భాగవతుల వాగామృతము - పానము జేసిన చాలు
బాగు మీర నట్టి యమృత - పాన మేటికీ మనసా ||
భాగవతులు అంటే భగవద్భక్తులని ఇంతకముందు భాగంలో చెప్పుకున్నాము. పండితులకు, భక్తులకు/జ్ఞానులకు మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. పండితులకు శాస్త్రజ్ఞానం ఉంటుంది, వారు మాటలతో మాయలు చేయచ్చు, అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా ఎన్నో విషయాలు చెప్పవచ్చు, కానీ వారిది వాచా వేదాంతమే. అంటే పుస్తకంలో చదివినది, తమకు అర్ధమైన విధంగా, లేదా తాము అర్ధం చేసుకున్న విధంగా చెబుతారు. వినేవారిని ముగ్దుల్ని చేయవచ్చు, తర్కం కూడా ఉపయోగించవచ్చు. కొందరు కుతర్కం కూడా ప్రయోగిస్తారు. కానీ దాని వల్ల లాభం ఎవరికి?
భక్తులు అలా కాదు. భక్తులకు శాస్త్రజ్ఞానం లేకున్నా, అనుభవ జ్ఞానం ఉంటుంది. పరమాత్మతో దగ్గరగా గడిపిన ఆ అనుభవాలు ఏ పుస్తకంల్లోనూ దొరకవు. అలా అని భాగవతులు, కాలక్షేపం కోసం మాట్లాడరు లేదా ప్రసంగాలు చేయరు. వారు శాస్త్రాల మీద ప్రసంగాలు కూడా చేసే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ వారిది అనుభవవేదాంతం. అది నిజమైన అమృతం. వారి మాటలు వినే అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఎందుకంటే వారికి మాట్లాడటం కంటే స్వామిని అనుభూతి చెందుతూ ఉండటమే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. వారి ప్రతి మాట భగవద్ ప్రేరణతోనే వస్తుంది. నిజానికి పరమ భాగవతోత్తముల విషయంలో, బయటకు వారు మాట్లాడుతున్నట్లుగా అనిపించినా, వారి ద్వారా మాట్లాడేది ఆ భగవంతుడే. ఇదిగో, అలాంటి భాగవతుల గురించే భక్త రామదాసుగారు సెలవిస్తున్నారు.
ఎక్కడో దొరికే అమృతాన్ని పానం చేయాలన్న కోరిక ఎందుకే ఓ మనసా! భాగవతులు ఎక్కడైనా దొరికితే, వారి దగ్గరకు వెళ్ళి మౌనంగా కూర్చో. వారు ఎప్పుడు మాట్లాడతారా అని తపనతో ఎదురు చూడు. వారివి కేవలం వాక్కులు కాదు, అమృతంతో కూడిన వాక్కులు, అవి దైవీ వాక్కులు. అవి ఖచ్ఛితంగా జీవుడికి అమృతతత్త్వాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి అమృతం తాగాలన్న కోరిక వదిలి, భాగవతుల వాగామృతాన్ని తాగాలనే కోరిక పెట్టుకో.
ఇంకా ఉంది....
No comments:
Post a Comment