మనకు వినాయకుడి గురించి తెలిసిన కథలు కొన్నే. ఆయన గురించి ఇంకా అనేక పురాణాల్లో ఎన్నో విషయాలు ప్రస్తావించబడ్డాయి. వినాయక జననం వివిధ పురాణాల్లో వివిధంగా ఉంది. వరాహ పురాణంలో ఒక రకంగా, శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము, శివపురాణాల్లో వేరుగా ఉండటానికి కారణం అవి వేర్వేరు కల్పాల్లో జరగడమే... మనకు నాలుగు యుగాలు- సత్యయుగం(కృత యుగం), త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒకడే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కాలాల్లో వ్యక్తమై తన లీలలను చూపి, దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం, ధర్మ సంస్థాపన చేయడం సనాతనధర్మంలోనే కనిపిస్తుంది. దేవుడి యొక్క ప్రతి అవతారానికి ఒక కారణం ఉంటుంది. అది మామూలు బుద్ధికి అర్దం కాకపోవచ్చు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో "పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని అన్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ , ధర్మ సంరక్షణ కోసం పదే పదే అవతరిస్తాను అని చెప్పాడు . ఇదే విధంగా గణేశుడు కూడా చెప్పినట్లు గణేశపురాణంతర్గతమైన గణేశ గీతలో స్వామి వెళ్ళడించాడు. తానెత్తిన అవతారాల్లో మహోత్కట వినాయకుడు, మయురేశ్వర వినాయకుడు, గజాననుడు అవతారాలు ముఖ్యమైనవి! ఇవి గణేశ పురాణంలో చెప్పబడ్డాయి.
కృతయుగంలో అదితి కశ్యపులను తల్లిదండ్రులుగా చేసుకుని గణపతి అవతరించారు. బంగారు శరీరచ్ఛాయతో పది చేతులతో సింహవాహనమెక్కి మహోత్కట గణపతి పేరుతో ప్రసిద్ధుడై దేవాంతక నరాంతక అనే రాక్షసుల్ని వధించాడు.
త్రేతాయుగంలో గణనాధుని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. స్ఫటిక శరీరచ్ఛాయతో 8 చేతులవాడై మయూర (నెమలి) వాహనం ఎక్కి మయూర గణపతిగా ఖ్యాతి నార్జించి సింధువనే రాక్షసుణ్ణి చంపాడు.
ద్వాపరయుగంలో పార్వతి నలుగుమట్టి ద్వారా పుట్టి, కుంకుమరంగు శరీరచ్ఛాయతో 4 చేతులవాడై ఎలుక వాహనాన్ని ఎక్కి గజావన గణపతి పేరుతో విఖ్యాతుడై సిందూరడనే రాక్షసుడిని మట్టుపెట్టాడు.
కలియుగంలో తనంత తానుగా (స్వయంభువు) పుట్టి పొగరంగు శరీరచ్ఛాయతో రెండు చేతులవాడై నీలం రంగు కలిగిన అశ్వాని (గుఱ్ఱాన్ని) వాహనంగా చేసుకుని ధూమకేతు గణపతి పేరిట, కలియుగంలోని మొదటి పాదం దాటాక (1,80,000 సంవత్సర మీదట) దుర్జనులందర్నీ వధిస్తాడు. ధర్మసంస్థాపన చేస్తాడు.
అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శివపురాణతర్గతమైన వినాయక చవితి కథ ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహ కల్పంలో జరిగింది. మిగితా అవతారాలు అనేక కల్పాల్లో జరిగాయి. ఇవికాక అష్టగణపతి అవతారాలు ఉన్నాయి. మరలా 16 గణపతి రూపాలు ఉన్నాయి, 32 గణపతి రూపాలు ఉన్నాయి, కొన్ని గ్రంథాల్లో 64, 108, 1008 గణపతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతికార్యంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడని శివుడు శాసించాడు!! త్రేతా యుగాములోను, ద్వాపరయుగాములోను శివ పార్వతులకే వేరు వేరు విధాలుగా జన్మించటం చూసి ఎవరైనా గందరగోళం చెందుతారు కానీ వాస్తవం ఇది ! త్రేతాయుగంలో తనకు పుత్రునిగా పరబ్రహ్మ ఆవిర్భవించాలని పార్వతి మాత తపస్సు చేయగా, మాతకు పుత్రునిగా కలిగాడు, ద్వాపరంలో తన చేతిలో బొమ్మగా చేసి అమ్మవారు ప్రాణం పోసింది ! ఇవే కాకా వక్రతుండ, ఏకదంత, మహోదర, గజానన, లంబోదర, వికట, విఘ్నరాజ అనే అవతారాలు ఉన్నాయి.
No comments:
Post a Comment