Sunday, 25 May 2014

హిందూ ధర్మం - 66 (రాజర్షి విశ్వామిత్రుడు)

ఎందరో తపస్వులు, మహాతపస్వులకు, కిన్నెరులకు, ఉర్గలకు నిలయమైన హిమాలయపర్వతాలకు చేరుకుని పరమశివును గురించి తపస్సు ప్రారంభించాడు. చాలా కాలానికి వృషభ ధ్వజం కలిగి, త్వరగా వరాలు ఇచ్చే శివుడు ప్రత్యక్షమయ్యాడు.

ఓ రాజా! నీవు దేన్ని కోరి ఈ తపస్సు చేశావో నాకు చెప్పు. నేను నీకు ఆ వరం ఇస్తాను అన్నాడు శివుడు. ఓ మహాదేవా! అనఘా! అంగ, ఉపాంగ, ఉపనిషద్ రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్ని నాకు ప్రసాదించు. దేవ దానవ గంధర్వ యక్ష ఋషి మొదలైన వారందరి వద్ద ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో, వాటి గురించి మొత్తం నాకు తెలియాలి. వాటి మీద నాకు ప్రతిభ ఉండాలి. ఇది నువ్వు మాత్రమే ప్రసాదించగలవు అన్నాడు విశ్వామిత్రుడు పరమశివునితో. 'ఏవం అస్తు - అలాగే జరుగుతుంది' అని శివుడు అదృశ్యమయ్యాడు.

మహాబలవంతుడైన విశ్వామిత్రుడు ఈ వరం పొందడంతో మరింత బలవంతుడయ్యాడు, అప్పటికి వరకు అణిగి ఉన్న దర్పం ఒక్కసారి సముద్రంలా పోటెత్తింది. పౌర్ణమి రోజున సముద్రం ఏలా ఉంటుందో విశ్వామిత్రుడు అలా ఉన్నాడు. వీరత్వం పెరిగి ఇక ఈ రోజుతో వశిష్టుడు మరణించినట్టే అని వశిష్ట ఆశ్రమానికి బయలుదేరాడు.

(మనం గమనిస్తే, మొదట వశిష్టమహర్షిని భూమిపై తిరిగే దైవంగా భావించి, ఆయన దర్శనమే మహాభాగ్యంగా భావించాడు విశ్వామిత్రుడు. కానీ కోరిక, దాని వెంట వచ్చిన కోపం, ఎటువంటు పరిస్థితికి దారి తీసిందో చూడండి. యజ్ఞానికి మూలమైన కామధేనువు తనకు దక్కాలని కోరిక పుట్టింది. తనది కానీ వస్తువును తాను కోరడం తప్పు, దొంగతనంతో సమానమని గుర్తుకురాకుండా పోయింది. మనసు కోరగానే, నిగ్రహించుకోవడం మానేసి, శబలను అడిగాడు. బ్రహ్మవేత్త, తపస్ సంపన్నుడైన వశిష్టుడు అంగీకరినలేదని ఊరుకోకుండా, వశిష్టుడికి ఇతర వస్తువులు బదులు ఇస్తానని ఆశ చూపడడానికి ప్రయత్నించాడు. ఆయనతో వాదించాడు. ఏ వశిష్టుడైనైతే గౌరవైంచాలో, ఆయన మాటను దిక్కరించాడు. వశిష్టుడు అంగీకరిచలేదని కోపం వచ్చింది. కోపంలో ఏం చేస్తున్నాడో అర్దంకాక, మతితప్పి కల్పవృక్షం లాంటి పవిత్రమైన గోవును తాళ్ళతో కట్టి లాక్కువెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో యుద్ధం చేసి, మొత్తం పరివారాన్ని పోగొట్టుకున్నాడు కానీ ఇంకా కోరిక చావలేదు, దాన్ని అంటిపెట్టుకుని ఉన్న కోపం తగ్గలేదు. ఇప్పుడు బలం వచ్చింది కనుక ఏకంగా వశిష్టుడు ఇక మరణించినట్టేనని పలికాడు. కోపము, కోరిక మనిషిని ఎంత నీచ స్థితికి దిగజారుస్తాయో చూడండి)

To be continued ..............

No comments:

Post a Comment