Wednesday, 7 May 2014

హిందూ ధర్మం - 58 (అక్రోధః)

అసలు కోపం ఎందుకు వస్తుందన్న ప్రశ్నకు భగవద్గీత మొదలైన గ్రంధాలు, ఉపనిషత్తులు చక్కని సమాధానం చెప్తాయి. కోపానికి ప్రధాన కారణం కామము. కామము అంటే కోరిక (ఏదైనా కావచ్చు), బాగా గమనించండి. అన్నీ మనకు నచ్చినట్టుగానే జరగాలని కోరుకుంటుంది మనసు. అది కామం, కోరిక. మనకు నచ్చినట్టుగా జరగకపోతే కోపం పొడుచుకు వస్తుంది. అందరూ నేను చెప్పినట్టే వినాలి, నా మాటే ఎప్పుడూ నెగ్గాలి అని అనుకుంటుంది మనసు. అది మనసు యొక్క సహజ లక్షణం. మనం చెప్పినట్టు ఎవరైనా వినకపోయినా, మన భావాలకు విరుద్ధంగా చెప్పినా, మనతో మనతో విభేదించినా కోపం తన్నుకు వస్తుంది. అందరూ మనం అనుకున్నట్టే ఉండాలి, లేని పక్షంలో సదరు వ్యక్తిని కోపగించుకుంటాం.. ఆఖరికి ఎదుటివాడు తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకున్నా, మనం అంగీకరించలేని స్థితికి చేరుకున్నాం. అయ్యో! అది అవతలి వ్యక్తి అభిప్రాయమే. అతనికి తన ఆలోచనల మీద, భావ వ్యక్తికరణకు స్వేచ్చ ఉందని, ప్రతి వ్యక్తికి కొంత వరకు స్వాతంత్ర్యం ఉంటుందన్న విషయమే మనం అంగీకరించలేకపోవడం మన దౌర్భాగ్యం అని నిత్యం మనసుకు సమాధానం చెప్పండి..

ముందు మనం అందరిని అంగీకరించడం నేర్చుకోవాలని శాస్త్రం చెప్తుంది, గురువుల భోధనల సారం కూడా అదే. ఆధ్యాత్మిక సాధనలో తొలి మెట్టు అందరిని అంగీకరించడమే. కోపగించుకునే ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నామా? మనం అనుకున్నవి అనుకున్నట్టుగా మాట్లాడుతున్నామా? సమర్ధించుకోకుండా సమాధానం కోసం ప్రయత్నించండి. లేదు అనే సమాధానం మాత్రమే వస్తుంది. మనకు నచ్చినట్టుగా మనం జీవించలేనప్పుడు, ప్రవర్తించలేనప్పుడు, లోకంలో అందరూ మనకు నచ్చినట్టుగా ప్రవర్తించాలి అనుకోవడం మూర్ఖత్వం కాదా? మనం ఎంత శాడిస్టులము? ఎంత సంకుచిత స్వభావం మనది. మన మీద మనకు నియత్రణ లేనప్పుడు, ఇతరులను నియంత్రించాలనుకోవడం ఎంత అమాయకత్వం. అసలు వేరొకరి మనసులోకి తొంగి చూసే అధికారం మనకు ఎక్కడిది? ఇలా మనసును సమాధాన పర్చుకోండి. ధర్మం కూడా అదే అంటొంది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మార్చుకోలేని నువ్వు అవతలివ్యక్తిపై ఎందుకు కోపగించుకుంటావు. అందుకే కోపాన్ని విడిచిపెట్టు (అక్రోధః).

To be continued......

No comments:

Post a Comment