Sunday, 22 April 2018

గ్లౌం బీజం - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం



గణపతి ఉపాసనలో లక్ష్మీ నారాయణులు, ఉమామహేశ్వరులు, రతీమన్మధులు, భూదేవి సహిత వరాహ స్వామి వార్లను కూడా ఉపయోగిస్తారు. వీరు గణపతి పీఠానికి నాలుగు దిశల యందు ఉంటారని, వీరి అనుగ్రహం కూడా పొందాలని చెప్తారు. అందులో ముఖ్యంగా గణపతి ఉపాసన, హోమం చేసేవారు, గణేశ మంత్రాల్లో 'గ్లౌం' అనే బీజాక్షరాన్ని ఉపయోగిస్తారు. 

గ్లౌం అనేది భూదేవి, వరాహ స్వామి వార్లకు చెందినది. ఇదం ద్యావా పృధ్వీ సత్యమస్తు అంటూ యజుర్వేదం సంధ్యావందనంలో నిత్యం బ్రాహ్మణులు పఠిస్తారు. ఈ భూదేవి మాకు తల్లి, తండ్రి వరాహ స్వామి అని దీని ఒక అర్ధం. ఇక్కడ మళ్ళీ వరాహ స్వామిని అంతరిక్షంగా చెప్తారు. అంటే భూమి, అంతరిక్షాలు మనకు తల్లిదండ్రులు అని. ఇక్కడ అంతరిక్షం అంటే భూమికి 8 కిలోమీటర్ల పైన ఉన్న ప్రదేశం అనే అర్ధం స్వీకరించాలి. అదే వేదంలోని భూసూక్తంలో కూడా కనిపిస్తుంది. 

ఈనాటి సైన్సు కూడా ఒక విషయం చెప్తుంది. ఈ భూమి మీద జీవం ఏర్పడటానికి కారణం ఇక్కడున్న ప్రత్యేక వాతావరణం. దానికి కారణం అంతరిక్షంలో అంటే భూమికి 10 నుంచి 17 కిలోమీటర్ల పైన ఉన్న ఓజోన్ పొర అని చెప్తున్నారు. అది లేకపోతే, భూమి పైకి సూర్యుని అతినీలలోహిత కిరణాలు ప్రవేసించి, జీవజాలం కష్టమయ్యేది. ఇంకా ఈ విషయంలో చాలా ఉన్నాయి. వీటిని వేదంలో ఒక్కమాటలో చెప్పారు. మన జీవనానికి కారణమైన ఆ అంతరిక్షం తండ్రి అని, ఈ భూమి నుంచి వచ్చాము కనుక ఈ భూమిని తల్లి అని అన్నారు. దాన్నే ఉపాసకులు, భక్తులు గ్లౌం అనే బీజంలో చూసి, గుర్తు చేసుకుంటారు.

ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్నది ఏమిటంటే కాలుష్యం పేరుతో భూమిని, అంతరిక్షాన్ని నాశనం చేయడం. దాని మీద అవగాహన కోసమే 22 ఏప్రిల్ న ప్రపంచ ధరిత్రీ దినోత్సవం జరుపుతున్నారు. కానీ ఇదే అవగాహనను వేద సంస్కృతి కొన్ని వేల ఏళ్ళ క్రితమే చిన్న మంత్రంలో నిక్షిప్తం చేసింది. 

ఇది అందరూ గర్హించాలి, అతి ముఖ్యంగా ఉపాసకులు, సాధకులు. గ్రహించి, భూమిని రక్షించడానికి చర్యలు చేపట్టినప్పుడే ఆ మంత్రాధిదేవత అనుగ్రహిస్తుంది. ఏదో కోరికతో గణపతి హోమాలు చేయడం కాకుండా, దీన్ని అర్ధం చేసుకుని, ఆచరణలో పెడితే, తప్పకుండా ఉపాసన సిద్ధిస్తుంది. 

No comments:

Post a Comment