవస్థలో లోపమే.ఈ దౌర్భాగ్యానికి కారణం గత అనేక దశాబ్దాలుగా పరిపారకులలో ఉన్న హిందూ వ్యతిరేకత, మైనారిటీ అనుకూలతే కారణం.

    ReplyDelete
    Replies
    1. అంతేగానీ.. మతం, కులాలపేరుతో జరిగిన అరాచకాలు మాత్రం కాదంటారు. అవన్నీ ఇతర మతాలు, పాలకులవల్లే అన్న మాట. ఇంకెంతకాలం పుండును కెలుకుతూనే ఉంటారు? మాంపే మందుగూర్చి ఎప్పటికీ పట్టించుకోరా? తప్పు ఒప్పుకోని.. లేంపలేసుకుంటే.. మతం మారిన వాళ్ళు తిరిగి ఆలో చించరా?

      Delete