శిక్షా గురువులు మరియు దీక్షా గురువులు
మానవులకు ఈ భూమి మీద రెండు రకాల కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, తన జీవితాన్ని పోషించుకొనుట/రక్షించుకొనుట. రెండవది ఆత్మను తెలుసుకొనుట. తన జీవితాన్ని కాపాడుకోనుట కోసం, ఉదరపోషణ కోసం విద్యాభ్యాసం చేయాలి. తన ఆత్మ సాక్షాత్కారం కోసం, అతను సేవ చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి మరియు ధ్యానం చేయాలి. ఏ గురువు అయితే తనకు భౌతిక ప్రపంచానికి సంబంధించిన విద్య నేర్పిస్తాడో, ఆయన శిక్షా గురువు. ఆత్మసాక్షాత్కారానికి మార్గం చూపిన గురువు దీక్షా గురువు. అతను నేర్చుకోవడానికి ఇష్టపడినంతవరకు ఒక వ్యక్తికి ఎంతమంది అయినా శిక్షా గురువులు ఉండవచ్చు. కానీ మోక్షానికి తీసుకువెళ్లే దీక్షా గురువు కేవలం ఒక్కరే ఉంటారు.
ఒకే గురువు కట్టుబడి ఉండుట
ఒక వైద్యుని వద్ద నుంచి నీవు ఔషధ నిర్ణయాన్ని తెచ్చుకుంటావు. ఇంకొక డాక్టర్ లేదా ఇద్దరు డాక్టర్లును సంప్రదించి, జబ్బు గురించి వారి ఆలోచనలు తెలుసుకుంటావు, లేదా వ్యాధి యొక్క విచారణ మరియు నిర్ధారణ చేసుకుంటావు. ముగ్గురు వైద్యుల దగ్గరికి వెళ్తే నీ చావును నీవే కొని తెచ్చుకుంటావు. అలాగే నీకు అనేక మంది గురువులు ఉంటే, నీవు ఏమీ తోచక కొట్టుమిట్టాడుతావు. అసలు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురి అవుతావు. ఒక గురువు 'సోహం' మంత్ర జపం చేయమని చెబుతారు. ఇంకొకరు 'రామ' నామాన్ని జపించమంటారు. మూడవ గురువు 'అనాహత శబ్దా'న్ని వినమంటారు. నీవు సందిగ్ధానికి లోనవుతావు. ఒక గురువుకు మాత్రమే కట్టుబడి, ఆయన సూచనలను పాటించు.
అందరు చెప్పేవి విను, కానీ ఒక్కరినే అనుసరించు. అందరినీ గౌరవించు, కానీ ఒక్కరినే ఆరాధించు/పూజించు. అందరి నుంచి జ్ఞానం పొందు, కానీ ఒకే గురువు యొక్క బోధనలను అవలంబించు. అప్పుడు మాత్రమే నీవు వేగంగా ఆధ్యాత్మిక పురోగతిని చూస్తావు.
No comments:
Post a Comment