Sunday 28 June 2015

హిందూ ధర్మం - 164 (సృష్టి- నాసదీయసూక్తం)

వేదాల్లో ఇప్పటివరకు విజ్ఞానం గురించి, స్త్రీల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఋగ్వేదం 10 వ మండలం 129 వ సూక్తంలో సృష్ట్యారంభం గురించి చెప్పబడ్డ నాసదీయసూక్తం గురించి అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సనాతనవైదిక ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది అనాది. ఎప్పటి నుంచో జరుతూనే ఉంది. సృష్టి అనేది ఒక సముద్రం అనుకుంటే, సముద్రపు అలలపై నురుగులో ఏర్పడ్డ నీటి బుడగల వంటివి ఈ అనంతకోటి విశ్వాలు. నీటి బుడగల మాదిరిగా విశ్వాలు నిత్యం అనేకం లయమవుతుంటాయి, కొత్తవి ఏర్పడుతుంటాయి. కనుక ఎక్కడైన హిందూగ్రంధాల్లో సృష్ట్యాది అంటే ఇప్పుడు అనంతకోటి విశ్వాల్లో ఏదో ఒక విశ్వం యొక్క సృష్ట్యాదిగానే అర్దం చేసుకోవాలి.

---------------------------------

ఈ విశ్వం ఎందుకు ఉంది? అంటే, ఈ విశ్వం యొక్క ఉనికికి కారణం ఏమిటి? ఈ విశ్వం పనిచేసే తీరు ఏమిటి? ఈ విశ్వనిర్మాణానికి వాడబడ్డ ఘటకద్రవ్యాలు ఏమిటి? ఈ విశ్వం ప్రాదుర్భావానికి కారణభూతులు ఎవ్వరు? మహావిస్పోటనంతో విశ్వం పుట్టింది అన్నారు. ఈ మహావిస్పోటనం ఎందుకు జరిగింది? ఈ విస్పోటనంతోటే స్థలం, కాలం పుట్టేయని అన్నాం కదా. విస్పోటనానికి 'ముందు' స్థలమే లేకపోతే ఆ పేలిన పదార్ధం (బ్రహ్మ పదార్ధం?) ఎక్కడ ఉండేది? మహావిస్పోటనంలోనే కాలం పుట్టినప్పుడు 'విస్పోటనానికి ముందు' అనే సమాసానికి అర్ధం ఉందా?

పోనీ, పైన అడిగిన ప్రశ్నలకి వేదాంత ధోరణిలో తప్ప శాస్త్రీయ ధోరణిలో సమాధానాలు చెప్పలేమని ఒప్పేసుకుందాం – మాటవరసకి. మన ప్రశ్నలని భౌతిక శాస్త్రం విధించిన పరిధిలోనే అడుగుదాం. పదార్ధం పరమాణు రేణువులతో తయారయింది అన్నారు కదా. కొన్ని పరమాణు రేణువుల అస్తిత్వానికి నిలకడ (అంటే స్థిరత్వం) ఉండి, కొన్నింటికి లేదు. ఎందుకని? మనిషి ఎంత పొడుగున్నాడో, ఎంత బరువున్నాడో కొలిచినంత మాత్రాన ఆ మనిషి తత్త్వం అర్ధం అవుతుందా? అలాగే మనం చేసినదల్లా విశ్వంలోని అంశాలని కొన్నింటిని – దూరాలు, వేగాలు, కాలాలు, గరిమలు, ఆవేశాలు, మొదలైన భౌతిక రాశులని - కొలిచాం. అంతే కాని ఈ విశ్వం యొక్క తత్త్వాన్ని అర్ధం చేసుకోలేదు. అంటే ఇప్పుడు మన దగ్గరున్న కేవలం సమాచారం (Information) మాత్రమే. ఈ విశ్వం యొక్క అస్తిత్వానికి కారణం ఏమిటి? ఈ రకం ప్రశ్నలకి ఆధునిక భౌతిక శాస్త్రం ఆమోదకరమైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది – ఇప్పటివరకు.

అంటే ఏమిటన్నమాట? కొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో మనకే తెలియటం లేదు. మరికొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఇంకా అధునాతనమైన అభిమతాలలో దొరకొచ్చనే ఆశ ఉంది. ప్రస్తుతానికి మొదటి రకం ప్రశ్నలకి సమాధానాలు మరొక కోణం నుండి వెతుకుదాం.

ప్రశ్నలను మొదట లేవనెత్తినవారు సనాతనధర్మానికి చెందిన ఋషులే.ఋగ్వేదంలో (10.129) నాసదీయ సూక్తం అనే మంత్రం ఉంది. ఎందుకంటే వర్ణించటం అనేది మనసుతో, భాషతో చేసే పని. మనసుకు చాలా వేగవనతమైనది, శక్తివంతమైనదే అయినా, దానికి కొన్ని పరిమితులున్నాయి. అది అన్నిటిని చెప్పగలదు కానీ సర్వాతీతమైన భగవంతుని గురించి చెప్పలేదు. మనసుకు ఆ స్థాయిని వర్ణించగలశక్తి లేదు. భగవంతుని అనుభూతి చెందడం తప్పించి, దాన్ని భావంలో చెప్పలేము. అటువంటిది సృష్టికి పూర్వం ఏముందంటే ఏం చెప్పగలం? సృష్టికి పూర్వం ఉన్నది కేవలం భగవత్తత్వం మాత్రమే. పరబ్రహ్మం తప్ప వేరొకటిలేదు. అయినా కరుణతో ఆ పరమసత్యం యొక్క చిన్న బింధువును ఈ సూక్తంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మంత్రంలోని భావం భాషకి అతీతం. సమాధిస్థితిలో మునులు అనుభవించి అవగాహన చేసుకున్న బ్రహ్మ సత్యాన్ని భాష విధించిన శృంఖలాలకి బద్ధులై చెప్పారు. వారు చెప్పదలుచుకున్న విషయాన్ని భాషలో బంధించి చెప్పేసరికి సగం భావం నశించిపోయి ఉంటుంది. మిగిలినదానిని ఇంగ్లీషులోకో, తెలుగులోకో దింపి చెప్పటానికి ప్రయత్నిస్తే మరో వన్నె తరిగిపోతుంది. అయినా సరే నాసదీయ సూక్తంలోని ఏడు శ్లోకాలలోని భావాన్ని అర్దం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
---------------------------------------------------



नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत् ।
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद्गहनं गभीरम् ॥1॥

సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు (సత్ లేదు, అసత్ లేదు). అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే/ఎవరిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?

न मृत्युरासीदमृतं न तर्हि न रात्र्या अह्न आसीत्प्रकेतः ।
आनीदवातं स्वधया तदेकं तस्माद्धान्यन्न परः किं चनास ॥2॥

మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు. అన్నిటికి అతీతమైన తత్వం మాత్రమే ఉంది. అది దేనీ మీద ఆధారపడిలేదు. ఆ బ్రహ్మం తప్ప వెరొకటిలేదు.

तम आसीत् तमसा गूळमग्रेऽप्रकेतं सलिलं सर्वमाइदम्
तुच्येनाभ्वपिहितं यदासीत् तपसस्तन्महिनाजायतैकम् || 3 ||

అంతా అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారం నెలకొని ఉంది. అవగాహనకి అందని ఆ బ్రహ్మం (బ్రహ్మ పదార్ధం) మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తీవ్రమైన తాపం (వేడి) వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. (బిగ్ బ్యాంగ్ జరుగగా అధికమైన వేడి పుట్టిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తున్నది.)

कामस्तदग्रॆ समवर्तताधि मनसॊ रॆत: प्रथमं यदासीत् ।
सतॊबन्धुमसति निरविन्दन्हृदि प्रतीष्या कवयॊ मनीषा ॥4॥

దానికి కారణం కోరిక (ఇచ్ఛ). అదే ప్రధమ బీజం, పరబ్రహ్మం యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచే విశ్వావిర్భావం జరిగింది, విశ్వం వికసించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దాని కోసం తమ హృదయాలను శోధించారో, వారికి శక్తికి, పదార్ధానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.

तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासी दुपरिस्विदासी ।
रेतोधाआसन् महिमान आसन् स्वधा अवस्तात् प्रयतिः परस्तात् ॥5॥

మరియు శూన్యానికి, దానిపైన, క్రింద ఏమున్నదో, దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అభ్యుదమైన ఆ శక్తి సారవంతమైనశక్తులను తయారు చేసింది. అన్నిటికిపైన చైతన్యశక్తి యొక్క ఉద్దేశ్యం, ప్రేరణ ఉంది, అదే దీన్ని నడిపిస్తోంది, క్రింద క్రమశిక్షణతో కూడిన సృజనాత్మకత ఉంది. అది ప్రేరణకు తగ్గట్టుగా నడుస్తోంది.

को अद्धा वेद क इह प्र वोचत् कुत आजाता कुत इयंविसृष्टिः ।
अर्वाग् देवा अस्य विसर्जनेनाथा को वेद यतआबभूव ॥6॥

కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు (పరబ్రహ్మం కాదు, పుణ్యఫలాల కారణంగా దేవతాజన్మను పొందిన వారు, ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైనవారు) కూడా ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది (వారు కూడా ఈ తర్వాత వచ్చినవారే).

इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न ।
यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्ग वेद यदि वा नवेद ॥7॥

ఈ సృష్టిని చేసి, దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్నవాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఎంటో తెలిసే ఉండాలి. బహుసా అతనికి కూడా తెలియదేమో! (ఎవరికి తెలుసు?)

ఈ సూక్తంలో చెప్పిన చాలా విషయాలను ఆధునిక భౌతికశాస్త్రం కూడా వర్ణించింది. విశ్వోద్భవశాస్త్రం మీద, భౌతిక శాస్త్రం మీద అవగాహన ఉన్నవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది.

ఈ రచనకు సహయాపడిన రచనలు -
వేమూరి వేంకటేశ్వరరావు గారి విశ్వస్వరూపం అనే వ్యాససంపుటం
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct11/viswaswarupam.html
స్వామి కృష్ణానంద సరస్వతీ గారు నాసదీయసూక్తానికి రాసిన భాష్యం
http://ajitvadakayil.blogspot.in/2014/07/nasadiya-sukta-rig-veda-5000-bc.html
http://hinduismdecoded.blogspot.in/2014/10/nasadiya-sukta-of-rig-veda-creation-of.html

To be continued .................

No comments:

Post a Comment