Showing posts with label యజుర్వేదం. Show all posts
Showing posts with label యజుర్వేదం. Show all posts

Saturday, 2 July 2016

హిందూ ధర్మం - 215 (యజ్ఞం ప్రాముఖ్యత - 2)



యజ్ఞం వలన పర్యావరణ శుద్ధి జరగడం, వర్షం కురవడం లౌకికమైన ప్రయోజనాలైతే, యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మానవులకు వరాలివ్వడం, కోరికలు తీర్చడం కళ్ళకు కనిపించని, అనుభవంలో మాత్రమే తెలుసుకునే అలౌకిక ప్రయోజనం. యజ్ఞం యొక్క ప్రయోజనం ప్రకృతిని పరిపుష్టం చేయడం. భూలోకంలో అగ్నిముఖంగా చేసే యజ్ఞం అనేక భూమికల్లో అనేక విషయాలకు ప్రతీక. యజ్ఞం సమస్త బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. పరబ్రహ్మం నుంచి ఉద్భవించిన ఈ సృష్టియే ఒక యజ్ఞం అని ఋగ్వేదంలోని పురుష సూక్తం స్పష్టం చేస్తోంది.

తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | పశ్చాద్-భూమిమథో’ పురః ||
యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||
సప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః సప్త సమిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం పశుమ్ ||

భావం - ఆ బ్రహ్మం నుంచి విరాట్ పురుషుడు ఆవిర్భవించాడు. ఆయన కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయనే సృష్టిగా, ప్రాణులుగా రూపుదాల్చాడు. అన్నిటికి ఆధారమైన ఆ పరతత్త్వం తెర అనుకుంటే, దాని మీద కదిలే బొమ్మలు ఈ విరాట్ పురుషుడు, ఆయన సృష్టి. ఆ బ్రహ్మాన్ని ఉద్దేశించి దేవతలు యజ్ఞం నిర్వహించదలచారు. అప్పుడు సృష్టి ఇంకా పూర్తి కాలేదు కనుక దేవతలు ఈ విరాట్ పుర్షుడినే ఆహుతి వస్తువుగా చేసుకుని యజ్ఞం ప్రారంభించారు (మనసులో ధ్యానించారు). అందులో వసంత ఋతువును ఆవునెయ్యిగా, గ్రీష్మ ఋతువు వంటచెరుకుగా, శరత్కాలం హవిస్సుగా అర్పించారు. పంచభూతాలు, పగలు, రాత్రి అనే 7 ఈ మహాయజ్ఞానికి సప్త పరిధులయ్యాయి. యజ్ఞ పరిధి అంటే యజ్ఞకుండం యొక్క సరిహద్దు రేఖ. దుష్టశక్తుల నుంచి యజ్ఞాన్ని రక్షించడం దీన్ని ఏర్పాటు చేస్తారు. దేవతలు యాగాన్ని ప్రారంభించి, విరాట్ పురుషుడిని యాగపశువుగా కట్టారు.... ఆ యజ్ఞం నుంచే దేవతలు, ఋషులు, సాధ్యులు, పశువులు, పక్షులు, మనుష్యులు, అందరూ ఉద్భవించారు.

ఇది ఋగ్వేదం చెప్తున్న మాట. ఈ యజ్ఞం ఒకనాడు జరిగి ఆగిపోయింది కాదు, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దాని ఫలాలను మానవులు అందుకుంటున్నారు. అందుకే ఋతువులు ఏర్పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, వాటి ద్వారా వచ్చిన ఆహారం మానవులకు శక్తినిస్తోంది. ఈ మహాయజ్ఞం ద్వారా జరిగిన మేలుకు కృతజ్ఞతగా ప్రతి మనిషి అగ్నిహోత్రంలో ప్రతి నిత్యం రెండు సంధ్యాకాలాల్లో రెండు ఆహుతులు వేయాలని ధర్మం చెప్తోంది. సృష్టి నుంచి మానవుడు ఫలాలు పొందే క్రమంలో ఈ సృష్టి కొంత కలుషితమవుతుంది, తన వనరులను, శక్తిని కొంతమేర కోల్పోతుంది. అందువల్ల ప్రకృతిని తిరిగి పోషించడం, పరిపుష్టం చేయడం మానవులు వ్యష్టి (Individual) గాను, సమిష్టి (Collective) గాను చేసే బాహ్య (సాగ్నికం) యజ్ఞం యొక్క లక్ష్యం. అప్రాచ్య అభివృద్ధి విధానాలనే (Western development models) సరైనవనుకున్న ఆధునిక మానవుడు ఈ సృష్టి అనే మహాయజ్ఞానికి తన వంతు సహాయం చేయక, ఆ యజ్ఞాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఋతువులు గాడి తప్పుతున్నాయి, భయంకర రోగాలు వ్యాపిస్తున్నాయి, స్వీకరించిన ఆహారం బలాన్నివ్వకపోగా, అనారోగ్యాన్ని కలిగిస్తోంది. అలా యజ్ఞాలను నాశనం చేసేవారిని రాక్షసులంటుంది ధర్మం. ఈ సృష్టి అనేది ధర్మంలో పవిత్రకార్యం. అధర్మాల్లో ఈ సృష్టికికి పవిత్రత ఆపాదించబడలేదు. సనాతన ధర్మావలంబకులందరూ యజ్ఞాన్ని గౌరవిస్తారు. అలాగే ప్రకృతిని కూడా గౌరవించి, దాన్ని కలుషితం చేయక, పవిత్రంగా, శుద్ధంగా ఉంచడం ఈ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరి కనీస 'ధర్మం'. ఈ విశ్వమే ఒక మహాయజ్ఞం, దీనికి ఏ మాత్రం కీడు కలిగించకూడదు అనేది 'వైదిక పర్యావరణవాదం' (Vedic Environmentalism)లో ఈ ముఖ్యసూత్రం.

అందువలన ఈ భూమి మీద యజ్ఞకుండం పెట్టి మానవులు నిర్వహించే యజ్ఞం సమస్త సృష్టికి, దాని క్రమానికి సూచికగా నిలుస్తోంది. అలాగే భోజన సమయంలో ఎన్నో నియమాలను పాటించడం ధర్మంలో చెప్పబడింది. కూర్చుని భోజనం చేయడం, భోజనానికి ముందు కాళ్ళు, చేతులు శుభ్రపరుచుకోవడం, శుచిగా అన్నం వండడం, మౌనంగా భుజించడం, మొదట ఔపోసన పట్టి, నెయ్యి కలిపిన 5 మెతుకులను పంటికి తగలకుండా, ఓం ప్రాణయ స్వాహా, ఓం అపానయ స్వాహా, .......... అంటూ విడివిడిగా 5 సార్లు కడుపులో ఉన్న జఠరాగ్నికి (వైశ్వనరాగ్నికి) ఆహుతివ్వడం, భోజనం మధ్యలో లేవకపోవడం, ఇదంతా పిండాండంలో, వ్యక్తి దేహంలో జరిగే యజ్ఞం. బాహ్యంలో జరిగే యజ్ఞానికి ఇది ప్రతీక (Symbolic representation).

భోజనం దేహానికి బలాన్నిస్తే, యజ్ఞం దేవతలకు శక్తినిస్తుంది. భగవంతునిచే నిర్వహించబడుతున్న సృష్టి అనే యజ్ఞం దేవతలు మొదలు సర్వజీవులు తమ పాపపుణ్యాలను అనుభవించడానికి, ధర్మాన్ని ఆచరించి, మోక్షం పొందడానికి తగిన ఉపాధులను (శరీరాలను) ఇస్తోంది. ఇలా యజ్ఞం అనే ప్రక్రియ బ్రహ్మాండం, అండాండం, పిండాండాల్లో అంతటా వ్యాపించి, వేర్వేరు స్థాయుల్లో వివిధ రకాలుగా జరుగుతోంది. అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మమే ఈ యజ్ఞము, యజ్ఞ కర్త, భోక్త ............ అన్నీను. బ్రహ్మము యజ్ఞము అభిన్నము, అంటే రెండూ వేరు కాదు. అందుకే 'యజ్ఞోవై విష్ణుః' అని యజుర్వేదం కీర్తిస్తోంది.  

To be continued ..........

Sunday, 12 June 2016

హిందూ ధర్మం - 213 (కల్పం - 3)



శ్రౌత సూత్రాల్లో ప్రధానంగా వేదాల్లో చెప్పబడిన సోమయాగం, వాజపేయం, రాజసూయం, అశ్వమేధం మొదలైన క్రతువుల గురించి వివరణ ఉంది.

ఋగ్వేదానికి అశ్వలాయన, సాంఖ్యాయన సూత్రాలని 2 శ్రౌత సూత్రాలున్నాయి. యజమాని ఏదైనా కోరి యాగం నిర్వహిస్తున్నప్పుడు ఇవ్వాలసిన వివిధ రకాల ఆహుతుల గురించి వివరిస్తాయి. అశ్వలాయన సూత్రాల్లో 12 అధ్యాయాలున్నాయి. శౌనక మహర్షి శిష్యుడు అశ్వలాయనుడు. వీరిద్దరు కలిసి ఐతరేయ ఆరణ్యకం చివరి 2 అధ్యాయాలు రచించారని చెప్తారు. సాంఖ్యాయన శ్రౌత సూత్రాల్లో 18 అధ్యాయలున్నాయి. వాటిని వివరించిన పద్ధతి, కూర్చిన విధాన్ని పరిశీలిస్తే, ఇవి అత్యంత పూరాతన సూత్రాలని, బ్రాహ్మాణాలను పోలి ఉంటాయని అర్దమవుతుంది.

శుక్ల యజుర్వేద కల్పసూత్రాలు - కాత్యాయన సూత్రాలు, పారస్కరాచార్యుడు రచించిన గృహ్య సూత్రాలు.
శ్రౌతసూత్రాలను అర్దం చేసుకోవడంలో కాత్యాయన శ్రౌత సూత్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో సూత్ర రూపంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డయి. ఈ గ్రంధం 23 అధ్యాయాలుగా ఉండి, అనేక వైదిక క్రతువుల, వాటిలోని ఆహుతుల గురించి వివరణ ఇస్తుంది. కాత్యాయన సూత్రాల్లోని మొదటి అధ్యాయం 10 కాండికలుగా విభజింపబడి, అనేక విషయాలను చర్చిస్తుంది.
2, 3 అధ్యాయాల్లో ప్రతి దానిలో 8 కాండికలు ఉన్నాయి. అమావాస్య, పూర్ణిమ తిధుల్లో ఇవ్వాల్సిన ఆహుతుల గురించి ఇది వివరిస్తుంది. 4 వ అధ్యాయంలో 15 కాండికలున్నాయి, అందులో పిండపితృ యాగం, దాక్షాయణ యాగం, శ్రౌత యాగం, అగ్నిహోత్ర యాగాల గురించి వివరిస్తుంది. 5 వ అధ్యాయం 13 కాండికలుగా విభింజబడి చాతుర్మాస్యంలో చేయాలసిన విధుల గురించి, ఆహుతుల గురించి వివరిస్తుంది.

6 వ అధ్యాయం 10 కాండికలుగా విభజించబడి మనిషిలోని పశు లక్షణాలను ఏ విధంగా యాగంలో సమర్పించాలో చెప్తుంది.
7 నుంచి 10 వ అధ్యాయం వరకు అగ్నిష్టోమ యాగం గురించి వివరిస్తుంది. 11 వ అధ్యాయం యజ్ఞంలో బ్రహ్మగా కూర్చునే బ్రాహ్మణుడి విధులు, వాటి ప్రాముఖ్యత తెలుపుతాయి. 12 ద్వాదసః యాగము, 13 గవమయన యాగం గురించి, 14 వ అధ్యాయం వాజపేయం గురించి, 15 రాజసూయ యాగం గురించి వివరిస్తాయి.
16 నుంచి 18 అధ్యాయాలు అగ్నిచయనం గురించి ........... ఇలా వీటిలో అనేక యాగల గురించి వివరణ ఉంది.

కృష్ణ యజుర్వేదానికి బౌద్ధాయన, ఆపస్థంభ, హిరణ్యకేశి, వైఖానస, భారద్వజ, మానవ శ్రౌత సూత్రాలున్నాయి. మొదటి 5 తైత్తరీయ శాఖకు చెందినవి కాగా, ఆఖరిది మైత్రాయణ శాఖ చెందినది. బౌద్ధాయన, ఆపస్థంభ సూత్రాల్లో సూత్ర గ్రంధాల 4 విభాగలు (శ్రౌత, స్మార్త, గృహ్య, సుల్భ సూత్రాల) ఉన్నాయి.

సామవేదానికి ఉన్న కల్ప సూత్రాలకు సామవేదీయ కల్పసూత్రాలనే పేరు ఉంది. వీటిలో ఏ యాగ సమయంలో ఎటువంటి సామాన్ని పఠించాలో చెప్పబడింది.

To be continued ....................

Source: http://veda.wikidot.com/kalpa-vedanga

Sunday, 19 April 2015

హిందూ ధర్మం - 155 (యజుర్వేదం)

2. యజుర్వేదం

'అనియతాక్ష రావసానో యజుః' - నియతమైన అక్షరములు లేనిది యజస్సు. యజుః అనేదానికి ప్రధానంగా 'గద్య' అనే అర్దం ఉంది, ఋగ్ వేదంలా కాకుండా యజుర్వేదం గద్యరూపంగా ఉంటుంది. 'యజుర్ యజతే' - మంత్రాలను యజ్ఞార్ధం ఉపయోహిస్తారు కనుక యజుర్వేదం అంటారని అర్దం.

యజుర్వేదం అనుసరించవలసిన పద్ధతులు, మానవ మనస్తత్వశాస్త్రం (human psychology), మానవుడు పరమ పురుషార్ధము, మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశమైన మోక్షాన్ని పొందటానికి ఏ విధమైన కర్మలు చేయాలో, ఎలాంటి మార్గాలను అనుసరించలో ప్రధానంగా చెప్తుంది. మానవుడు తాను పొందిన జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకుని, లోకానికి మేలు చేసే కార్యాలను చేసి, ఇతర మానవులకు జ్ఞానాన్ని, మేలును ఎలా చేకూర్చే విధానాన్ని స్పష్టం చేస్తుంది. ఇవేకాక తత్వం గురించి, మనసు, ప్రాణం గురించి కూడా వివరిస్తుంది.

యజుర్వేదం 33 వ అధ్యాయం, 7 వ శ్లోకంలో వేల మైళ్ళు ఆగకుండా ఎగిరే విమానాల గురించి ప్రస్తావన ఉంది. ఖగోళ (Astronomy), భూగోళ (Geography), భూగర్భ(Geology ), Hydrostatics, ఔషధ (Medicine), విమానశాస్త్రాల (air-flight) ప్రస్తావన యజుర్వేదం, 6 వ అధ్యాయం, 21 వ శ్లోకంలో ఉంది.

స్త్రీపురుషులు, అన్ని వర్ణాల వారు సమానమని యజుర్వేదం 31 వ అధ్యాయం చెప్తున్నది. స్త్రీలకు గౌరవం ఇవ్వాలని సందేశం ఇస్తోంది. 18 వ అధ్యాయం 48 వ మంత్రం స్నేహ సందేశాన్ని ఇస్తోంది. 21 వ అధ్యాయం 67 నుంచి 70 మంత్రాల వరకు వ్యవసాయపనులైన దున్నడం, నారుపెట్టడం, విత్తడం మొదలైన పనుల గురించి వివరణ ఉంది. ఇనుము, వెండి మొదలైన ఖనిజాల ప్రస్తావన కూడా ఉంది. 24 వ అధ్యాయం మొత్తం పక్షులు, జంతువులు, కీటకాల గురించి ప్రస్తావిస్తూ జంతుశాస్త్రానికి బీజం వేసింది. 21 వ అధ్యాయం ఋతువుల గురించి, ఆయ ఋతువులలో ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోదగిన ఆహారం గురించి చెప్తుంది. 23 వ అధ్యాయం 10వ మంత్రం చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదని, సూర్యుని నుండి వెలుగును గ్రహించి ప్రసరిస్తున్నాడని వెల్లడిస్తోంది.

యజుర్వేద సంహితల్లో చాలా రకాల యజ్ఞాల ప్రస్తావన ఉంది. వాజసనేయ సంహిత దర్శపూర్ణమాసాలు, అగ్నిహోత్రం, వాజపేయం, అశ్వమేధం, సర్వమేధం, బ్రహ్మయజ్ఞం, పిత్రిమేధం, శౌత్రామణి మొదలైన వాటి గురించి చెప్పబడింది. సులువగా అర్దమవ్వడం కోసం వాటిని దర్శపూర్నమాశాలని, సోమయాగాలని, అగ్నిచయనాలని 3 గా విభాగం చేయచ్చు.

యజ్ఞం అంటే కేవలం అగ్నితో చేసేది మాత్రమే కాదనీ, మనకు తెలిసిన మంచి విషయాలను, జ్ఞానాన్ని పంచుకోవడం, ధర్మప్రచారం చేయడం కూడా యజ్ఞమేనని చెప్తుంది. సమానత్వము, ఐక్యత, విశ్వజనీన సహోదరత్వం గురించి సందేశం ఇస్తుంది.

ఉఛ్చారణా పద్ధతిని అనుసరించి యజుర్వేదాన్ని రెండుగా చెప్తారు. ఒకటి కృష్ణ యజుర్వేదం, రెండు శుక్లయజుర్వేదం. శుక్ల యజుర్వేదాన్నే వాజసనేయము అని కూడా అంటారు. ఉత్తరభారతదేశంలో శుక్ల యజుర్వేదము, దక్షిణ భారతదేశంలో కృష్ణ యజుర్వేదము తరతరాలుగా బోధిస్తున్నారు.
వీటి మధ్య బేధాన్ని ఈ వీడియోలో వినండి.

1) కృష్ణయజుర్వేదం

2) శుక్లయజుర్వేదం


యజుర్వేద మంత్రాలను काण्डिका (కాణ్డికాలు) అంటారు. యజుర్వేదంలో 40 అధ్యాయాలు, 1975 కాణ్డికాలు ఉన్నాయి. పతంజలి మహర్షి మహాభాష్యం రాసే సమయానికి యజుర్వేదానికి 101 శాఖలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం 6 శాఖలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మిగితావి లుప్తమైపోయాయి.  తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన, మైత్రాయణ, కరు కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. శతపథ బ్రాహ్మణం శుక్ల యజుర్వేదానికి చెందినది. అయినప్పటికి ప్రస్తుతం మొత్తం యజుర్వేదానికి సంబంధించి శతపధ బ్రాహ్మణం ఒక్కటి మాత్రమే లభిస్తోంది.

యజుర్వేదానికి సంబంధించిన ఆరణ్యకాలు ఏవీ కూడా లభించడం లేదు.

ఉపనిషత్తుల విషయానికి వస్తే ఈశావాస్య, తైత్తరీయ, బృహదారణ్యక ఉపనిషత్తులు యజుర్వేదానికి సంబంధించి అందుబాటులో ఉన్నాయి. అందులో శుక్ల యజుర్వేదానికి సంబంధించినది బృహదారణ్యక ఉపనిషత్తు. ఉపనిషత్తులను కూడా స్వరంతో చదివే సంప్రదాయం ఉన్నా, హిందువులకు లభిస్తున్న అన్ని ఉపనిషత్తుల్లో ఒక్క తైత్తరీయ ఉపనిషత్తు మాత్రమే స్వరంతో కూడి లభిస్తోంది. మిగితావి అన్యమతాల దండయాత్రాల్లో కోల్పోగా, కేవలం ప్రతులు మాత్రమే లభిస్తున్నాయి. యజ్ఞసమయంలో యజుర్వేదం చదివే పండితుడిని అధ్వర్యుడు అంటారు.

To be continued ...............

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
http://ignca.nic.in/vedic_heritage_intro_yajurveda.htm
http://archive.org/stream/yajurveda029670mbp/yajurveda029670mbp_djvu.txt
http://www.vedicgranth.org/what_are_vedic_granth/the-four-veda/yajur-veda