Saturday, 13 June 2015

త్రైలింగ స్వామి సందేశం



త్రైలింగస్వామి దిగంబరులై తిరుగుతూ ఉండేవారు. అందువలన కొందరు పోలీసులు ఆయనను పట్టుకొని పోయి జిల్లా న్యాయాధిపతిముందు నిలబెట్టారు. న్యాయాధిపతి అట్లా తిరగటానికి వీలులేదని శాసించాడు. ధోవతి కట్టుకోవాలని ఆదేశించాడు. స్వామీజీ దాన్ని పట్టించుకోలేదు. న్యాయాధిపతికి కోపం వచ్చి బేడీలు వేసి చెరసాలలో పెట్టమని ఆదేశించాడు. వెంటనే పోలీసులు ఆయనకు బేడీలు వేయటానికి దగ్గరకు వెళ్లగా, స్వామీజీ వారికి కనబడలేదు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపడ్డారు. వారు ఆ ప్రదేశమంతా దాదాపు గంటసేపు వెదికినా కనబడలేదు. ఆ తరువాత స్వామీజీ న్యాయాధిపతి ముందు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. స్వామీజీ ఎట్లా మాయమయ్యారో, మళ్లీ ఎట్లా ప్రత్యక్షమయ్యారో వారికి అర్థం కాలేదు. అదిచూసి వారంతా ఆశ్చర్యచకితులైనారు. న్యాయాధిపతి కొంతసేపటికి తేరుకొని, స్వామివారు తమకు నచ్చినవిధంగా తిరుగవచ్చునని అనుమతినిచ్చాడు.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు మరొక అధికారి వచ్చాడు. ఆయన చాలా తీవ్రస్వభావం కలవాడు. ఒకరోజు ఆయన దృష్టి స్వామివారి మీద పడింది. స్వామీజీ దొంగ సాధువు అని తలంచి చెరసాలలో పెట్టి బంధించాడు. మరునాడు ప్రొద్దున ఆయనకు ఒక విచిత్ర సంఘటన కనిపించింది. అదేమిటంటే- స్వామీజీని బంధించిన చెరసాల అంతా బాగా నీళ్లతో తడిసి ఉండింది. చెరసాల తలుపుకు వేసిన తాళం అట్లాగే ఉండింది. కాని స్వామీజీ మాత్రం చెరసాల బయటివైపున అటూ ఇటూ పచార్లుచేస్తూ కనిపించారు. వెంటనే ఆ అధికారి- ‘‘నీవు చెరసాలనుంచి బయటకు ఎట్లా వచ్చావు? ఇంత నీరు చెరసాలలోకి ఎట్లా వచ్చింది?’’ అని అడిగాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వి ‘‘అర్థరాత్రి నాకు మూత్రవిసర్జన చేయవలసి వచ్చింది. గదికి తాళంవేసి ఉండటంవలన గదిలోనే మూత్రవిసర్జన చేశాను.

ఉదయం కాగానే బయటకు పోవాలనే కోరిక కలిగింది. చూసేసరికి గది తలుపులు తెరిచి ఉన్నాయి. నేను బయటకు వచ్చేశాను. మీరు ఎవరి జీవితాన్నీ తాళంవేసి బంధించలేరని నిశ్చయంగా తెలుసుకోండి. ఒకవేళ ఆ విధంగా బంధించగలిగినా, వారిని మరణ సమయంలో బంధించి మరణం రాకుండా కాపాడగలరా? అంతకుముందు కూడా ఎవరూ మరణించరు. ఎవ్వరికీ అలాంటి శక్తి లేదు. మరి మీరు ఎందుకు అంతగా కోపగిస్తున్నారు?’’ అని అన్నారు. ఆ విచిత్ర సంఘటనను తన కళ్లారా చూసిన ఆ అధికారి అవాక్కయిపోయాడు.

ఆ తరువాత స్వామీజీ యథేచ్చగా తిరుగవచ్చని అనుమతి ఇచ్చాడు. స్వామీజీకి అయిష్టమైన పని ఎవ్వరూ చేయరాదని ఆజ్ఞాపించాడు.

సేకరణ: ఆంధ్రభూమి

No comments:

Post a Comment