టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!!
-ఎం.వి.ఆర్. శాస్త్రి 14/11/2015 - ఆంధ్రభూమి
టిప్పు సుల్తాన్ సెక్యులరా, కాదా అని వేరెవరినో అడగవలసిన పనిలేదు.
ఆ సంగతి టిప్పు సుల్తానే చెబుతాడు ఎంచక్కా.
‘‘మీర్ హుస్సేన్ అలీతో మావాళ్లు ఇద్దరిని పంపుతున్నాను. వారి సాయంతో నువ్వు హిందువులందరినీ పట్టి, చంపాలి. 20 ఏళ్ల లోపు వాళ్లని ఖైదు చేయాలి. మిగతావారిలో 5000 మందిని చెట్లకు వేలాడదీసి చంపాలి. ఇది నా ఆజ్ఞ.’’
‘ఆదర్శ ప్రభువు’ టిప్పు సుల్తాన్ 1788 డిసెంబర్ 14న కాలికట్‌లోని తన సేనాపతికి రాసిన జాబు ఇది.
‘‘పనె్నండు వేల మంది హిందువులు ఇస్లాంను స్వీకరించారు. వారిలో చాలా మంది నంబూద్రి బ్రాహ్మణులు ఉన్నారు. ఈ సంగతి హిందువుల్లో బాగా ప్రచారం చేయించు. అప్పుడు హిందువులని నీ దగ్గరికి రప్పించి ఇస్లాంలోకి మార్పించు. నంబూద్రి బ్రాహ్మణుడు ఒక్కడిని కూడా వదలొద్దు.’’
1788 మార్చి 22న ‘మోడల్ కింగ్’ టిప్పు సుల్తాన్‌గారు అబ్దుల్ కదీర్‌కి రాసి పంపిన ఉత్తర్వు ఇది.
‘‘ఇటీవల మలబార్‌లో నాలుగు లక్షల మందికి పైగా హిందువులను ఇస్లాంలోకి మార్పించి గొప్ప విజయం సాధించాను. ఈ సంగతి నీకు తెలియదా?’’
1790 జనవరి 19న బుద్రుజ్ జుమాన్ ఖాన్‌కి ‘‘జాతీయ వీరుడు’’ టిప్పు సుల్తాన్ రాసిన ఉత్తరం ఇది.
‘‘మహమ్మద్ ప్రవక్త, అల్లాల దయవల్ల కాలికట్‌లోని హిందువులందరూ ఇస్లాంలోకి మార్చబడ్డారు. కొచ్చిన్ రాజ్య సరిహద్దుల్లోని కొందరు మాత్రమే ఇంకా మారకుండా మిగిలారు. వాళ్లనీ అతిత్వరలో మార్చెయ్యాలని నిశ్చయించాను. ఇదే ‘జిహాద్’ అని నేను అనుకుంటున్నాను.’’
1790 జనవరి 18న సయ్యద్ అబ్దుల్ దులాయ్‌కి ‘‘సెక్యులర్ పాలకుడు’’ టిప్పు సుల్తాన్ రాసిన లేఖ ఇది.
ఈ ఉత్తరాలన్నీ నిన్నో మొన్నో నరేంద్ర మోదీ గ్యాంగు బనాయించిన బాపతు కాదు. సుప్రసిద్ధ చరిత్రకారుడు కె.ఎం.పణిక్కర్ కష్టపడి సేకరించి నేటికి తొంభై ఏళ్లకింద ‘్భషా పోషిణి’ పత్రిక (1923 ఆగస్టు సంచిక)లో వెలువరించిన ఉత్తరాలివి. దానికి నూరేళ్ల కింద William Kirkpatrick 1811లో ప్రచురించిన Selected Letters of Tipoo Sultan గ్రంథంలోనూ ఇలాంటి లేఖామాణిక్యాలు చాలా దొరుకుతాయి.
ఉత్తరాల్లో రాసుకున్నవి బడాయి గొప్పలు అయి ఉండొచ్చు కదా? ఆదేశాలు పంపినంత మాత్రాన అవన్నీ అక్షరాలా అమలయ్యే ఉంటాయని ఎలా నమ్మగలం?
నమ్మవద్దు. 19వ శతాబ్దపు ‘మైసూర్ గెజిటీర్’ని చూడండి. దక్షిణ భారతంలో టిప్పు సేనలు 8000 దేవాలయాలను సర్వనాశనం చేసినట్టు కనపడుతుంది. ముఖ్యంగా మలబార్, కొచ్చిన్‌లలో జరిగిన దోపిడీలకు, దేవాలయ విధ్వంసాలకు మేర లేదని అర్థమవుతుంది.
పోనీ మనవాడు కాని Lewis B. Boury ని కదపండి. మలబార్‌లో హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద టిప్పు సుల్తాన్ చేయించిన ఘోర దురాగతాలు గజనీ మహమ్మద్, అల్లావుద్దీన్ ఖిల్జీ, నాదిర్షా, ఔరంగజేబుల ప్రతాపాలకు ఏమాత్రం తీసిపోవని మొత్తుకుంటూ ఆయన పెద్దపుస్తకమే రాశాడు.
‘కేరళలో టిప్పు సుల్తాన్ దండయాత్రల ఘాతుకాలు చూస్తే చెంఘిజ్‌ఖాన్, తైమూర్‌లు గుర్తుకొస్తారని సుప్రసిద్ధ మహమ్మదీయ చరిత్రకారుడు పి.ఎస్.సయ్యద్ ముహమ్మద్ ‘‘కేరళ ముస్లిమ్ చరిత్రమ్’’ గ్రంథంలో వర్ణించాడు.
పుస్తకాలకేమి? తెలిసో తెలియకో ఎవడైనా ఏదైనా రాసి పడెయ్యవచ్చు- అని కొట్టేద్దామా?
1783 నుంచి 1791 వరకు మలబార్‌లో టిప్పు సుల్తాన్ రాక్షస కృత్యాల మూలంగా 30,000 మంది బ్రాహ్మణులు, ఇంకా ఎన్నో వేలమంది నాయర్లు ఇళ్లు, ఆస్తులు విడిచిపెట్టి ప్రాణభయంతో తిరువాన్కూరు రాజ్యానికి పారిపోయారని టిప్పు మరణానంతరం బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వారు నియమించిన విచారణ సంఘం దర్యాప్తులో తేలింది. ఆ నివేదిక కేవలం బ్రిటిషు ప్రభువులకు తెలియడం కోసం రూపొందిందే తప్ప పుస్తకం రాద్దామన్న ఉద్దేశంతో పోగేసింది కాదు. 1866-86 మధ్యకాలంలో ఆ ప్రాంతాన కలెక్టరుగా పనిచేసిన William Logan రికార్డులు ఫరిశీలించి, ప్రజలతో మాట్లాడి, విస్తృతంగా సమాచారం సేకరించి వెలువరించిన Malabar Manual లోనూ టిప్పు చేయించిన అత్యాచారాలు, సామూహిక సున్తీలు, ‘కత్తి లేదా టోపీ’ నినాదంతో నెత్తిన ముస్లిం టోపీ పెట్టుకోవటానికి ఒప్పుకోనివారిని వేల సంఖ్యలో నరికేసిన ఉదంతాలు, దేవాలయాలను మలిన పరిచి, బలవంతంగా ఆవు మాసం నోట కుక్కించి, స్ర్తిలను చెరిచి, పసిపిల్లలనూ చంపించిన పైశాచిక కృత్యాలు ఏకరవు పెట్టారు. దాని తాజాముద్రణను కొచ్చిన్, కేరళ యూనివర్సిటీల సహకారంతో విఖ్యాత ముస్లిం చరిత్రకారుడు డాక్టర్ సి.కె.కరీమ్ సరిచూసి ప్రచురించాడు.
పోనీ - బ్రిటిషు వారికి టిప్పు సుల్తాన్ బద్ధ శత్రువు కాబట్టి ఇంగ్లిషు వాళ్ల కళ్లకి అతడిలో అన్నీ తప్పులే కనపడి ఉండొచ్చు; ఆ ‘స్వాతంత్య్ర యోధుడి’ని భ్రష్టు పట్టించేందుకే వాళ్లు లేనిపోనివి కల్పించి ఉండవచ్చు అనుకుందామా?
ఇంగ్లిషు వాడు కాని విదేశీయుడు, 1790లో టిప్పు యుద్ధ బీభత్సాన్ని అక్కడే ఉండి కళ్లారా చూసిన పోర్చుగిసు యాత్రికుడు Barthoelomeo తరవాత కాలంలో రాసిన 'A Voyage to East Indies' లో ఛెప్పిందిది:
First a corps of 30,000 barbarians butchered everybody on the way... Tipu was riding an elephant behind which another army of 30,000 soldiers followed. Most of the men and women were hanged in Calicut. First mothers were hanged with their children tied to necks of mothers. That barbarian Tipu Sultan tied the naked Christians and Hindus to the legs of elephants and made the elephants to move around till the bodies of the helpless victims were torn to pceces. Temples and Churches were ordered to be burned down, desecrated and destroyed...
(ముందు 30 వేల దండు వెడలి దారిలో కనపడ్డ వాళ్లనల్లా నరికేసింది... టిప్పు ఏనుగు మీద ఉన్నాడు. ఇంకో 30వేల సైనికులు అతడి వెనుక నడిచారు. కాలికట్‌లోని స్ర్తి పురుషుల్లో అత్యధిక సంఖ్యాకులను ఉరి తీశారు. బిడ్డలని మెడలకు కట్టి తల్లులను ఉరి తీశారు. కిరాతకుడు టిప్పు సుల్తాన్ క్రైస్తవులను, హిందువులను నగ్నంగా ఏనుగుల కాళ్లకు కట్టేయించి, వారు ముక్కలయ్యేదాకా ఏనుగుల చేత తొక్కించాడు. దేవాలయాలను, చర్చిలను తగలబెట్టి, మలినపరిచి, నాశనం చేయించాడు.)
అదీ సంగతి! అన్ని మతాలనూ సమానంగా చూడవలెను అన్నది సెక్యులరిజం-ట కదా? చంపి పోగులు పెట్టే విషయంలో హిందూ, క్రైస్తవ మతాలకు చెందినవారిని సమానంగా చూశాడు కాబట్టి బహుశా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గారి కాంగ్రెసు కళ్లకు టిప్పు సుల్తాన్ సిసలైన సెక్యులరిస్టుగా, ‘మోడల్ కింగ్’గా, ‘జాతీయ వీరుడు’గా కనపడి ఉండవచ్చు.
పూర్వపు కాంగ్రెసు ఇలవేల్పులు ఆ మహా ‘స్వాతంత్య్ర యోధుడి’ సంస్మరణార్థం ప్రత్యేక తపాలా బిళ్లను వెలువరించారు. సెక్యులర్ రాజ్యంలో సర్కారీ దూరదర్శన్The Sword of Tipu Sultan అనే పేర టిప్పుగారిని ఆకాశానికెత్తి మహావీరుడిగా, సుగుణాల రాశిగా చిత్రిస్తూ పక్కా అబద్ధాల అల్లికతో పెద్ద సీరియలే తీసి తరించింది. అలాంటప్పుడు తాను మాత్రం ఆ ‘మైసూర్ టైగర్’కి ఘన నివాళి ఇవ్వకపోతే మర్యాదగా ఉండదని తలచినవాడై, ఇనే్నళ్లకి ఆ ‘జాతీయ వీరుడి’ జయంతిని కన్నడ సిద్దుడు ప్రభుత్వ పరంగా ఏటేటా మహా ఘనంగా జరిపించబట్టాడు.
అది చూసి గిరీష్ కర్నాడ్ అనే ‘జ్ఞానపీఠ’మెక్కిన మహాజ్ఞానికి ఆనందబాష్పాలురాలి, ఉత్సాహం ఉప్పొంగింది. టిప్పు సుల్తాన్ అనేవాడు శివాజీ, నేతాజీల సరసన అర్జంటుగా చేర్చదగిన మహానుభావుడనీ, అంతటి పుణ్యాత్ముడిని అనుక్షణం గుర్తుపెట్టుకునేలా బెంగళూరు విమానాశ్రయానికి కెంపెగౌడను పక్కకు తనే్నసి టిప్పు సుల్తాన్ పేరు తగిలిస్తేగానీ సెక్యులర్ భారత్ కీర్తి ప్రతిష్ఠలు ఇంకా మండిపోవనీ ఆ మహామేధావి ఓవరైపోయాడు.
హిందువులను హింసించిన వాడు ఎవడైనా ఆటోమెటిగ్గా సెక్యులరిస్టే అయి తీరతాడు కాబట్టి మన పుణ్యభూమిలోని సమస్త వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర మేధావులు కూడా అమందానందభరితులయ్యారు.
ఎటూచ్చీ మతోన్మాదులైన హిందూ జనాలే ఈ లోకోత్తర జయంతి అద్భుతంగా సాగకుండా పెద్ద న్యూసెన్సు చేస్తున్నారు.
వాళ్లకి మరీ బుద్ధి లేకుండా పోయింది. ‘మా దేశం మీద దాడికి రండి. మీతో చేతులు కలుపుతా’నని టిప్పు సుల్తాన్ ఫ్రెంచి వాళ్లను పిలవనంపి, దేశ ద్రోహానికి పాల్పడితేనేమి? ఇంగ్లిషు వాళ్లని తీవ్రంగా ఎదిరించాడు కాబట్టి అతడిని స్వాతంత్య్ర వీరుడు, జాతీయ యోధుడు అని పొగిడి, సెక్యులర్ బుద్ధి జీవుల్లా హిందువులు కూడా పొంగి పోవచ్చు కదా? శృంగేరి మఠానికి చేసిన సహాయాన్ని మాత్రమే గుర్తుంచుకోవచ్చు గదా? ఉత్తర కర్ణాటకలో, కూర్గ్‌లో వేలాది హిందువులను చంపి, లక్షల మందిని బలవంతంగా మతం మార్పించి, వందల దేవాలయాలు కూల్చిన ‘టైగర్’ చేతలను మన సెక్యులర్ మేధావుల్లాగే వారూ మరచిపోవచ్చు గదా?
అందులోనూ ‘మహా జయంతి’కి సిద్ద రామయ్య ఎంచుకున్న తేదీ ఏది? టిప్పు సుల్తాన్ పుట్టిన నవంబర్ 20నా? కాదండి. కాదు. మేల్కొటేలో ఒకే రోజు 700 మంది అయ్యంగార్లను టిప్పు సాహెబ్ ఉరి తీయించిన నవంబర్ 10ని! ఆ భయానక దుర్దినాన్ని మరచిపోలేక మేల్కొటే అయ్యంగార్లు ఈనాటికీ దీపావళి పండుగ జరుపుకోరట. అది వారి ఖర్మ. మిగతా ఊళ్ల హిందువులకు ఏమయ్యింది? సిద్దరాముడి సెక్యులర్ ప్రభుత్వం అంతలా పనిగట్టుకుని, ఒక సెక్యులర్ మహావీరుడిని - చచ్చిన రెండు శతాబ్దాలకు గోరీ లోంచి లేపి ‘జయంతి’ని వైభవంగా చేయిస్తూ... పుండుమీద కారం చల్లేలా టిప్పు బాధిత కూర్గ్ ప్రాంతంలో కిరాయి మూకతో పెద్ద ఊరేగింపు కూడా తీయిస్తే హిందువులు నోరు మూసుకుని బుద్ధిగా పడి ఉండవచ్చు కదా?
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికీ ఇచ్చి ఉండవచ్చు. అలాగని విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వంటి హిందూ మతోన్మాద ఫాసిస్టు సంస్థలు అలాంటి ప్రజాస్వామిక హక్కును తమ చేతిల్లోకి తీసుకుంటే ఎలా సహించగలం? హిందుత్వం వాలాలు శాంతియుతంగానే గుమికూడి నినాదాలు ఇస్తూ ఉండి ఉండవచ్చు. వారి చేతిలో ఏ ఆయుధాలూ లేకపోవచ్చు. కేరళ నుంచి ప్రత్యేక వాహనాల్లో స్పెషల్ డ్యూటీ మీద రప్పించిన బంగ్లాదేశీ ముస్లింలూ, ఇతర దౌర్జన్య శక్తులే వారి మీద నిష్కారణంగా విరుచుకుపడి నానా ఆగం చేసి ఉండవచ్చు. ఆ దాడిలో 70వ ఏడు దగ్గరపడ్డ ఒక పరువుగల వి.హెచ్.పి. నాయకుడి ప్రాణం పోయి ఉండొచ్చు.
కాని - దాడి జరిగింది హిందువుల మీద అయినప్పుడు దాన్ని ‘రెండు వర్గాల ఘర్షణ’ గానే చూడాలి అని సెక్యులర్ శాస్త్రం కదా? హిందూ సంస్థలు నిరసనకు దిగడంవల్లే నడిరోడ్డుమీద పెద్ద మనిషి ఖూనీ జరిగింది కాబట్టి తప్పు ముమ్మాటికీ ఆ సంస్థలదే; రెచ్చగొట్టబడిన ఉడుకు రక్తపు వారి కంటపడటంవల్లే కదా దురదృష్టవశాత్తు అతడి ప్రాణం పోయింది?
ఒకవేళ మైనారిటీ మతస్థుల మీదే ఇలాంటి దాడి జరిగి ఉంటే ఈపాటికి సెక్యులర్ మేధావులు రంకెలు వేసేవాళ్లు. సాహిత్యకారులు అరిగిపోయిన చచ్చు అవార్డులను వెనక్కిచ్చేవారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక హిందూ ఫాసిజాన్ని ఖండిస్తూ సంపాదకీయం రాసేది. దాడి జరిగింది హిందువుల మీద కాబట్టి, మరణించినవాడు హిందూ సంస్థ ప్రముఖుడు కాబట్టి దాని గురించి మాట్లాడటం మర్యాదస్తులకు నిషిద్ధం. టిప్పును ఒప్పుకోని హిందువుల అసహనానే్న పవిత్ర సెక్యులరిస్టులు ఎంతసేపూ ఖండించాలి... హిందువులను నిరసన అయనా తెలపనివ్వని అన్యుల అసహనాన్ని పట్టించుకుంటే సెక్యులర్ మడి చెడుతుంది. గిరీష్‌కర్నాడ్ అనే సెక్యులర్ దేశభక్తుడిని ఎవడో కడుపు మండినవాడు ట్విట్టర్‌లో బెదిరించాడన్న కబురే ఈ మొత్తం ఉదంతంలో పత్రికలకు పతాక శీర్షిక.
ఇండియన్ బ్రాండు సెక్యులరిజం జిందాబాద్!
సేకరణ: ఆంధ్రభూమి దినపత్రిక 14-11-2015