Sunday, 20 November 2016

హిందూ ధర్మం - 229 (జ్యోతిష్యం - 11)



తిధుల గురించి గత భాగాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు వారాల గురించి తెలుసుకుందాం. వారం అంటే 7 రోజులు. కాలమానాన్ని వారాలుగా విభాగం చేసి గణించిన ఘనత మన ఋషులకే చెల్లింది. నేడు ప్రపంచమంతా కాలగణనలో వారమంటే 7 రోజులుగానే స్వీకరిస్తోంది. ఈ పద్ధతి మన సనాతన సంస్కృతిలో సృష్ట్యాది నుంచి ఉంది. తిధికి, వారానికి తేడా ఉంది. తిధి చంద్రుని గమనంతో సంబంధం కలిగి ఉంటే, వారం (రోజు / Day) సూర్య సంబంధమైనది. ఉదయాద్ ఉదయం వారః అని అంటుంది శాస్త్రం. అంటే ఒక సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం మధ్య కాలమే వారం. ఇక్కడ వారమంటే రోజు అని అర్దం. ఏడువారాల నగలంటే వారంలో 7 రోజులు ధరించే ఒక్కో రకమైన నగలనే అర్దంవస్తుంది కానీ 7 ను 7తో హెచ్చిస్తే (7x7) వచ్చే 49 రోజులకు సరిపడే నగలని కాదు. ఈ ఏడువారాలు అనేమాట కూడా ఆ వారం నుంచి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం సనాతంధర్మంలో జ్యోతిష్యం ఆధారంగా ఒక రోజు మారిందని లెక్కించాలంటే సూర్యోదయన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. సూర్యోదయం మార్పుకు సంకేతం. ఒక్క ప్రకృతిలోనే కాదు, ఈ భూమిపై జరిగే అన్ని క్రియల్లోనూ మార్పు సంభవిస్తుంది. సూర్యుడు హారిజోన్ దాటగానే శరీరంలో ప్రాణశక్తి పైకి వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఊపిరిలో మార్పు కనిపిస్తుంది. అప్పటివరకు నిలకడగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా సనన్ని గాలులు వీయడం ప్రారంభవుతుంది. ఆ గాలులు ఎంతో శక్తిని, ఆరోగ్యాన్నిస్తాయి అంటుంది ఆయుర్వేదం. అందుకే సూర్యోదయానికి ముందే లేవాలి. అదేకాక ఆ సమయం శరీరశుద్ధికి ఎంతగానో అనువైనది, ఎందుకంటే ఆయుర్వేదపరంగా రాత్రి ముగుస్తున్న సమయం (సుర్యోదయానికి పూర్వం) వాతానికి చెందిన సమయం. అందుకే అప్పటికే లేచి మలమూత్ర విసర్జన ముగించాలి, తద్వార శరీరం లోపల శుద్ధి చేసుకోవాలి, ఆ తర్వాత స్నానం చేసి బాహ్యశుద్ధి చేసుకోవాలి, ప్రాణాయామది క్రియలు చేసి, ప్రాణశుద్ధి, సంధ్యావందానికి సిద్ధమై, జపం చేసి మనస్శుద్ధి చేసుకోవాలి. పసిపిల్లలు, జంతువులు, పక్షులు సైతం ప్రకృతిలో కలిగే ఈ మార్పును ముందే గ్రహించగలుగుతాయి, తమను తాము ఆ మార్పుతో సమన్వయం చేసుకోవడం కోసమే తెల్లవారుఝామునే మేల్కోంటాయి. కానీ అన్ని తెలుసనుకున్న, ఇంగ్లీష్ విద్యలు బాగా అబ్బిన చదువుకున్న 'అవిద్యావంతులు' మాత్రమే ఆ సమయంలో గురకపెట్టి నిద్రపోతారు. పైగా తమ ఇంట్లో పసిపిల్లలు ఆ సమాయనికి మేల్కోంటే, వాళ్ళని కూడా నిద్రబుచ్చి, ఆ పిల్లలకున్న ప్రాకృతమైన జ్ఞానం కంటే తమకున్న అజ్ఞానమే గొప్పదాని వాడి మీద కూడా రుద్దుతారు. పక్షులు, జంతువులు కూడా ఈ సమయానికి మేల్కొని తమ శరీరాలు బయట ప్రపంచంలో ఉండే ప్రాణశక్తిని గ్రహించేందుకు సిద్ధం చేసుకుంటాయి. ఇది విశ్వంలో సహజంగా ప్రతి రోజు కలిగే మార్పు.

అదే అర్దరాత్రి 12 గంటలకు ఏ మార్పూ కలగదు. పైగా అది నిశాచర జీవులు తప్ప మిగితా అన్ని జీవాలు తప్పక నిద్రించాల్సిన సమయం అంటుంది మన శాస్త్రం. ఆ సమయంలో శరీరం ఉదయం కోల్పోయిన శక్తిని పొందుతుంది, అలసిన శరీర భాగాలు తిరిగి శక్తివంతమయ్యేలా ఓజస్సు ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో జీవక్రియలన్నీ చాలా నెమ్మదిస్తాయి. అసలు ఆ సమయంలో మెల్కొనకూడదు. అలాంటిది రాత్రి 12 కు రోజు మారుతుంది అంటారు పాశ్చాత్యులు. ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే, వాడిని ఆ సమయం వరకు నిద్రపోనివ్వరు, లేదా నిద్రపోయినా, ఫోన్ చేసి, వాడి నిద్ర చెడగొట్టి శుభాకాంక్షలు చెప్తారు. అవి శుభాకాంక్షలా? లేక ఆరోగ్యానికి అశుభాకాంక్షలా? ఎవరికైనా ఒకరి మీద ప్రేమ ఉంటే, వాడు నిద్రపోతున్నాడు, లేపకండి, గట్టిగా శబ్దాలు చేయకండి అంటారు. అంతేకానీ ఇదేంటో, మనం ఎక్కడి నుంచి చూసి తలకు ఎక్కించుకున్నామో కానీ, ప్రాణస్నేహితుడని హాయిగా నిద్రపోతున్నవాడిని సైతం పుట్టిన రోజని ఆకాశం ఊడిపడ్డట్టు నిద్రలేపుతారు. న్యూ ఇయర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అది ప్రపంచ తాగుబోతుల దినోత్సవం ............. అధికారికంగా ప్రకటించకపోయినా. జీవక్రియలు నెమ్మదించే సమయమని ముందే చెప్పుకున్నాం కదా, అయినా అలాంటి సమయంలో వీళ్ళు కేకులు తిని, మందు కొట్టి వేడుకలు జరుపుకుంటారు. ఆరోగ్యం నోట మన్ను కొడతారు, పటాసులు కాల్చి మిగితా జీవాల నిద్ర చెడగొడతారు. అది ఏ మార్పూ కలగని సమయం. కానీ వారికి రోజు మారుతుంది !? మారిందా? మారిందనుకుంటున్నారా?

అంటే మనం గమనించాల్సింది మన ధర్మంలో రోజు మార్పంటే నూతన శక్తి, నూతన ఉత్తేజం. మన ధర్మంలో మార్పు అంటే ఎవరో మనుష్యులు నిర్ణయించేది కాదు, ఈశ్వరుడు నిర్ణయించినది, ప్రకృతిబద్ధమైనది. పాశ్చాత్యులు వారి రోజు మార్పును నిద్రలోనో, మత్తులోనో ఆహ్వానిస్తే, హిందువులు మాత్రం దానికి సిద్ధపడి ముందే స్వాగతం పలుకుతారు. అది సుప్రభాతం.

To be continued .............

2 comments:

  1. వారం అంటే రోజు అని అర్థం చెప్పారు. నిజానికి వారం అన్న మాటకు తడవ అని అర్థం ఇక్కడ. అంటే repetition అన్న మాట. స్మరవారంవారం చేతః స్మర నంద కుమారం అన్న కీర్తనలో వారం అన్న మాటకు అర్థం అదే. రోజునకు ఒకసారి నందకుమారుణ్ణి తలచుకోమని చెప్పటం కాదు. పదేపదే తలచుకోమని చిత్తానికి చెప్పటం జరిగిందక్కడ.

    ReplyDelete
  2. ప్రతిరోజున నాలుగు సంధ్యాసమయా లుంటాయి. అందరికి సులువుగా తెలిసేవి ఉదయ అస్తమయసంధ్యలు. ఇవి కాక మరి రెండు సంధ్యలున్నాయి. మధ్యాహ్న సంధ్య అనేది ఒకటి కొంచెం స్తోత్రాలు వగైరా చదివే వారికి పరిచయంగానే ఉంటుంది. 'త్రిసంధ్య' అన్న పదం కూడా వాటికారణంగా తెలుస్తుంది. సంధ్యావందనం చేసేవారు ప్రాతః, మాధాహ్నిక, సాయం సంధ్యలు మూడిటినీ ఉపాసిస్తారు. అర్ధరాత్రమూ సంధ్యాసమయమే - అదే నాలుగవసంధ్య. అందరూ నిదురించే ఆసమయంలో సంధ్యోపాసన ఉండదు. మాధ్యాహ్నిక అర్థరాత్రాలను నతోన్నతములని జ్యోతిషంలో వాడుకచేస్తారు. అర్థరాత్రానికి గుర్తింపు లేదనుకోవటం పొరపాటు.

    ReplyDelete