Sunday, 7 June 2015

హిందూ ధర్మం - 161 (వేదంలో విజ్ఞానశాస్త్రం)



యజుర్వేదం 22-26 మంత్రాలు మేఘాలు ఎలా ఏర్పడతాయో వివరణ ఇస్తాయి. అక్కడ యజ్ఞప్రక్రియ గురించి చెప్తూ, మేఘాలు ఏర్పడే విధానం, వర్షాలు కురవడానికి సూర్యుడికి ఉన్న సంబంధం వివరించారు. యజుర్వేదం 24-20 మంత్రంలో 6 ఋతువుల గురించి ఉంది.

యజుర్వేదం 17-2 లో సంఖ్యా, గణితశాస్త్రాల ప్రస్తావన ఉంది. ఒకటి, పది, పది పదులు వంద, వంద పదులు వెయ్యి, వంద వేలు లక్ష అంటూ పదిలక్షలు, కోటి, పదికోట్లు, నూరుకోట్లు, వెయ్యి కోట్లు, దానికి పదిరెట్లు మహాపద్మం, దానికి పదిరెట్లు శంఖం, దానికి పదిరెట్లు సముద్రం, దానికి పదిరెట్లు మధ్య, దానికి పదిరెట్లు ప్రర్ధం అంటూ పెద్ద పెద్ద సంఖ్యలను ఆ మంత్రం వివరిస్తోంది.
------------------------------------------------

రసాయన శాస్త్రం

గురుదత్త్ విద్యార్ధి గారు వేదంలో మిత్రా, వరుణ పదాలకు అర్దం చెప్తూ మిత్ర అంటే ప్రాణవాయువని (Oxygen), వరుణ అంటే హైడ్రోజన్ అని, రెండిటి సారమే జలమని వివరించారు.

విద్యుత్ గురించి

అధర్వణవేదం 6-111-4, 6-130-1 లో అప్సరసలకు తేజస్సు, విద్యుత్, శక్తి అనే అర్దాలున్నాయి. 6-118-1 లో దానికే సూర్యకిరణాలనే అర్దం ఉంది.

యజుర్వేదం 24-15-19 లో విద్యుత్ గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే సౌరవిద్యుత్తు, తోకచుక్కలు, కొన్ని రకాల వృక్షాల నుండి విద్యుత్తును వెలికితీసే విధానం గురించి చెప్పబడింది. అదే ఈ శ్లోకం

 రౌద్రీ భాస్వంతు సంయోగాజ్జాయతే మారికాభిదా|
 విషశక్తిస్తయా సూర్యకిరణాశని సంభవం||

అసలు విద్యుత్ అనేది ఒకటుందని సమాజానికి తెలియదని, పూర్వీకులు చీకటిలో మగ్గారని కొందరు అంటున్నారు. కానీ వేదం సౌర విద్యుత్ గురించి చెప్పడమే కాక, వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి కూడా చెప్పింది. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు కూడా వృక్షాల్లో విద్యుత్ఛక్తి ఉందని, తులసి, రావి మొక్కలో అధికశాతంలో ఈ శక్తి నిక్షిప్తమైందని చెప్తున్నాయి.

దేవీచంద్ గారి అధర్వణవేద భాష్యంలో విద్యుత్‌కు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు. సైనిక కార్యకలాపాల్లో విద్యుత్ వాడకం గురించి, విద్యుత్ఛక్తితో నడిచే అతిశీతలీకరణ యంత్రాల గురించి, వాటిలో నిల్వ ఉంచే ఔషధాల గురించి, విద్యుత్‌తో నడిచే వాహనాల గురించి, యంత్రాల గురించి ఇళ్ళను కూడా విద్యుత్ఛక్తితో వెలిగించడం గురించి అధర్వణవేదంలో ఉన్న విషయాలను వారు ప్రమాణ పూర్వకంగా విశదీకరించడం చూస్తే, ఎవరైనా సంభ్రమాశ్చర్యాలకు గురికాక తప్పరు. వేదద్వేషులైతే నాలుక్కరుచుకుంటారు.
---------------------------------------

భౌతిక శాస్త్రం

హెచ్.సి. వర్మ గారు కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం రచించారు. అందులో స్పీడ్ ఆఫ్ లైట్ అనే అధ్యాయంలో జి.వి.రాఘవరావు గారి పుస్తకం నుంచి ఋగ్వేద మంత్రాన్ని ప్రస్తావిస్తూ, అధునిక శస్త్రవిజ్ఞానం కనుగొన్న అనేక విషయాలు వేదల్లో నిక్షిప్తమై ఉన్నాయని, తెలియతని వాటిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తారానిర్విశ్వదర్శతో జ్యోతిస్కరిదసి సూర్య విశ్వంబసిరోచనం|
తాతాచస్మర్యత యోజనం సహస్రం ద్వే ద్వే శతే ద్వేచ యోజనే||
ఏకేన నిమిషర్దేనా క్రమనా నమోస్తుతే - ఋగ్వేదం 1-50-4

దీనికి సాయనాచార్యుడు 15 వ శత్బాదంలో బాష్యం రాశారు. అందులో ఆయన సూర్యకాంతి అర్దనిమిషంలో 2202 యోజనాలు ప్రయాణం చేస్తుందని వివరించారు. యోజనం అనే మాట వైదిక వాజ్ఞ్మయంలో తరచూ కనిపిస్తుంది. 1 యోజనం అంటే 4 కోసులు, అనగా బ్రిటీష్ వారి లెక్కలో 8000 గజాలు, ఒక గజం అనగా 0.9144 మీటర్లు.

సమయాన్ని లెక్కించడం గురించి శ్రీ మద్భాగవతం చెప్తోంది. ఒక 15 నిమిషాలు = 1 కాష్ఠ, 15 కాష్ఠలు ఒక లఘు, 30 లఘులు = 1 ముహూర్తం, 30 ముహూర్తాలు = 1 దివారాత్రము (పగలురాత్రి/రోజు). ఆధునిక బాషలో చెప్పుకుంటే 24 గంటలు. ఒక నిమిషం అంటే 16/75 సెకన్లు (తెలుగు నిమిషాలు కాదు, సంస్కృతపదాల గురించి మాట్లాడుకుంటున్నాం, గమనించండి).

 అర్ధనిమిషానికి 2202 యోజనాలను SI units లో మారిస్తే, 3.08*10మీటర్ ప్రతి సెకనుకు వస్తుంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం సూర్యకాంతి భూమిని చేరుటకు చెప్పిన వేగంతో సరిపోతోంది.
-----------------------------------

దేవమిత్రస్వామి తన Searching for Vedic India అనే పుస్తకంలో వెళ్ళడించిన విషయాలు చూద్దాం.

అధర్వణవేదంలో ఒక మంత్రం ఇలా అంటున్నది. 'ఓ శిష్యుడా! రాజనీతిశాస్త్ర విద్యార్ధి, సముద్రాలపై నౌకల్లో ప్రయాణించు, విమానాల ద్వారా ఆకాశంలో విహరించు, సృష్టికర్త అయిన భగవంతుని వేదాల ద్వారా తెలుసుకో, యోగం ద్వారా శ్వాసను నియంత్రించు, జ్యోతిష్యం (ఖగోళ శాస్త్రం) ద్వారా పగులు, రాత్రి యొక్క ధర్మాలను తెలుసుకో, ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను తెలుసుకో.

ఖగోళశాస్త్రం, భూగర్భశాస్త్రం, భూగోళశాస్త్రం ద్వారా సూర్యుడు కింద ఉన్న ఈ భూమిపై ఉండే అన్ని దేశాలకు వెళ్ళు. రాజనీతి శాస్త్రం, వృత్తి నైపుణ్య శాస్త్రాల ద్వారా మంచి జ్ఞానం పొందు, వైద్యశాస్త్రం ద్వారా వైద్య మూలికల గురించి అవగాహన కలిగించుకో, జలముల గురించిన శాస్త్రం (హైడ్రోస్టాటిక్స్) ద్వారా నీటి యొక్క వివిధ ఉపయోగాలను తెలుస్కో, మిరుమిట్లు గొలిపే కాంతి గురించి విద్యుత్ శాస్త్రం ద్వారా తెలుసుకో. నా ఆదేశాలను మనఃపూర్వకంగా ఆచరించు - యజుర్వేదం 6.21 (ఇది సాక్షాత్తు భగవంతుని ఉపదేశం).

అట్లాగే అధర్వణవేదం 20.41.1-3 మంత్రాలు అణుశక్తి గురించి చెప్తున్నాయి.
---------------------------------------

To be continued ...............

ఈ రచనకు సహకరించిన వెబ్‌సైట్లు :
ఆర్యసమాజం దయానంద సరస్వతీ విరచిత ఋగ్వేద భాష్యభూమిక
http://www.speakingtree.in/spiritual-blogs/seekers/science-of-spirituality/the-speed-of-light-rigvedic-hymn
https://cpdarshi.wordpress.com/2011/10/01/color-and-speed-of-light-as-per-vedas/
https://groups.google.com/forum/#!topic/samskrita/d8OA7E-7WOU

No comments:

Post a Comment