అన్నమయ్య, కంచర్ల గోపన్న (భద్రాచల రామదాసు) మొదలైన వాగ్గేయకారులు రచించిన కీర్తనల్లో భక్తి ఎంత ఉంది, వేదాంతము, సామాజిక స్పృహ, ఉపదేశ రహస్యాలు, తత్త్వబోధ అంతే ఉన్నాయి. ఈ రోజు ఉదయం రామదాసు జయంతి సందర్భంగా భద్రాచలంలో గోష్టిగానం వింటున్నప్పుడు, నవరత్న కీర్తనల్లో ఒకటైన శ్రీ రాముల దివ్యానామం అనే కీర్తన మనసుకు హత్తుకుంది. అందులో ఎంత గొప్ప అర్ధముందో చూడండి....
శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు
ఘోరమైన తపములను కోర నేటికే మనసా ||
ఆ శ్రీ రాముడి దివ్యమైన నామాన్ని కేవలం స్మరిస్తూ ఉంటే చాలట, కఠినమైన తపస్సు చేయాలని కోరుకోవడం ఎందుకే ఓ మనసా! అంటున్నారు.
ఆధ్యాత్మికత అనగానే అబ్బో బోలెడు నియమాలు పాటించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎక్కడెక్కడో విని ఉంటాము. అది కాక అహంకారమంటూ ఒకటి ఉండనే ఉంది. అది ఊరికినే ఉండదాయే. తాను ఏమి చేసినా, అది పదిమంది ముందు చూపించుకోవాలని చూస్తుంది. డాంభికాన్ని, పొగడ్తలను ఆశిస్తుంది. అందుకే నేను ఆ సాధన చేస్తున్నాను, ఈ సాధన చేస్తున్నాను, నాకు ఆ అనుభవాలు కలిగియాంటూ చాలామంది సాధకులు మనస్సు మాయలో పడి, ప్రకటిస్తుంటారు. అదే కాక, దైవం ఊరకనే దక్కుతుందా, అది ఎంతో కష్టమని, ఎంతో తపస్సు చేయాలని, చాలా ప్రవచనాల్లో వినే ఉంటాము. అది అసత్యమే అయినా, మనసుకు సత్యంగా, వినసొంపుగా అనిపిస్తుంది. అందుకే అది ఘోరమైన తపస్సు చేయాలని కోరుకుంటుంది.
తపస్సు అంటే తపించడం. భగవంతుని కోసం తపించడం. క్షణం కూడా ఆయన ఆలోచన తప్ప అన్యమైనది తలచకుండటం, కాదు అలా తలిస్తే, భరించలేకపోవడం. ఆయన మీదే మనస్సుని లగ్నం చేయడం. కానీ తపస్సు అంటే అది తప్ప మిగితావన్నీచేసేవారే కనిపిస్తారు. నిజానికి అలా తపించడానికి కూడా ఆయన అనుగ్రహం కావాలి. ఇలా తపించలేకపోవడం కూడా ఆయన అనుగ్రహమే. అది వేరే సంగతి. అయితే నిరంతరం ఆయన గురించి తపించడం తప్ప, ఇతర బాహ్యమైన కఠినమైన నియమాలను పాటించడానికి మనస్సు సిద్ధపడుతుంది, చాలామంది అదే తపస్సు అని కూడా అనుకుంటారు. నిజానికి అలాంటి నియమాలు ప్రారంభంలో అవసరం కావచ్చేమో, కానీ ధీర్ఘకాలం అలాగే ఉండటమంటే తపస్సు ముందుకు సాగట్లేదనే అర్ధం. మరి అసలైన తపస్సు ఏంటి? నిత్యం ఆయన ధ్యానంలో గడపడమే తపస్సు. అది అంతర్ముఖమైనా, బహిర్ముఖమైనా.... నిజానికి అది ఒక్కటి తప్ప, ఇంకేం చేయమన్నా మనస్సు చేస్తుంది.
అదే భక్త #రామదాసు గారు చెప్తున్నారు చూడండి. ఓ మనసా! వినవే! శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు... పావనమైన ఆ శ్రీ రాముని దివ్య నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉండవే, అది చాలే. కఠినమైన నియమాలను కోరడం ఎందుకే?
ఇంకా ఉంది.....
No comments:
Post a Comment