Monday, 19 May 2014

హిందూ ధర్మం - 62

విశ్వామిత్రుడు తాను చెప్పాలనుకున్నది పరోక్షంగా చెప్పినప్పటికి, వశిష్టమహర్షి మళ్ళిమళ్ళీ బ్రతిమిలాగా, చివరకు విశ్వామిత్రుడు వశిష్టులవారితో 'మిమ్మల్ని అది సంతోషపెడుతుంది కనుక అలాగే కానివ్వండి' అని సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్న మహర్షి ఆనందంతో తన దగ్గర ఆశ్రమంలో పోషింపబడుతున్న శబల అనే పేరుగల ఆవును పిలిచారు, అది కామధేనువు, కోరినవన్నీ వెంటనే ఇస్తుంది.

రా రా శబల. త్వరగా వచ్చి నేను చెప్పింది విను. నేను గొప్ప రాజర్షికి సమానమైన విశ్వామిత్రునకు, అతని సైన్యానికి భోజనం ఏర్పాటు చేసి సేవ చేయదల్చుకున్నాను, నా కోసం వారందరికి నువ్వు భోజనం సిద్ధం చేయాలంటూ "ఓ కామధేనువా! నీవు కోరినవన్నీ ఇట్టే ప్రసాదిస్తావు. ఇక్కడున్న అందరి మనసుల్లో ఎవరికి ఏ ఏ ఆహారం ఇష్టమో గ్రహించి, వారి వారి అభిరుచులకు అనుగుణంగా షడ్రసోపేతమైన ఆహారన్ని ప్రసాదించు. ఓ శబలా! అన్నరాశులను, పాణీయాలను, రసాలను, లేహ్యాలను, చోష్యాలను, సర్వ విధములైన ఆహారమను సృష్టించు' అని ప్రార్ధించారు.

వశిష్టమహర్షి మాటలు విన్న శబల రకరకాల ఆహారపదార్ధాలను సృష్టించింది. చెఱుకుగడలు, తేనే మొదలైన మధురపదార్ధాలను, మంచి పాత్రలతో కూడిన పానీయాలను, సైన్యానికి నచ్చిన పదార్ధాలను, వారికి రాజసానికి తగ్గట్టుగా ఇచ్చింది. ఆహారం స్వీకరించడానికి వెండి పాత్రలు కూడా ఇచ్చింది. రోజు మామూలు ఆహరంతో అలవాటుపడిన సైన్యం ఈ విందు భోజనంతో బాగా సంతృప్తి చెందింది. రాజమందిరంలో ఉండే స్త్రీలు, పురోహితులు, పండితులతో కూడి ఆహారం స్వీకరించే విశ్వామిత్రుడికి ఈ భోజనం కొత్త శక్తిని ఇచ్చింది. ఇంత గొప్ప సత్కారానికి ప్రీతి చెందిన విశ్వామిత్రుడు ఎంతో సంతృప్తి చెంది, మహదానందంతో వశిష్టమహర్షితో ఈ విధంగా చెప్తున్నారు.

"ఓ భగవాన్! మీరు నాకిచ్చిన గౌరవానికి ముగ్ధుడనయ్యాను. నా తరుపున నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. సర్వాన్ని ప్రసాదించగల ఈ శబలను మీరు నాకు ఒక ఇవ్వండి. నేను దీనికి బదులుగా శత శహస్ర (లక్ష)ఆవులను ఇస్తాను. ఈ గోవు పెద్ద సంపద. రాజు వద్దనే సర్వ సంపదలు ఉండాలి కనుక దీనిని నాకు అప్పగించండి. నిజానికి ధర్మాన్ని అనుసరించి ఈ శబల నాకు చెందుతుంది".  

To be continued.......................

No comments:

Post a Comment