Sunday, 28 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (7 వ భాగము)


అతిథి వచ్చి యాకలన్న - అన్నమింత నిడిన చాలు
క్రతువు సేయవలెననే - కాంక్ష యేటికే

పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి, పూజలు చేయాలి, లేకపోతే అన్నదానం చేయాలనే కోరికలు ఎందుకు? నీ ఇంటికి వచ్చి ఆకలిగా ఉందన్నవాడికి కొద్దిగా అన్నం పెట్టు చాలు అంటున్నారు రామదాసుగారు. అంటే పూజలను, క్రతువులను ఆయన నిరసించట్లేదు, వాటిని తక్కువ కూడా చేయడంలేదు. సమస్త క్రతువులు, ఉపాసనలు మనకు నేర్పేదిమిటి? సర్వజీవుల్లో భగవంతుడిని చూడటం, సర్వజీవుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం, వారి బాధను మన బాధగా భావించడం. అదేలేనప్పుడు, ఎన్ని ఉపాసనలు చేస్తే ఏం లాభం? నీవు చేసే ప్రతి పని, నీలో దివ్యప్రేమను పెంచాలి. అలా చేయడంలో మొదటి అడుగు, పక్కవాడి బాధను నీ బాధగా భావించి, తోచిన సాయమందించడం.

నేను సర్వజీవుల్లో వైశ్వానరునిగా ఉండి, నాలుగు విధములుగా తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేస్తున్నానని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. సర్వజీవుల్లో ఉండే ఆకలి భగవంతుడే. అంతేకాదు, ఆకలిని వైశ్వానరాగ్ని అని కూడా అన్నారు. 
యా దేవీ సర్వభూతేషు క్షుదా రూపేణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 
అని దేవీ భాగవతం కూడా చెబుతోది. సర్వజీవుల్లో ఆకలి రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని అర్ధము. అంటే ఆకలితో నీకు ఎవడైనా కనిపిస్తే, అది నీ భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే ఆకలి రూపంలో వానిలో భగవానుడు వ్యక్తమవుతున్నాడు. వానికి ఏ కొంచం ఆహారం పెట్టినా, అది నేరుగా భగవానునికే చెందుతోంది. అది కూడా అగ్నికి సమర్పించడమే. అంటే యజ్ఞం చేయడంతో సమానం కదా. ఇది ఎంతో సులభమైన మార్గము. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. నీవు వండుకునే దాంట్లోనే ఇంకొకరి కొంచం పంచి పెట్టు. అది చాలే మనసా! అది చేయకుండా పెద్ద పెద్ద పనులు చేస్తానంటావేమిటే?  

కబీర్ గారు ముస్లిం అనే కారణంగా వారిని దేవాలయంలోకి అనుమతించలేదట. అయితే వారు ఆలయం వెలుపలే కూర్చుని, వంట చేసుకున్నారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ కుక్క, వారు కాల్చుకున్న రొట్టె ముక్కను ఎత్తుకుపోయింది. అది చూడగానే కబీర్ గారు, నారాయణ ఆగు. ఒట్టి రొట్టే తింటే బాగుండదు, ఇదిగో ఈ నెయ్యి కూడా రాసుకుని తిను అని దాని వెంటపడ్డారట. అది చూసి, వారిని గుడిలోకి అనుమతించని మిగితావారు తలదించుకున్నారు. నిజమైన భక్తి అలా ఉంటుంది. మౌనంగా, తాను చేసేది చేస్తాడు భక్తుడు. అందరి ఆకలిని తీర్చలేకపోవచ్చు, కానీ నీకున్నదాంట్లో కొందరిదైనా తీర్చు, చాలు. అది కూడా రామునికి ఇస్తున్నాననే భావనతో. అదే రామదాసుగారి ద్వారా రాముడు పలికించాడు. 

ఇంకా ఉంది.... 

No comments:

Post a Comment