Monday, 15 June 2015

హిందూ ధర్మం - 162 (వేదంలో స్త్రీలు)

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమనుతాము సంఘసంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదికసంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.



స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03
స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20
స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)
స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74
స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2
స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1

పరిపాలన విషయంలో స్త్రీలు
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - అధర్వణవేదం 7.38.4
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి-  ఋగ్వేదం 10.85.46
ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1

కుటుంబం
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20
స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3

ఉద్యోగాల్లో
స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2
స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజువేదం 16.44 (ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం. స్త్రీలు బయటకురాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా. శ్రీ రామాయణంలో కైకయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చిన అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).
కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- ఋగ్వేదం 10.85.26

విద్యా విషయాల్లో
ఓ స్త్రీల్లారా! పురుషలతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాకా. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాకా. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్దం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను- ఋగ్వేదం 10-191-3

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్రా వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్యసందేశం ఇచ్చినట్టుగా లేదు.

వివాహం - విద్యాభ్యాసం
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - అధర్వణవేదం 14-1-64 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).

To be continued .................

ఈ రచనకు సహకరించింది: ఆర్యసమాజంవారి సౌజన్యంతో

1 comment: