Tuesday, 13 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 4వ భాగము



గురువును అన్వేషించుట

ఒక మహాత్ముని సాన్నిధ్యంలో నీకు మనశ్శాంతి దొరికితే, అతని ప్రవచనాల వలన నీలో ప్రేరణ కలిగితే, అతను దురాశ, కోపం మరియు లౌల్యము నుంచి విముక్తుడై ఉంటే, అహంకారరాహిత్యం, స్వార్థంరాహిత్యం మరియు ప్రేమ కలిగి ఉంటే, అతన్ని నీవు గురువుగా స్వీకరించవచ్చు. ఎవరైతే నీకు కలిగే సందేహాలను నివృత్తి చేయగలరో, నీ సాధన పట్ల సానుభూతి చూపగలరో, నీ నమ్మకాలను భంగ పరచకుండా నీ స్థాయి నుంచే నీకు సహాయం చేయగలడో, ఎవరి యొక్క సాన్నిధ్యము చేతనే నీవు ఆధ్యాత్మికంగా ఉన్నతిని అనుభూతి చెందగలవో - అతనే నీ గురువు. ఒక్కసారి నీ గురువును ఎంచుకున్న తర్వాత, పరిపూర్ణంగా ఆయననే అనుసరించు. భగవంతుడు నిన్ను గురువుగారి ద్వారా నడిపిస్తాడు. 

గురువులు ఎంచుకోవడంలో అధికంగా నీ బుద్ధిని ఉపయోగించకు. ఒకవేళ నీవు గనక అలా చేస్తే నీవు విఫలమవుతావు. ఉన్నతమైన గురువును పొందడంలో విఫలమైతే, కొన్నేళ్లుగా సాధనాపథంలో నడుస్తూ, పరిశుద్ధత మరియు ఇతర సద్గుణాలు కలిగి, శాస్త్రాల పట్ల కొంత జ్ఞానం కలిగిన సాధువు దగ్గరికి వెళ్లి, అతని సూచనలను అనుసరించే ప్రయత్నం చెయ్యి. ఎలాగైతే ఎం.ఏ. పట్టా కలిగిన ఆచార్యుడు అందుబాటులో లేనప్పుడు, ఇంటర్మీడియట్ విద్యార్థి మూడవ తరగతి చదువుతున్న విద్యార్థికి చదువు చెప్పగలడో, ఎలాగైతే సివిల్ సర్జన్ లేని సమయంలో అతని సబ్-అసిస్టెంట్ సర్జన్ రోగి బాగోగులు చూడగలడో, అలాగే మొదటి శ్రేణి గురువు నీకు లభించనప్పుడు ఈ రెండవ శ్రేణి గురువు నీకు సహాయం చేయగలరు.

నీవు కనీసం ద్వితీయ శ్రేణి గురువులు కూడా పొందలేని పక్షంలో ఆత్మసాక్షాత్కారం పొందిన జగద్గురు ఆదిశంకరులు, దత్తాత్రేయ మరియు ఇతర మహాత్ములు రాసిన పుస్తకాలలో చెప్పిన బోధనలను అనుసరించవచ్చు. జీవన్ముక్తుడైన లేదా ఆత్మ సాక్షాత్కారం పొందిన అటువంటి గురువుల యొక్క చిత్తరువు/చిత్రపటం నీ లభ్యమైతే, నీ ముందు ఉంచుకొని దానిని భక్తివిశ్వాసాలతో పూజించు. క్రమంగా నీకు ప్రేరణ కలుగుతుంది, మరియు రైన సమయంలో గురువు స్వప్నంలో కనిపించి, దీక్ష ఇచ్చి, ప్రేరణ కలజేస్తారు. నిజాయితీగల సాధకులకు సహాయం అనేది చాలా గుహ్యమైన రీతిలో వస్తుంది.

No comments:

Post a Comment