ఒకసారి దత్తాత్రేయుడు అడవిలో ఆనందంగా సంచరిస్తున్న సమయంలో, యదు అనే పేరు గల రాజును కలిశారు. ఆయన దత్తాత్రేయుడు ఎంతో ఆనందంగా ఉండడం చూసి, ఆయన యొక్క ఆనందానికి కారణం అయిన రహస్యాలు మరియు ఆయన గురువు గారి పేరు అడిగారు. దత్తాత్రేయుడు తనకు ఆత్మ మాత్రమే గురువు అని, అయినప్పటికీ 24 వ్యక్తులు జీవుల నుంచి జ్ఞానం పొందాలనని, అందువల్ల వారు తన గురువులని చెప్పారు.
దత్తాత్రేయుడు 24 మంది గురువుల పేర్లు మరియు వారి నుంచి తాను ఏమి నేర్చుకున్నారనేది చెప్పారు.
దత్తుడు ఇలా చెబుతున్నారు: "నా 24 మంది గురువులు - 1.భూమి 2.నీరు 3.గాలి 4.అగ్ని 5.ఆకాశము 6.చంద్రుడు 7.సూర్యుడు 8.పావురము 9.కొండచిలువ 10.సముద్రము 11. మిణిగురు పురుగు 12.తేనెటీగ 13. బాటసారి లేదా తేన పట్టువాడు 14.ఏనుగు 15.జింక 16.చేప 17. పింగళ అనే నాట్యకారిణి 18.కాకి 19.పసిపిల్లవాడు 20.యుక్త వయసులో ఉన్న కన్య 21.సర్పము 22.బాణాములు తయారు చేయువాడు 23. సాలీడు 24.భ్రమరము/ తుమ్మెద
1. సహనం కలిగి ఉండటం మరియు పరులకు మేలు చేయటం అనేది నేను భూమి నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే మనిషి తనకు ఎంత అపకారం చేసినా, ఎంత హాని చేసినా భూమి భరిస్తుంది మరియు అతనికి చక్కని పంట, మొక్కల ఇస్తూ అతనికి మేలు చేస్తుంది.
2. నీటి నుంచి నేను పవిత్రంగా ఉండటం నేర్చుకున్నాను. మీరు ఎలాగైతే ఇతరులను శుద్ధి చేస్తుందో, అలాగే యోగి లేదా ఋషి, పవిత్రుడు మరియు స్వార్థము, లౌల్యము, అహంకారము, కోపము, దురాశ మొదలైన వాటి నుంచి విముక్తుడైన వాడు, తన వద్దకు వచ్చిన వారందరినీ పవిత్రులను చేస్తాడు.
3. గాలి అన్ని వస్తువుల మీద నుంచి వీచినప్పటికి, అది దేనికి అంటుకోదు. అలా నేను అనేక మంది ప్రజల మధ్య ప్రపంచంలో సంచరించరిస్తున్నప్పటికీ, వాయువు నుంచి బంధరహితంగా ఉండడం నేర్చుకున్నాను.
4. అగ్ని దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. అలాగే యోగి లేదా ఋషి, తన యొక్క జ్ఞానము మరియు తపస్సు ద్వారా దివ్యంగా ప్రకాశించాలి.
5. నక్షత్రాలు, గాలి మరియు మేఘాలు మొదలైనవి ఆకాశంలో ఉన్నప్పటికీ, ఆకాశము వాటితో ఏ విధంగానూ బంధం కలిగి ఉండదు. ఆత్మ ఆకాశంవలే సర్వవ్యాప్తమై ఉన్నప్పటికీ, అది దేనితోనూ సంపర్కం కలిగి ఉండదని ఆకాశము ద్వారా నేర్చుకున్నాను.
6. చంద్రుడు ఎల్లప్పుడు పూర్ణంగానే ఉన్నప్పటికీ భూమి యొక్క నీడ చంద్రుని మీద పడిన కారణం చేత అతనిలో క్షీణత లేదా వృద్ధి ఉంటుంది. అలాగే ఆత్మ ఎల్లప్పుడు పూర్ణంగా మరియు ఏం మార్పుకులోను కాకుండా ఉన్నప్పటికీ, ఉపాధులు లేదా వివిధ జన్మలు యొక్క నీడ కారణం చేత అది తాను పరిమితం అనుకుంటుందని నేను తెలుసుకున్నాము.
7. ఎలాగైతే సూర్యుడు తన కింద ఉంచిన అనేక నీటి పాత్రలు వేరువేరు బింబాలుగా కనిపిస్తాదో, అలాగే న్రహ్మము ఒకటే అయినా, మనస్సు యొక్క పరావర్తనం చేత వివిధ ఉపాధులలో ఉన్న కారణంగా, వేరువేరుగా కనిపిస్తుంది. ఇది నేను సూర్యుని నుంచి నేర్చుకున్నాను.
8. ఒకసారి నేను రెండు గువ్వ పిట్టలు తమ పిల్లలతో ఉండడం చూశాను. ఒక వేటగాడు వల వేసి వాటి పిల్లలను పట్టుకున్నాడు. తన పిల్లల పట్ల ఆ తల్లికి ఉన్న ప్రేమ కారణంగా ఆమె తన జీవితాన్ని సైతం లెక్క చేయక వలలోకి దూకి, అతడికి పట్టుబడింది. మగ పావురం ఆడ పట్ల ఎంతో ఇష్టం పెంచుకుంది. అందువల్ల అది కూడా వలలో పడి పట్టుబడింది. దీనివల్ల రాగమే బంధానికి కారణం అని నేను తెలుసుకున్నాను.
9. కొండచిలువ తన ఆహారం కోసం ఎక్కడికి కదలదు. అది ఒక చోటే ఉంటూ తనకు దక్కిన దానితోనే సంతృప్తి చెందుతుంది. అలాగే నేను ద్వారా అజగ్రవృత్తి ద్వారా దొరికిన ఆహారాన్నే తింటూ, ఆహారం పట్ల మనసు పెట్టక, సంతృప్తిగా ఉండాలని నేర్చుకున్నాను.
10. వందల నదులు సముద్రంలో కలిస్తున్నప్పటికీ, సముద్రం చలించకుండా ఉంటుంది. అలాగే జ్ఞాని కూడా అన్ని రకాల ప్రలోభాలు, నష్టాలు మరియు బాధలలకు చలించకుండా ఉండాలని నేను సముద్రం నుంచి తెలుసుకున్నాను.
11. ఎలాగైతే మిణిగురు/ దీపపు పురుగు అగ్ని యొక్క దివ్యమైన కాంతి చూసి, ఆకర్షితమై, అందులోకి దూకి ఆహుతి అవుతుందో, అలాగే కామోద్రేకం కలిగిన వ్యక్తి అందమైన యువతితో ప్రేమలో పడి, చివరకు శోకిస్తాడు. నయేంద్రియం (కన్ను) ను నిగ్రహించాలని, దృష్టిని ఆత్మపై నిలపాలని నేను దీపపు/ మిణుగురు పురుగు ద్వారా నేర్చుకున్నాను.
12. ఎలాగైతే తేనేటీగ రకరకాల పుష్పాల నుంచి తేనెను సేకరిస్తుందో, ఒకే పువ్వుకు పరిమితం కాదో, అలాగే నేను కూడా ఒక్కో ఇంటి నుంచి కొద్దిగా మాత్రమే స్వీకరించి, వేరు ఇంటికి వెళుతూ, నా ఆకలిని తీరుచుకోవాలని, అలా నా మధుకరి వృత్తిని కొనసాగిస్తూ, ఏ గృహస్థుకు భారం కాకూడదని తెలుసుకున్నాను.
13. తేనెటీగలు ఎంతో శ్రమపడి తేనెను సేకరిస్తాయి, కానీ బాటసారి వచ్చి సులువుగా దాన్ని తీసుకెళ్తాడు. అలాగే ఎంతో కష్టపడి సంపదలు మరియు ఇతర వస్తువులను సంపాదిస్తారు మానవులు కానీ మరణం రాగానే ఇవన్నీ, ఒక్కసారిగా వదిలేసి యముడి వెంట వెళ్ళిపోతారు. అలా వాటి నుంచి నేను అనవసరమైన వస్తువులను పోగు చేయకూడదని తెలుసుకున్నాను.
14. మగ ఏనుగుకు ఆడఏనుగు స్పర్శ అంటే చాలా ఇష్టం. అందువల్ల ఏనుగును పట్టుకోవాలనుకున్న మావటి వాడు, ఒక పెద్ద గొయ్యి తీసి, దాని మీద గడ్డి పరచి, ఆ పైన గడ్డితో చేసిన ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతాడు. అది చూసిన మగ ఏనుగు, ఆ బొమ్మను ఆడఏనుగు అని భావించి, కామంతో కళ్ళు మూసుకుపోయి, ఆ గుంతలో పడిపోతుంది. ఆ విధంగా అది పట్టుబడి, బంధిన్చబడి, మావటి వాడిచేత హింసించబడుతుంది. అలాగే కామోద్రేకం కలిగిన వ్యక్తి స్త్రీ యొక్క స్పర్శ వలలో పడి దఃఖం పొందుతాడు. కనుక వ్యక్తి కామాన్ని నశింప చేసుకోవాలి. ఇది నేను ఏనుగు నుంచి నేర్చుకున్నాను.
15. జింకకు సంగీతం అంటే ఇష్టం. అది వేటగాని యొక్క సంగీతానికి ఆకర్షించబడి అతడికి బలవుతుంది. అలాగే వ్యక్తి జారత్వం కలిగిన స్త్రీ యొక్క సంగీతానికి ఆకర్షితుడై తన వినాశనాన్ని కోరి తెచ్చుకుంటాడు. కనుక వ్యక్తి ఎన్నడూ కామోద్రేకాన్ని కలిగించే సంగీతాన్ని వినకూడదు. ఇది నేను జింక నుంచి నేర్చుకున్నాను.
16. ఒక చేప ఏవిధంగానైతే అత్యాశకు పోయి ఆహారం కోసం జాలరి బారిన పడుతుందో అలాగే మానవుడు ఆహారం పట్ల అత్యాశకు పోయి, అతని రసేంద్రియము అతనిమీద ఆధిపత్యం చలాయించే స్థాయికి తెచ్చుకుని, తన స్వతంత్రాన్ని కోల్పోయి, సులభంగా నశిస్తాడు. అందువలన రుచిగల ఆహారం కోసం తపించడం వదిలి పెట్టాలి. ఇది చేప నుంచి నేర్చుకున్నాను.
17. ఒకప్పుడు విదేహ రాజ్యంలో పింగళ అనే పేరుగల నాట్యకారిణి ఉండేది. ఒక రాత్రి ఆమె విటుల కోసం ఎదురు చూసి అలసిపోయింది. చివరకు నిరాశ చెందింది. అప్పుడు ఆమె తనకున్న దానితో సంతృప్తి చెంది హాయిగా నిద్రపోయింది. పతనం చెందిన ఆ స్త్రీ నుంచి ఆశను లేదా కోరికలను వదులుకోవడం చేతనే సంతృప్తి కలుగుతుందని నేను నేర్చుకున్నాను.
18. ఒక కాకి తనకు దొరికిన ఒక మాంసపు ముద్ద తీసుకున్నది. అది చూసిన మిగితా పక్షులు కాకిని వెంబడించి, పొడిచాయి. అది అంతిమంగా మాంసపు ముద్దను వదిలిపెట్టి, శాంతి మరియు విశ్రాంతి పొందింది. ఈ ప్రపంచంలో ఉన్న మనిషి విషయసుఖాల వెంట పడినంత కాలమూ అన్ని రకాల కష్టనష్టాలకు పొందుతాడని, మరియు పక్షి వదిలేసినట్టుగా ఇందిర్యసుఖాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టినప్పుడు ఆనందపడతాడని దీని నుంచి నేను నేర్చుకున్నాను.
19. తల్లి పాలు త్రాగే పసిపిల్లవానికి ఏ బాధలు, ఆవేశాలు, ఆందోళనలు ఉండవు, మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఈ విధంగా సంతోషంగా ఉండడం అనే గుణాన్ని నేను పసిపిల్లవాడి నుంచి నేర్చుకున్నాను.
20. యుక్తవయసుకు వచ్చిన ఒక అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చక్కని వరుని వెతకడం కోసం వెళ్లారు. ఆ అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో పెళ్లి చూపుల నిమిత్తమై కొందరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. స్వయంగా ఆమె వారిని లోనికి ఆహ్వానించింది. వారిని కూర్చోబెట్టి ఆమె వరి పొట్టు తీయడం కోసం వరి దంచడానికి వెళ్ళింది. ఆమె దంచుతున్న సమయంలో చేతి గాజుల రాపిడి వలన తీవ్రమైన శబ్దం వచ్చింది. తెలివి గల అమ్మాయి గాజుల యొక్క శబ్దం చేత స్వయంగా తనే దంచుతున్నానని మరియు వేరొకరిని ఈ పని కోసం పెట్టుకునే స్థోమత తన కుటుంబానికి లేదని, వచ్చిన వారు భావిస్తారని పసిగట్టి రెండు చేతులకు రెండు గాజులు చొప్పున ఉంచుకొని మిగతావి పగులగొట్టాలని నిర్ణయించుకుంది. అలాగే ఆమె తన రెండు చేతులకు రెండు గాజులు చొప్పున మిగుల్చుకుని మిగతావి విరగొట్టింది. రెండు గాజులు కూడా శబ్దం చేశాయి. అప్పుడామె ఒక్కొక్క గాజు చొప్పున విరగొట్టింది. దాంతో ఇక శబ్దం రాలేదు మరియు ఆమె తన నిశ్చింతగా తన పనిలో మునిగిపోయింది. ఈ ప్రపంచంలో అనేక మంది మధ్య బ్రతకడం విభేదాలకు, కలతలకు, గొడవలకు మరియు జగడాలకు కారణమవుతుంది. కనీసం ఇద్దరు ఉన్నా కూడా అనవసరమైన మాటలు పొడచూపుతాయి. కనుక సన్యాసి ఎల్లప్పుడూ ఒంటరి గా ఉండాలని ఈ అమ్మాయి యొక్క అనుభవం ద్వారా నేను నేర్చుకున్నాను.
21. సర్పము తనకు తానుగా పుట్ట నిర్మించుకోదు. ఇతరులు పెట్టిన పుట్టలు మీద అది ఆధారపడుతుంది. అలాగే ఒక సాధువు లేదా సన్యాసి తనకోసం తాను గృహము నిర్మించుకోకూడదు. ఇతరులు నిర్మించిన గుహలు లేదా ఆలయాల్లో జీవించాలి. ఇది నేను పాము నుంచి నేర్చుకున్నాను.
22. బాణాలు చేసే వ్యక్తి యొక్క మనసు పూర్తిగా ఆ బాణాన్ని సరిగ్గా, పదునుగా చేయడంలోనే నిమగ్నమైంది. అతను అలా పనిలో మునిగి ఉన్నప్పుడు, ఒక రాజు అతని ఇంటి ముందు నుంచి తన పూర్తి సైన్యం మరియు పరివారంతో వెళ్లారు. కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, రాజు మీ ఇంటి ముందు నుంచి వెళ్ళాడా అని అడిగారు. ఆ కమ్మరి వ్యక్తి తను గుర్తించలేదని సమాధానం ఇచ్చారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ కమ్మరి వ్యక్తి యొక్క మనసు పూర్తిగా పని యందే నిమగ్నమై, అతను పట్టించుకోలేదు. మనస్సు యొక్క ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉండాలనే గుణాన్ని నేను ఆ కమ్మరి వ్యక్తి నుంచి నేర్చుకున్నాను.
23. సాలీడు తన నోటి ద్వారా పొడవైన దారాలను వదిలి, వాటిని అల్లుతూ గూడు నిర్మించుకుంటుంది. అది తన నిర్మించుకున్న గూడునే అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగే మానవుడు తన సొంత భావాలను ఏర్పరుచుకుని, వాటిలోని కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కనుక జ్ఞ్ఞాని ప్రాపంచిక ఆలోచనలు వదిలి పెట్టి, బ్రహ్మ, గురించే ధ్యానించాలి. ఇది నేను సాలీడు నుంచి నేర్చుకున్నాను.
24. తుమ్మెద లేదా భ్రమరం ఒక చిన్న పురుగును తీసుకువచ్చి తన గూట్లో పెట్టి దాన్ని ఒకసారి కుడుతుంది. పాపం ఆ పురుగు తుమ్మెద వస్తుందేమో, మళ్ళీ కొడుతుందేమోనని భయపడి తుమ్మెద గురించి తీవ్రంగా నిరంతరంగా ఆలోచించి తుమ్మెదగా మారుతుంది. అట్లాగే మనిషి నిరంతరం ఏ రూపం గురించి ధ్యానం చేస్తాడో, కాలక్రమంలో అతడు అదే రూపాన్ని పొందుతాడు. మానవుడు తాను ఏది ఆలోచిస్తే అదే అవుతాడు. ఆత్మ మీద ధ్యానం ద్వారా నన్ను నేను తెలుసుకుని, ఆత్మసాక్షాత్కారం పొంది, శరీర బంధాల నుంచి బయటపడి, మోక్షాన్ని పొందాలని తుమ్మెద మరియు పురుగు నుంచి నేర్చుకున్నాను.
దత్తాత్రేయుని బోధనలతో రాజు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. దత్తాత్రేయుడు సకల విధములైన అసహనములు లేదా పక్షపాతాలు మంచి పూర్తి విముక్తుడు. తనకు ఎదురుగా వచ్చిన ప్రతి దాని నుంచి ఆయన జ్ఞానం పొందారు. జ్ఞానాన్ని ఆశించే సాధకులందరూ దత్తాత్రేయుని ఒక ఉదాహరణగా తీసుకుని అనుసరించాలి.
ఆరవ అధ్యాయము సమాప్తము
No comments:
Post a Comment