Friday, 31 July 2015

గురు పూర్ణిమ సందేశం

అంధకారంలో మగ్గుతున్న జీవులను ఉద్ధరించడం కోసం ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. జీవుల కర్మక్షయం కోసం జన్మల పరంపరను ఏర్పరిచాడు. అన్నీ తానే చేసినా, తాను అన్నిటికి సాక్షిగా ఉండాలని, జీవుల మీద ప్రేమతో వారికి దగ్గరగా ఉండాలని అంతర్యామియై అంతటా, అన్నిటి యందు ఉన్నాడు. ఇది అర్దం చేసుకున్న జీవుడు, ఈ జీవితం భౌతికమైన సుఖాల కోసం కాదని, అంతర్యామియైన భగవానుని తెలుసుకోనుటకేనని నిశ్చయించుకుని ఆయనను వెతకడం ప్రారంభిస్తాడు. భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈశ్వరుని గురించి తెలిపే వారెవరు? నా గురించి ఏదైనా చెప్పుకుంటే నేనే చెప్పుకోవాలి. మీ గురించి చెప్పుకుంటే మీరే చెప్పుకోవాలి. ఇతరులు మన గురించి చెప్తే, అది అసంపూర్ణంగానే ఉంటుంది. అట్లాగే ఈశ్వరుని గురించి కూడా. అందుకే ఈశ్వరుడే రహస్యంగా గురు రూపంలో భూమిపై తిరుగుతూ, తన గురించి తెలుసుకోవాలనే తపన కలిగిన వారికి తన తత్వం చెప్తాడు. అందుకే శాస్త్రం 'ఈశ్వరః గురు రూపేణ గూఢఛ్ఛరతి భూతలే' అంటుంది. వారి వారి స్థాయిని అనుసరించి, వారి సంస్కారాన్ని అనుసరించి వారికి తగిన విధంగా అర్దమయ్యేలా తత్వం బోధ చేస్తాడు. అందుకే లోకంలో అనేకమంది గురువులు ఉన్నారు.

ఈశ్వరుడు ఒక్కో యుగంలో ఒక్కో మహాగురువుగా అవతరించాడు కృతయుగంలో దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా.......... కానీ రాబోయే కలియుగాన్ని, అందులో మానవుల కష్టనష్టాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భగవానుడే ద్వాపరయుగాంతంలో వేదవ్యాస మహర్షిగా అవతరించారు. వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. వేదాలను గ్రంధస్థం చేయుటయే కాక, అనేక మన్వంతరాలు, కల్పాలు, ఇతర సృష్టిలో జరిగిన సంఘటనలు, వాటిలో ఉన్న ధర్మసూక్ష్మాలను మానవాళికి అందించి, వారి ఉద్ధతి కోసం 18 పురాణాలను, 18 ఉపపురాణాలను రచించారు. బ్రహ్మసూత్రాలను అందించారు. తాను బ్రహ్మనిష్ఠుడై ఉండీ, బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నప్పటికి, మానవాళి మీద ప్రేమతో క్రిందకు దిగి వచ్చి ఈ రచనలు చేశారు. అంతమేలు చేసిన వ్యాసునికి కృతజ్ఞత ఆవిషకరించడం కోసమే వ్యాసజయంతిని వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటాం.

గురుపూర్ణిమ రోజున చేసే పూజ చేతనే వ్యాసుడు సంతృప్తి చెందుతాడా అంటే కాదనే చెప్పాలి. ఆయన అంత శ్రమపడి ఇచ్చిన వాటిని పాటించకుండా ఉంటే ఆయనకు ఎంత బాధ కలుగుతుంది? వ్యాసుడు ఇచ్చిన పురాణలను ఆకళింపు చేసుకుని నిత్య జీవితంలో అనుష్ఠించాలి. ధర్మాన్నే పాటించాలి. వేదాలను, పురాణేతిహాసాలను రక్షించుకోవాలి. అదే వ్యాసుడికి చేసే నిజమైన గురుపూజ. గురువు చెప్పినదాన్ని పాటించడం చేతనే గురువు సంతోషిస్తాడు. గురుపూర్ణిమ మనలో అలాంటి మార్పును తీసుకురావాలి. నేను ధర్మాన్నే పాటిస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను అని సంకల్పించుకుని దాన్ని అమలుపరచాలి. అప్పుడే మనపై వేదవ్యాసమహర్షి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.  

సద్గురు శివానందమూర్తి గారు మొదలగు అనేకమంది సిద్ధపుర్షులు, యోగుల యొక్క అమృతవాక్కుల సమాహారం ఇది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

గురుపూర్ణిమ శుభాకాంక్షలు 

No comments:

Post a Comment