Showing posts with label వక్రతుండ. Show all posts
Showing posts with label వక్రతుండ. Show all posts

Monday, 4 September 2017

వక్రతుండ మహాకాయ..... (5)



నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా|

నేను చేపట్టిన ప్రతి కార్యంలో ఎల్లప్పుడూ విఘ్నములు ఎదురుకాకుండా చూడు.....
ఇంతకముందు కొన్ని వక్రములు/ విఘ్నాల గురించి చెప్పుకున్నాము. అవి ఎదురుకాకుండా చూడు.
1. నిన్ను మర్చిపోవడమే పెద్ద విఘ్నము. నేను ఏ కార్యం చేస్తున్నా, నిన్ను మరువకుండా ఉండేలా చూడు. బయట పనులు చేయాలి, కానీ లోపల హృదయంలో మాత్రం నీ మీద ధ్యాస ఉండాలి. సదా ఇలా ఉండేలా ఆశీర్వదించు.
2. నీవే కర్తవు. నేను పాత్రధారిని. నేను కర్తను అనుకునప్పుడు, నాకీ కర్మలు అంటుకుంటాయి. అదే జన్మల పరంపరకు కారణమవుతోంది. నేను కర్తను కాదనే జ్ఞానాన్ని నాకు అనుభవంలో తెలియపరుచు.  వేల జన్మలుగా నేనే కర్తను అని conditioning చేయబడ్డాను. అందుకే తరచుగా అదే భ్రమలో పడిపోతున్నాను. కాబట్టి మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ఓ వక్రతుండ, ఈ విఘ్నాన్ని తుండెము చేయి.
3. మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము. లేదా గృహస్థాశ్రమంలోకి భవిష్యత్తులో అడుగుపెడతాము. ధార్మికంగా సుఖాలను అనుభవించడం వలన కలిగిన సంతృప్తితో జనించిన వైరాగ్యం ద్వారా (వివేకంతో కూడిన వైరాగ్యం ద్వారా) మాత్రమే జ్ఞానము పొంది, నిన్ను చేరుకుంటాము. మా జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి. విద్యలో సమస్య, నిరుద్యోగం, సంతానహీనత, లేదా పిల్లలు మాట వినకపోవడం, అనారోగ్యం, దాంపత్యదోషాలు..... ఇలా ఎన్నో సమస్యలు. ప్రతి పనిలో ఆటంకాలే. ఇవన్నీ ఎదురుకాకుండా చూడు. సంతృప్తితో కూడిన జీవితాన్ని ఇవ్వు. నిన్ను స్మరిస్తున్నాం కనుక ఇప్పుడే, కాదు భవిష్యత్తులో ఎదురయ్యే విఘ్నాలను కూడా భస్మీపటలం చెయ్యి. మాకు కార్యసిద్ధిని కలిగించు. నీవు పూర్ణస్వరూపానివి. కనుక కోరికలను తీర్చుతూనే, జ్ఞానాన్ని కూడా ఇచ్చి, ఇటు ఇహాన్ని, పరాన్ని ప్రసాదించు. 
4. నీకే శరణాగతి చేద్దామని అనుకుంటాను. కానీ అప్పుడప్పుడూ అవిశ్వాసం మనసులోకి ప్రవేశిస్తోంది. అది వక్రము, దాన్ని తుండెము చేయు. నువ్వు చెప్పినట్లు కాక, మనసు చెప్పినట్లు నడుస్తున్నాను. కోపానికి, దురాశకు, అహంకారానికి వశుడనువుతున్నాను. ఇవన్నీ కూడా విఘ్నాలే స్వామి. కనుక ఎల్లప్పుడూ నీ మాట మాత్రమే వినేలా చూడు.

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||

ఇది బ్రహ్మదేవుడు వక్రతుండ గణపతిని ఉద్దేశించి చేసిన స్తోత్రంగా ఒక చోట చెప్పబడింది. చిన్న శ్లోకమైన మహిమకలది. కల్పవృక్షం వంటిది. ఈ శ్లోకం ఎప్పుడు వీలైతే అప్పుడు పఠించదగ్గది. కేవలం ఇహలోక భోగాలనే కాదు, ముక్తికి మార్గం చూపే శ్లోకం ఇది. పిల్లలకు దీన్ని నేర్పితే, దురలవాట్లకు లోనుకాకుండా, చక్కగా చదువుకుని, ఉన్నతంగా స్థిరపడి, అంతిమంగా స్వామిని చేరుతారు.   

స్వస్తి
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వం శ్రీ గణేశ్వరరాపణమస్తు 

Saturday, 2 September 2017

వక్రతుండ మహాకాయ..... (3)

"...... దిగీశాదిరూపం
అసత్ సత్ స్వరూపం జగద్ధేతురూపం సదావిశ్వరూపం గణేశం నతాః స్మః ||
అని గణపతిని గర్గ మహర్షి కీర్తించినట్లు గణేశపురాణంలో ఉంది. 

దశదిశలా వ్యాపించి ఉన్నవాడు; అసత్ (నశించిపోయే వస్తువులు, ప్రపంచం, పంచభూతాలు మొదలైనవి), సత్ (శాశ్వతమైనది, పరబ్రహ్మతత్త్వం) - ఈ రెండింటి రూపంలో ఉన్నవాడు, జగత్తుకు కారణమైనవాడు, ఈ విశ్వం యొక్క రూపంలో ఉన్న గణేశునికి నమస్కారలు అని భావం.

కనపడని తత్త్వమే కాదు, కనిపించే ఈ జగత్తు కూడా గణపతి స్వరూపమే. ఆయన తప్ప అన్యమైనది లేదు. ఈ జగత్తు మిథ్య అని కొన్ని సంప్రదాయల్లో ఎందుకు చెప్తారంటే, అలా చెప్పకపోతే ఎవ్వరూ అంతర్ముఖమవ్వరు. భౌతికమైన దృష్టితో బ్రతుకుతున్న వ్యక్తికి తాను అనుభవించేదంతా అసత్యమని, ఇంతకంటే గొప్పది ఇంకోటి ఉందని చెప్తే తప్పించి అతడు ఆత్మాన్వేషణ ప్రారంభించడు. అయితే చివరకు ఈ జగత్తు మిథ్య కాదు, అలా అని వేరేదో కాదు, ఇది కూడా భగవంతుని వ్యక్తరూపమే అని తెలుస్తుంది. అదేదో ఇప్పుడే తెలుసుకోవచ్చు కదా, జగత్తు లేకున్నా భగవంతుడు ఉన్నాడని, కానీ భగవంతుడు లేకుండా జగత్తు లేదని, దీనికి ప్రత్యేకమైన అస్థిత్వం లేదని, ఇది ఆయన నుంచి వచ్చిందని, ఇది ఆయనేనని ఇప్పటి నుంచే చూసే ప్రయత్నం చేయచ్చు కదా?! ఇలా చూసేవాడు భక్తుడు, భక్తియోగం ఈ మార్గాన్నే సూచిస్తుంది.……..

ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖమవ్వడం. అయితే అంతర్ముఖమై అలాగే ఉండిపోవాలా? చాలామంది ఆధ్యాత్మికత పేరు చెప్పి, ఈ లోకంతో మనకేంటి అంటారు. అది పలాయనవాదమే అవుతుంది కానీ ఆధ్యాత్మికత కాదు. తాను అంతర్ముఖమై దర్శించిన సత్యాన్ని, అదే అంతఃనేత్రంతో బయట కూడా దర్శించాలి. అంటే మనసు నుంచి కాక, హృదయం నుంచి లోకాన్ని చూడాలి. అలా హృదయం నుంచి చూస్తూ జీవించాలి….. లోపల తాను ఏదైతే అనుభూతి చెందాడో, బయట ఉన్న ప్రతి అణువు (Atom) లో అదే అనుభూతి చెందాలి. భగవంతుడిని లోపలే కాదు, బయట కూడా దర్శించాలి. అప్పటివరకు మోక్షం రాదు. మనకున్న మామూలు దృష్టి నుంచి పైకి ఎదిగితే, ఈ లోకంలో ప్రతి అణువులో దైవమే ఉందని తెలుస్తుంది..... ప్రతి చర్యంలోను (Action), ప్రతిచర్య (Reaction) లోనూ ఆయన్నే చూడగలగాలి. అలా అన్నిటిలో చూసే ప్రయత్నం చేస్తే, ఆయన అనుగ్రహం చేత తప్పకుండా, అంతటా ఆయన్ను చూడగలిగే దృష్టి లభిస్తుంది. సాధ్యం కాదు అనుకోవడమే వక్రము….. 

భగావన్ రమణ మహర్షి, వారి ఉపదేశసారంలో 'జగత ఈశాధీయుక్త సేవనం, అష్టమూర్తి భృద్దేవపూజనం -5||’

ఈ జగత్తే ఈశ్వరుడు అనే బుద్ధితో కూడి, దీనికి సేవ చేస్తే, అది అష్టమూర్తులుగా వ్యక్తమవుతున్న భగవంతునికి చేసే పూజయే అవుతుంది అని భావం. ఇది పరిపూర్ణమైన భక్తియోగ మార్గం. అందుకోసం అంతర్ముఖమై, ఆ అంతఃదృష్టిని నిలుపుకుంటూనే దేశానికి, ధర్మానికి, లోకానికి సేవ చేయాలి, అందరికీ ప్రేమను పంచాలి. అంతటా దైవాన్నే చూస్తే, అప్పుడు కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, చిరాకు మొదలైన లక్షణాలకు తావు ఉండదు. ఇతరుల కోపంలో కూడా మనం స్వామినే చూస్తాము. ద్వేషాన్ని కూడా ద్వేషించము, పగను కూడా ప్రేమిస్తాము. ఎందుకంటే అన్నిటిలో ఆయనే ఉన్నాడు. మంచి, చెడులు రెండూ ఆయన నుంచే ఉద్భవించాయి. ఒకటి ఎలా ఉండాలో చెప్తే, ఇంకోదాని ద్వారా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు.... మనం అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, మన ఆశలకు (expectations) భిన్నంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కానీ అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతోంది అని నిజంగా నమ్మితే, అనుకోనిది జరిగినా కోపం ఉండదు, బాధ ఉండదు. ఎవరివల్లనో పనులు ఆగిపోయాయని వాళ్ళ మీద విరుచుకుపడటం ఉండదు. మనం అలాంటి స్థితిని చేరుకోవాలి.  నిజానికి ఇవన్నీ చదివితే అనుభవంలోకి రావు, ఆచరణలో పెట్టాలి, మనం చేసే ప్రతి పనిలో ఆయన్ను చూడగలగాలి. అందుకు సిద్ధమవ్వాలి. పాత ఆలోచనలను ఈ క్షణంలోనే విడిచిపెట్టాలి.  కర్మ(ఆచరణ) ద్వారా మాత్రమే జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఖచ్ఛితంగా దైవం యొక్క స్పందనను మనం వినవచ్చు. ప్రతి దాన్లోను జీవం ఉట్టిపడటం కనిపిస్తుంది. అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాగణపతి దర్శనం అవుతుంది. అదే గణపతి ‘మహాకాయం’.  విశ్వరూప గణపతికి ఎన్నో ముఖాలు ఉంటాయి. అందులోకి నీ ముఖం కూడా ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఆయన నుంచి వేరుగా లేవు. ఆయనలోనే ఉన్నావు. అదే మహాకాయం.

భగావన్ రమణ మహర్షి, వారి ఉపదేశసారంలో 'జగత ఈశాధీయుక్త సేవనం, అష్టమూర్తి భృద్దేవపూజనం -5||’
ఈ జగత్తే ఈశ్వరుడు అనే బుద్ధితో కూడి, దీనికి సేవ చేస్తే, అది అష్టమూర్తులుగా వ్యక్తమవుతున్న భగవంతునికి చేసే పూజయే అవుతుంది అని భావం. ఇది పరిపూర్ణమైన భక్తియోగ మార్గం. అందుకోసం అంతర్ముఖమై, ఆ అంతఃదృష్టిని నిలుపుకుంటూనే దేశానికి, ధర్మానికి, లోకానికి సేవ చేయాలి, అందరికీ ప్రేమను పంచాలి. అంతటా దైవాన్నే చూస్తే, అప్పుడు కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, చిరాకు మొదలైన లక్షణాలకు తావు ఉండదు. ఇతరుల కోపంలో కూడా మనం స్వామినే చూస్తాము. ద్వేషాన్ని కూడా ద్వేషించము, పగను కూడా ప్రేమిస్తాము. ఎందుకంటే అన్నిటిలో ఆయనే ఉన్నాడు. మంచి, చెడులు రెండూ ఆయన నుంచే ఉద్భవించాయి. ఒకటి ఎలా ఉండాలో చెప్తే, ఇంకోదాని ద్వారా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు.... మనం అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, మన ఆశలకు (expectations) భిన్నంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కానీ అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతోంది అని నిజంగా నమ్మితే, అనుకోనిది జరిగినా కోపం ఉండదు, బాధ ఉండదు. ఎవరివల్లనో పనులు ఆగిపోయాయని వాళ్ళ మీద విరుచుకుపడటం ఉండదు. మనం అలాంటి స్థితిని చేరుకోవాలి.  నిజానికి ఇవన్నీ చదివితే అనుభవంలోకి రావు, ఆచరణలో పెట్టాలి, మనం చేసే ప్రతి పనిలో ఆయన్ను చూడగలగాలి. అందుకు సిద్ధమవ్వాలి. పాత ఆలోచనలను ఈ క్షణంలోనే విడిచిపెట్టాలి.  కర్మ(ఆచరణ) ద్వారా మాత్రమే జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఖచ్ఛితంగా దైవం యొక్క స్పందనను మనం వినవచ్చు. ప్రతి దాన్లోను జీవం ఉట్టిపడటం కనిపిస్తుంది. అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాగణపతి దర్శనం అవుతుంది. అదే గణపతి ‘మహాకాయం’.  విశ్వరూప గణపతికి ఎన్నో ముఖాలు ఉంటాయి. అందులోకి నీ ముఖం కూడా ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఆయన నుంచి వేరుగా లేవు. ఆయనలోనే ఉన్నావు. అదే మహాకాయం.

సదావిశ్వరూపం గణేశం నతాః స్మః

వివరణ ఇంకా ఉంది……..

Friday, 1 September 2017

వక్రతుండ మహాకాయ..... (2)


నిజానికి యోగమార్గంలో సాధన చేస్తున్నప్పుడు అనేక అనుభూతులు కలుగుతాయి. కొన్ని భ్రమలు కూడా కలుగుతాయి. ఒకనొక దశంలో సాధకుడు తాను తన గమ్యాన్ని చేరుకున్నానని, లేదా సమీపానికి వచ్చేశానని భ్రమిస్తాడు. దాంతో ఎక్కడో ఒకచోట ఆగిపోతాడు. ఇవి వక్రములు..... 
అనుభూతులు ఉన్నాయంటే అనుభవించేవాడు ఉన్నాడనే అర్ధం. అనుభూతులు మనసుకే కానీ తన (ఆత్మ) కు కాదు. ఒకరు రమణమహర్షి వద్దకు వచ్చి, 'నేను ధ్యానంలో శూన్యస్థితికి వెళిపోతున్నాను. అప్పుడు తలంపులేమీ ఉండటంలేదు. కానీ ఈ స్థితిని మాత్రం దాటలేకపోతున్నాను' అని అనగా, దానికి బదులుగా మహర్షి 'ఆ శూన్యస్థితిని అనుభవిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. తాను ఉన్నాడు కనుకే ఆ స్థితి ఉందని తెల్సుకోగలుగుతున్నాడు. ఆ ఉన్నది ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది' అని సమాధానమిచ్చారు..... కానీ చాలామంది తమకు కలిగిన అనుభూతులనే గొప్పగా భావించి, వాటిని పదేపదే నెమరువేసుకుంటూ కూర్చుంటారు. ఇది వక్రము.
నాకు శాస్త్రము తెలుసు.... నేను సాధన చేస్తున్నాను... నాకు మంత్రోపదేశం ఉంది.... నేను ఇన్ని లక్షల మంత్రజపం చేశాను... వాళ్ళు తప్పుగా ఆచరిస్తున్నారు.... వారిని సరి చేయాలి..... ఇలా ఎన్నో భావాలు మనసులో పెట్టుకుంటారు. వీటన్నిటికి మూలం అహంలో ఉంది. ఈ భావాలు ఉన్నన్ని రోజులు ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఎందుకంటే ఇవే వక్రములు. శాస్త్రం తెలిసి ఉండటం మంచిదే, కాని అది నీలో అహంకారాన్ని పెంచకూడదు, అణుకువను పెంచాలి. భక్తిశ్రద్ధలను పెంచాలి. నువ్వు ఇక్కడకు ఇతరుల్లో దోషాలు ఎంచడానికి, ఎవరు ఎలాంటి వారో తీర్పులు చెప్పడానికి రాలేదు. ఈశ్వరుడిచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా ఎరుకతో జీవించి, ఆయనలో కలిసిపోవడానికి వచ్చావు. ఎవరు ఎంత జపం చేసినా, ఎంత సాధన చేసినా, ఆత్మసాక్షాత్కారం అనేది పూర్తిగా ఈశ్వరానుగ్రహం మీదనే ఆధారపడి ఉన్నది....... 

ఇంకా ఇలా కూడా అంటుంటారు. నాకు మోక్షం ఈ జన్మలోనే వస్తుందని నమ్మకం లేదు, దానికి ఎన్నో జన్మల సాధన కావాలి, నేను ఇప్పుడే మొదలుపెట్టాను.... ఇలా మనం ఎన్నో భావాలను (presumptions, assumptions and preconceived notions) ఏర్పర్చుకుని ఉంటాము. కొన్ని ఎక్కడో, ఎవరో చెప్పగా విన్నవి... కొన్ని చదివినవి.... ఇవన్నీ వక్రాలే. ఇవి ఉన్నంతకాలం దైవానికి మనం దూరంగా ఉన్నట్లే. వీటిన్ననిటిని ధ్వంసం చేయువాడు వక్రతుండుడు. నిజానికి ఇవన్నీ వదిలించుకుని వర్తమానంలో, దైవాన్ని హృదయంలో స్థిరంగా నిలిపుకుని, పరిపూర్ణమైన జీవనం గడపడమే ఆధ్యాత్మికత.....అందుకే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మొదటి చక్రం. ఆయన అనుగ్రహంతో ప్రయాణం ప్రారంభిస్తే, మధ్యలో వచ్చే వక్రాలన్నీ నశించిపోతాయి. తన భక్తులను నేరుగా హృదయస్థానానికి తీసుకువెళ్ళి తన యందే నిశ్చలమైన దృష్టి ఉండే స్థితిని కలిగిస్తాడు.   

వక్రం అనగా విఘ్నము... లౌకిక జీవనంలో అటంకాలుగా చెప్పుకుంటే, ఆధ్యాత్మికతలో విఘ్నమే మాయ... గణేశునికి విఘ్నరాజు అనే నామం ఉంది. అలాగే విఘ్నకర్త, విఘ్నహర్త అనే నామాలు కూడా ఉన్నాయి. విఘ్నరాజు అనగా విఘ్నములను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, అనగా మాయను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. ఆయనే పరబ్రహ్మం. ఈ జగత్తు ఆయన మాయ. ఈ మాయ కూడా ఆయనలోనించే వచ్చింది..... జీవుల కర్మ తీరటం కోసం వారికి ఉపాధి (శరీరం) కల్పించి, మాయలో ఉంచి, కర్మక్షయం చేస్తున్నాడు. తనను చేరటానికి కర్మక్షయం చేస్తున్న గణేశుని ఒక నామమే విఘ్నకర్త. తన పాదాలను గట్టిగా పట్టుకుని, నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేదు, నీకే శరణాగతి చేస్తున్నాను, నన్ను ఉద్ధరించు అన్న భక్తునికి మాయను తొలగించి, తనలో ఐక్యం చేసుకుంటున్నాడు కనుక ఆయన విఘ్నహర్త కూడా. లౌకిక జీవనంలో వీటి అర్ధాలు మనకు తేలికగానే బోధపడతాయి.....

కాబట్టి గణపతిని వక్రతుండ అనే నామంతో పూజిస్తే, ఆయన మనకున్న భౌతిక, ఆధ్యాత్మిక విఘ్నాలను తొలగించి, ఆయనలో కలుపుకుంటాడు.

వక్రతుండ గణపతి ఎంత శక్తిమంతుడంటే, మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా మనకు వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని స్మరిస్తే, ఆయన మంత్రం కానీ, నామం కానీ విశ్వాసంతో జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు సద్గురు శివాయ శుభ్రమునీయ స్వామి వారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. ఈయన శత్రువులను కాదు, శత్రువుల శత్రుబుద్ధిని నశింపజేసి, ప్రేమను, స్నేహభావాన్ని పెంచుతాడు.

వక్రతుండ అని స్వామిని స్తుతించిన బ్రహ్మగారు, ఆ తర్వాత మహాకాయ అని స్తుతించారు. మహాకాయ అంటే పెద్ద శరీరం కలవాడు. అంటే గణపతి భారీ ఆకారంలో ఉంటాడు, లావుగా ఉంటాడు అని కాదు. గణపతి అథర్వశీర్షోపనిషత్తులో గణపతి రూపం గురించి ప్రస్తావన ఉంది. గకార పూర్వరూపం అంటూ..... గం అనే బీజాన్ని జపించినప్పుడు, ఏర్పడే గణపతి రూపం మనం చూస్తున్నట్లు పెద్ద ఉదరంతో ఉంటుంది. ఆ రూపం వెనుక ఎంతో తత్త్వం దాగి ఉన్నది. అయితే బ్రహ్మదేవుడు, స్వామిని మహాకాయ అనడంలో అర్దం ఇంకోలా ఉంది. స్వామి అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటా అంటే విశ్వమంతటా, విశ్వానికి అతీతంగా కూడా ఉన్నాడు. ఆయన లేని చోటు అంటూ లేదు... అసలు ఆయన తప్ప అన్యమైనదే లేదు. అందుకే 'శుక్లాంబరధరం విష్ణుం' అని  ఆయన్ను ప్రార్ధిస్తున్నాము. విష్ణుం అంటే సర్వవ్యాపి. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా శ్రీ మన్నారాయణుడు ఒక మాట అంటారు... విష్ణుత్వం కలిగి ఉన్నవాడే విఘ్నాధిపతి కాగలడు, అటువంటి వాడు పార్వతీ మాత ద్వారా ఆవిర్భవిస్తాడు' అని. స్వామిది, విష్ణుమూర్తిది ఒకటే తత్త్వం....

దశదిశలా వ్యాపించి ఉన్నాడు కనుక స్వామిని చెందిన సహస్రనామాల్లో దిగంబరః అనే నామం ఉంది. అది కూడా త్రిపురాసుర సంహారానికి పూర్వం పరమశివుడు, గణపతి గురించి తపస్సు చేసి, ద్విదశ భుజ (20 చేతులతో), దశముఖ మహాగణపతిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అప్పుడు స్వామిని స్తుతించగా, లోకానికి అందినవే గణేశ సహస్రనామాలు. వాటికి భాసకరరాయల వారు భాష్యం రాశారు. పరమశివుడు ఆ మహాగణపతిని ప్రత్యక్షం చేసుకున్న క్షేత్రం మహారాష్ట్రలో అష్టగణపతి క్షేత్రాల్లో ఒకటై రంజంగావ్ గా ప్రసిద్ధమై ఇప్పటికీ ఉంది. అది దర్శించవచ్చు ..... వస్త్రాలు లేనివాడని కాదు. దిగంబరః అంటే దిశలెల్లా వ్యాపించి ఉన్నవాడు. ఇకా ఆయన వ్యాపించడానికంటూ చోటే లేదు. ఆ దిక్కులనే బట్టలుగా కట్టేసుకున్నవాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడికి రూపం ఉంటుందా?? అన్ని రూపాలు ఆయనవే. అరూపం కూడా ఆయనదే. అదే మాహాకాయం. 

ఇక్కడ ఇంకో విశేషం ఉంది. బ్రహ్మదేవుడు వక్రతుండిని ప్రార్ధిచిన తరువాత, సృష్టి జరిగింది. కానీ ఆ సృష్టిని బ్రహ్మగారు ఎక్కడ నుంచో చేయలేదు. అంతటా వ్యాపించి ఉన్న ఆ స్వామియే, ఈ చరాచర సృష్టిగా, అందులోని జీవులుగా మారిపోయాడు. మరి ఇంతకీ బ్రహ్మదేవుడు చేసినదేంటి? ఏమీ లేదు..... త్వమేవ కేవలం కర్తాసి| త్వమేవ కేవలం ధర్తాసి| త్వమేవ కేవలం హర్తాసి| త్వఏమ సర్వం ఖల్విదం బ్రహ్మాసి| - గణపతి అథర్వశీర్షోపనిషత్తు.

ఆయనే కర్త, ఆయన ధర్త (స్థితికారుడు), ప్రళయకర్త/ తొలగించేవాడు కూడా ఆయనే. ఈ సమస్త సృష్టి ఆయన తప్ప మరేమీ కాదు. ఆయన కాదు, మనమే కర్తలము అనుకోవడమే మన అజ్ఞానం. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉన్న ప్రాణులంతా పాత్రధారులు. ఆయన మాత్రమే కర్త. అదే జ్ఞానం.

వివరణ ఇంకా ఉంది..... 

Wednesday, 30 August 2017

వక్రతుండ మహాకాయ.... (1)



గణపతికి సంబంధించి మనకు అనేక స్తోత్రాలు లభ్యమౌతున్నాయి. అందులో అత్యంత మహిమాన్వితమైనది, అందరూ సులభంగా నేర్చుకుని చదువదగినది

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా

వివరణ- ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పూనుకోగా, ఆయనకు అనేక విఘ్నాలు ఎదురయ్యాయి. ఎంత ప్రయత్నించినా ఆయన కార్యం ముందుకు కదల్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, పరబ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఎన్నో దివ్యసంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, పరబ్రహ్మ వక్రతుండ గణపతిగా సాక్షాత్కరించి, బ్రహ్మదేవుడికి వక్రతుండ మంత్రాన్ని ఉపదేశించారు. 

అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ మాత చేత శ్రీ గణేశుడి సృష్టించబడటానికి పూర్వం నుంచి కూడా ఆయన ఉన్నాడు. శివపార్వతుల కల్యాణంలో కూడా గణపతిని పూజించారు. అంటే గణపతి ఈనాటి వాడు కాదు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము. అందుకే ఒకనాడు ముద్గల, గర్గ మహర్షులతో కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గణపతిని పరబ్రహ్మంగా స్తుతించిన స్తోత్రం కూడా ఉంది.

సనాతన ధర్మంలోనే శైవం, శాక్తేయం, వైష్ణవం వలె గాణాపత్యం అనే మతం కూడా ఉంది. ఇందులో గణపతిని పరబ్రహ్మంగా, మిగితా దేవీదేవతలంతా ఆయన అంశలుగా భావించి ఉపాసిస్తారు. ఆయనే ఆది మూలంగా ఉపాసిస్తారు.

సంపదలను కలిగించి, పోషించువాడు, నిధులను ఇచ్చువాడు, అన్నసమృద్ధిని ఇచ్చువాడు అంటూ ఆ మంత్రం ఎన్నో రకాలుగా స్వామి వైభావన్ని ప్రకటించి, చివరలో వక్రతుండ షడక్షర మంత్రంతో ముగుస్తుంది. బ్రహ్మదేవుడు ఆ మంత్రం మీద ధ్యానం చేసి, ఆ తర్వాత సృష్టి చేయడాన్ని ఆరంభించాడు. అప్పుడు ఆయనకున్న విఘ్నాలన్నీ తొలగి, సృష్టి సజావుగా సాగింది.

ఇదే విషయం ఉమామహేశ్వరుల సంవాదం రూపంలో శ్రీ కృష్ణాయామల తంత్రంలో కనిపిస్తుంది. అందులో 

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 

సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు ఎవరినైతే విశేషంగా పూజించి, ఫలసిద్ధిని పొందాడో, అటువంటి పార్వతీ పుత్రుడైన శ్రీ గణనాథుడు నా ఋణములను నాశనం చేయుగాకా అని ఉంది.

ఇప్పుడు మనకొక సందేహం వస్తుంది. బ్రహ్మదేవునకు విఘ్నాలు కలగటం ఏమిటి?.... త్వమేవ కేవలం కర్తాసి అని గణపతి అథర్వశీర్షోపనిషత్తు వర్ణించింది. అంటే ఈ సమస్త సృష్టిలో కేవలం గణపతి మాత్రమే కర్త. మిలిగినవారు అంటే పిపీలికాది బ్రహ్మ ప్రయంతం ఉన్న జీవులంతా పాత్రధారులు మాత్రమే. తానే కర్తను అనుకోవడం వల్లనే జీవులకు కర్మఫలం అంటుకుని, జననమరణ చక్రంలో కొట్టుకుపోవలసి వస్తోంది. తాను కర్తను కాదు, భగవంతుడే కర్త, అన్నీ ఆయనే చేస్తున్నాడు, నేను కేవలం పాత్రధారిని మాత్రమేననే భావన కలిగి ఉంటే, మరణానంతరం నేరుగా బ్రహ్మంలో ఐక్యమవుతాము. దీనికి ప్రధానమైన కారణం అహంకారం. అందుకే అహం నశిస్తే, అన్నీ నశిస్తాయని భగవాన్ రమణ మహర్షి అన్నారు. బ్రహ్మదేవుడు కూడా తానే ఈ సృష్టికి కర్తను అనుకుని ఉంటాడు. అందుకే ఆయనలో కలిగిన ఆ అహంభావాన్ని తొలగించడానికి పరబ్రహ్మ స్వరూపమైన గణపతి/ విఘ్నాధిపతి/ విఘ్నరాజు విఘ్నాన్ని కలిగించాడు. ఇది అస్తిత్వంలోకి రాబోయే లోకానికి, జీవులకు ఎంతో ప్రేమతో, కరుణతో వక్రతుండుడు చేసిన తొలి ఉపదేశం. దీన్ని ఒక్కదాన్ని జాగ్రత్తగా జీవితంలో పాటించినా, జీవులు త్వరితగతిన ఆ పరబ్రహ్మరూపమైన గణపతిలో ఐక్యమవుతారు.

వక్రతుండ మహాకాయ......(2)

వక్రతుండ- అంటే చాలామంది వంకర తొండం కలవాడని అర్దం చెబుతున్నారు. కానీ వక్రతుండ అనే పదానికి 'వక్రానాం తుండయతీతి ఇతి వక్రతుండః' అని వ్యుత్పత్తి. వక్రములను తుండెము చేయువాడు వక్రతుండుడు.

సృష్ట్యాదిలో బ్రహ్మదేవునకు కలిగిన విఘ్నాలను నశింపజేశాడు. తాను కర్తను అనే భావనయే వక్రము. అదే జన్మల పరంపరకు కారణమవుతుంది, అది అహం నుంచి పుడుతుంది. ఆ భావనను బ్రహ్మలో నశింపజేసినవాడు వక్రతుండుడు.
వక్రబుద్ధులను నశింపజేయువాడు వక్రతుండుడు. వక్రబుద్ధి మనలోనే ఉండవచ్చు, లేదా మన చుట్టూ ఉన్నవారిలో మనపట్ల వక్రమైన ఆలోచనలను ఉండవచ్చు. వక్రతుండ అనే నామస్మరణ చేతనే ముందు తన భక్తులలోనూ, ఆ తర్వాత వారి చుట్టూ ఉన్నవారిలో వక్రబుద్ధులను నశింపజేయువాడు వక్రతుండుడు....... ఇక్కడ వక్రం అంటే విఘ్నం అని కూడా చెప్పుకోవచ్చు. వివాహం ఆలస్యం జరగడం, సంతానం కలగపోవటం, చక్కని ఉద్యోగం లభించకపోవటం, ఉన్నత విద్యాప్రాప్తికి ఆటంకాలు.... ఇలా జీవితంలో మనకు ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి. ఇవన్నీ వక్రాలు/ విఘ్నాలు. వీటిని తుండెము చేయువాడు వక్రతుండ గణపతి..... అందుకే ‘వక్రతుండ గణపతి అనేది పరిపూర్ణ రూపం. ఆయన్ను అన్నిటికోసం ప్రార్ధించవచ్చు. మంచి ఉద్యోగం, వివాహం, విద్య...... ఇలా అన్నిటికి వక్రతుండమే సమాధానం’ అని అంటారు పూజ్య గురువులు వి.వి.శ్రీధర్ గారు. అలాగే వామాచారం, అధర్మప్రవృత్తి, దుర్గుణాలు, దుష్టుల సహవాసం..... మొదలైనవి కూడా వక్రములే. వాటిని నిర్మూలించాలన్నా, వక్రతుండ గణపతిని హృదయపూర్వకంగా ప్రార్ధించాలి.

వక్రం ఆత్మ రూపం ముఖం యస్య- అని గణపతి వక్రతుండం గురించి చెబుతూ శాస్త్రం వివరించింది. అనగా ఆత్మ ప్రధానంగా వక్రించి ఉంటుంది అని. ఆత్మ వక్రించి ఉండటమేంటి? దీనికి భగవాన్ రమణ మహర్షి గారు మాత్రమే సమాధానం చెప్పారు. వారు ఎప్పుడూ షట్చక్రాల మీద ధ్యానం చేయమనలేదు, షట్చక్ర భేదనం గురించి చెప్పలేదు, ఈ జగత్తుని విడిచిపెట్టండి అని చెప్పలేదు.... వారు నేరుగా చెప్పారు. ఎందుకంటే వారంటారు.... కుండలినీ సహస్రారం చేరితే, సమాధి స్థితి వస్తుంది. కానీ వాసనలు నిర్మూలించబడవు. కాబట్టి యోగి సమాధి నుంచి బహిర్ముఖుడవుతాడు, బంధాల నుంచి విడువబడడు. కాబట్టి అతడు వాసనాక్షయం కోసం ఇంకా సాధన చేయాల్సి ఉంటుంది..... సుషుమ్నా నాడి ద్వారా మూలాధారం నుంచి సహస్రారం చేరిన కుండలినీ, అటు తర్వాత వంపు తిరిగి ఉన్న జీవనాడి ద్వారా హృదయాన్ని చేరుతుంది. ఆ జీవనాడినే అమృతనాడి అని కూడా అంటారు. అది వక్రించి ఉంటుంది. హృదయం అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. భౌతిక హృదయం ఎడమభాగంలో ఉంటే, ఆధ్యాత్మిక హృదయం కుడిభాగంలో ఉంటుంది.... అందులోకి కుండలినీ చేరితే, అప్పుడు నిరాటంకమైన సమాధి స్థితి కలుగుతుంది..... సాధారణంగా కుండలినీ సహస్రారం చేరిన తర్వాత, అప్పుడు జీవుడిలో 'నేనేవరు' అనే విచారణ మొదలై, దానికి సమాధానం దొరకగానే అది హృదయంలో కలిసిపోతుంది అని భగావన్ రమణ మహర్షి చెప్పారు. అందుకే రమణులు వేరే ఏ పద్దతి చెప్పకుండా, నేరుగా నేనెవరు అనే విచార మార్గాన్ని చూపారు. అది హృదయం వద్దే మొదలై, త్వరితగతిన ముక్తిని ఇస్తుంది, అందుకే వారు అవధూత, దక్షిణామూర్తి.....  వక్రతుండ గణపతి దానినే సూచిస్తున్నాడు. ఆయనకు వంకర తొండం ఉన్నా, అది ఏదో ఒక ప్రక్కకు తిరిగి ఉంటుంది. దీని ద్వారా స్వామి, వక్రించి ఉన్నఆత్మ తత్త్వాన్ని సూచిస్తున్నాడు.  వక్రములు కలిగిన మార్గాల నుంచి భక్తులను తప్పించి నేరుగా తనను చేరే మార్గాన్ని చూపువాడు వక్రతుండుడు.

త్వం సాక్షాదాత్మాసి నిత్యం అని గణపతి అథర్వశీర్షోపనిషత్తు అంటున్నది. అంటే సాక్షాత్తు ఆత్మ రూపంగా గణపతి ఉన్నాడు అని అర్దం.. ఆ ఆత్మయే తాను, అదే హృదయం. అందుకే గణపతిని గృత్సమదుడు ముద్గల పురాణంలో 'హృదిప్రకాశస్య ధరం స్వధీస్థం' అని స్తుతించాడు. అంటే విచారణ ద్వారా తన్ను తాను తెలుసుకుంటే, హృదయంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న గణనాథుని దర్శనం పొందవచ్చు. అదే వక్రతుండుని దర్శనం.  

వివరణ ఇంకా పూర్తికాలేదు .....

Monday, 1 September 2014

వక్రతుండ నామార్ధం

ఓం గం గణపతయే నమః

గణపతికి వక్రతుండుడని పేరు. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు, కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం. వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం. వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు. వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు. దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు. గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు. తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు. దుష్టులంటే వ్యక్తులే అని భావించనవసరంలేదు. మనలో కూడా అనేక చెడు సంస్కారాలు, నీచపు ఆలోచనలు ఉంటాయి. వాటిని నాశనం చేస్తాడు కనుక గణపతికి వక్రతుండ అని పేరు. అంతేకాదు, మనలో చెడు తొలగించినా, మనం మంచిగానే ప్రవర్తించినా, ఎదుటివారు మనకు కీడు చేయవచ్చు. కనుక అటువంటి వారి వక్రమైన ఆలోచనల పాలిట కాలుడై, నంశింపజేయువాడు కనుక గణపతికి వక్రతుండ అన్న నామం వచ్చింది.

పిల్లలు దురలవాట్లకు లోనైనప్పుడు, తల్లిదండ్రులు గణపతికి వక్రతుండ నామంతో జపించి, అర్చించి, వేడుకుంటే, తప్పుత్రోవ పట్టిన పిల్లలు తిరిగి మంచిమార్గంలోకి వస్తారు. ఈ వక్రతుండ అన్న నామం చాలా మహిమాన్వితమైంది. తంత్రశాస్త్రంలో సదాచారతంత్ర విధానంలో 'ఓం వక్రతుండాయ నమః' అనే వక్రతుండ గణపతి మంత్రానికి ఒక బీజాక్షరం చేర్చి, జపిస్తారు. ఈ వక్రతుండ గణపతి మంత్రాన్ని గణపతి గురించి తెలిసినవారి వద్దనుంచి గ్రహించి జపించాలి. ఆ జపం చేయడం వలన ఉపాసకుడి పై చేసిన ప్రయోగాలు విఫలమవుతాయి. మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు సద్గురు శివాయ సుబ్రహ్ముణియ స్వామి వారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. తొండం యొక్క పర్స్తావన వచ్చింది కనుక గణపతికి ఉండే వంకర తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి.

ఓం వక్రతుండాయ నమః

వక్రములను తొలగించే ఆ గణపతి మనలోని చెడు భావనలను తొలగించుగాకా
ఓం గం గణపతయే నమః