సతతము మా భద్రగిరి - స్వామి రామదాసుడైన
ఇతర మతములనియేటి - వెతల వేటికే మనసా ||
మతములు అంటే ఆలోచనలు. వెతలు అంటే కష్టాలు. మోక్షం పొందడానికి, లేదా తరించడానికి ఎంతో ఆలోచించి, కష్టపడటమెందుకు? ఆ సాధన చేయాలి, ఈ సాధన చేయాలి, అన్ని గంటలు ధ్యానం చేయాలి, ఇన్ని గంటలు జపం చేయాలని ఇతర కష్టమైన మార్గాలను పట్టుకోవడమెందుకే మనసా. ఎల్లప్పుడూ మా భాద్రాచల శ్రీ రామునికి దాసుడవై ఉండిపో. అది ఒక్కటి చాలు. అంటే స్వామిని నీ ప్రభువుగా భావించు. దాసుడు, ప్రభువు చెప్పిన మట తప్ప అన్యమైనది వినడు, ప్రభువు చెప్పిన దారిలో తప్ప వేరే మార్గంలో నడవడు. అతనికి అతని ప్రభువు చెప్పిందే వేదం. అలానే నీవు ఆ భద్రాచల శ్రీ రామచంద్రునికి దాసుడవైపో. ఇది ఎంతో సులభమైన మార్గము. కోపం, ఆవేశం, ఈర్ష్యా, అసూయ, ద్వేషము, పరనింద, దోషాలు ఎంచడం వంటి దుర్గుణాలు ఎన్నో ఉన్నాయి. వాటికి దాస్యం చేయడం మానుకో. తిరగబడు. మన భద్రాచల రాముడు సామాన్యుడు కాడు. సకల గుణాభిరాముడు. ఈయన వైకుంఠ రాముడు. ఎక్కడైనా రాముడు ధనుర్బానాలతో ఉంటాడు. కానీ భద్రాచలంలోని రాముడు శంఖుచక్రాలను కూడా ధరించి ఉన్నాడు. ఈయన సాక్షాత్తు వైకుంఠం నుంచి భద్రగిరికి దిగివచ్చిన వైకుంఠ రాముడు. ఈయన్ను పట్టుకుంటే, నేరుగా వైకుంఠానికే తీసుకెళతాడే.
మానవుడు ఎలా జీవించాలో మన రాముడు చూపించాడు. ఆయనకు దాస్యం చేయడమంటే, ఆయనలోని గుణాలను మనలో పెంపొందించుకోవడం, ఆయన నడిచిన మార్గంలో నడవడం, ధర్మాన్ని రక్షించడం. అలా నిత్యం రాముని మార్గంలో నడువు. వేరే ఆలోచనలు పెట్టుకోకు. నేను చాలా సులభమైన మార్గం చెబుతున్నాను.
ఇవన్నీ చేస్తూ ఆ శ్రీ రాముని దివ్యనామాన్ని స్మరిస్తూ ఉండు. కఠినమైన తపస్సులను కోరవలసిన పనిలేదు. అన్నీ తీరి, మరణానంతరం ఆ రామునిలో ఐక్యమవుతామంటూ ఈ ఒక్క కీర్తనలోనే శ్రీ రామదాసుగారు ఎంతో తత్త్వాన్ని నింపి అందించారు.
ఇదంతా రాయడానికి ప్రేరణ కలిగించిన ఆ రామునికి, నా గురువుకు నమస్కరిస్తూ, సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment