సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని అహస్సు అని, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండే కాలాన్ని రాత్రి అని అన్నారు ఋషులు. అహస్సు+రాత్రి కలిపితే, అహోరాత్రము, అంటే ఒక దినము (రోజు). అహర్నిశలు శ్రమిస్తున్నాడు అని అంటారు, అంటే పగలనల, రాత్రనక శ్రమిస్తున్నాడని అర్దం. అహర్నిశ అనేది కూడా రోజునే సూచిస్తుంది. ఆ అహోరాత్ర అనే పదంలో హోరా ను విడదీసింది మనవారే. ఒక రోజును తొలుత 24 హోరలుగా భాగించారు. లేదా ఒక రోజంటే 24 హోరలు అని అర్దం.
నిజానికి ఈ హోర పదం వైదిక జ్యోతిష్యంలో కనిపిస్తుంది. పరాశర మహర్షి హోరా శాస్త్రాన్ని రచించారు. అది బృహత్ పరాశర హోరా శాస్త్రంగా ప్రసిద్ధి. పరాశరుడు భగవాన్ వేదవ్యాస మహర్షి తండ్రిగారు. మహాభారత కాలానికి ముందువారు. అనగా క్రీ.పూ. 3000 ఏళ్ళ నాటికి ముందు నుంచి జీవించి ఉన్నవారు. వారి జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. వారి కంటే మునుపే లోమశ సూత్రాలు లేదా గర్గ హోరా మొదలైన గ్రంధాలు మనకు లభ్యమవుతున్నాయి. ఇంకా వెనక్కు వెళితే, భృగు మహర్షి రాసిన నాడి గ్రంధాలు, అగస్త్య మహర్షి రాసిన నాడీ గ్రంధాలు కనిపిస్తాయి. ఇంకా వెనక్కుడు వెళితే మనుస్మృతిలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమవుతున్నాయి. గ్రహగతుల కాలం, మానవ జీవనానికి సంబంధం గురించి అందులో ప్రస్తావన ఉంది. దేవతలకు ఒక రోజు మానవలోకంలో 1 సంవత్సరానికి సమానం అని అందులో చెప్పబడింది. ఇది ఆనాటికే మనవద్ద ఉన్న శాస్త్రీయ దృష్టిని, సాంకేతికతను సూచిస్తోంది. ఈ హోరా అనే పదాన్ని యధాతధంగా లాటిన్ వారు స్వీకరించారు. ఈ హోరా అనే పదం నుంచి 'అవర్' (Hour) అనే పదం వచ్చింది. ఈ హోరా అనే పదం నుంచి కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రమైన హోరాలజీ (Horology) వచ్చింది.
ఈ హోరలను ఆధారంగా చేసుకునే వారాలకు నామాలను పెట్టడం జరిగింది. ఏ హోరలో సూర్యోదయం అవుతుందో, ఆ రోజుకు ఆ నామం పెట్టడం జరిగింది. ప్రతి హోరకు, కాలంలో దానికున్న లక్షణాలను అనుసరించి, ఒక గ్రహ నామం పెట్టడం జరిగింది. ఏ హోరపై ఏ గ్రహం ఆధిపత్యం కలిగి ఉంటుందనేది ఆ గ్రహం తన కక్ష్యలో రాశి చక్రం చూట్టు ఎంత వేగంతో తీరుగుతుందనే దాన్ని అనుసరించి ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. శని అన్నిటికంటే తక్కువ వేగం కలిగినది కనుక అది మొదట వస్తుంది, ఆ తర్వాత గురువు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు వస్తాయి.
ఆదివారంతో ప్రారంబిద్ధాం ఎందుకంటే సూర్యుడు ఈ భూమికి అత్యంత ముఖ్యమైన గ్రహం మరియు ఆత్మకారకుడు, జ్ఞానదాత. రోజులో 24 హోరలు ఉండగా, మొదటి హోర రవితో ప్రారంభమైనది కనుక దానికి రవి వారం అని పేరు, ఆయనే ఆదిత్యుడు, కనుక మనం ఆదివారం అంటున్నాం. ఆదివారంలో సూర్యోదయానికి ఉండే హోరకు ఆధిపత్యం రవిది కాగా, తర్వాత శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఆ తర్వాత శని, గురువు, అంగారకుడు. ఇప్పటికి 7 హోరలు అయ్యాయి. మళ్ళీ 8 వ హోర రవిదే అవుతుంది. అ తర్వాత క్రమంగా 9 కి శుక్రుడు, 10 బుధుడు, 11 చంద్రుడు, 12 శని, 13 గురువు, 14 కుజుడు, 15 సుర్యుడు, 16 శుక్రుడు, 17 బుధుడు, 18 చంద్రుడు, 19 శని, 20 గురువు, 21 కుజుడు. ఇక్కడికి మూడు సార్లు ఈ వరుస క్రమం వచ్చింది. ఇప్పుడు 22వ హోరకు రవి, 23 శుక్రుడు, 24 బుధ హోర అయింది. 24 హోరలతో రోజు పూర్తవ్వగా, ఆ క్రమంలోనే తదుపరి హోర, 25 వ హోరకు చంద్ర హోర అవుతున్నది. అప్పుడే సూర్యోదయం అవుతోంది. అందువలన ఆ వారానికి ఇందువాసరమని, సోమవారమని పేరు. ఇందుడు, సోముడంటే చంద్రుడు. శివుడికే ఇందుకళాధరుడని, సోమశేఖరుడనే నామాలు ఉన్నాయి కదా. కుజుడు అంటే మంగళుడు, కుజ హోరతో మొదలైనవారం మంగళవారం, భౌమవారం, బుధహోరతో మొదలయ్యేది బుధవారం లేదా సౌమ్యవారం, గురు హోరతో ప్రారంభమయ్యేది గురువారం, శుక్రాధిపత్య హోర తో సూర్యోదయమైన వారం శుక్రవారం, సంస్కృతంలో భృగువారం, శనిహోరతో ప్రారంభమయ్యేది శ్థిరవారం, లేదా మందవారం, అదే మనం శనివారం అంటున్నాం. ఇలా ఈ చక్రం నిత్యం పరిభ్రమిస్తూనే ఉంటుంది. అలా మనకు వచ్చినవే ఈ 7 వారాలు. సప్తగ్రహాలకు సూచిక అవి. రాహూకేతువులు ఛాయా గ్రహాలు, జ్యోతిష్యంలో రాశి చక్రంలో వాటికి సొంతంగా ప్రత్యేక స్థానం ఉండదు. అందుకే ప్రతి రోజులో రాహువుకు ఆధిపత్యం ఉన్న కాలానికి రాహుకాలమని, కేతువు ఆధిపత్యం కలిగిన కాలాన్ని యమగండమని పిలుస్తున్నారు. ఏ హోరలే ఏ పని చేస్తే మంచిదనేది, ఏది చేయకూడదనేది కూడా జ్యోతిష్యం వివరించబడి ఉన్నది, కాని మనకు ఇప్పటికి అప్రస్తుతం.
To be continued .....................
ఈ రచనకు ఉపకరించిన వెబ్‌సైట్లు
http://www.hinduvedicastro.in/blog/how-the-west-stole-weekdays-from-india/
http://www.astrojyoti.com/horapage.htm