Wednesday, 8 June 2016

తల్లి కోతికి పళ్ళిచ్చి పంపిన భగవాన్

భగవాన్ రమణులు జీవుల పట్ల ఎనలేని కారుణ్యం చూపేవారు. మనుష్యులతో సమానంగా జంతువులను, పక్షులను ఆదరించేవారు. ఆయన దగ్గరకు రావాలని, ఆయన చేతి స్పర్శ తగలాలని జంతువులన్నీ తహతహలాడేవి.

ఒకసారి ఎవరో భక్తులు పళ్ళబుట్టను రమణాశ్రమానికి తెచ్చారు. దారిలో ఓ కోతి అడ్డు తగిలి కొన్ని పళ్ళను ఎత్తుకుపోయింది. అది చూసిన భగవాన్ రమణులు, ఇక్కడి వరకు వస్తే తనకు దక్కవేమోనని భావించి, తన వాటానే తానే చొరవ చేసి తీసుకుందని చమత్కరించారు. ఇంతలో మరో ఆడకోతి, పొట్టన కరుచుకున్న బిడ్డతో పళ్ళ దగ్గరకు ఆశగా వచ్చింది. ఆ కోతిని జనం తరుముతుంటే, రమణ మహర్షి వారించారు. నిజమైన సన్యాసి వస్తే, అన్యాయంగా తరిమేస్తున్నారు. ఏళ్ళ తరబడి తినడానికి గోదాముల్లో ఆహారం దాచుకుంటాం. పాపం అది చూడండి! ఇల్లా, వాకిలా? ఎక్కడైనా ఏమైనా దొరికితే తింటుంది. ఏ చెట్టు మీదో పడుకుంటుంది. పైగా చంటిపిల్లతో ఉంది. అటువంటి సన్యాసిని ఆదరించాలి - అని ఆ తల్లికి కొన్ని పళ్ళిచ్చి పంపించారు.


No comments:

Post a Comment