Sunday, 22 April 2018

హిందూ ధర్మం - 265 (కర్మసిద్ధాంతం- 5)



శాస్త్రం మనకు కర్మల్ని రెండు రకాలుగా విభజించింది. ఒకటి విహిత కర్మ, రెండవది నిషిద్ధ కర్మ. 
విహిత కర్మ అంటే ఆచరించించవలసిన కర్మ. 'సత్యంవద ధర్మంచర' అంటుంది తైత్తరీయోపనిషత్తు. సత్యమే మాట్లాడండి, ధర్మాన్ని పాటించండి. విధిగా పితృదేవతలకు శ్రాద్ధకర్మలు పెట్టండి అని తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. ఇలా శాస్త్రం మనకు ఆచరించమని విధించిన కర్మలు విహిత కర్మలు.

నిషిద్ధ కర్మ అంటే చేయకూడని కర్మ.  ఉదాహరణకు పరమశివుడు సూర్యభగవానుని స్తుతించిన సూర్యాష్టకంలో ఈ విధంగా ఉంది. ఆదివారం నాడు మద్యం తాగకూడదు, మాంసాహారం తినకూడదు. స్త్రీగమనం కూడదు అంటే శృంగారం కూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. తైలాభ్యంగన స్నానం చేయరాదు అంటుంది, అంటే ఆదివారం నాడు పైవి చేయడం నిషిద్ధం. ఇలా ప్రత్యేక దినాల్లో కొన్ని నిషిద్ధమైతే, కొన్ని ఎల్లవేళలా నిషిద్ధం. ఎవరిని బాధించకూడదు, శారీరికంగా కానీ, మానసికంగా గానీ హింసించకూడదు. అలా హింసించడం నిషిద్ధ కర్మ. 

మళ్ళీ విహిత కర్మలు మూడు రకాలు. అవి నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ.

నిత్యకర్మ అంటే నిత్యం ఆచరించవలసిన కర్మ - స్నానం, జపం, సంధ్యావందనం, దీపారాధన, దైవ ప్రార్థన మొదలైనవి. అంటే మన రోజూవారీ జీవితంలో అనునిత్యం ఆచరించాల్సిన కర్మలు.

నైమిత్తిక కర్మ - అంటే ప్రత్యేకమైన రోజుల్లో ఆచరించే కర్మ. ఉదాహరణకు వినాయక చవితి నాడు వరసిద్ధి వినాయకుడిని పూజించడం, అక్షయతృతీయ నాడు దానాలు చేయడం, పెద్దలు మరణించిన తిధుల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మొదలైనవి. అంటే ఇవి ప్రత్యేకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆచరించేవి.

కామ్య కర్మ - అంటే కోరికతో చేసే కర్మ, లేదా మనకున్న కోరికలను సిద్ధింపజేసుకోవడానికి చేసే కర్మలు. ఉదాహరణకు మరణానంతరం స్వర్గాది లోకాలను పొందడానికి అగ్నిష్టోమం మొదలైన యగాలు చేస్తారు. అలాగే వివాహం ఆలస్యమవుతుంటే, దానికి ఏర్పడ్డ ఆటంకాలు తొలగడానికి కొన్ని ఆలయాలను దర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా మన కోరికలు తీరడానికి, అందుకు తగ్గ పుణ్యం ప్రాప్తించడానికి ఎన్నో పనులను మనం నిత్యం చేస్తుంటాము. వాటిని కామ్య కర్మలు అంటారు.

చేసే కర్మ యొక్క స్వభావాన్ని బట్టి దాన్ని సత్కర్మ లేదా దుష్కర్మ అన్నారు. సత్కర్మ అంటే మంచి కర్మ, దుష్కర్మ అంటే చెడు కర్మ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. చేస్తున్న కర్మ యొక్క స్వభావానికంటే ముఖ్యమైనది, ఆ కర్మ వెనుకున్న కర్త యొక్క ఉదేశ్యం. ఒక పని చేస్తున్నప్పుడు, అది ఏ భావంతో, ఎందుకు చేస్తున్నామనే దాన్ని అనుసరించి కర్తకు ఫలం లభిస్తుంది. కాబట్టి ఆచరించబడుతున్న కర్మకంటే, దాని వెనుకనున్న భావాలు, ఉద్దేశాలు ముఖ్యం. భగవంతుడు చేసిన కర్మను చూడడు, దాని వెనుకనున్న ఉద్దేశాలను చూస్తాడు. 

స్వామి వివేకానంద కర్మ యోగంలో ఒక మాట అంటారు. మనం ఉన్నది సాపేక్ష ప్రపంచంలో. ఇది మంచి, చెడు, సుఖ దుఃఖాలు మొదలైన ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఏ పని పూర్తిగా మంచిది కాదు, పూర్తిగా చెడ్డది కాదు. మంచి చేసే పని కూడా కొందరికి చెడు చేస్తుంది, చెడు కూడా కొందరికి మేలు కలిగిస్తుంది. కాకపోతే, ఒక కర్మ అత్యధికమందికి మేలు కలిగిస్తే అది మంచి కర్మగానూ, అత్యధికశాతం చెడు కలిగిస్తే, అది చెడ్డదిగానూ చెప్పాయి శాస్త్రాలు.       

To be continued .....

No comments:

Post a Comment