Saturday, 12 October 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 15 వ భాగము



గురుపూర్ణిమ యొక్క ప్రాముఖ్యత

ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను బాగా గుర్తు పెట్టుకో. ఆషాఢ పూర్ణిమ చాతుర్మాస్య ఆరంభానికి, ఎంతగానో ఎదురు చూస్తున్న వర్షముల రాకకు సూచిక. భూమి నుంచి ఎండాకాలంలో తీసుకోబడిన నీళ్లు, ఇప్పుడు అంతటా నూతన జీవం సృష్టించేందుకు వీలుగా సువృష్టి (చక్కని వర్షం) రూపంలో కిందకు వస్తాయి. అలాగే నీవు కూడా ఇంతకుముందు నేర్చుకున్న వేదాంత తత్వాన్ని, నీలో దాచుకున్న తత్వశాస్త్రాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టాలి. ఈరోజు నుంచే నీ యొక్క ఆధ్యాత్మిక సాధన ఆచరణాత్మకంగా మొదలుపెట్టు. ఆధ్యాత్మికత యొక్క నూతన తరంగాలను సృష్టించు. నీవు చదివినది, విన్నది, చూసినది, నేర్చుకున్నది, సాధన ద్వారా నిరంతరం ప్రపంచానికి అందించే ప్రేమగా, మరియు సర్వజీవులలో ఉన్న భగవంతునకు నిరంతరం చేసే ప్రేమపూర్వక సేవ, నిరంతర ప్రార్థన మరియు పూజగా మారాలని కోరుకో.

ఈ రోజున పాలు మరియు పండ్లు మాత్రమే తీసుకుంటూ తీవ్రమైన జపము, ధ్యానము చేయి. బ్రహ్మ సూత్రాలను చదువు మరియు నీ గురు మంత్రాన్ని లేదా ఇష్ట మంత్రాన్ని ఈ చాతుర్మాసంలో కొన్ని లక్షల జపము అనగా అనుష్టానము లేదా పునశ్చరణ చేయి. నీవు ఎంతగానో పడతావు లాభపడతావు.

సమస్త విశ్వాన్ని గురువుగా భావించు

నీ దృష్టికోణంలో నూతన విధానాన్ని ఎంచుకో. మొత్తం విశ్వాన్నే గురు స్వరూపంగా భావించు. ఈ విశ్వంలోని ప్రతి వస్తువులో, మార్గదర్శనం చూపే నీ గురువు చేయిని, నిన్ను మేలుకొలిపే స్వరాన్ని, జ్ఞానం అందించే గురువు యొక్క స్పర్శను దర్శించు. మారిన నీ దృష్టి కోణంలో ఇప్పుడు సమస్త ప్రపంచం మారిపోతుంది. విరాట్ గురువు మన జీవితం యొక్క అమూల్యమైన రహస్యాలను నీకు వెల్లడించి జ్ఞానం ఇస్తారు. పరమాత్ముడైన సద్గురు గోచరమైన ప్రకృతి రూపంలో జీవితం యొక్క అత్యంత విలువైన పాఠాలను నీకు బోధిస్తారు. ప్రతిరోజు గురువులకు గురువైన, అవధూత అయిన దత్తాత్రేయుడు సైతం గురువైన ఈ గురువును పూజించు. సమస్తము కలిగి ఉన్నా, నిరంతరం ఓర్పుతో ఉండే భూమి, అందరికీ నీడను, పండ్లను ఇస్తూ ఎల్లవేళలా ఆత్మత్యాగానికి సిద్ధంగా ఉన్న చెట్టు, చిన్న విత్తనం లో ఎంతో ఓపికగా ఒదిగి ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు, నెమ్మది నెమ్మదిగా నిరంతరం పడే నీటి చుక్కలు పెద్ద బండరాళ్ళను తొలచడం, గ్రహాలు మరియు క్రమంగా సమయానికి వచ్చే ఋతువులను ఎవరైతే చూస్తారో, వింటారో మరియు స్వీకరిస్తారో వారికి ఇవన్నీ దివ్యమైన గురువులు.

పవిత్రత మరియు పురోగతి

గ్రహణ శీలత అనే గుణానికి ప్రతిరూపంగా మారు. నీలో ఉన్న అహంకారం ఖాళీ చేసుకో. ప్రకృతి యొక్క హృదయం లో ఉన్న సమస్త సంపదలు నీవి అవుతాయి. తక్కువ సమయంలోనే పురోగతి మరియు పరిపూర్ణత వస్తాయి. మలయమారుతం వలే శుద్ధము మరియు బంధరహితంగా మారు. నది నిరంతరం నిలకడగా, మార్గం తప్పకుండా, ఎడతెగకుండా తన లక్ష్యమైన సముద్రం వైపు ప్రవహించినట్లుగా, నీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఉన్నతమైన, దివ్యమైన సచ్చిదానంద స్థితి వైపునకు మళ్ళించు. నీ ఆలోచనలు (మనస్సు), నీవు వాక్కు (మాట్లాడే మాటలు), నీవు చేసే పనులను (కాయము) కేవలం ఈ లక్ష్యం వైపుగా మళ్ళించు.

చంద్రుడు దివ్యమైన, ప్రకాశవంతమైన సూర్యుని యొక్క వెలుగును పరావర్తనం చేస్తాడు. పూర్ణిమ రోజు కనిపించే పూర్ణ చంద్రుడు దివ్యమైన సూర్యుని యొక్క వెలుగును పూర్తిగా పరావర్తనం చేస్తాడు. అది సూర్యుని వైభవాన్ని ప్రకటిస్తుంది. అలాగే చంద్రునివలె, సాధన మరియు సేవ అనే అగ్ని ద్వారా నిన్ను నీవు పవిత్రుని చేసుకో, ఆత్మ యొక్క దివ్యమైన వెలుగును ప్రసరించు. వెలుగులకే వెలుగు అయిన బ్రహ్మవర్చస్సు అనే వెలుగును పూర్తిగా ప్రసరించే వానిగా రూపాంతరం చెందు. అనంత కోటి సూర్యులకు సమానమైన ఆ దివ్యత్వానికి సజీవంగా సాక్షీభూతంగా జీవించడమే నీ జీవితం యొక్క లక్ష్యంగా పెట్టుకో.

తత్వమసి
బ్రహ్మము లేదా పరమాత్మయే సత్యము. ఆయన అందరి యొక్క ఆత్మ. ఆయనే ఈ ప్రపంచం యొక్క సారము. ఇంత విభిన్నమైన, విరుద్ధమైన ప్రకృతి యందు ఎటువంటి ద్వైతానికి తావు ఇవ్వని, ఏకత్వము ఆయన. ఆయన అమరుడు, సర్వవ్యాపి, నిత్యానందస్వరూపి అయిన బ్రహ్మము. తత్వమసి - అదే నువ్వు. ఇది తెలుసుకొని ముక్తుడవు అవ్వు.

బ్రహ్మ సూత్రాలు ముఖ్యమైన నాలుగు వాక్యాలు గుర్తుపెట్టుకో. (1) అథాతో బ్రహ్మజిజ్ఞాస - కనుక ఇప్పుడు, బ్రహ్మం యొక్క విచారణ చేపట్టు. (2) జన్మాద్యస్య యతః - దేని నుంచి ఈ సృష్టి ఉద్భవిస్తుందో, ఆ మూలము (3) శాస్త్రయోనిత్వత్ -అయితే సరైన జ్ఞానానికి మూలం గ్రాంధాలు (4) తత్ తు సమన్వయత్ - ఎందుకంటే అదే ముఖ్యమైన ఆధారము.

ఇప్పుడు ఇలా కీర్తించు :
జయ గురు శివ గురు హరి గురు రామ
జగద్గురు పరమ గురువు సద్గురు శ్యామ

వ్యాస మహర్షి మరియు బ్రహ్మవిద్యా గురువులను గుర్తుపెట్టుకుని గౌరవించు. వారి యొక్క ఆశీర్వాదాలు నీపై ఉండుదువుగాక! జీవన్ముక్తుల ఆశీస్సులతో అవిద్య అనే ఒక చిక్కుముడిని తెంచుకొని జీవన్ముక్తుడవై అన్ని చోట్ల శాంతిని, ఆనందాన్ని, వెలుగును ప్రసరించెదవు గాక.

మూడవ అధ్యాయము సమాప్తము 

No comments:

Post a Comment