Saturday 7 February 2015

హిందూ ధర్మం - 141 (మహాభారతానికి పురావస్తు ఆధారాలు)

ద్వారక కాకుండా మహాభారతం చరిత్రలో జరిగిందనడానికి మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఉత్తరభారతదేశంలో 35 కు పైగా ప్రదేశాల్లో పురావస్తు ఆధారాలు లభించాయి. అవన్నీ మహాభారత గ్రంధంలో ప్రస్తావించబడిన పురాతన నగరాలుగా ఏవైతే పిలువుబడ్డాయో, అక్కడే లభించాయి.అక్కడ రాగిపాత్రలు, ఇనుము వస్తువులు, ముద్రలు, వెండి, బంగారు నగలు, టెర్రాకోట వస్తువులు, ఇతర సామగ్రి దొరికాయి. వీటి మీద పరిశోధన చేసినప్పుడు వీటి కాలం పండితులు చెప్తున్న మహాభారత కాలానికి సరిపోతోంది.

ఇది కాకుండా దక్షిణభారతదేశంలో కర్ణాటక రాష్ట్రలో తుంగభధ్ర నదీ తీరంలోనూ, ఐహోల్, హళిబిద్ద మొదలైన ప్రాంతాల్లో దొరికాయి. వీటిలో ఐహోల్‌లో దొరికిన తామ్రశాసనం ప్రధానమైనది. అర్జునుడికి జన్మించినవాడు అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు, ఆయన కుమారుడు జనమేజయుడు. (కధను క్లుప్తంగా వివరిస్తా) ఒకసారి పరీక్షిత్ మహారాజు చేసిన ఒక తప్పు కారణంగా ఋషి శాపానికి గురై, తక్షకుడి చేతిలో మరణిస్తాడు. తన తండ్రిని చంపిన తక్షకుడి మీద, నాగజాతి మీద పగ తీర్చుకోవాలని జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ యాగంలో వేల కొద్ది సర్పాలు ఆహుతైపోతాయి. ఆ యాగాన్ని ఆపటానికి ఆస్తికమహర్షి వస్తారు, తన ప్రయత్నంలో సఫలం అవుతారు. మానవులకు సర్పాలకు మధ్య స్నేహభావాన్ని, బంధాన్ని పెంచుతారు, దానికి గుర్తుగా ఈ రోజుకి ప్రతీ ఏటా శ్రావణ మాసంలో నాగపంచమి జరుపుకుంటారు హిందువులు.

ఇది కేవలం కధ కాదు. దీనికి సంబంధించిన ఆధారాలే ఐహోల్ లో ఉన్నాయి. సర్పయాగం తర్వాత జనమేజయుడు తన తండ్రి పేరున అగ్రహారాలు దానం ఇస్తాడు. వాటి కోసం రాగిరేగులపై శాసనాలు రాయించాడు . ఆ రాగిరేగులు ఇప్పటికి ఐహోల్ లో ఉన్నాయి. వాటి ఫొటోలు కూడా అనేకులు తీసుకున్నారు. వీటిని కోట వేంకాటాచలం గారు, తన Age of Mahabharata war అనే పుస్తకంలో పొందుపరిచారు. వాటికి శాసనపూర్వక ఆధారాలు అందించారు. 'మహాభారత యుద్ధం క్రీ.పూ.3138 లేద 36 లో ఖచ్చితంగా జరిగిందనడానికి ప్రధానంగా 4 శాసనాలు లభించాయి' అని వారి రచనలో చెప్పారు. వాటి గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం.

To be continued .............

No comments:

Post a Comment