Friday, 5 June 2015

పర్యావరణం - ఋషుల సందేశం

ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణ విషయంలో అందరిని జాగృత పరచడానికి, అవగాహన కలిగించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటికి అనేకమంది దీంతో మాకు సంబంధమేమిటి? అనేక సమస్యలుండగా ఇదే పట్టించుకోవాలా? అంటున్నారు. ఇటువంటి తరుణంలో అసలు పర్యావరణ పరిరక్షణ గురించి వేదాలు, ఋషులు, గురువులు, సాధువులు ఏం చెప్పారో చూద్దాం.

అసలు ప్రకృతిని చూడగానే మనసు పులకిస్తుంది, తెలియని ఆనందం కలుగుతుంది, పెద్దపెద్ద రోగాల బారిన పడినవారు కూడా ప్రకృతి మధ్య ఉంటే, త్వరగా కోలుకుంటున్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి. పువ్వులను, సీతాకోకచిలుకలను, జలపాతాలను చూడగానే ఏదో తెలియని అనుభూతి కలగడం అందరికే తెలిసింది. దానికి కారణం ఏంటో తెలుసా?

శ్రీ రవీంద్రనాధ్ ఠాగూర్ గారు వారి పుస్తకాల్లో ఇలా వెల్లడించారు. 'సమాధి స్థితిలో ఉన్న ఋషులు తొలిసారి ఈ రహస్యం గుట్టు విప్పారు. తైత్తరీయ ఉపనిషత్తులో దాన్ని పొందుపరిచారు. ప్రకృతి భగవంతుని ఆనందం యొక్క వ్యక్తీకరణ. భగవంతుడు సచ్చిదానందుడు. ఆయన తన ఆనందస్థితికి ఒక రూపం ఇవ్వాలని సంకల్పించినప్పుడు అది ప్రకృతిగా రూపాంతరం చెందింది. అందుకే ప్రకృతిలోకి వెళ్ళితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది'.

ఋషులు కూడా ఇదే విషయాన్ని స్మృతులలో పొందుపరిచారు. విద్యాభ్యాసం నగరానికి దూరంగా, అడవికి దగ్గరగా, ప్రకృతి రమణీయత మధ్య జరగాలని మనుస్మృతి చెప్తోంది. చుట్టు గోడలు కట్టి రూముల్లో పిల్లలకు భోధన చేయడం వృధా అని, అది వారి ఎదుగుదలను నిరోధిస్తుందని, వారి లాభం చేయకపోగా, నష్టం చేకూరుస్తుందని చెప్పారు. ప్రకృతి మధ్య సాగే విద్యాభ్యాసం, పిల్లల్లో ఉన్న అంతఃశ్శక్తిని జాగృతం చేస్తుందని చెప్పారు. ఈ కారణంగా రవీంద్రనాధ్ ఠాగూర్ గారి శాంతినికేతనం, పరమహంస యోగానందగారి 'యోగదా సత్సంగ్ సోసైటీ ఆఫ్ ఇండియా' ఋషులు చెప్పిన పద్ధతుల్లోనే ప్రకృతి మధ్యే విద్యాబోధన చేస్తున్నాయి. దీని బట్టి ప్రకృతి యొక్క శక్తిని అర్దం చేసుకోవచ్చు.

ప్రకృతి మాత్రమే మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తపరచగలదు. సత్యాకామ జాబాలికి గౌతమ మహర్షి చేసిన ఉపదేశం కూడా ఇదే పద్ధతిలో సాగింది.

ప్రకృతిమాత మధ్యలో మనిషి భగవంతుని యొక్క చైతన్యాన్ని తనకు తెలియకుండానే పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు కనుకనే అతడు ఆనందాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శ్రీ అరబిందో గారు ఇలా చెప్పారు. 'మనలో ఉన్న చైతన్యమే పువ్వులో కూడా ఉంది. సూక్ష్మమైన ఈ విషయాన్ని మన ఆత్మ గ్రహించినందువల్లనే, మన హృదయం ఆనందంతో నిండిపోతోంది'.

మనిషి తన భౌతికమైన పరిధుల నుంచి బయటకు వచ్చి, అన్నింటా వ్యాపించి ఉన్న ఆనంతమైన తత్వాన్ని తెలుసుకొనుటకు ప్రకృతే సహాయం చేస్తోందని శ్రీ అరబిందో గారు యోగా గురించి రాసిన లేఖల్లో వివరించారు. అందుకే ఋషులు కూడా తపస్సు చేయుటకు అడవులకు వెళ్ళమని సలహా ఇస్తారు. ప్రకృతికి మనిషిని అంతర్ముఖం చేసి, సూక్ష్మమైన రహస్యాలను వెళ్ళడించగల శక్తి ఉంది. ప్రకృతి జడపధార్దం కాదు, అందులో చైతన్యం ఉంది. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో మొదటి నామం 'ఓం ప్రకృత్యై నమః'. జీవరాశికి కావలసిన ఆహారాన్నే కాదు, మానవుడి పరమగమ్యమైన శాశ్వత ముక్తికి కూడా ప్రకృతి దోహదపడుతోంది. అందుకే ఇప్పటికి గురువులు చెప్పే మాట ఏమిటంటే ఎక్కడైన పచ్చదనం పరిడవిల్లిన చోటుకు వెళ్ళి, రోజూ ఒంటరిగా కాసేపు మౌనంగా గడపమని లేక మంత్రంజపం చేస్తే క్రమంగా ప్రశాంతత లభిస్తుందని.

పర్యావరణం ఎంత స్వఛ్ఛంగా, పవిత్రంగా ఉంటే మానవుడు అంత స్వఛ్ఛంగా పవిత్రంగా ఉంటాడు.  ప్రకృతి నాశనమైతే మానవుడు నాశనమవుతాడు, పరతత్వానికి దూరమవుతాడు, ప్రకృతిని నాశనం చేసేవారు భగవంతుని ఆగ్రహానికి కారణమవుతారు. ముక్తి కూడా దూరమవుతారు. అనేకమంది యోగులు, సిద్ధపురుషులు తమ జీవతంలో ఇచ్చిన సందేశాల్లో ప్రకృతిని రక్షించడం ముఖ్యమైనది. పతంజలి యోగశాస్త్రం కూడా అహింసకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. అహింసను పాటించకుండా, ప్రకృతిని రక్షింకుండా ఏ వ్యక్తి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు.

ప్రకృతిని రక్షించుకోవడం మన బాధ్యత. పర్యావరణ దినోత్సవం ప్రపంచానికి పర్యావరణ హితమార్గాన్ని ఎంచుకోమని గుర్తు చేస్తుంటే, భారతీయులకు మాత్రం తమ పూర్వీకులు నడిచిన ధర్మమార్గాన్ని గుర్తు చేస్తోంది.    


సమిష్టి ప్రయత్నాలు మాత్రమే పర్యావరణాన్ని రక్షించగలవు. రండి, పర్యావరణాన్ని రక్షించుకుందాం.

2 comments:

  1. బాగుంది. పర్యావరణం పట్ల మనిషి ఉండాల్సిన తీరును భారతీయ ఋషి సంస్కృతిలో చెప్పిన విషయాలను వివరించిన తీరు బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి, శివార్పణం

      Delete