Thursday, 31 August 2017

వినాయక నవరాత్రుల్లో పూజించాల్సిన గణపతి స్వరూపాలు- జపించవలసిన మంత్రాలు



వినాయక నవరాత్రుల్లో రెండవ రోజు నెమలి వాహనం మీద కూర్చున్న గణపతిని 'ఓం శ్రీ సౌరబ్రహ్మణే వికటాయ నమః' అని ధ్యానించాలి లేదా ఓం వికటాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. అటుకులు నివేదించాలి. ఈ రోజు వికట వినాయకుని స్మరణ వలన కామదోషం నివారణవుతుంది. అధర్మబద్ధమైన కామం నశిస్తుంది. ఈ రోజు గణపతి సూర్యభగవానుని రూపంలో ప్రకాశిస్తాడు. సూర్యతత్త్వం కలిగి ఉంటాడు. సూర్యమండలంలో ప్రకాశిస్తూ ఉంటాడు.


వినాయక నవరాత్రుల్లో మూడవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న గణపతిని 'ఓం శ్రీ శక్తిబ్రహ్మణే లంబోదరాయ నమః' అని ధ్యానించాలి లేదా ఓం లంబోదరాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు లంబోదర వినాయకుని స్మరణ వలన క్రోధ దోషం నివారణవుతుంది. అనవసరమైన క్రోధం/ కోపం నశిస్తుంది. లంబోదర గణపతి క్రోధాసురుడిని అణిచివేశాడు. ఈయన శక్తి స్వరూపం. ఈ రోజు స్వామి వారికి పేలాలు నివేదించాలి.

వినాయక నవరాత్రుల్లో ఐదవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న మహోదర గణపతిని 'ఓం శ్రీ జ్ఞానబ్రహ్మణే మహోదరాయ నమః' అని ధ్యానించాలి. ఓం మహోదరాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు మహోదర వినాయకుని స్మరణ వలన మోహదోషం నివారణవుతుంది. మోహం నశిస్తుంది. మహోదర గణపతి జ్ఞానస్వరూపంగా వెలుగొందుతూ ఉంటాడు. స్వామి ధ్యానం జ్ఞానన్ని ఇస్తుంది.
నేడు స్వామికి కొబ్బరి కురిడీ నివేదించాలి.


వినాయక నవరాత్రుల్లో ఆరవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న గణపతిని 'ఓం శ్రీ ఏకదంతాయ నమః' అని ధ్యానించాలి. ఓం ఏకదంతాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు ఏకదంత వినాయకుని స్మరణ వలన మద దోషం నివారణవుతుంది. మదం నశిస్తుంది.


వినాయక నవరాత్రుల్లో ఏడవ రోజు సింహవాహనం మీద కూర్చున్న వక్రతుండ గణపతిని 'ఓం శ్రీ బ్రహ్మస్వరూపాయ వక్రతుండాయ నమః' అని ధ్యానించాలి. ఓం వక్రతుండాయ నమః అని కూడా 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు వక్రతుండ వినాయకుని స్మరణ వలన మాత్సర్యదోషం నివారణవుతుంది. మాత్సర్యం నశిస్తుంది.  
వక్రతుండునికి అరటిపళ్ళను నివేదించాలి. ఈయన బ్రహ్మస్వరూపంలో వెలుగొందుతూ ఉంటారు. 



వినాయక నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఆదిశేషుని మీద కూర్చున్న విఘ్నరాజ గణపతిని 'ఓం శ్రీ విష్ణవే విఘ్నరాజాయ నమః' అని ధ్యానించాలి లేదా 108 సార్లు ఆయన నామం జపించవచ్చు. ఈ రోజు విఘ్నరాజ వినాయకుని స్మరణ వలన మమతా దోషం నివారణవుతుంది. అనవసరమైన మమకారం నశిస్తుంది. ఈయన విష్ణుస్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఆయన ఆశీనుడైన ఆదిశేషుడు మహాపితృ. ఈయన్ను పూజిస్తే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. సత్తుపిండి నివేదన చేయాలి.


వినాయక నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మూషికం మీద కూర్చున్న ధూమ్రవర్ణ గణపతిని 'ఓం శ్రీ శివాత్మనే ధూమ్రవర్ణాయ నమః' అని ధ్యానించాలి లేదా ఓం ధూమ్రవర్ణాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు ధూమ్రవర్ణ వినాయకుని స్మరణ వలన అభిమాన దోషం నివారణవుతుంది. అనవసరమైన అభిమానం/ అహంకారం నశిస్తుంది. ఈయన శివస్వరూపుడు. అహాన్ని అణగద్రొక్కి తనలో ఐక్యం చేసుకుంటాడు. తన భక్తులు ఎక్కడ ఉన్నా, వాయువు రూపంలో ఉంటూ, వారిని గమనిస్తూ, రక్షిస్తూ ఉంటాడు.
నేతి అప్పాలు నివేదించాలి.

No comments:

Post a Comment