దొరకని పరుల ధనముల - దోచక యుండితే చాలు
గురుతుగాను గోపురము - గట్ట నేటికే మనసా ||
భక్త రామదాసు గారు ఇంకా ఇలా చెబుతున్నారు. నీది కానీ ధనాన్ని, పరుల సొమ్మును దోచుకోకుండా ఉంటే చాలు, నీకు ఎంతో డబ్బు ఉందని చెప్పడానికి గుర్తుగా పెద్ద ఆలయం కట్టడమెందుకు?
దేవాలయం నిర్మించడమంటే సామన్యమైన విషయం కాదు. ఆలయమంటే ఒక వ్యవస్థ. గుడి కట్టడమంటే శాశ్వతమైన వ్యవస్థను నిర్మించడం. అది ఎంతో పుణ్యం. అంతకంటే పుణ్య కర్మ పురాతన ఆలయానికి జీర్ణోద్ధరణ చేయడం. పాత గుడిని పునఃఅభివృద్ధి చేయడమంటే 100 నూతన ఆలయాలు నిర్మించడంతో సమానమని శాస్త్రం చెబుతుంది. కానీ అలాంటి పుణ్యకర్మను దోచుకున్న సొమ్ముతో నిర్మిస్తే ఏం లాభం? అవినీతికి పాల్పడిన వ్యక్తియే కాదు, అతడి అవినీతి సొమ్ముతో కొన్న దినుసులతో వండబడిన ఆహారం తిన్నవాడికి కూడా ముక్తి లభించదని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది. దోచుకున్న సోమ్ముతో అన్నదానం చేస్తే, దానికి సాధువులు, సన్యాసులు హాజరవ్వకూడదని కూడా ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఆ సొమ్ముని యజ్ఞయాగాదుల్లో ఉపయోగించకూడదు. దాన్ని విరాళంగా, దానంగా తీసుకోకూడదు. ఇలా శాస్త్రం దోచుకున్న ధనాన్ని ఎన్నో రకాలుగా నిషేధించింది. అంతెందుకు, ఆ సొమ్మును భగవంతుడు సైతం అంగీకరించడు. దానికి ఉదాహరణ గాలి జనార్ధన్ రెడ్డి. ప్రకృతి సంపద అయిన ఉక్కు విషయలో అక్రమాలకు పాల్పడి, ఆ సొమ్ములో కొంత భాగంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి కిరీటం చేయిస్తే, ఇంతవరకు స్వామి దాన్ని ధరించనేలేదు. ఇక ఆ కిరీటం ఇవ్వడమెందుకు? తాను ఇచ్చానని గొప్పలు చెప్పుకోవటానికే.
నిజంగా దైవం పట్ల భక్తి, విశ్వాసం ఉన్నవాడు, అడుక్కుతినే స్థితిలో ఉన్నా, పరుల నుంచి రూపాయి కూడా ఆశించడు. ఇతరుల వస్తువుల కోసం ఆశపడడు. పరుల ధనంలో పావలా కూడా తన ధనంలో కలవనీయడు. ఎందుకంటే ఈశ్వరాదేశంతో తనకు వచ్చినది రూపాయయైనా, అదే మహా ప్రసాదంగా భావిస్తాడు. గోపన్నగారు అదే అంటున్నారు. ఇతరుల నుంచి దోచిన ధనం పాపం. అది నిన్ను రాముడి నుంచి దూరం చేస్తుంది. నువ్వా రాముడిని ప్రేమిస్తే, ఆయన్ను చేరుకోవాలనుకుంటే గొప్పగా గుడి కట్టక్కర్లేదు. నీదికాని డబ్బును దోచుకోకుండా ఉంటే చాలు. అదే గొప్ప యోగము. పరుల సొమ్ముని ఆశించి, గుళ్ళూ గోపురలు కడతానంటావేమిటే మనసా!
ఇంకా ఉంది....
No comments:
Post a Comment