Friday, 30 June 2017

ఈ విషయంలో వారిని ఆదర్శంగా తీసుకుంటేనే ధర్మం నిలుస్తుంది.



భారతదేశంలో 100 కు పైగా పార్శీల దేవాలయాలు ఉన్నాయి. అందులో ముంబాయిలోనే 40 ఉన్నాయి- అక్కడ అగ్ని జ్వాల ఎప్పుడూ ఆరదు. వాళ్ళు కూడా అగ్ని ఆరాధకులు. అగ్ని జ్వలించడానికి కొంత గంధవు చెక్కను వాడినా, అధికంగా బబూల్ చెట్టు చెక్కను వాడతారు. ఎందుకంటే బబూల్ చెక్క ఎక్కువసేపు మండుతుంది, మెల్లిగా కాలుతుంది, అగ్ని చాలాసేపు ఉంటుంది. ఈ కారణంగా బేకరీలు మొదలైనవి కూడా వెంట చెరుకుగా బబూల్ చెక్కనే వాడుతున్నారు. దీంతో గత దశాబ్దంలో బబూల్ చెక్క ధర 5 రెట్లు పెరిగింది. ఇలా ధర పెరగడం గురించి ఆందోళన చెందిన పారశీలు తమ స్థలాల్లో బబూల్ వృక్షాలను పెంచుతున్నారు. ఇది గుజరాత్ లో మొదలైంది, ఇప్పుడు ముంబాయిలో కూడా మొదలవుతోంది. దేశవ్యాప్తంగా దీన్ని ఆచరణలోకి తెచ్చి, తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నట్లు వార్తపత్రికల్లో వచ్చింది. వారి జనాభ దేశంలో 66,000 మాత్రమే ఉంది. అయినా వారికి ఎంత నిబద్ధత.

దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. మనకు కొన్ని పవిత్ర వృక్షాలున్నాయి. కొన్ని రకాల వృక్షాల చెక్కలనే యజ్ఞంలో సమిధలుగా వినియోగిస్తారు. ఏ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏ సమిధ వాడితే ఫలితం ఉంటుందో శాస్త్రం నిర్దేశించింది. కానీ చాలామటుకు అవి లభ్యమవ్వడం లేదు. దానికి ప్రధానమైన కారణం వృక్ష సంపద తగ్గిపోవడం. అడవులు కూడా వేగంగా తరిగిపోతున్నాయి, కాదు అభివృద్ధి పేరుతో అడవితల్లిని నాశనం చేస్తున్నాం. రోజుకు సగటున 108 అరుదైన ఆయుర్వేద మూలికలు, వృక్షాలు భారతదేశంలో అంతరిస్తున్నాయని ఒక అంచనా. పార్శీల జనాభా ఈ దేశంలో 0.006 % మాత్రమే ఉంది. కానీ హిందువుల జనాభా సుమారు 60%- 70% ఉండవచ్చు (మతమార్పిడి చేసుకున్నవారిని మినహాయించి). కానీ మనకు అలాంటి ప్రణాళికలేమీ లేవు, అసలలాంటి ఆలోచనే కలగదు. ధర్మాన్ని రక్షించండి, సంస్కృతిని కొనసాగించండి అంటాము, మరియు వాటికి అవసరమైన వాటిని మాత్రం నశింపజేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు చక్కని వర్షాలు పడుతున్నాయి. ఇదే మంచి సమయం. మనం మొక్కలు నాటాలి, మేడి, మోదుగ, జువ్వి, తెల్ల మద్ది, నల్ల మద్ది, మఱ్ఱి, రావి మొదలైన దేవతా వృక్షాలను నాటి పెంచాలి. అవి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడతాయి, ముందు భూమి చల్లబడుతుంది. మొక్కలు నాటడం వలన వచ్చే పుణ్యం గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం, వాటికి తోడు మనం నాటిని మొక్కలను సమధలుగా వాడితే, ఇంకా ఎంతో పుణ్యం కూడా దక్కుతుంది. అలా కాకుండా చాలా ఉన్నాయండి అని కబుర్లు చెబుతూ కూర్చుంటే, కొన్నాళ్ళకు చాలా కాస్త కొన్ని అవుతాయి, ఆ తర్వాత అంతరిస్తే, మనమే బాధపడాలి. అంతెందుకు మనం వృతం చేసినప్పుడు కలశం స్థాపిస్తాము. కలశంలో పంచపల్లవాలు (5 రకాల చిగుర్లు) వేయాలని శాస్త్రం చెప్పింది. మఱ్ఱి, రావి, మేడి, జువ్వి, మామిడి. అసలీ విషయం ఎంతమందికి తెలుసు? అంతెందుకు వినాయక చవితికి మనం అర్పించే పత్రిలో ఎన్ని పత్రాలు సరైనవి? అవి మన ఇంటి దగ్గర పెంచుకోలేమా? ఉగాదికి మార్కెట్ లో వేపపువ్వు దొరకడమే గగనమైపోయింది. మనమే ముందడుగు వేసి ఓ వేప చెట్టు పెంచలేమా? ఆఖరికి మామిడాకులు కూడా కొనుక్కునే దుర్భరమైన పరిస్థితి దాపురించింది. అందరికి మామిడాకులు, వేపపువ్వు కావాలి, కానీ ఎవ్వరూ వేప, మామిడి చెట్లు నాటరు. ఇలా చెప్పుకుంటే ఎన్నో.

మొక్కలు నాటి ఆయా జాతుల వృక్షాలను పెంచి, సంరక్షించడానికి ఇది అనువైన సమయం. మనమంతా ఆ దిశగా ఒక ముందడుగు వేస్తేనే భవిష్యత్తులో #ధర్మం నిలుస్తుంది, శాస్త్రీయమైన యజ్ఞ ప్రక్రియ నిలబడుతుంది. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః అని యజుర్వేదంలో శ్రీ రుద్రం కూడా అంటున్నది. వృక్షాల రూపంలో ఉన్న రుద్రునకు నమస్సులు, పచ్చని కొమ్మలు, రెమ్మలు, ఆకులు తన కేశాలుగా కలిగిన మహాదేవునకు నమ్మస్సులు అని అర్దం.

ఇది కూడా ఒక యజ్ఞమే. దీని గురించి కూడా కాస్త ఆలోచించండి. మరి మొక్కలు నాటి పోషిస్తారా?

No comments:

Post a Comment