ప్రకృతిలో అనేక రకాలైన జీవులున్నాయి. ఉదాహరణకు బాక్టీరియా, క్రిములు, పక్షులు, చెట్లు, జంతువులు, మానవులు. ఈ భూమిపైన ఇన్ని రకాల జీవులు వుండవలసినదే. ఎందుకంటే జీవులన్నీ పరస్పరం ఒకదానిమీద ఒకటి ఆధారపడ్డాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక జాతిజీవి నశిస్తే అనేక జీవులు నశించే ప్రమాద ముంది. రైతుల నిత్య జీవితానికి సంబంధించిన రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం.
మినుము, పెసర, జనుము వంటి మొక్కల వేళ్ళలో బుడిపెలు వుంటాయి. అవి నత్రజని నిల్వలు. భూమికి కావలసిన నత్రజనిని ఆ వేళ్ళు అందిస్తాయి. కాని ఆ వేళ్ళలో నత్రజని బుడిపెలు తయారు కావాలంటే భూమిలో ఒక రకమైన బాక్టీరియా, ఆ వేళ్ళుద్వారా మొక్క విసర్జించే పదార్థాన్ని తిని నత్రజని బుడిపెలను తయారుచేస్తాయి. అలాగే వానపాములు భూమిని నిరంతరం గుల్లగా వుంచుతాయి. దానివలన ఆ భూమి ఎంత వాననీటినైనా పట్టి వుంచగలుగుతుంది. రైతులు చీడపీడల నివారణకు ప్రకృతి సిద్ధమైన పద్ధతులు అవలంబించక, రసాయనిక మందులను అధిక మోతాదులో వాడితే, ఆ మందులు వానకు భూమిలోకి ఇంకి ఆ బాక్టీరియాను, వానపాములను చంపుతాయి. దానివలన ప్రకృతి సహజసిద్ధంగా భూమిలో వుండే నత్రజని ఎరువును ఆ భూమిలో వేసినా, భూమి స్వీకరించలేని పరిస్థితి వస్తుంది. అలాగే వానపాములు చచ్చిపోతే నేల గట్టిపడి, వాననీరు భూమిలోకి ఇంకలేక వృధాగా పోతుంది. ఈ రెండింటి వలన భూమి సేద్యానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇది తీవ్రమైన ఆహార కొరత సమస్య సృష్టిస్తుంది. అంటే మానవాళి మనుగడయే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉదాహరణకు అమెరికాలో 1949-68 మధ్య రసాయనిక మందుల వినియోగం, వాటి వలన రసాయనిక నత్రజని వినియోగం 40శాతం పెరిగింది. దానిని భూమిసరిగా తీసుకోలేక పోవడం వల్ల అది నైట్రేట్ రూపంలో కాలువలు, చెరువుల లోకి చేరి ఆ నీరు కలుషితమయింది.
మరి రసాయనిక మందులు అతిగా వాడకుండా చీడపీడల నివారణ ఎలా? ప్రకృతిలోనే అనేక కీటకాలు చీడపురుగులను ఆహారంగా కలిగినవి వున్నాయి. వాటిని పెంచి చేలలో వదిలితే చాలు, సస్యరక్షణ అద్భుతంగా జరుగుతుంది. ఇటీవల మన పత్రికలలో చీడపురుగులను కీటకాలు ఆహారంగా స్వీకరిస్తున్న దృశ్యాలు ప్రచురించి, మనకు అవగాహన కలిగించాయి. ఈ పద్ధతిని రైతులలోకి విస్తృతంగా తీసుకు వెళ్ళాలి.
కాబట్టి జీవవైవిధ్యం నాశనమయితే పర్యావరణం పెను ప్రమాదంలో పడుతుంది. అదొక్కటే కాదు. కార్బన్‌డయాక్సైడ్, మిథన్, క్లోరోఫ్లోరా కార్బన్ వంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగించే వాయువుల వలన కూడా గ్లోబల్ వార్మింగ్ జరిగి పర్యావరణ ప్రమాదం పెరుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్‌కి ప్రధానంగా పరిశ్రమల నుండి వెలువడే కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు 23శాతం, విచక్షణా రహితంగా చేసే అడువుల నరికివేత మరో 23శాతం కారణాలవుతున్నాయని శాస్త్రజ్ఞుల అంచనా.
కాబట్టి పర్యావరణం, తద్వారా ఈ భూమి, సంరక్షింపబడాలంటే జీవ వైవిధ్యం కాపాడబడాలి. గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల తగ్గించబడాలి. కాని వాస్తవంగా ఏం జరుగుతోంది? పారిశ్రామిక అభివృద్ధి ఫలాలన్నీ అనుభవిస్తున్న అమెరికా, అభివృద్ధి కారణంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పట్టించుకోవడం లేదు. ఈ అమానుష చర్య అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ కాలం నుండి చేపట్టబడింది.
జార్జివాషింగ్టన్ 1779 మార్చి 31న సైనికాధికారి జనరల్ సల్లివాన్‌కు ఈ క్రింది విధంగా ఆదేశాలిచ్చాడు. ''మీరు శతృవులైన ఆరు స్థానిక ఇండియన్ జాతులను అదుపు చేయండి. దీనికి గాను వారి పంటలను పొలాల్లోనే నాశనం చేయడం అవసరం. ఇతర పంటలేవీ పండించ బడకుండా చూడాలి.'' (అయ్యో భూగోళం, పేజీ 29) అంతే! వాషింగ్టన్ ఆదేశాల మేరకు ఏ ఒక్క మొక్కనూ వదలకుండా వలస సైనికులు ధ్వంసం చేశారు. ఎంతగా ధ్వంసం చేశారంటే ''నయాగరా ప్రాంతంలో గతంలో ఇండియన్ జాతులు నివసించి వుండేవనేందుకు ఆధారాలైన వారి ఆహార పంటలు లేకుండా నాశనం చేశాము'' అని సల్లివాన్ తన నివేదికలో పేర్కొన్నాడు.
ఇక వియత్నాం యుద్ధంలో విజయానికి ఆమెరికా అనుసరించిన వ్యూహం పర్యావరణ యుద్ధం. అడవులను సర్వనాశనం చేయడం, విషపూరితమైన రసాయనాలను ప్రయోగించడం అనే పద్ధతులు అవలంబించబడ్డాయి. విషరసా యనాలను ప్రయోగించడంలో ముఖ్య బాధ్యతల్లో వున్న ఒక అధికారి 1984లో ఇలా రాశారు.
''అమెరికా అనుసరించిన రసాయన యుద్ధంలో కోట్లాది మొక్కలు, వృక్షాలు చనిపోవడమే కాక నేటికీ పచ్చగడ్డి మొలకెత్తని ప్రాంతాలున్నాయి. నేలలోని పోషక జీవులు అంతరించడంతో ఆ నేల నిస్సారమైంది. వన్య మృగాలు అదృశ్యమయ్యాయి. జలచరాల ఉనికి మాయమైంది. కాలక్రమంలో వింత రూపాలతో శిశువుల జననం లాంటి దీర్ఘకాల ప్రభావాలకు ఈ యుద్ధం కారణమైంది.'' విశేషమే మంటే రసాయనిక యుద్ధానికి సైన్యాధికారులు వెనుకాడినా, అధ్యక్షుడు కెనెడీ పూర్తిగా ప్రోత్సహించాడు.
నికరాగ్వాలో కూడ శాంతినిష్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ప్రతీఘాత సైన్యాన్ని ప్రోత్సహించింది. ఈ సైన్యం పంట చేలపైన దాడికి దిగింది. 75 మందికి పైగా పర్యావరణ శాస్త్రజ్ఞులను కిడ్నాప్ చేయడం గాని, చంపడం గాని చేసింది. నికరాగ్వా రైతులకు విత్తనాలు సరఫరా చేసే ప్రధాన విత్తనశుద్ధి సేకరణ కేంద్రంపై దాడి చేసింది. ఇదీ ఆదేశ పర్యావరణంపై దాడి జరిగిన తీరు!
ఇక రీగన్ పరిపాలనా కాలంలో అమెరికా ప్రభుత్వం పథకం ప్రకారం పర్యావరణ పరిరక్షణ చట్టాలను తుంగలో తొక్కి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది. పర్యావరణ ప్రమాణాలు పరిశీలించే కౌన్సిల్‌లో ఉద్యోగులందరినీ రీగన్ తొలగించాడు. పర్యావరణ పరిరక్షణ సంస్థ ఉద్యోగులను నాల్గవవంతుకి తగ్గించాడు. బడ్జెట్‌లో పర్యావరణ పరిరక్షణకి కేటాయింపులు మూడో వంతుకీ, పరిశోధనల కోసం సగానికీ కోత విధించాడు. ఇటువంటి చర్యల కారణంగా బహుళజాతి సంస్థలు పర్యావరణాన్ని నాశనం చేసే చర్యల్లో అమితోత్సాహంగా ముందుకెళుతున్నాయి.
ఈ విషయంలో మన ప్రభుత్వాలు కూడా అమెరికా సామ్రాజ్యవాదానికీ, బహుళజాతి గుత్తసంస్థలకూ అనుకూలంగా వ్యవహరి స్తున్నాయి. జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే బిటి విత్తనాలకు ఎర్రతివాచీ పరచడం వంటి పనులు చేస్తున్నాయి. బిటి విత్తనాలు, వాటితో వ్యవసాయం చేసే చేలలోనే కాకుండా, వాటి పుప్పొడి పాకినంత మేర, విత్తనాల పునరుత్పత్తి లేకుండా చేస్తుంది. దానితో మరుసటి సంవత్సరం విదేశీ కంపెనీవారి విత్తనాలను పక్కచేల రైతులు కూడా కొనకతప్పని పరిస్థితి వస్తుంది. కొంతకాలానికి దేశమంతా విదేశీ కంపెనీల విత్తనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశీ విత్తనాలు లేకపోతే మనకు మనుగడ లేని పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా బిటి విత్తనాలు మన స్వాతంత్య్రాన్ని హరించి, మనల్ని అమెరికాకి బానిసల్ని చేస్తాయి. ఇది నా ఊహకాదు. అమెరికా వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి ఎర్లబట్జ్ స్వయంగా అన్నమాట. ఆయనేమన్నాడంటే ''ఒకవేళ ఆహారాన్ని ఆయుధంగా వాడుకోదలిస్తే, సంతోషంగా దాన్ని మేం వాడుకుంటాం''. అమెరికా ఆ ప్రయత్నంలో ముందడుగు వేస్తుంటే, మన ప్రభుత్వం దానిపట్ల ఉదాసీనంగా ఉంటోంది. ఇది క్రమంగా బానిసత్వానికి దారితీయదా?
మన ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణపై ఎంత చిన్న చూపంటే, ''ఔషధ పరిశ్రమలు ఉత్పత్తి చేసి విక్రయించే రసాయనాల మొత్తం టర్నోవర్‌పై 1శాతం పన్ను విధించి దాన్ని పర్యావరణ సంస్థల వద్ద డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల క్రితమే ఆదేశించింది. కాని ఈ ఆదేశాన్ని అమలు పరచడంలో ప్రభుత్వాలు ఇప్పటివరకూ శ్రద్ధ చూపడమే లేదు.
కాబట్టి దేశభక్తులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, పర్యావరణ విధ్వంసకారు లెవరు? వారి తైనాతీలెవరు? అనే విషయాలను ప్రజలకు వివరించి, మన భూమిని కాపాడుకొనే చర్యలను ముమ్మరం చేయాలి. భావితరాలకు పచ్చనైన భూమిని వారసత్వంగా అందజేయాలి.
కె.ఎల్. కాంతారావు
సెల్: 9490300449
సేకరణ:
http://www.navatelangana.com/article/net-vyaasam/36515