Saturday, 5 October 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 14 వ భాగము



నాలుగు రకాల శిష్యులు

ఉత్తమ శిష్యుడు వాయువేగంతో ఉంటాడు. ఎంతో దూరంలో ఉన్నప్పటికీ గురువు ఒక్క ఉపదేశానికి అతడు వెంటనే చురకగా స్పందిస్తాడు.

రెండవ రకం శిష్యుడు కర్పూరం వంటి వాడు. గురువు యొక్క స్పర్శ అతని అంంతరాత్మను జాగృత పరిచి, అతనిలో ఆధ్యాత్మికత అనే అగ్ని రగిలిస్తుంది.

మూడవ రకం శిష్యుడు బొగ్గు వంటివాడు. అతడిలో ఉన్న చైతన్యాన్ని జాగృతం చేయడానికి గురువు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

నాలుగవ రకం శిష్యుడు మోడు వంటివాడు. ఏ ప్రయత్నం చేసినా అతని మీద ఏ ప్రభావం ఉండదు. గురువు ఏమి చేసినా, అతడు పట్టనట్లుగా, స్తబ్ధంగా ఉంటాడు.

అందంగా చెక్కబడిన ఒక శిల్పానికి రెండు విషయాలు అవసరము. ఒకటి సంపూర్ణత, దోషరహితం, చక్కని శిల. రెండవది గొప్ప శిల్పి. గొప్ప శిల కూడా గొప్ప శిల్పంగా మారడానికి, ఉలి దెబ్బలు తినడానికి ఒక శిల్పి చేతుల్లో బేషరతుగా ఉండాలి. అలాగే శిష్యుడు తనని తాను బాగు పరచుకోవాలి, పవిత్రుడిని చేసుకోవాలి మరియు ఏ దోషం లేని శిల వలె గురువు యొక్క మార్గదర్శనంలో ఉండాలి, గురువు తనను భగవంతుని యొక్క రూపంగా చెక్కేందుకు అనుమతి ఇవ్వాలి.

రెండవ అధ్యాయము సమాప్తము 

----------------------------------------------- 

మూడవ అధ్యాయము

గురుపూర్ణిమ యొక్క ప్రాముఖ్యత

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః

శివునకు, విష్ణువుకు, వేదవ్యాసుల వారికి మరియు శంకరాచార్యులకు నమస్కారాలు. వేదాంత సూత్రాలను రచించిన వేదవ్యాస మహర్షికి మరియు వాటికి భాష్యం అందిచిన ఆదిశంకరాచార్యుల వారికి మరల మరల నమస్కారములు.

ఆషాడ మాసంలో వచ్చే పూర్ణిమ అత్యంత పవిత్రమైనది, అది గురు పూర్ణిమ. గురుపూర్ణిమ రోజున, భగవాన్ వేదవ్యాస మహర్షి లేదా కృష్ణద్వైపాయనుని స్మరణలో సన్యాసులంతా ఏదో ఒక చోట కూర్చుని వేదాంత విచారం చేస్తారు మరియు వ్యాస మహర్షి మూడు సార్లు దీవించి అందించిన బ్రహ్మసూత్రాల మీద ప్రవచనం చేస్తారు. నాలుగు వేదాలను విభాగం చేసి, 18 పురాణాలు రచించి, మహాభారతం, భాగవతం అందించి మానవాళికి సర్వకాల సర్వావస్థలలో మర్చిపోలేనంత సేవ చేశారు శ్రీ వేద వ్యాస మహర్షి. ఆయన యొక్క రచనలు నిరంతరం చదివి, ఆయన బోధనలను ఆచరించి, ఈ కలియుగంలో మనము తిరిగి భగవంతుని దిశగా చేరే విధంగా మలుచుకుని, మనలో ఆయన పట్ల ఎంతో గాఢంగా ఉన్న కృతజ్ఞతను, మరియు కొంత ఋణాన్ని తిరిగి చెల్లించే ప్రయత్నం చేయగలము. దివ్యమైన ఈ మహాపురుషుని గౌరవార్థం, సాధకులు మరియు భక్తులు ఈనాడు వ్యాస పూజ చేస్తారు. శిష్యులు తమ గురువులను పూజిస్తారు. మహాత్ములు మరియు సాధువులను గృహస్థులు పిలిచి, వారికి దానం మొదలైనవి ఎంతో అత్యధిక విశ్వాసం మరియు నిజాయితీతో నిర్వర్తిస్తారు. సన్యాసులకు ఈ రోజు నుంచే చాతుర్మాస్యం మొదలవుతుంది. వర్షఋతువుకు చెందిన ఈ నాలుగు నెలల్లో, సన్యాసులు ఒకే ప్రదేశంలో ఉంటూ బ్రహ్మసూత్రాలను చదువుతూ ధ్యానం చేస్తారు.

No comments:

Post a Comment