Friday, 30 May 2014

హిందూ ధర్మం - 71 (రాజర్షి విశ్వామిత్రుడు)

నేను దైవసమానులైన వశిష్టమహర్షి చేత, అంతే స్థాయిలో ఉన్న ఆయన కూమరులైన మీ చేత తిరస్కరించబడ్డాను. ఈ పరిస్థితుల్లో నేను వేరొకరిని ఆశ్రయిస్తాను. మీకు స్వస్తి కలుగుగాకా అన్నాడు త్రిశంకు. ఇది విన్న వశిష్టమహర్షి పుత్రులకు జరగబోయే విపత్కర పరిస్థితి గర్హించి మరింత కోపంతో 'నీవు చండాలునిగా మారిపోతావు' అంటూ శపించి, వారి ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయారు. (ఇక్కడ చండాలుడంటే అంటరానివారని, తక్కువజాతి వాడని అనుకోకూడదు. అంటరానితనం వేదంలో ఎక్కడా చెప్పబడలేదు, అది అంగీకరయోగ్యం కాదు. సనాతన ధర్మంలో కులం కంటే గుణం ప్రధానం. నువ్వు ఏ కులంలో పుట్టావన్నది కాదు, ఎంత మంచి గుణవంతుడివన్నదే నిన్ను భగవంతుని వద్దకు చేర్చుతుందని మన ధర్మం చెప్తోంది.) మరుసటి రోజుకు రాజు చండాలునిగా మారిపొయాడు. నల్లని వస్త్రాలి ధరించి, రేగిపోయిన జుత్తు, నల్లని శరీర ఛాయ వచ్చేశాయి. మెడలో ఉండే పూలహారాలు పుర్రెలదండలుగా మారిపోయాయి. ఒంటి నిండా బూడిద పూసుకుని, ఇనుప ఆభరణాలు వేసుకున్నాడు రాజు. ఆ రూపంలో అతన్ని చూసిన మంత్రులు, రాజపరివారం, ప్రజలు భయంతో దూరంగా పరుగులు తీశారు. ఒక రాత్రంతా బాధపడిన రాజు, మరుసటి రోజు తపస్వి అయిన విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు.

రాజును చూసిన విశ్వామిత్రునికి దయ కలిగింది. తన స్థితి వలన సింహాసనం, వైదిక క్రతువులు, స్వర్గాదిభోగాలకు త్రిశంకు దూరమయ్యాడు. నీకు శుభములు చేకూరుగాకా అంటూ ఓ మహారాజా! త్రిశంకు! అయోధా పరిపాలాక! నీ రాకకు కారణమేమిటి? నీవు శాపగ్రస్థుడవు కావటానికి కారణమేమి? అని అడిగారు విశ్వమిత్రుడు. దానికి బదులుగా చేతులు జోడించి త్రిశంకు 'నేను నా గురువు, గురుపుత్రులు చేత తిరస్కరించబడ్డాను. నా కోరిక తీరకపోగా, ఈ దుస్థితి ఏర్పడింది. ఓ విశ్వామిత్ర మహర్షి! సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలన్నది నా కోరిక. నేను ఎన్నో వందల యాగాలు చేసినా ఈ ఫలితం నాకు దక్కలేదు. నేను అసత్యం చెప్తున్నానని అనుమానించకండి ఎందుకంటే నేను ఇంతవరకు ఎన్నడు అబద్దం చెప్పలేదు. ఇప్పుడు చెప్పడం లేదు, ఇక ముందు కూడా చెప్పను. ఎందుకంటే ఎన్ని యజ్ఞాలు చేసినా అబద్దం చెప్పినవాడిని, యజ్ఞాలు రక్షించలేవు. అతడు నరకానికి వెళతాడు. నేను నా క్షత్రియ ధర్మం మీద ప్రమాణం చేస్తున్నాను. అనేక విధములైన యజ్ఞముల చేత దేవతలను తృప్తి పరిచాను, ధార్మికంగా ప్రజలను పరిపాలించాను, నా ప్రవర్తన చేత మహాత్ములు కూడా సంతుష్టులయ్యారు. అన్నిటికి ఒకటే ఫలం ఆశించాను. ఎన్నో యజ్ఞాలు చేసినా, నా గురువులు నా కోరికను మన్నించలేదు.

To be continued ..............

No comments:

Post a Comment