గణపతికి సంబంధించి మనకు అనేక స్తోత్రాలు లభ్యమౌతున్నాయి. అందులో అత్యంత మహిమాన్వితమైనది, అందరూ సులభంగా నేర్చుకుని చదువదగినది
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా
వివరణ- ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పూనుకోగా, ఆయనకు అనేక విఘ్నాలు ఎదురయ్యాయి. ఎంత ప్రయత్నించినా ఆయన కార్యం ముందుకు కదల్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, పరబ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఎన్నో దివ్యసంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, పరబ్రహ్మ వక్రతుండ గణపతిగా సాక్షాత్కరించి, బ్రహ్మదేవుడికి వక్రతుండ మంత్రాన్ని ఉపదేశించారు.
అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ మాత చేత శ్రీ గణేశుడి సృష్టించబడటానికి పూర్వం నుంచి కూడా ఆయన ఉన్నాడు. శివపార్వతుల కల్యాణంలో కూడా గణపతిని పూజించారు. అంటే గణపతి ఈనాటి వాడు కాదు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము. అందుకే ఒకనాడు ముద్గల, గర్గ మహర్షులతో కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గణపతిని పరబ్రహ్మంగా స్తుతించిన స్తోత్రం కూడా ఉంది.
సనాతన ధర్మంలోనే శైవం, శాక్తేయం, వైష్ణవం వలె గాణాపత్యం అనే మతం కూడా ఉంది. ఇందులో గణపతిని పరబ్రహ్మంగా, మిగితా దేవీదేవతలంతా ఆయన అంశలుగా భావించి ఉపాసిస్తారు. ఆయనే ఆది మూలంగా ఉపాసిస్తారు.
సంపదలను కలిగించి, పోషించువాడు, నిధులను ఇచ్చువాడు, అన్నసమృద్ధిని ఇచ్చువాడు అంటూ ఆ మంత్రం ఎన్నో రకాలుగా స్వామి వైభావన్ని ప్రకటించి, చివరలో వక్రతుండ షడక్షర మంత్రంతో ముగుస్తుంది. బ్రహ్మదేవుడు ఆ మంత్రం మీద ధ్యానం చేసి, ఆ తర్వాత సృష్టి చేయడాన్ని ఆరంభించాడు. అప్పుడు ఆయనకున్న విఘ్నాలన్నీ తొలగి, సృష్టి సజావుగా సాగింది.
ఇదే విషయం ఉమామహేశ్వరుల సంవాదం రూపంలో శ్రీ కృష్ణాయామల తంత్రంలో కనిపిస్తుంది. అందులో
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||
సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు ఎవరినైతే విశేషంగా పూజించి, ఫలసిద్ధిని పొందాడో, అటువంటి పార్వతీ పుత్రుడైన శ్రీ గణనాథుడు నా ఋణములను నాశనం చేయుగాకా అని ఉంది.
ఇప్పుడు మనకొక సందేహం వస్తుంది. బ్రహ్మదేవునకు విఘ్నాలు కలగటం ఏమిటి?.... త్వమేవ కేవలం కర్తాసి అని గణపతి అథర్వశీర్షోపనిషత్తు వర్ణించింది. అంటే ఈ సమస్త సృష్టిలో కేవలం గణపతి మాత్రమే కర్త. మిలిగినవారు అంటే పిపీలికాది బ్రహ్మ ప్రయంతం ఉన్న జీవులంతా పాత్రధారులు మాత్రమే. తానే కర్తను అనుకోవడం వల్లనే జీవులకు కర్మఫలం అంటుకుని, జననమరణ చక్రంలో కొట్టుకుపోవలసి వస్తోంది. తాను కర్తను కాదు, భగవంతుడే కర్త, అన్నీ ఆయనే చేస్తున్నాడు, నేను కేవలం పాత్రధారిని మాత్రమేననే భావన కలిగి ఉంటే, మరణానంతరం నేరుగా బ్రహ్మంలో ఐక్యమవుతాము. దీనికి ప్రధానమైన కారణం అహంకారం. అందుకే అహం నశిస్తే, అన్నీ నశిస్తాయని భగవాన్ రమణ మహర్షి అన్నారు. బ్రహ్మదేవుడు కూడా తానే ఈ సృష్టికి కర్తను అనుకుని ఉంటాడు. అందుకే ఆయనలో కలిగిన ఆ అహంభావాన్ని తొలగించడానికి పరబ్రహ్మ స్వరూపమైన గణపతి/ విఘ్నాధిపతి/ విఘ్నరాజు విఘ్నాన్ని కలిగించాడు. ఇది అస్తిత్వంలోకి రాబోయే లోకానికి, జీవులకు ఎంతో ప్రేమతో, కరుణతో వక్రతుండుడు చేసిన తొలి ఉపదేశం. దీన్ని ఒక్కదాన్ని జాగ్రత్తగా జీవితంలో పాటించినా, జీవులు త్వరితగతిన ఆ పరబ్రహ్మరూపమైన గణపతిలో ఐక్యమవుతారు.
వక్రతుండ మహాకాయ......(2)
వక్రతుండ- అంటే చాలామంది వంకర తొండం కలవాడని అర్దం చెబుతున్నారు. కానీ వక్రతుండ అనే పదానికి 'వక్రానాం తుండయతీతి ఇతి వక్రతుండః' అని వ్యుత్పత్తి. వక్రములను తుండెము చేయువాడు వక్రతుండుడు.
సృష్ట్యాదిలో బ్రహ్మదేవునకు కలిగిన విఘ్నాలను నశింపజేశాడు. తాను కర్తను అనే భావనయే వక్రము. అదే జన్మల పరంపరకు కారణమవుతుంది, అది అహం నుంచి పుడుతుంది. ఆ భావనను బ్రహ్మలో నశింపజేసినవాడు వక్రతుండుడు.
వక్రబుద్ధులను నశింపజేయువాడు వక్రతుండుడు. వక్రబుద్ధి మనలోనే ఉండవచ్చు, లేదా మన చుట్టూ ఉన్నవారిలో మనపట్ల వక్రమైన ఆలోచనలను ఉండవచ్చు. వక్రతుండ అనే నామస్మరణ చేతనే ముందు తన భక్తులలోనూ, ఆ తర్వాత వారి చుట్టూ ఉన్నవారిలో వక్రబుద్ధులను నశింపజేయువాడు వక్రతుండుడు....... ఇక్కడ వక్రం అంటే విఘ్నం అని కూడా చెప్పుకోవచ్చు. వివాహం ఆలస్యం జరగడం, సంతానం కలగపోవటం, చక్కని ఉద్యోగం లభించకపోవటం, ఉన్నత విద్యాప్రాప్తికి ఆటంకాలు.... ఇలా జీవితంలో మనకు ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి. ఇవన్నీ వక్రాలు/ విఘ్నాలు. వీటిని తుండెము చేయువాడు వక్రతుండ గణపతి..... అందుకే ‘వక్రతుండ గణపతి అనేది పరిపూర్ణ రూపం. ఆయన్ను అన్నిటికోసం ప్రార్ధించవచ్చు. మంచి ఉద్యోగం, వివాహం, విద్య...... ఇలా అన్నిటికి వక్రతుండమే సమాధానం’ అని అంటారు పూజ్య గురువులు వి.వి.శ్రీధర్ గారు. అలాగే వామాచారం, అధర్మప్రవృత్తి, దుర్గుణాలు, దుష్టుల సహవాసం..... మొదలైనవి కూడా వక్రములే. వాటిని నిర్మూలించాలన్నా, వక్రతుండ గణపతిని హృదయపూర్వకంగా ప్రార్ధించాలి.
వక్రం ఆత్మ రూపం ముఖం యస్య- అని గణపతి వక్రతుండం గురించి చెబుతూ శాస్త్రం వివరించింది. అనగా ఆత్మ ప్రధానంగా వక్రించి ఉంటుంది అని. ఆత్మ వక్రించి ఉండటమేంటి? దీనికి భగవాన్ రమణ మహర్షి గారు మాత్రమే సమాధానం చెప్పారు. వారు ఎప్పుడూ షట్చక్రాల మీద ధ్యానం చేయమనలేదు, షట్చక్ర భేదనం గురించి చెప్పలేదు, ఈ జగత్తుని విడిచిపెట్టండి అని చెప్పలేదు.... వారు నేరుగా చెప్పారు. ఎందుకంటే వారంటారు.... కుండలినీ సహస్రారం చేరితే, సమాధి స్థితి వస్తుంది. కానీ వాసనలు నిర్మూలించబడవు. కాబట్టి యోగి సమాధి నుంచి బహిర్ముఖుడవుతాడు, బంధాల నుంచి విడువబడడు. కాబట్టి అతడు వాసనాక్షయం కోసం ఇంకా సాధన చేయాల్సి ఉంటుంది..... సుషుమ్నా నాడి ద్వారా మూలాధారం నుంచి సహస్రారం చేరిన కుండలినీ, అటు తర్వాత వంపు తిరిగి ఉన్న జీవనాడి ద్వారా హృదయాన్ని చేరుతుంది. ఆ జీవనాడినే అమృతనాడి అని కూడా అంటారు. అది వక్రించి ఉంటుంది. హృదయం అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. భౌతిక హృదయం ఎడమభాగంలో ఉంటే, ఆధ్యాత్మిక హృదయం కుడిభాగంలో ఉంటుంది.... అందులోకి కుండలినీ చేరితే, అప్పుడు నిరాటంకమైన సమాధి స్థితి కలుగుతుంది..... సాధారణంగా కుండలినీ సహస్రారం చేరిన తర్వాత, అప్పుడు జీవుడిలో 'నేనేవరు' అనే విచారణ మొదలై, దానికి సమాధానం దొరకగానే అది హృదయంలో కలిసిపోతుంది అని భగావన్ రమణ మహర్షి చెప్పారు. అందుకే రమణులు వేరే ఏ పద్దతి చెప్పకుండా, నేరుగా నేనెవరు అనే విచార మార్గాన్ని చూపారు. అది హృదయం వద్దే మొదలై, త్వరితగతిన ముక్తిని ఇస్తుంది, అందుకే వారు అవధూత, దక్షిణామూర్తి..... వక్రతుండ గణపతి దానినే సూచిస్తున్నాడు. ఆయనకు వంకర తొండం ఉన్నా, అది ఏదో ఒక ప్రక్కకు తిరిగి ఉంటుంది. దీని ద్వారా స్వామి, వక్రించి ఉన్నఆత్మ తత్త్వాన్ని సూచిస్తున్నాడు. వక్రములు కలిగిన మార్గాల నుంచి భక్తులను తప్పించి నేరుగా తనను చేరే మార్గాన్ని చూపువాడు వక్రతుండుడు.
త్వం సాక్షాదాత్మాసి నిత్యం అని గణపతి అథర్వశీర్షోపనిషత్తు అంటున్నది. అంటే సాక్షాత్తు ఆత్మ రూపంగా గణపతి ఉన్నాడు అని అర్దం.. ఆ ఆత్మయే తాను, అదే హృదయం. అందుకే గణపతిని గృత్సమదుడు ముద్గల పురాణంలో 'హృదిప్రకాశస్య ధరం స్వధీస్థం' అని స్తుతించాడు. అంటే విచారణ ద్వారా తన్ను తాను తెలుసుకుంటే, హృదయంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న గణనాథుని దర్శనం పొందవచ్చు. అదే వక్రతుండుని దర్శనం.
వివరణ ఇంకా పూర్తికాలేదు .....
పూర్తి వివరణ ఇవ్వగలురు దయచేసి
ReplyDelete