Sunday, 29 April 2018

హిందూ ధర్మం - 266 (కర్మసిద్ధాంతం - 6)



నిత్య, నైమిత్తిక కర్మలను చేయడం వలన పుణ్యం, యశస్సు, ఆత్మబలం కలుగుతాయి, వాటిని విడిచిపెట్టడం వలన పాపం కలుగుతుంది. నిషిద్ధ కర్మను చేయడం వలన పాపం కలుగుతుంది, దాన్ని విడిచిపెట్టడం వలన సద్గతి, ఆత్మబలం, తపశ్శక్తి పెరుగుతాయి. 

చేసిన కర్మ మనకు ఇచ్చే ఫలితాన్ని అనుసరించి దాన్ని పాపకర్మ, లేదా పుణ్యకర్మ అంటాము. ఇతరులకు మేలు చేసేది; ఇతరులకు హానీ చేయకుండా తనకు మేలు చేసేవి అయిన కర్మలను సత్కర్మలుగా చెప్తారు. ఇతరులకు హానీ చేసే కర్మను పాపకర్మ అంటారు.

సులభంగా చెప్పాలంటే సుభాషితకారులు ఇలా అన్నారు.

అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం
పరోపకారం పుణ్యాయః పాపాయ పరపీడణం

అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు వాటి సారాన్ని ఈ విధంగా కీర్తించాడట. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, అపకారం చేయడం పాపం అని. నిజానికి ఇతరులకే కాదు, తనకు హానీ చేసేది కూడా పాపమే.

ఎడ్ల బండి నడవడానికిబండి చక్రాలు ఎలాగో, అలాగే జీవ యాత్ర సాగాలంటే పాపపుణ్యాలు అలాంటివి. ఈ రోజు నీకున్న ఆరోగ్యం, ఆహారం, ఆహార్యం, సంతోషం, పదవి, హోదా మొదలైన అన్ని సుఖాలకు కారణం పుణ్యకర్మ లేదా పుణ్యఫలం. అలాగే నీవు అనుభవించే కష్టాలు, భయాలు, రోగాలు మొదలైన అన్ని రకాల దుఃఖాలకు కారణం పాపకర్మ లేదా పాప కర్మ యొక్క ఫలం. కర్మ సిద్ధాంతం ఇలా చెప్తుంది. నీవు చెడు చేస్తే, చెడును పొందుతావు; మంచి చేస్తే మంచి అనుభవిస్తావు; ఇతరులను అవమానిస్తే, అవమానించబడతావు; దూషిస్తే దూషించబడతావు; దోషాలు ఎంచితే, నీలోని దోషాలు ఎంచబడతాయి; ఆకలి తీరిస్తే, నీ ఆకలి తీర్చబడుతుంది; నీవు తిరస్కరిస్తే, తిరస్కరించబడతావు; ప్రేమిస్తే, ప్రేమించబడతావు; శంతిని పంచితే, శాంతిని పొందుతావు; అశాంతిని రగిలిస్తే, అశాంతితో కాలి బూడదవుతావు. ఒక్కమాటలో చెప్పాలంటే నీవు (ఇతరులకు) ఏది ఇస్తావో, అదే నీకు తిరిగి లభిస్తుంది. 

ఈ జన్మలో నీవు అనుభవించే సుఖాలకు కారణం నువ్వు గతంలో చేసిన పుణ్యమైతే, దుఃఖాలకు కారణం నీ గత జన్మ పాపం. అంటే జీవుడు, తాను చేసే కర్మ ద్వారా, పాపపుణ్యాలను మూటకట్టుకుని జన్మల పరంపరంలో ప్రయాణం చేస్తుంటాడు. ఆ క్రమంలో మరణం తర్వాత పోగు చేసుకున్న సంపదలు గానీ, బంధువులు గానీ తన వెంట రారు. అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన వారు అక్కడ కరెన్సీని ఇక్కడ నేరుగా ఉపయోగించలేరు. దాన్ని భారత కరెన్సీలోకి మార్పిడి చేసుకోవాలి. అప్పుడే వీలవుతుంది. అలానే పాపపుణ్యాలు. కూడబెట్టిన సంపదను దానం అనే ప్రక్రియ ద్వారా పుణ్యంగా మార్చుకోవచ్చు. అప్పుడది జీవయాత్రలో జీవుడి వెంట ఉండి, అతడికి అవసరమైనప్పుడు, తగిన వసతిని సమకూర్చుతుంది. కాబట్టి తాను పోగు చేసుకున్న సంపదను పుణ్యంగా మార్చుకుంటాడు వివేకవంతుడు. అలా కాక, అన్నీ కట్టుకుపోతామనే భ్రమలో ఉండి, తాను తినక, ఇతరులకు పెట్టక, ఇతరుల నోటి దగ్గరి ముద్దను సైతం లాక్కునే వాడు అవివేకి, బుద్ధిహీనుడు.

అందుకే భగవాన్ రమణులు ఇలా అంటారు. "ఇతరులకు ఇచ్చిందేదో, అది మాత్రమే తనకు దక్కుతుంది. మిగితావన్నీ వెళ్ళిపోతాయి. ఈ రహస్యం తెలిసిన ఇతరులకు ఇవ్వకుండా ఎలా ఉండగలరు?"

అందుకే సనాతన ధర్మం దానం గురించి గొప్పగా చెప్తుంది. ఒక్కో దానానికి ఒక్కో ఫలం ఉంటుంది. ఉదాహరణకు కొందరికి అన్నీ ఉంటాయి, కానీ ఆత్మసంతృప్తి ఉండదు. కొందరికి ఏమీ లేకున్నా, సంతృప్తిగా ఉంటారు. దీనికి మూలం ఎక్కడ ఉంది? శాస్త్రం ఇలా చెప్తుంది. మామిడి పండును దానం చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అది మామిడి పండు దానం వలన జీవుడు సంపాదించుకున్న పుణ్యఫలం. అది ఏ జన్మలో చేసినా, ఎప్పుడో ఒకప్పుడు, ఫలం లభిస్తుంది. అలా ప్రతి వస్తువు దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ మరింత విశేషం ఏమిటంటే ఇచ్చేవాడు అనగా దాత గొప్ప కాదు, దానం పుచ్చుకునేవాడు గొప్ప అంటుంది సనాతన హిందూ ధర్మం. అతడు దానం స్వీకరించి, పుణ్యఫలానికి నీకు పాత్రతను కలిగిస్తున్నాడు. కాబట్టి మన ధర్మంలో దానం తీసుకున్నవాడు దాతకు నమస్కరించడు, దాతయే దానం పుచ్చుకున్నవానికి నమస్కరిస్తాడు. తనకు అంతటి అమూల్యమైన భాగ్యాన్ని ఇచ్చినందుకు.  అదేకాక దానం పుచ్చుకునేవాడిని శ్రీ మాహావిష్ణు స్వరూపంగా భావించమని శాస్త్రం చెబుతోంది. అతడికి పాదపూజ చేయమంటుంది.

ఇదే తైత్తరీయోపనిషత్తులో కనిపిస్తుంది.
శ్రద్ధయా దేయం | అశ్రద్ధయా2 దేయం | శ్రియా దేయం | హ్రియా దేయం | భీయా దేయం | సంవిదా దేయం || 11.6

శ్రద్ధతో దానం ఇవ్వండి. ఉదాసీనతతో, అశ్రద్ధతో దానం ఇవ్వకండి. శక్తి మేరకు, సమృద్ధిగా దానం ఇవ్వండి. వినమ్రతతో, అణుకువ కలిగి దానం ఇవ్వండి. గౌరవపూర్వకంగా దానం ఇవ్వండి. సౌహార్దంతో దానం ఇవ్వండి.

To be continued ..... 

No comments:

Post a Comment