Sunday, 21 July 2013

గురుపూర్ణిమ

జూలై 22, సోమవారం ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ. గురు పూర్ణిమ విశిష్టత గురించి ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, జగ్గి వాసుదేవ్ గారు ఒక కధ చెప్తారు.

పూర్వం హిమాలయాల్లో పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగిన ఒక యోగి కనిపించాడు. ఆత్మజ్ఞానం వలన కలిగిన ఆనందంతో ఆ యోగి అధ్భుతమైన తాండవం చేశాడు, కాసేపటికి అతని ఆనందం అవధులు దాటే సరికి మౌనంగా ధాన్యంలో కూర్చుని ఆత్మనందాన్ని పొందుతున్నాడు. అతన్ని గమనించిన జనానికి ఇతను మనకంటే గొప్పదైన దాన్ని ఎదో పొందాడు, అందువల్లే ఇతను ఇంత ఆనందంగా ఉన్నాడన్న భావన కలిగి ఆ రహస్యం తెలుసుకుందామని అతని వద్దకు చేరుకున్నారు. ఎంతమంది అతను చుట్టూ చేరినా, ఆ యోగి ఎవరిని పట్టించుకోకుండా తనలో తానూ ఆత్మనందాన్ని అనుభవిస్తున్నాడు. జనానికి విసుకువచ్చి వెళ్ళిపోయారు, ఒక్క ఏడుగురు తప్ప.

ఆ మహాపురుషుడి వద్ద నుంచి ఆ రహస్యం తెలుసుకోవాలన్న తపనతో అక్కడి నిలబడిపోయారు. కానీ ఆ యోగి వారిని పట్టికుంచుకోలేదు. కాసేపటికి వారు యోగి ఆనందానికి గల కారణం చెప్పమని ప్రాధేయపడ్డారు. "మీరు మూర్ఖులు, ఇప్పుడు మీరున్న స్థితి నుంచి మీకు ఈ అధ్బుత జ్ఞానం అందడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ జ్ఞానం పొందాలంటే చాలా సాధన కావాలి. కాలక్షేపం కాక చేసే సాధన కాదిది" అన్ని ఆ యోగి ఏదో చెప్పి, వాళ్ళని పట్టించుకోవడం మానేసి, ధాన్యంలో ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.

రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ ఏడుగురు నిత్యం విడువకుండా సాధన చేస్తూనే ఉన్నారు. 84 ఏళ్ళ తర్వాత దక్షిణాయనంలో ఒకానొక పూర్ణిమ రోజున ఆ యోగి వీళ్ళపై తన దృష్టిని ప్రసరించాడు. ఆ మహాద్భుత జ్ఞానాన్ని పొందాలన్న తపనను వాళ్ళలో గుర్తించాడు. ఇక వాళ్ళకు ఆ మహాజ్ఞానం తప్పకుండా చెప్పాలన్న నిర్ణయానికి వచ్చి, వారిని మరింత దగ్గరగా గమనించడం మొదలుపెట్టాడు. మరొక పౌర్ణమి వచ్చేసింది. ఇప్పటికి వరకు ప్రపంచంలోనే ఆదియోగి అయిన ఇతను గురువు స్థానంలో కూర్చుని వారికి ఉపదేశం చేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రపంచానికి 'ఆది గురువు' అయ్యాడు. దక్షిణ ముఖంగా కూర్చుని, కేధార్‌నాథ్‌కు దగ్గరలో ఉన్న కాంతి సరోవరం దగ్గర తన యోగవిద్యను ఉపదేశించాడు. మానవశరీరానికి సంబంధించిన సమస్తమైన రహస్యాలను, మనిషి యొక్క శరీరం, బుద్ధి, మనసు, ప్రాణశక్తులను ఏకీకృతం చేసి, సమస్త మానవజాతి శాశ్వతమైన ఎదుగుదలను, ఆనందాన్ని పొందే ఆ మహోన్నత విద్యను వాళ్ళకు కొన్ని సంవత్సరాల పాటు పంచాడు.

జ్ఞానభోధ పూర్తయ్యేసరికి ఈ ఏడుగురు మహావిజ్ఞానవంతులయ్యారు. ఈ ఏడుగురే సప్తఋషులు. భారతీయసంస్కృతికి మూలపురుషులు. వారు నేర్చుకున్న యోగ విద్యను ప్రచారం చేయమని ఈ 7మందిని ప్రపంచలో 7 దిక్కులకు పంపించాడు. మానవుడికి సాధ్యకానిది ఏది లేదని నిరూపించగల ఈ యోగవిద్యను సప్తఋషులు ప్రపంచమంతా ప్రచారం చేశారు. ఆ ఆదియోగి ఏవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే. ఆయన బోధించినది మరేమిటో కాదు, ఈ రోజు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తూ, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, భారతదేశ పూరాతన వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న యోగా. యోగా/యోగ విద్యను మొదట బోధించినవాడు పరమశివుడే. ఆయన దక్షిణానికి తిరిగి బోధన ప్రారంభించిన పూర్ణిమతో కూడుకున్న దినమే గురుపూర్ణిమ. 

No comments:

Post a Comment