Saturday, 28 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 13 వ భాగము

గురువు ఎలా బోధిస్తారు?

గురువు వ్యక్తిగత ఉదాహరణ ద్వారా బోధిస్తారు. గురు నిత్య జీవితంలో నడిచే నడవడిక సూక్ష్మ గ్రాహ్య శక్తి గల శిష్యులకు ఆదర్శం. గురువు యొక్క జీవితమే నిజాయితీగల శిష్యులకు ఇచ్చే సజీవమైన ఉపదేశము. నిరంతరం సంపర్కం ద్వారా, గురువుతో సంగం ద్వారా, శిష్యుడు గురువు యొక్క సద్గుణాలను అలవరచుకుంటాడు. అతడు క్రమక్రమంగా రూపుదిద్దుకొంటాడు. ఛాందగ్యోపనిషత్తు చదువు. ఇంద్రుడు ప్రజాపతితో నూట ఒక్క సంవత్సరాలు ఉండి, ఆయనను హృదయపూర్వకంగా సేవించాడు అని నీవు తెలుసుకుంటావు.

గురువుకు తన శిష్యుల యొక్క ఆధ్యాత్మిక అవసరాలు తెలుసు. శిష్యుని యొక్క ఎదుగుదల మరియు అవగాహన స్థాయికి అనుగుణంగా ఆయన ఉపదేశిస్తారు. ఈ ఉపదేశాన్ని రహస్యంగా ఉంచాలి. శిష్యుల మధ్య చర్చించడం అనేది గురువును విమర్శ చేయటానికి మరియు సాధనలో అశ్రద్ధకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. గురువు యొక్క ఉపదేశాలను తు.చ. తప్పకుండా పాటించు. అది నీకు మాత్రమే అని గుర్తు పెట్టుకో. వేరే శిష్యులు కూడా గురువు నుంచి ఉపదేశం పొంది ఉంటారు. వాళ్ళను దాన్ని అనుసరించనివ్వు. నీవు పొందిన ఉపదేశాన్ని ఇతరుల మీద రుద్దకు.

శిష్యుడు గురువు గురించి అతనికి ఉన్న విశ్వాసం యొక్క స్థాయిని బట్టి అతను తెలుసుకుంటాడు, గురువు చెప్పిన ఉపదేశాలను తనలో ఇముడ్చుకోగలడు. గురువు సాధకునకు ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు, సాధకుడు తగిన శ్రద్ధ చూపకపోతే, అతను తనకు ఉన్న దానితో సంతృప్తి చెంది ఉంటే, మరియు అజాగ్రత్తతో ఉంటే, అతను తన హృదయం యొక్క ద్వారాలను గడియ పెట్టుకుని ఉంటే, అతడు లాభ పడడు.


గురువు పరీక్షలు పెడతారు

సద్గురువు ఉపనిషత్తుల యొక్క రహస్య జ్ఞానాన్ని తను నమ్మదిగిన శిష్యులకు, అది కూడా వారు అనేకసార్లు ప్రార్థించడం చేత మరియు తీవ్రమైన పరీక్షల పెట్టిన తర్వాత అందిస్తారు. కొన్నిసార్లు, గురువు తన శిష్యుడిని ప్రలోభ/ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ శిష్యుడు గురువు ఎందుకు దృఢ విశ్వాసంతో దాన్ని అధిగమించాలి.

పురాతన కాలంలో, పరీక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఒకసారి గోరఖ్‌నాథుడు, తన శిష్యులలో కొంత మందిని ఒక పొడవైన చెట్టు ఎక్కి, తలక్రిందులుగా ఒక త్రిశూలం మీదకు దూకమని చెప్పారు. విశ్వాస రహితులైన ఎందరో శిష్యులు మౌనంగా ఉన్నారు. కానీ విశ్వాసం గల ఒక శిష్యుడు చెట్టు ఎక్కి మెరుపు వేగంతో తనను తాను క్రిందకు తోసుకున్నాడు. గోరఖ్‌నాథుని అదృశ్యహస్తం ద్వారా అతడు రక్షణ పొందాడు. అతనికి వెంటనే ఆత్మసాక్షాత్కారం కలిగింది.

ఒకసారి గురు గోవింద సింగ్ తన శిష్యులను పరీక్షించ దలచాడు. "నా ప్రియ శిష్యులురా! మీకు నా పట్ల నిజమైన భక్తి ఉంటే, నా ముందుకు వచ్చి మీ తలలు నాకు అర్పించండి. అప్పుడు మనము ఈ ప్రయత్నంలో విజయం పొందవచ్చు" అని ఆయన అన్నారు. విశ్వాసం గల ఇద్దరు శిష్యులు తమ శిరస్సులను అర్పించేందుకు ముందుకు వచ్చారు.

గురు గోవింద సింగ్ వాటిని లోనికి తీసుకెళ్లి, వాటికి బదులు రెండు మేక శిరస్సులు ఖండించారు. గురువు తన శిష్యుని అనేక విధాలుగా పరీక్షిస్తారు. కొందరు శిష్యులు గురువు అపార్ధం చేసుకొని ఆయన యందు విశ్వాసం కోల్పోతారు. అందుకే వారు లాభపడరు.

No comments:

Post a Comment