Saturday, 26 October 2024

శ్రీ గరుడ పురాణము (307)

 

నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వికృతి నామకులగు మరో అయిదుగురు కుమారులున్నారు. యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టారు. వృషపర్వపుత్రియగు శర్మిష్ఠ ద్వారా యయాతికి ద్రుహ్యు, అను, పురునామకులైన తనయులు జనించారు.


యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, రఘువులనే కొడుకులు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతనికి హయహైహయులు జనించారు. హయునికి అనరణ్యుడూ హైహయునికి ధర్ముడూ పుట్టారు. ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు, కుంతి (కుంతుడు), సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణ్యుడు, దుర్దముడు వర్ధిల్లారు.


దుర్దముని కారుగురు కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ,కృతౌజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు, అతని పుత్రుడు శూరసేనుడు. కృతవీర్యునికి అర్జునుడే కాక, ఇంకా జయధ్వజ, మధు, శూర, వృషణ నామకులైన పుత్రులు జనించారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజ పుత్రుడు తాలజంఘుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణపుత్రుడు మధువు, అతని పుత్రుడు వృష్టి, ఈ వృష్టియే వృష్టి వంశానికి మూలపురుషుడు.


క్రోష్టు వంశంలో క్రమంగా విజజ్జివాన్, ఆహి, అశంకు, చిత్రరథ, శశ బిందువులు జనించారు. ఈ శశబిందునికి లక్షమంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుదాన, పృథుశ్రవాది పదిలక్షలమంది శ్రేష్ఠులైన పుత్రులుదయించారు. పృథుశ్రవుని పుత్రుడు, అతని కొడుకు ఉశనుడు, అతని పుత్రుడు శితగు, అతని తనయుడు శ్రీ రుక్మకవచుడు. ఇతనికి రుక్మ, పృథురుక్మ, జ్యామఘ, హరి, పాలితులనే పుత్రులు పుట్టారు. జ్యామఘుని కొడుకు పేరు విదర్భుడు.


విదర్భునికి శైబ్య అనే భార్య ద్వారా క్రథ, కౌశిక, రోమపాదులను పుత్రులు కలిగారు. రోమపాదుని కొడుకు బభ్రువు, మనుమడు ధృతి.


కౌశికుని వంశంలో ఋచి, చేది, కుంతి, వృష్టి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీమూత, వికృతి, భీమరథ, మధురథ, శకుని, కరింభ, దేవమాన్ (దేవనత) దేవక్షత్ర, మధు, కురువంశ, అను పురుహోత్ర, అంశు, సత్త్వ శ్రుత, సాత్త్వతులు రాజులైనారు.


సాత్త్వతునికి ఏడుగురు కొడుకులు. వారు భజినుడు, భజమానుడు, అంధకుడు, మహా భోజుడు, వృష్టి, దివ్యవంతుడు, దేవవృధుడు. భజమానుని కొడుకుల పేrlu నిమి, వృష్టి, అయుతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు, దేవ, బృహస్పతి.


మహాభోజుని వంశంలో భోజుడు, వృష్టి, సుమిత్రుడు జనించగా సుమిత్రుని ముగ్గురు కొడుకులైన స్వధాజిత్, అనామిత్ర, అశినులలో అనమిత్రుని ముగ్గురు కొడుకులయిన నిఘ్న, ప్రసేన, శిబిలలో శిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి. ఇతని వంశంలో వరుసగా సంజయుడు, కులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైబేయులంటారు.


అనమిత్రునికి వృష్టి, శ్వఫల్కుడు, చిత్రకుడు అని మరో ముగ్గురు కొడుకులున్నారు. శ్వఫల్కునికి గాందినియను పత్ని ద్వారా పరమవైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు అక్రూర నందనులు.

No comments:

Post a Comment