వినాయకుని గుర్తు u-. అనగా వంకరగా ఉండి చివర తిన్ననైన గీతతో ఉంటుంది. చక్రంలా ఒకటి తిరుగుతూ ఉంటే ఒక ఇరుసుండాలి కదా! అది తిన్నగా ఉంటుంది కదా! విష్ణువు యొక్క చక్రం గీసినప్పుడు క్రింద ఒక వ్రేలుతో దానిని పట్టినట్లుంటుంది. ఆ వేలు ఇక్కడ ఇరుసు. గుండ్రంగా ఉండే ప్రపంచ భువనాలను తిప్పే ఇరుసు తిన్నగానే ఉండాలి. అది కంటికి కనబడకపోయినా ఒక తిన్ననైనది త్రిప్పుతూ ఉంటుంది. అదే శక్తి రూపంలో ఉంటుంది. దానికి గుర్తుగా వినాయకుని గుర్తు. అనగా వంకర, దాని చివర తిన్ననైన గీత.
నేను చదివినదో విన్నదో గాని శక్తి యొక్క ఆగమనం వినాయకుని గుర్తులానే ఉంటుందిట. వినాయకుని తుండం, భ్రమణానికి గుర్తు. గీత దాని నుండి ఉదయించిన శక్తికి గుర్తు. ఈ రెంటినీ నాద బిందువులుగా శివశక్తి సమ్మేళనంగా భావిద్దాం.
పూర్ణత్వాన్ని సూచించాలంటే ఒక చుక్కతో ఆరంభమై మరల చుక్క దగ్గరకు వచ్చినపుడే. అది బ్రహ్మమును సూచిస్తుంది. వినాయకుని గుర్తు సున్నాను గీయబోయి అర్ధచంద్రాకారంగా ఉంచుతూ దాని చివర తిన్ననైన గీత నుంచుతాం. ఇది ఏమని సూచిస్తుంది? బ్రహ్మమొక్కటియైనా అందులోనుండి అనేక బ్రహ్మాండాలు వచ్చాయని అవి బ్రహ్మమే అని పూర్ణములే అని సూచిస్తుంది. అనగా బ్రహ్మమూ, ప్రపంచమూ పూర్ణములే. పూర్ణమైన బ్రహ్మము నుండి పూర్ణమైన ప్రపంచం వచ్చిందని ఉపనిషత్తు చెప్పింది కదా? వినాయకుని గుర్తు వంకరగా నుండి గీతతో ఉంటుంది కనుక ఆ వంకర, బ్రహ్మ పూర్ణత్వాన్ని ఆ గీత, ప్రపంచ పూర్ణత్వాన్ని సూచిస్తుంది.
నేను వంకర, తిన్నని గీత అని పేర్కొన్నాను. ఈ రెండూ స్వామి దంతాన్ని సూచిస్తాయి. ఆయన ఏకదంతుడు. అవ్వైయార్, ఈ పిల్లల దేవుణ్ణి పూజించి, ముసలితనాన్ని వయస్సులోనే పొంది, ఈ ఏక దంతుడు ప్రారబ్ధ కర్మను పోగొడతాడని చెప్పింది.
No comments:
Post a Comment