Saturday 5 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (15)




పూర్ణ స్వరూపుడూ ఆయనే, శూన్య స్వరూపుడూ ఆయనే. ఈ సున్న ఉన్నది, లేని దానిని పరమాత్మ స్వరూపమనే సూచిస్తుంది. వినాయకునికి తీపి పదార్థముతో ఉండే ఉండ్రం గుండ్రంగానే ఉంటుంది. దానిని పూర్ణమంటాం. అట్టి పూర్ణ స్వరూపుని అర్ధచంద్రాకారునిగా సూచిస్తాం. ఇదే అన్నిటిని పూర్ణంగా చేస్తుంది.

ఇతని గుర్తు వంకరగా ఉండి తిన్ననైన గీతతో (-) ముగుస్తుంది పూర్ణత్వమైనా శూన్యత్వమైనా వక్రంగానే ఉంటూ అతడు తిన్నగా నున్నాడని ఆ గీత సూచిస్తుంది. వక్రానికి విరుద్ధం ఆర్జవం. అనగా ఋజుత్వం. నిర్గుణం, సగుణత్వము నిర్గుణ బ్రహ్మ తత్త్వాన్నే సూచిస్తాయి.

ఇక 'ఊ అనే అక్షరం, ప్రణవంలోని మధ్యాక్షరం. అ+ఉ+మ లతో ఓంకారం. 'అ' సృష్టిని, 'ఊ - రక్షణను; 'మ' సంహారాన్ని, అంటే వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. ఈ ముగ్గురూ ఒక పరాశక్తి నుండే వచ్చినవారు. ఆమె ప్రణవ స్వరూపిణి. ప్రణవాన్ని దేవీ ప్రణవమని అనరు. ఉమయే దేవీ ప్రణవం. అ,ఉ,మ,లే ఉమ (ఉ+మ+అ). ఓంలో మొదటి అక్షరం 'అ'. అమ్మవారి ప్రణవం ఉతో ఆరంభమవడం వల్ల దయతో కూడిన పోషణత్వాన్ని సూచిస్తుంది. కనుక 'ఉమ' అనే మాటయే దేవీ ప్రణవం.


ఓంకారంలో 'ఉ' గుండె వంటిది. అదే ఉమా ప్రణవంలో మొదటి అక్షరం. అ,మ, లేకుండా 'ఊ కలిగిన వినాయకుని గుర్తు ఏమని సూచిస్తుంది? అతడు తల్లి వంటి వాడే కాదు, ఒక మెట్టు ఎక్కువని సూచిస్తుంది. ఎట్లా? సృష్టిని సూచించే 'అ', సంహారాన్ని సూచించే 'మ'తో కూడినది ఆమె. కాని వినాయకుని గుర్తు 'ఉ తోనే ఉంటుంది. అంటే ఇతని పని కేవలం రక్షణయే. కరుణామూర్తి కనుక 'ఉ'తోనే ఉంటాడు. ప్రణవంలో 'ఉ' విష్ణువును సూచిస్తోంది. ఉమ కూడా విష్ణురూపిణియే. ఆమెకు నారాయణ సహోదరి, విష్ణుమాయా విలాసిని, నారాయణి అని ఇతర నామాలు. అందరికీ వచ్చిన శుక్లాంబర ధరం విష్ణుం శ్లోకం లో ఉన్న విష్ణువు సర్వవ్యాపి. ఈ 'ఊ శివశక్తులను విష్ణువును కలిపి సూచిస్తోంది. అనగా శైవ వైష్ణవ మతాలు సంగమమిక్కడ. 


No comments:

Post a Comment