నాకు ధరిత్రీ దినోత్సవం అనగానే భూదేవి, వరహాస్వామి గుర్తుకువస్తారు. స్వార్ధపరుడైన హిరణ్యాక్షుడు భూదేవిని రసాతలానికి తీసుకువెళ్ళి, బంధిస్తే, శ్రీ మహావిష్ణువు వరహారూపంలో అవతరించి, భూదేవిని ఉద్ధరించారు. హిరణ్యాక్షుడిని సంహరించారు. అక్కడ ఉద్భవించిన వరాహం మామూలు వరాహం కాదు, అది దివ్య వరాహం, యజ్ఞవరహాం. ఆయన రూపమే యజ్ఞస్వరూపం. అక్కడ జరిగిన యుద్ధంలో వాడబడిన అస్త్రాలు కూడా అలాంటివే. ఇది నేను ఒకసారి మా గురువుగారి ప్రవచనంలో విన్నాను. ఆ ఘట్టాన్ని సరిగ్గా అర్దం చేసుకుంటే, అప్పుడు ఒక్కడే హిరణ్యాక్షుడు ఉండేవాడు, ఇప్పుడు ప్రతివాడిలో ఒకడు ఉన్నాడు. స్వార్ధ చింతన పెరిగిపోయింది. 'ఈ లోకంలో చలించేది, చలించనిదంతా ఈశ్వరమయమై ఉంది. అందువల్ల భోగ బుద్ధితో కాక, త్యాగబుద్ధితో చరించి, జీవించండి' అని ఉపనిషత్తు ఆదేశించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే భూగోళం, వనరుల వినియోగంలో త్యాగబుద్ధికి బదులు భోగబుద్ధి ప్రవేశించి సమస్తమూ దుర్వినియోగం చేస్తున్నాం, అతివినియోగం చేస్తున్నాం. తర్వాతి తరాలకు అందకుండా చేస్తున్నాం, ఈ భూమిపై మనకు ఏ అధికారం లేదు, కేవలం జీవించే అవకాశం మాత్రమే ఉందని, అది కూడా ఈశ్వరుని కరుణ కారణంగానేనని మర్చిపోతున్నాం. అందుకే ఈనాడు ప్రపంచంలో భూమి, నీరు, వాయువు, ఆకాశం, ప్రజల మనసులు సహా సర్వం కలుషితమైపోయింది.
ఇప్పుడు మనం వరాహస్వామి అవతార ఘట్టం గుర్తుకుతెచ్చుకుని మన మార్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూమిపై భోగబుద్ధితో కాక, త్యాగబుద్ధితో చరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఏప్రియల్ 22 న ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటోంది కానీ నిజానికి సనాతన ధర్మాన్ని పాటించేవారికి వరాహస్వామి అవతరించి, భూమాతను ఉద్ధరించిన రోజే ధరిత్రీ దినోత్సవం. వరాహజయంతియే నిజమైన ధరిత్రీ దినోత్సవం (Earth Day). మన గత చరిత్రను మనం స్మరించాల్సిన రోజది. మనకు అది గుర్తుకులేదు, కనీసం ఈరోజైనా గుర్తుకు తెచ్చుకుందాం.
No comments:
Post a Comment