Sunday, 26 July 2015

హిందూ ధర్మం - 168 (శిక్షా - 2)

అసలు శబ్దం కోసం, ఉఛ్ఛారణ కోసం ఒక శాస్త్రం అవసరమా? అని అడుగుతారు. భాష గురించి ఆధునిక చరిత్రకారులు వివరిస్తూ, మొదట ఆదిమానవుడు ఉన్న సమయంలో అసలు లిపి అనేదే లేదని, మొదట సైగలతో బ్రతికేశారని, తరువాత బొమ్మలు వేయడం మొదలుపెట్టారని, ఆ తర్వాతి క్రమంలో భాష మొదలైందని చెప్తారు. కానీ ధర్మం అలా చెప్పదు. సృష్ట్యాదిలో భగవంతుడు మానవులను సృష్టిచడంతోనే వేదాలను వ్యక్తపరిచాడని శాస్త్రగ్రంధాలు అంటాయి. అక్కడే భాష కూడా మొదలైంది. సంస్కృతానికి ఆల్ఫబెట్ లేదు. ఆ మాటకు వస్తే తెలుగుకు కూడా లేదు. గ్రీకు లో ఆల్ఫా, బీటా,.. లాటిన్ (రోమన్)లో a, b, c.. వంటి పరస్పర సంబంధంలేని సంజ్ఞలు ఉన్నాయి. మన భాషలకు ఉన్నది వర్ణమాల. వర్ణమంటే ప్రత్యేక ఉచ్చారణ గల శబ్దాలను సూచించే సంజ్ఞలు. సంస్కృతం వ్యాకరణములలో కంఠ్యములు, తాలవ్యములు, మూర్థన్యములు, దంత్యములు, ఓష్ట్యములు అని ఉన్నాయి. అంటే కొన్ని గొంతుతో పలికేవి, కొన్ని ముక్కుతో పలికేవి, కొన్ని నాలుకతో పలికేవి, కొన్ని పన్నులతో పలికేవీ...... ఇలా అన్నమాట. ప్రపంచంలో దాదాపు 98% భాషలకు సంస్కృతమే తల్లి అని ఫోర్బ్స్ మొదలైన పత్రికలే కాక, అనేక పరిశోధనలు కూడా ఋజువు చేశాయి. అయినా ఇతర దేశాల భాషలకంటే భారతీయ భాషలకు సంస్కృతంతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. తెలుగు, కన్నడ మొదలైన భాషలు సంపూర్ణమైనవి కావు. వాటిలో అనేక పదాలకు ఇప్పటికి సంస్కృతానికి చెందినవే. ఆ మాటకు వస్తే, ఒక్క సంస్కృతం తప్ప మరే ఇతర భాష సంపూర్ణం కాదు.



ఇంగ్లీష్ విషయం తిసుకున్నా, 'ఇంగ్లీష్ లో ఒక్క a తప్ప మిగిలినవి అన్ని ఒక్క నాలుకను మాత్రమే  ఉపయోగించే పలికే శబ్దాలే. నాలుకను ఉపయోగించకుండా మిగితావి పలకలేము. అందుకే ఆంగ్లేయులు నాలుకను భుజాన వేసుకుని ప్రపంచాన్ని పరిపాలించారు. తెలుగు, సంస్కృతం మాట్లాడటంలో మన శరీరం, నోరు, గొంతు భాగంలోని ప్రతి అవయవం పనిచేస్తుంది, అందులో చలనం వస్తుంది. 72,000 నాడులను సంస్కృతం ఉత్తేజపరుస్తుంది. అందుకే భారతీయ బాషలను, ముఖ్యంగా సంస్కృతాన్ని మాట్లాడేవారు ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు' అని స్వర్గీయులు శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ గారు అనేవారు. ఇది వారు ఏదో సరదాకి చెప్పిన విషయం కాదు. సంస్కృతం మాట్లాడటం వలన నోరు, గొంతు క్యాన్సర్లను నివారించవచ్చని విదేశీయుల పరిశోధనలో తేలింది. ఆ కారణం చేతనే బ్రిటన్, జెర్మనీ వంటి దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులకు సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధిస్తున్నారు.

అయితే భారతీయ ఋషుల దృష్టి కోణంలో వర్ణమాల అంటే కేవలం ఏదో భావాలను వ్యక్త పరచటానికి ఉపయోగించే ఒక వ్యవస్థ కాదు. ఓం అనేది ఏ విధంగానైతే పరబ్రహ్మం యొక్క ప్రతిరూపమో, అట్లాగే సంస్కృత వాఙ్గయంలో ప్రతి ప్రతి అక్షరానికి ఒక అధిదేవత ఉంది. ఆ అధిదేవతను ఋషులు దర్శించారు. మొత్తం వర్ణమాలలోని 52 అక్షరాలకు 52 మంది అధిదేవతలు ఉన్నారు. వారికి ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది, వారికీ శక్తి ఉంది, వారు కూడా శుభాలను చేకూరుస్తారు. ఈ 52 అక్షరాలకు మానవ శరీరంలోని 6 చక్రాలకు సంబంధం ఉంది, 72,000 నాడులను చైతన్యం చేసే శక్తి ఉంది. ఒక్కో అక్షరం ఒక్కో చక్రం మీద పని చేస్తుంది, మనిషికి ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది. ఆయా అక్షరాలను కలిపి చదవడం వలన ఒక్కో రకమైన శక్తి పుడుతుంది. అక్షరాలను ఒక పద్ధతిలో ఏర్పరిచి భగవంతుడు మంత్రాలను, సూక్తములను ఇచ్చాడు. అక్కడ వేర్వేరు అక్షరముల కలియిక (Combination) ఉంది. అది ఇంకా శక్తివంతం. ఎంత అంటే సూక్తంలో చదివినది అర్దంకాకపోయినా, అది వినడం చేతనే, విన్నవాడు శుభాలను పొందుతున్నాడు. వాడిలో దైవీశక్తి జాగ్రతం అవుతోంది.

ఆ రకంగా చూసినప్పుడు మొత్తం సంస్కృతం, దానితో సంబంధం కలిగి ఉన్న భారతీయ భాషలన్నీ ప్రపంచంలో పెద్ద అద్భుతాలు. కేవలం సంస్కృత భాషణం(మాట్లడటం) చేత ఇంతమంది అధిదేవతల అనుగ్రహం లభిస్తుంది. అది మన సంస్కృత భాష యొక్క గొప్పతనం. సంస్కృతం దైవభాష అని చెప్పుటకు ఇది కూడా ఒక కారణం. అందుకే ఋషులు అక్షరాభ్యాసం అనే ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు. అక్షరం అనగా నాశనం లేనిది అని అర్దం. అక్షరమే భగవంతుడు. పసిపిల్లవాడు ఏదో విద్య నేర్చుకుంటున్నాడు అని ఋషులు అనలేదు, వాడు అక్షరాన్ని అభ్యసిస్తున్నాడు, పరబ్రహ్మాన్ని ఉపాసిస్తున్నాడు అన్నారు. అందుకే పూర్వం విద్యాభ్యాసంలో పాఠశాలకు వెళ్ళిన విద్యార్ధులు చెప్పులు బయట విడిచిపెట్టి, పద్మాసనంలో కూర్చుకుని పవిత్రంగా విద్య నేర్చుకునేవారు. ఎందుకంటే వారు కేవలం విద్య నేర్చుకోవటంలేదు, నేర్చుకోవటం అనే నెపంతో దైవాన్ని ఉపాసిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంస్కృత శబ్దాలు, వాటి శక్తులు గురించి చాలా చెప్పుకోవచ్చు. ఇంత మహత్తు ఉన్న శబ్దముల కోసం వచ్చిన శాస్త్రమే శిక్షా.

To be continued .......................

ఈ రచనకు సాయం చేసిన రచనలు.
 Vvs Sarma గారి సంస్కృతంతో నా చెలిమి
శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి ఉపన్యాసం
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనం

No comments:

Post a Comment