చిత్రకునికి పృథు, విపృథు, సాత్త్వత నందనుడైన అంధకునికి శుచి, భజమాన పుత్రుడైన కుకురునికి ధృష్టుడు (ధృష్టకుడు) జన్మించారు. ధృష్టుని వంశంలో క్రమంగా కాపోతరోమకుడు, విలోముడు, తుంబురుడు, దుందుభి, పునర్వసు, ఆహుకుడు జన్మించారు. ఆహుకునికి ఆహుకియను కూతురూ దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జనించగా దేవకుని కూతురుగా (వరమున) శ్రీకృష్ణపరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక ఆరుగురు కూతుళ్ళు కూడా కలిగారు. ఆయన తన సప్త కన్యలనూ వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు. దేవక పుత్రుడైన సహదేవునికి దేవవాన్ ఉపదేవ నామకులైన ఇద్దరు కొడుకులు.
అంధక పుత్రుడైన భజమాను నందనుడు విదూరథుని వంశంలో క్రమంగా శూర, శమి, ప్రతిక్షత్ర, స్వయంభోజ, హృదిక, కృతవర్మాదులు జనించారు.
శూరునికైదుగురు కూతుళ్ళు కూడా పుట్టారు. వారు పృథ, శ్రుతదేవి, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి. వీరిలో పృథను కుంతి భోజకుని పెంపకానికిచ్చేశారు. అతడామెను అల్లారుముద్దుగా పెంచి పాండురాజుని కిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారతవీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడ పృథయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడ. ఈమెను 'కుంతి' అని పిలిచేవారు.
ఈ కుంతి చెల్లెలు శ్రుతదేవి కడుపున బుట్టినవాడే దంతవక్త్రుడు. శ్రుతకీర్తి కేకయ రాజుని పెండ్లాడి సతర్దనాది అయిదుగురు కొడుకులను కన్నది. రాజాధిదేవికి విందు, అనువిందులని ఇద్దరు కొడుకులు పుట్టారు. శ్రుతశ్రువ చేది రాజైన దమఘోషుని పెండ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు.
వసుదేవునికి పౌరవ, మదిర, దేవకి, రోహిణి, భద్రాది భార్యలలో దేవకీ నందనుడు శ్రీకృష్ణపరమాత్మ కాగా రోహిణీపుత్రుడు బలరాముడు. బలరామునికి రేవతి ద్వారా సారణ, శఠాది పుత్రులు జనించారు. దేవకి పుత్రులైన కీర్తిమాన్, సుషేణ, ఉదార్య, భద్రసేన, ఋజుదాస, భద్రదేవులను కంసుడు చంపేశాడు. శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలమంది కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబులు ప్రధానులు. ప్రద్యుమ్నపత్ని కకుద్మినికి మహాపరాక్రమశాలియైన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్రయను పేరు గల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతడు అతని పుత్రుడు ప్రతి బాహువు, మనుమడు చారు (దత్తుడు) రాజ్యాలనేలారు.
యయాతి పుత్రుడైన తుర్వసుని వంశంలో వహ్ని, భర్గ, భాను, కరంధమ, మరుత్తులు జనించారు.
రుద్రదేవా! ఇక ద్రుహ్యు అను వంశములను వర్ణిస్తాను వినండి.
యయాతి పుత్రుడు ద్రుహ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, ఆరద్ధ, గాంధార, ధర్మ, ఘృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు.
అనువు వంశంలో వరుసగా సభానల, కాలంజయ, సృంజయ్, పురంజయ, జనమేజయ, మహాశాల, ఉశీనర, శిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్షు, రూషద్రథ, సుతపులు జన్మించారు. సుతపసుతుడైన బలి మహారాజు కైదుగురు కొడుకులు. వారే అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, పౌండ్రులు.
No comments:
Post a Comment