Sunday, 21 July 2013

ఆషాఢ పూర్ణిమ గురుపూర్ణిమ

ఆషాఢ పూర్ణిమ, గురుపూర్ణిమ :

ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీ వేదవ్యాస మహర్షిని తప్పకుండా పూజించాలి.

భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడి తాండవంలోఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు. వాటిని తన నలుగురు శిష్యులకు ఉపదేశించి ప్రచారం చేయమని ఆదేశించారు. వేదాన్ని అర్ధం చేసుకోవడం కష్టమని, అందరికి అర్దమయ్యే విధంగా వేద సారం మొత్తాన్ని అష్టాదశ(18) పురాణాల్లోనూ, ఉపపురాణాల్లోనూ నిక్షిప్తం చేశారు. బ్రహ్మసూత్రాలను రచించారు. పంచమవేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతాన్ని వినాయకుడి సాయంతో గ్రంధస్థం చేశారు. ధర్మాచరణలో వేదమే ప్రామాణికం. మన సంస్కృతికి ఆది, పూనాది వేదమే. అటువంటి వేదాన్ని నాలుగుగా విభజించి, లోకానికి ఎంతో ఉపకారం చేసిన వేదవ్యాస మహర్షికి కృతజ్ఞతగా ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా, వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం.

వ్యాసమహర్షి తనకు పరంపరాగతంగా వస్తున్న విద్యను తన పుత్రుడైన శుకమహర్షికి ఉపదేశించాడు. శుకమహర్షి గౌడపాదాచార్యులవారికి, ఆయన గోవిందపాదాచార్యులవారికి, గోవిందపాదులు శ్రి శంకరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని బౌద్ధ, చార్వాక, జైన మతాలు అంతం చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు కైలాస శంకరుడే ఆదిశంకరాచరుడిగా అవతరించాడు. శ్రీ శంకరాచార్యులవారు దైవ, ఋషి పరంపరగా వస్తున్న ఈ మహాద్భుత జ్ఞానాన్ని తన నలుగురు శిష్యులైన పద్మపాదాచార్యులు, హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, సురేశ్వరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని పునరుద్దరించారు.

ఆత్మ జ్ఞానమైన, బ్రహ్మజ్ఞానమైన, వేదమైన, ఎటువంటి జ్ఞానమైన ఆధునిక కాలంలో కొత్తగా తెలుసుకుని/కనిపెట్టి చెప్పినవారు లేరు. నారాయణుడి దగ్గరినుండి పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని, ఏదైతే వ్యాసుడి చేత చెప్పబడిందో, అది మాత్రమే చెప్తారు. వ్యాసుడి చెప్పినదానికి భిన్నంగా ఏది చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది ఆమోదయోగ్యం కాదు. ఎంతో పురాతనమైన, సనాతమైన ఈ సంపద మనకు అందడంలో ముఖ్యపాత్ర పోషించిన వ్యాసమహర్షిని మన గురువులలో చూసుకుని ఆరాధించడమే గురు పూర్ణిమ.                                           

No comments:

Post a Comment