Wednesday, 25 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 12 వ భాగము

భవిష్యత్తు గురించి ఏమాత్రం భయం చెందని శిష్యులు

ఆధ్యాత్మిక మార్గం అనేది మాస్టర్ ఆర్ట్స్ లో డిగ్రీ కోసం రాసే ఒక పరిశోధనవ్యాసం వంటిది కాదు. అది పూర్తిగా భిన్నమైన మార్గము. ఇక్కడ గురువు యొక్క అవసరం ప్రతి క్షణము ఉంటుంది. ఈ రోజుల్లో యువ సాధకులు నిమ్నమైన, దురహంకారంతో, ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడాలనే ఆలోచనతో ఉన్నారు. వారు గురువు యొక్క ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడరు. వాళ్లకి గురువు ఉండాలని కూడా ఇష్టపడరు. ప్రారంభం నుంచి స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆధ్యాత్మికత లేదా సత్యం గురించి వారికి అ ఆ ఇ ఈ లు తెలియక ముందే వారు తూరియ అవస్థలో ఉన్నారని భావిస్తారు. కొంటెతనాన్ని, విచ్చలవిడితనాన్ని లేదా స్వేచ్ఛా విహారాన్ని, లేదా తమకు నచ్చినట్లుగా, తమ మనసు చెప్పినట్టుగా ఉండడాన్ని స్వేచ్ఛ అని భావిస్తారు. ఇది తీవ్రమైన, శోచనీయమైన అపరాధము. ఆ కారణం చేతనే వారు ఎదగరు. వారు సాధన యొక్క సామర్ధ్యం మీద, భగవంతుని మీద విశ్వాసం కోల్పోతారు. వారు ఎటువంటి లస్యము లేకుండా కాశ్మీరు నుంచి గంగోత్రికు, గంగోత్రి నుంచి రామేశ్వరానికి తమ భవిష్యత్తు గురించి ఏమీ పట్టకుండా, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ, విచారసాగరం నుంచి కొంత, పంచదశీ నుంచి కొంత మాట్లాడుతూ జీవన్ముక్తులుగా కనిపించే ప్రయత్నం చేస్తారు.



శరణాగతి మరియు అనుగ్రహము
నువ్వు ఒక కుళాయి నుంచి నీళ్ళు త్రాగాలన్టే, నీకు నువ్వుగా వంగాలి. అలాగే గురువు యొక్క పవిత్రమైన పెదవుల నుంచి ప్రవహించే సచ్చిదానందం అనే ఆధ్యాత్మిక అమృతాన్ని పానం చేయాలంటే, దానికి నీవు వినయము మరియు నమ్రతకు ప్రతిరూపంగా మారాలి.

మనస్సు యొక్క అల్పమైన ప్రకృతి ఎప్పటికప్పుడు పునరుద్ధరించబడుతూ ఉంటుంది. సాధకుడు తన గురువుతో ఇలా చెబుతాడు: "నాకు యోగాభ్యాసము చేయాలని ఉంది. నాకు నిర్వికల్ప సమాధి స్థితి చేరుకోవాలని ఉంది. నేను మీ పాదాల వద్ద కూర్చోవాలనుకున్టున్నాను. నన్ను నేను మీకు అర్పించుకున్నాను ,శరణాగతి పొందాను." కానీ అతను తన యొక్క అల్పమైన ప్రకృతిని, అలవాట్లను, పూర్వపు శీలాన్ని, గుణాన్ని మార్చుకొనుటకు ఇష్టపడడు.

వ్యక్తి యొక్క అహంకారం, ముందే ఏర్పరుచుకున్న భావాలు, తాను వృద్ధి చేసుకున్న ఆలోచనలు, స్వార్థపు ఆశలు వదిలిపెట్టాలి. ఇవన్నీ గురువు యొక్క ఉపదేశాలను మరియు సూచనలు పాటించే మార్గంలో అడ్డుగా ఉంటాయి.

నీ హృదయంలో దాగి ఉన్న రహస్యాలను గురువు ముందు స్పష్టంగా చెప్పు. నీవు ఆ చేసిన కొద్దీ, నీ పట్ల అంత అధికంగా దయ ఉంటుంది, అంటే దాని అర్థం పాపము మరియు దురాకర్షణల మీద నీవు చేసే పోరాటంలో నీకు మరింత శక్తి వస్తుంది.

ఒక సాధకుడు, తాను గురువు యొక్క అనుగ్రహం కోరుకునే ముందు, దానికి తగిన వాడై ఉండాలి. సాధకునికి నిజమైన తృష్ణ ఉన్నప్పుడే, అతడు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే గురువు యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది.

వినయము, విశ్వాసంతో ఉన్న సాధకుని మీదనే వారి మీదనే గురువు యొక్క అనుగ్రహం వర్షితుంది. ఆయనపై నమ్మకం మరియు ప్రత్యయమే గురువుపై విశ్వాసము. ఏదైతే గురువు, తన అనుభవం ద్వారా లేదా శాస్త్ర ప్రమాణం ద్వారా లేదా ఏ ఇతర ఆధారం లేకుండా చెప్పినప్పటికీ, అది సత్యము అనే భావన లేదా గట్టి నమ్మకం కలిగి ఉండడమే విశ్వాసము. గురువు యందు విశ్వాసం వున్న శిష్యుడు వాదన, చేయడు ఆలోచించడు, కారణాలు వెతకడు, వాటినే తలపోసుకుంటూ కూర్చోడు. అతడు గురువు చెప్పినది చెప్పినట్లు పాటిస్తాడు.

శిష్యుడిగా గురువుకు శరణాగతి మరియు గురువు యొక్క అనుగ్రహము పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. శరణాగతి పొందడం అనేది గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఉపయోగపడితే, గురువు యొక్క అనుగ్రహం శరణాగతిని సంపూర్ణం చేస్తుంది. గురువు యొక్క అనుగ్రహం రూపంలో సాధన రూపంలో సాధకునిలో పనిచేస్తుంది. ఒక సాధకుడు తన మార్గానికి కట్టుబడి ఉంటే ఇది గురువు యొక్క అనుగ్రహం. తన మీద దాడి చేసే దురాకర్షణలను అతడు నిలువరించగలిగితే, ఇది గురువనుగ్రహము. ప్రజలు అతడిని ప్రేమ మరియు గౌరవంతో స్వీకరించగలిగితే, ఇది గురువు యొక్క అనుగ్రహము. అతడు తన శరీర/భౌతిక సుఖాలన్నీ పొందగలిగితే, ఇది గురు అనుగ్రహము. సాధకుడు నిరాశనిస్పృహల్లో ఉన్నప్పుడు, అతనికి ప్రోత్సాహము మరియు మనోబలము కలిగితే, ఇది గురువు అనుగ్రహం. అతడు తన శరీరస్పృహకు అతీతుడై, తన ఆనంద స్వరూపంలో ఉండగలిగితే, అది గురువు అనుగ్రహము. ప్రతి అడుగు ఆయన అనుగ్రహాన్ని అనుభవించండి, గురువు పట్ల నిజాయితీగా మరియు సత్యంగా ఉండండి.

No comments:

Post a Comment