Sunday, 18 March 2018

పంచాంగం కేవలం బ్రాహ్మణులకేనా?



పంచాంగం కేవలం బ్రాహ్మణులకేనా?

ఈ రోజు చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వచ్చాక, చాలామంది క్యాలెండర్ చూసుకునేది కేవలం సెలవులు ఎప్పుడొస్తాయాని తెలుసుకోవటానికే. ఎందుకంటే వారికి ఉండే పని ఒత్తిడి అలాంటిది. కానీ నిజానికి మనం పాటించేది క్యాలెండర్ కాదు, పంచాంగం.

పంచాంగం కేవలం బ్రాహ్మణులకు సంబంధించినది కాదు. అది ముహూర్తాల వరకే ఆగిపోదు. వండ్రంగివారు, మేస్త్రీలు, ముఖ్యంగా రైతులు ఈనాటికి పంచాంగం చూస్తారు. ఎప్పుడు నిర్మాణం మొదలుపెట్టాలి, కర్తరి ఎప్పుడు ఉంది అనేవి వడ్రంగి వారు చూస్తే, ఏ కార్తె ఎప్పుడు వస్తుంది, పంట ఎప్పుడు వేయాలి? ఏ నక్ష్త్రంలో పంట వేయాలి? అది ఊర్ధ్వముఖ నక్షత్రమా? అధోముఖమా? ఇలా ఎన్నో విషయాలను చూసి రైతు పంట వేస్తాడు. విత్తనం వేయడం దగ్గరే పంచాంగంతో పని మొదలవ్వదు. విత్తనాలు ఏ ఋతువులో సేకరించాలి, మేఘాలను, గాలిని, ప్రకృతిని పరిశీలించి రాబోయే కాలంలో వర్షాలు ఎలా ఉంటాయి మొదలైన ఎన్నో విషయాలు జ్యోతిష్యం చెప్పింది. కృషి పరాశరా మొదలైన గ్రంథాలు వీటి గురించి విపులంగా వివరిస్తాయి. అంతెందుకు ఈనాటికి చాలా ఊళ్ళకు వెళితే, ఏ చదువు రాని వారు కూడా పంచాంగం చూసి, ఏ కార్తెలో ఎంత ఎండ కాస్తుంది, వర్షం ఎప్పుడు పడుతుంది అనేవి చెప్పేస్తారు. వారేమీ బ్రాహ్మణులు కారు. అందులో మాలమాదిగలు కూడా ఉన్నారు. పంచాంగం అందరిది. ముఖ్యంగా కాయకష్టం చేసుకుని, ప్రకృతి పై నేరుగా ఆధారపడి జీవించే శ్రమజీవులది, కృషీవలులది, కర్షకులది.  

ప్రకృతి పులకించి, వసంతంలో చెట్లు చిగురించే సమయానికి ఉగాది వస్తుంది. అది ప్రకృతిలో నూతన ఆరంభానికి గుర్తు. అదే మన నూతన సంవత్సరం కూడా. అందుకే ఆ రోజు సాయంత్రం ఊళ్ళో అందరూ గుడి దగ్గరకు చేరుకున్నప్పుడు, ఆ ఊరి పురోహితుడు, అక్కడి రైతులను, శ్రమజీవులను ఉద్దేశించి పంచాంగ పఠనం చేస్తారు. అక్కడ కూర్చున్నవారు పంచాంగ పఠనం చేస్తారు. ఆ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా కాస్తాయి, ఏ పంట బాగుంటుంది, ఆ సంవత్సరానికి నవనాయకులు ఎవరు? మొదలైనవి ఆసక్తిగా వింటారు ప్రజలు. అయితే అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత కూడా ప్రజలు నిత్యం పంచాంగం చూస్తూనే ఉంటారు.  

కానీ గత 10-15 సంవత్సరాల నుంచి చాలా మంది రైతుల్లో ఈ జ్ఞానం కొరవడుతూ వస్తోంది. అందుకే రైతన్న ఢీలా పడుతున్నాడు. 

కాకపోతే ఇదే కాక మరో బాధాకరమైన అంశం ఏమిటంటే రాజకీయనాయకుల ఒత్తిడల వల్ల చాలామంది పంచాంగ కర్తలు అసలు విషయం చెప్పకుండా, ఉన్నవీ లేనివి కలిపి వారి మెప్పు కోసం పంచాంగం చెబుతున్నారు. పంచాంగం పరువు తీస్తున్నారు.

పాతతరం నుంచి కొత్త తరం పంచాంగం చూడటం నేర్చుకోవాలి. తద్వారా ప్రకృతిని ముందే గమనించి, అంచనా వేసి, ఇబ్బందులకు గురికాకుండా దేశానికి మంచి దిగుబడిని అందివ్వవచ్చు.

No comments:

Post a Comment